ఉల్లీ…ఉల్లీ! ఇదేమి తల్లీ!!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మా నాయనమ్మ బతికుండగా నీ గురించి చెప్పని రోజుండేది కాదు. అబ్బో కాబోలనుకున్నాను తల్లీ. అయితే గియితే ఆ మేలు తండ్రిలాంటి రైతన్నకూ కాకుండా, ప్రియుడులాంటి వినియోగదారుడికీ కాకుండా దళారోడికని ఆలస్యంగానయితేనేం తెలుసుకున్నానులే. మామూలుగానయితే నిన్ను కోస్తే కళ్లంట నీళ్లు ఒకటే ధార కట్టాలి. అయితే నీ గురించి నిజం తెలిసింది చూడూ, అప్పుడు నిన్ను తలచుకుంటేనే నా కళ్లెంట కడివెడు నీరు కారి నేనున్న చోటంతా చిత్తడయిందంటే నమ్ము. అయినా కడివెడు నీరుగార్చినా, సముద్రాలే పారించినా నీకు మేమొక లెక్కా? కుడి,ఎడమల డాల్‌ కత్తులు మెరియగ అన్నట్లుగా నీ వెంట రూపాయల్నీ, డాలర్లనీ ఘల్లుఘల్లుమనిపించే దేశీయ దళారోళ్లు, విదేశీ బోకరోళ్లు ఉంటున్నారుగదా! ఇప్పుడు నువ్వు సామాన్యురాలివా తల్లీ? ఉల్లీ! నువ్వు, కాలుసాగేస్తే చాలు ”రాజు వెడలె రవి తేజములలరగ” అన్నట్లు అంతర్జాతీయ మార్కెట్టు మొదలు రైతు బజారుదాకా సాగిపోతోందిగదా!
అన్నట్లు చిన్ననాటి సంగతొకటి నాకు గుర్తుకొస్తోంది. అహహహహహ… అహహహహహ… అహహహహహ… అహహహహహ…హమ్మ.. అమ్మా, పొట్టచెక్కలవుతుందంటే నమ్ము తల్లీ. మా నాయనమ్మ అదేనమ్మ ఉల్లీ, నీతో ఇదే చిక్కు. నీ వాళ్లనుకున్నవాళ్లందరినీ ఏడిపించటమే గదా నీ పని. ఆ పనిలోబడి అతి సామాన్యురాలయిన మా నాయనమ్మ సీతమ్మ నీకు గుర్తుండటం అంటే సాధ్యమయ్యే పనేనా?! అదట్లా ఉంచు. మా నాయనమ్మ ముచ్చట్లు చెప్పుకుందాం. కమ్మటి మాటలు చెబుతూ టోకరా వేసే వాడిని మా సీతమ్మ ”వాడొట్టి బోకరోడు. వాడిని నమ్మబాకండి” అంటూ తన పరిశోధనా ఫలాలను గుట్టుగా అందరికీ పంచేసేది క్షణాల్లో. మా నాయనమ్మకే ఎవడన్నా టోకరా వేయబోయాడనుకో…” ఒరేయ్‌, దళారోడా… జొరం తగ్గుద్దని ఆముదం తాగేవాడెవన్నా ఉంటే మోసంజేయరా? అంటూ దులిపేసేది. ఆ తర్వాత వాడు ఎక్కడ కనపడ్డా, ఎప్పుడు కనపడ్డా, లెక్కాడొక్కా లేకుండా ఒరేయ్‌, దళారోడా, దగాకోరోడా బాగున్నావంటరా? అనో, బోకరోడా, బొక్కల మొహమోడా! ఎక్కడికిరా దర్జాగా బయలుదేరావ్‌? అనో వాకబు చేసేది. ఆ దళారి ఒంటరిగా ఉంటే సరి. పది మందిలో ఉన్నాడో? వాడు చచ్చాడే. మా నాయనమ్మ మాట్లాడే ప్రతి పదానికీ ఈలలు, చప్పట్లు పడాల్సిందే. వాడి ముఖం చూస్తూ అందరూ ఒకటే నవ్వుతుంటే బిక్కచచ్చిపోయేవాడు. ఇప్పుడు మళ్లీ నీ విషయాలు మాట్లాడుకుందాం!
ఈ ఏడాది అతివృష్టి నీ కుటుంబాన్ని ఎక్కడికక్కడే నాశనం చేసిందని పత్రికల్లో చదివానులే. అందుకనే నాకు అందనంతగా, నాలాంటోళ్లకు దొరకనంతగా నీకు గిరాకీ ఏర్పడిందంటున్నారు.
పోనీ నీకు గిరాకీ ఏర్పడితే రైతన్న జేబున్నా పండుద్దనుకున్నా. అదేమీ లేదే. కర్నూలు మార్కెట్లులో ఆగస్టులో నువ్వెంత పలికావు… క్వింటాలు రూ. 650. అవునా?. ఆ తర్వాత సెప్టెంబరులో ఎంత? ఆఆఆఆఆ… వెయ్యి రూపాయలకు చేరింది. అక్టోబరు వచ్చేసరికి రూ. 1300 అయింది. అంటే మీ దళారోడు రైతు నుంచి కిలో రూ. 13 కొంటున్నాడు. మరి కర్నూలు కిరాణా దుకాణంలోనే నీ పరిస్థితి ఏమిటో చూడు. నువ్వు లేకపోతే బతకలేనని ఏడిచ్చచ్చే వినియోగదారుడి నుంచి కిలోకు రూ. 25 వసూలు చేస్తున్నారు తెలుసా?
అంటే ఆరుగాలం చెమటోడుస్తూ, నిన్ను కంటారా కాపాడుకున్న రైతోడి చేతి నుంచి దళారోడి చేతిలోకీ, దళారోడి చేతుల్లో నుంచి గోదాములోకీ, అక్కడి నుంచి తిరిగి కిరాణా చిల్లర దుకాణానికీ చేరేసరికి నీ ధర రెట్టింపు అయింది. ఇదేమి అన్యాయమమ్మా ఉల్లీ.
ఏటా ఎకరానికి డెబ్బైఎనభై క్వింటాళ్లన్నా పండేదానివి. ఇప్పుడేమో వర్షాలకు పాచిపోయి నలభై క్వింటాళ్లకన్నా కాకపోతుండే. అదీగాక వర్షానికి నువ్వు పాచిపోయావంటూ తరుగు తీసేస్తున్నారు. తీసేయటమంటే తూకం లెక్కలో తగ్గిస్తున్నారుగానీ, నిన్ను తీసేయటం లేదన్న సంగతి నీకు తెలుసుకదా!
ఈ ఏడాదంటే కొంత పర్వాలేదుగానీ, పోయినేడాది తుంగభద్ర వరదలొచ్చి నువ్వసలు చేతికే దక్కకపోతివి. అంతెందుకులే, ఈ ఏడాది కూడా మహారాష్ట్ర, కర్నాటక రైతన్నలకు దక్కకపోతివి. రాష్ట్రంలోనూ ఆదిలాబాదు, నిజామాబాదు, మహబూబ్‌నగర్‌, కడప జిల్లాల్లోనూ దెబ్బతినిపోతివి. ఏదో కర్నూలు రైతన్నల్ని మాత్రం అంతో, ఇంతో ప్రకృతి మాత కరుణించటంతో నువ్వు చేతికొస్తన్నావులే. నువ్వు పండాలంటే ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. కౌలు  మరొక పదేల రూపాయలు కలపాలనుకో.  ఇప్పుడు ఎకరానికి రూ. 65వేల ఆదాయం వస్తోంది. పెట్టుబడి+ వడ్డీ + కౌలు తీసేస్తే ఎకరానికి మిగిలేది ఇరవై వేల రూపాయలు. నువ్వు దక్కని చోట రైతుకి మిగిలింది అప్పులూ, వడ్డీలు, కడివెడు కన్నీళ్లు. అప్పులిచ్చిన దాత ఒత్తిడి చేస్తే ఒకింత చావు. అంతేనమ్మా అంతే. అదే కర్నూలు దళారోడు ఇట్టా రైతు నుంచి తీసుకుని అట్టా  కొల్‌కతా బోకరోడికి అమ్ముకుంటే క్వింటాలుకు రూ. 1100 జేబులో పడిపోతోంది. అదే ఎకరం పంటకు లెక్కేస్తే రూ. 55 వేలు. ఇందులో దళారోడిది పైసా పెట్టుబడి లేదు. వాడికి ఒక్క చెమటచుక్క కారదు. వాడి తెల్లచొక్కా నలగదు. లారీలకు లారీలు సరుకు పంపటం. గోతాలకు గోతాల సొమ్ము జమేసుకోవటమే. ఇదమ్మా సంగతి ఉల్లీ. నిన్ను తిన్నోళ్లకు నువ్వు ఎంత ఆరోగ్యం ప్రసాదిస్తున్నావో తెలియదుగానీ, నిన్ను నమ్ముకున్న రైతన్నకు బోలెడు, బోలెడు కష్టాలు. నిన్ను తింటే ఆరోగ్యమనుకునే వినియోగదారుడికి కడివెడు కన్నీళ్లు. ఏంది ఉల్లీ! ఇదేమిటి తల్లీ!!

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

 1. కాదేది బ్లాగు పోస్ట్లకనర్హం అని మరోసారి నిరూపించారు.చెల్లీ ..తల్లీ..ఉడుముబల్లి అయ్యింది నేడీ ఉల్లీ…

  స్పందించండి

 2. ఒక్క వుల్లి ఏమి ఖర్మ .అన్ని వస్తువుల ధరలు ఆకాశంలోనే వున్నాయంటున్నారు.అన్నిటకన్నా చిత్రం ఎనిటంటే టీవీ పెడితే ఒక అమ్మడు బంగారం ధర రెండు వేలు దాటింది ఏమి కొంటాము ..అయినా దీపావళి ..కొనక తప్పదు కదా అంటుంది. కూరల మార్కెట్ లో ఒక అమ్మ కూడా అదే డైలాగ్ చెబుతుంది.కొనక తప్పని కూరలతో సమంగా బంగారాన్ని కూడా జనం చూసే మైండ్ సెట కి మన మధ్య తరగతిని మార్చినదెవరు? ఈ విషయం మీద గిల్లండి తెలుగిల్లు గారూ!ఏమయినా ఉల్లి మీద మీ వ్యాసం అదిరింది.

  స్పందించండి

 3. ఎవడండీ ఈ దళారోడు…అన్నిటిలోకీ చొరబడతాడు…ఆగమాగం చేస్తాడు… వీడీని
  నాశనం చేయాలంటే ఒక్కటే మార్గం…రైతు బజారు తరహా మార్కెట్ రావాలి…ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి… ముందస్తు వ్యాపారాన్ని బ్యాఅన్ చేయాలి…
  అయినా సారూ…చిన్న సందేహం నాది.. ఉల్లిపాయ లేకుండా కూర వండుకోలేమా…
  ఈ సమస్యను ఎంత కమ్మగా విశదీకరించారండీ…
  మీ బామ్మ గారు దళారోడిని ఎండగట్టిన తీరు మా పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించింది..

  స్పందించండి

 4. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ…………

  – SRRao

  శిరాకదంబం

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: