Archive for అక్టోబర్ 16th, 2010

వారికన్న రాబందులు ఎంతో నయం నయం

సూక్ష రుణ సంస్థల ఆగడాలను అరికట్టేందుకు విడుదల చేసిన ఆర్డినెన్సుతో పేదల కష్టాలన్నీ తీరిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్న నేపథ్యంలోనే 16 అక్టోబరు 2010న గుంటూరు జిల్లాలో ఓ ఆటో డ్రైవరు బలయ్యాడు. దీనికితోడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగానే ఆ సూక్ష్మ రుణ సంస్థ సిబ్బంది కనీస కనికరం లేకుండా వ్యవహరించారు. అప్పటికప్పుడే వాయిదా సొమ్ము చెల్లిస్తేగానీ అక్కడ నుంచి వెళ్లలేదు.
గుంటూరు జిల్లా రెంటపాళ్లకు చెందిన షేక్‌ మస్తాన్‌వలి తన ఆటో మరమ్మతుల కోసం షేర్‌ సంస్థ వద్ద రూ.26 వేలు అప్పు తీసుకున్నాడు. వాయిదా సొమ్ము చెల్లించాలంటే మరొక ఆటో ఉంటేనే సాధ్యమని భావించి రెండోదఫా రూ.20 వేల రుణం తీసుకున్నాడు. ఆటో కొనుగోలు కోసం పిడుగురాళ్లలోని ధనలక్ష్మి ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.46 వేలు తీసుకున్నాడు. ఈ అప్పులన్నిటికీ కలిపి నెలకు రూ.10 వేల చొప్పున చెల్లించాల్సి వస్తోంది. అయితే వాయిదా సొమ్ము చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బంది 15వ తేదీ ఉదయం బలవంతంగా ఆటోను లాక్కెళ్లారు. దీనికితోడు 16వ తేదీన షేర్‌ సంస్థకు వాయిదా చెల్లించాల్సి ఉండటంతో మస్తాన్‌వలి ఆందోళనకు లోనయ్యాడు. దీంతో ఏమనుకున్నాడో ఏమోగానీ 15వ తేదీ రాత్రి శీతల పానీయంలో పురుగుమందు కలుపుకొని తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సత్తెనపల్లిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో అతనిని చేర్పించారు. అయినా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
శవం లేవక ముందే వాయిదా వసూలు
మస్తాన్‌వలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతుండగానే షేర్‌ సంస్థ సిబ్బంది అక్కడ ప్రత్యకమయ్యారు. వాయిదా సొమ్ము కోసం భీష్మించుకు కూర్చున్నారు. ఇక చేసేది లేక వలి బంధువులు షేర్‌ సిబ్బందికి వాయిదా సొమ్ము ఇచ్చేసి పంపారు.

ఒక్కచ్చిరం రాదు! ఒక్క వ్యాక్కిరం సెప్పలేరు!!

”ఒరేయ్‌! ఎంకటసుబ్రావ్‌, మీ ఇలేకరులేందిరా అట్ట మాట్టాడతారు?. ఒక్కచ్చిరం రాదు. నాబోటి సదుము రానోడికి అరదమయ్యేటట్టు ఒక్క వ్యాక్కిరం సెప్పలేరు.” అంటూ ఆ మధ్య పెద్దాయనొకరు ఎగతాళి చేస్తే నేను నోరు తెరిస్తే ఒట్టు.
నిజమే మరి. ఫోన్‌-ఇన్‌ వింటే మా పెద్దాయన మాట వంద శాతం నిజమేననిపిస్తోంది. ఒక్క వాక్యానికి ఆ..ఊ..లు వందన్నా ఉంటాయి. ఈ విషయంలో ఢిల్లీ, హైదరాబాదు విలేకరులకన్నా  నియోజకవర్గస్ధాయి విలేకరులే ఒకింత మేలనిపిస్తోంది. చెప్పదలచుకున్నదేదో, ఆ..ఊ..లు లేకుండా చదివిపారేస్తారు అత్యధికులు.
ఇక రాతలు చూస్తే తెలుగు భాషా ప్రేమికులంతా తలలు బాదుకోవటమే.
16 అక్టోబరు 2010న తెలుగు టీవీల్లో స్క్రోలింగ్‌ వార్తల్నిగనుక చూస్తే వాటిని కంపోజ్‌ చేసిన సహ-సంపాతక మహాశయులెవ్వరికీ కూసింత కూడా బుర్ర లేనట్లు ఇట్టే తేలిపోతుంది. కర్నూలు జిల్లాలో మందుబాబు తన తల్లినీ, భార్యనీ చంపేశాడని వార్త. దానికి మన ఘనత వహించిన తెగ తెగులు పట్టిన తెణుంగు టీవీలు ”తల్లిని, భార్యనూ కొట్టి చంపిన కుమారుడు” అని రాసిపారేశాయి. అయితే దీనిలో టీవీ-9, ఈ-టీవిని మినహాయించాలి. ఆ రెండింటిలోనూ సరిగ్గానే రాశారు. వాడు ఎవరిని చంపాడని ప్రశ్నించుకుంటే తన తల్లినీ, భార్యనూ చంపాడని సమాధానం వస్తుంది. అంతవరకూ ఇబ్బంది లేదు. ఎవడు చంపాడు. చనిపోయినవారిలో ఒకరికి కుమారుడు, మరొకరి భర్త. మరి దీన్నెలా రాయాలి. నిందితుడు కుమారుడని రాస్తే… మరి రెండో మృతురాలికి కుమారుడు కాదుగదా? అలాగని భర్త అని రాస్తే … మొదటి మృతురాలికి కుమారుడయిపోయనే. ఆ సంబంధాలు పనికి రావని తేలిపోయింది. మరి ఎలా రాయాలి?. వేరే వర్ణన చేయాలి. అది దుర్మార్గుడు, కిరాతకుడు, మందుబాబు, ఓ ఫలాని పనిచేసేవాడు, ఫలానా ప్రాంత నివాసి ఇలా ఏదో ఒకటి రాయాలి. చూద్దాం…. కర్నూలు జిల్లాలో తల్లినీ, భార్యనూ చంపిన కిరాతకుడు. తల్లినీ, భార్యనూ చంపిన దుర్మార్గుడు… ఇలా రాసేయొచ్చు.
రాసే ముందు ఎవరన్నా అడిగితే మనం ఏమిచెబుతామో ఊహించుకుంటే ఈ తప్పులు జరగవు. ఉదాహరణకు ఈ సంఘటననే ఏమి జరిగిందని ఎవరో మనల్ని అడిగారనుకుందాం. ”గాంధీరోడ్డులో కత్తులషాపోడొకడు వాళ్లమ్మనీ, వాడి భార్యనీ రోకలి బండతో కొట్టి చంపేశాడు.” అని చెబుతాం. దీన్ని రాసేటప్పుడు చిన్న మార్పులు చేసి రాసేస్తే సరిపోతుంది. అయితే ఆలోచించటం, అవసరమయితే పక్కవాడి సలహా తీసుకోవటం ఇవన్నీ చేయకుండా, నాకు నేనే మహా పండితుణ్ణని భుజకీర్తులు తగిలించుకుని రాసేస్తే నాకయినా, మీకయినా బూతులు రాక పూలసౌరభాలు ఎలా పూస్తాయి?
ఆ అత్తాకోడళ్లకు నివాళి
మందుబాబు చేతిలో అన్యాయంగా అశువులుబాసిన కర్నూలు జిల్లా వాసులయిన ఆ అత్తాకోడళ్లకు ఓ సహ మానవుడిగానూ, శాంతియుత సహజీవనం కోరుకునేవాడిగానూ నివాళులు అర్పిస్తున్నాను.