ఇస్తినమ్మ వాయినం … తీసుకుంటి వాయినం


అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌, ముద్దపప్పు మూడట్లోయ్‌ అంటారు ఆరుద్ర ఏదో తెలుగు సినిమాలో. రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారో తెలియదుగానీ కోస్తా గ్రామాల్లో మాత్రం పదేళ్ల క్రితందాకా ప్రశస్తంగా జరిగేది. మారిన పరిస్ధితుల్లో ఈ పండుగ నామమాత్రమయింది. అందులోనూ సాంఘీక కోణం పూర్తిగా మరుగున పడిపోతోంది. ఆథ్యాత్మిక కోణంతో పండుగను ముగిస్తున్నారు.
ఆథ్యాత్మిక కోణాన్ని ఆవలబెట్టి చూస్తే అట్లు, ఊయళ్లు ఈ పండుగ ప్రత్యేకతలు.
మా ఊళ్లో (ప్రకాశం జిల్లా ఈదుమూడి) దసరా ఆనవాళ్లు కూడా కన్పించేవి కాదు. దసరా సెలవుల్ని దీపావళి ఏర్పాట్లకు ఉపయోగించుకునేవాళ్లం. అయితే అట్లతద్దె మాత్రం కనీసం వారం రోజులపాటు సందడి సందడి చేసేది.
ఆడపిల్ల వివాహానికి తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ పండుగ ప్రారంభమయి ఉండొచ్చు. వివాహాననంతరం వచ్చే తొలి ఆశ్వయుజ బహుళ తదియనాడు అట్లతద్దె పండుగను జరుపుకుంటారు. కనీసం ఐదుగురు ముత్తైదవలను, ఓ పోతురాజునూ ఎంపికచేసుకుని వారి ఆధ్వర్యంలో పూజలు – పునస్కారాలు, వ్రత, భోజన, వాయనాల కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దాపన అని పిలుస్తారు మా ప్రాంతంలో. ముత్తైదవలతోపాటు బంధువులకు కూడా 11 అట్లచొప్పున అందజేస్తారు. చూసేందుకు ఈ వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుందిలే. 11 అట్లను ఉంచిన మూకుడుని వెనక్కు పెట్టుకుని ”ఇస్తినమ్మ వాయినం” అని ఇచ్చేవాళ్లు అంటుంటే, ”తీసుకుంటి వాయినం” అంటూ తీసుకునేవాళ్లు కూడా వెనక నుంచి తీసుకుంటారు. ఇదేదో మూఢ నమ్మకం కారణంగా ఏర్పడి, కొనసాగి ఉంటుందనిపిస్తోంది తప్ప ఔచిత్యం కన్పించటం లేదు. ఉద్దాపన తీర్చదలచుకుంటే ఆ ఇంట్లో వారం రోజుల ముందు నుంచే సందడే సందడి. సమీప బంధువులంతా చేరుకుంటారు. చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ ఆ ఇల్లే కేంద్రం. అందరూ చేరి పిండి వంటలకు ఏర్పాట్లు చేస్తుంటారు. పండుగ ముందు రోజే నాలుగయిదు పొయ్యిలు పెట్టి తట్టలకొలదీ అట్లు పోస్తారు.
ఇక ఊరి నిండా ఇంటింటా, చెట్టుచెట్టుకూ ఉయ్యాళ్లు కన్పించటం పండుగ ప్రత్యేకత. అవికాక కనీసం వీధికి ఒక్కటయినా పెద్ద ఊయల వేస్తారు. దీనికితోడు కనీసం ఊరికి రెండయినా రంగుల రాట్నాలనూ వేయటం కద్దు. రంగులరాట్నం అంటే దాంట్లో సాంకేతిక విషయాలు కూడా ఇమిది ఉంటాయి. ఓ పెద్ద దూలాన్ని భూమిలో పాతుతారు. దాని కొసన బండి ఇరుసును తాళ్లతో బంధిస్తారు. ఆ ఇరుసుకు ఎడ్లబండి చక్రాన్ని తగిలిస్తారు. ఆ చక్రంపైన ఇంటూ ఆకారంలో బయటకు వచ్చే విధంగా  బొంగుల్ని కట్టేస్తారు. ఆ బొంగుల చివర్లలో ఎదురబళ్ల ఊయళ్లను నాలిగింటిని ఏర్పాటు చేస్తారు. ఈ ఊయళ్లలో ఒక్కొక్కరు (కొండొకచో ఇద్దరు కూడా) ఎక్కిన తర్వాత ఒక ఊయలకుగానీ, రెండింటికిగానీ పెద్ద గడను తగిలించి చుట్టూ తిప్పటంతో అవి వేగం అందుకుంటాయి. గుడ్రంగా కనీసం 20 అడుగుల ఎత్తుకుపోయి తిరుగుతాయి. ఇక బజార్లలో వేసే ఊయలను బలంగా ఊపితే ఆకాశానికి చేరుతుందంటే నమ్మాల్సిందే.  అటూ ఇటూ కనీసం 15 అడుగుల నుంచి 20 అడుగుల మేర ఎత్తుకు పోయి తిరిగొస్తుంటుంది. అన్ని వయస్సుల ఆడవాళ్లూ, యువకులు, పిల్లలంతా ఊయళ్లు, రంగుల రాట్నాలూ ఎక్కి ఊగుతుంటారు. వీటిని కనీసం వారం, పది రోజులపాటు ఉంచుతారు. అందరికన్నా ఈ పండుగ పిల్లల్లో ఆనందం అంబరాన్నంటుతుంది. కొత్త దుస్తులు, పిండి వంటలు లేకపోయినా ఓ తాడును ఇంటి దూలానికి కట్టి ఊగటంతో ఆ ఆనందం పిల్లలందిరి సొంతమవుతుంది. పండుగ మాటెలాగున్నా ఓ చెట్టుకో, ఇంటి వసారా కొక్కేనికో ఓ తాడును కట్టి మీ బుడుగుల్నీ, సీగాన పెసూనాంబలనూ అందులో కూర్చోబెట్టి ఊపండి. అన్నట్లు  ఊయల తాడు రెండు మడతలు  ఉండాలి. పిల్లలు కూర్చునేందుకు గుడ్డతో తొట్టిని ఏర్పాటు చేయాలంటే రెండు మడతల తాడు అవసరం మరి. ఆ ఊయలలో మీ పిల్లలు ఊగుతుండగా వారి ముఖాల్ని చూడండి. ఎన్నడూ లేనంతగా వెలిగిపోతుంటాయి. అన్నట్లు పిల్లల పాటల్ని, వీలయితే ఊయల పాటల్ని విన్పిస్తూ వాళ్లను ఊపండి. అది వారికి స్వర్గారోహణమేనంటే నమ్మండి మరి.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

 1. అట్ల తద్దె గురించి చాలా బాగా రాసారండీ. మా ఉత్తరాంధ్రలో మా చిన్నప్పటి రోజులలో ఈ పండుగ బాగా జరుపుకునే వారు.
  గోదావరి జిల్లాలలో లాగా మా ప్రాంతంలో వీధులలో కామన్గా ఉయ్యాలలు వేయడం కానీ, రంగుల రాట్నం ఏర్పాటు చేయడం కానీ
  ఉండేది కాదు. కానీ ప్రతి ఇంటి లోనూ ఉయ్యాలలు కట్టే వారు.
  మాప్రాంతంలో అట్ల తదియనాడు తెల్లవారు ఝామున మూడింటికే లేచి, ఆడ పిల్లలు, ముత్తయిదవలూ, చిన్న చిన్న అబ్బాయిలు కూడా స్నానాలు కానిచ్చి, కొత్త బట్టలు కట్టుకుని, భళ్ళున తెల్లవారే లోపే వేడి వేడి అన్నాలు తినేసే వారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేయడానికి వలనుపడదు. ఆ వేకువ జామున చిరు వెన్నెలలో అమ్మాయిలంతా రకరకాల ఆటలు ఆడుకుంటూ గడిపేవారు. తెల్లారేక, ప్రతి ఆడపిల్లా 8 ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఉయ్యాలలు ఊగాలి. ఆరోజంతా పగలు కొన్ని గంటల వ్యవధానంతో రకరకాల పళ్ళు తింటూ, తాంబూలాలు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉయ్యాలలు ఊగడమే. ఆ సాయంత్రం చంద్రోదయం కాగానే అట్లు వాయినాలు ఇవ్వడం తీసుకోవడం. ఈ తంతు మీరు రాసినట్టుగానే జరిగేది

  మీరు చెప్పినట్టు మన పండుగలలో సామాజిక కోణాలు మరుగున పడిపోయి, ఆధ్యాత్మిక కోణాలు ప్రబలం కావడం వల్ల ఆ పండుగ వేడుకలన్నీ లాంఛన ప్రాయంగా మిగిలి పోతున్నాయి.

  మంచి టపా రాసారు. అభినందనలు..

  స్పందించండి

 2. ippudaa sandadi ekkadundi?aa rojulu talistene aanadamkalugutundi.pandagala vaataavaraname kanipinchadamledu.

  స్పందించండి

 3. సుబ్బారావుగారూ! మీరు ఏమైనా రాయగలరు అన్న దాఁకి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదు. భలే రాశారండీ..! చాలా బాగుంది. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అయితే గోరింటాకఁ, గోంగూర పచ్చడి కూడా ఈ పండుగలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరన్నట్లు ఇవన్నీ వారం రోజులు ముందునుంచే ఏర్పాట్లు జరుగుతాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వేకఁవనే లేచి తలస్నానాలు చేసి సూర్యుడు వచ్చే లోపే భోజనాలు చేస్తాం. వాయినం తీర్చుకఁనేవారికి ఐదుగురు ముత్తయిదువులు, పోతురాజు అఁ్న కలిపి ఒక్కొక్క ముద్ద పెడతారు. అవి తిన్నాకే మిగిలిన భోజనం చేయాలి. అందరూ ఇక మధ్యాహ్నం భోజనం చేయకఁండా సాయంత్రం మళ్లీ స్నానాలు చేసి పూజ చేస్తారు. పూజల్లో అట్లతద్ది కథ చదువుతారు. ఆ తర్వాత గుమ్మాఁకి ఇవతల వాయినం తీర్చుకఁనేవారు అవతల ముత్తయిదువులు, పోతురాజు ఉంటారు. వాయినాలు ఇచ్చే ముందు గడప మీద సాన పీట పెడతారు. దాఁమీద వాయినం ఇచ్చేవారిది ఒక పాదం, పుచ్చుకఁనేవారిదొక పాదం పెట్టి పుచ్చుకఁంటారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకఁన్నాక ఉయ్యాలలూగుతారు. ఇదంతా వాయినాలు తీర్చుకఁనేవారి తంతు. ఈ సందర్భంగా అట్లు పోయడం గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల అందరూ కలిసి చేసుకఁంటారు. ఆ కలవిడితనం, కలిసి చేసుకోవడం అన్నీ పోయి ఇందులో కూడా వ్యాపారం మొదలైంది. ఇవన్నీ ముందుగానే ఆర్డరిస్తే ఎఁ్న అట్లు కావాలంటే అఁ్న, అందులో ఉంచాల్సిన సమస్త సామాగ్రి పేకింగ్‌ చేసి మరీ ఇస్తున్నారు. ఈ వ్యాపార ప్రభావంతో చుట్టుపక్కల వాళ్లు పండగలకఁ, పబ్బాలకూ కలుసుకోవడం చాలా అరుదైపోతుంది. వాళ్ల మధ్య కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి. మంచీచెడూ తగ్గిపోతుంది.
  ఇక పిల్లకాయలైతే ముందురోజు రాత్రే గోరింటాకఁలు పెట్టేసుకఁంటారు. తెల్లవారు జామునే లేచి స్నానాలు కాఁస్తారు. కాల్వలు ఉన్నవాళ్లయితే అక్కడ చేసి వస్తారు. సూర్యుడు వచ్చే లోపు గోంగూర పచ్చడి వేసుకఁఁ లాగిస్తారు. ఈ పండుగ కోసం పిల్లలంతా ఎంతో ఎదురుచూస్తూ ఉంటారు. ఉయ్యాలలూ ఒకరి కన్నా ఒకరు పోటీ పడి పెద్ద పెద్ద ఊపులు ఊగుతూ ఉత్సాహపడటం కద్దు. అబ్బ ఆరోజులే వేరండీ..! ఇప్పుడు పల్లెల్లో కూడా ఈ సాంప్రదాయం మీరన్నట్లు సామాజిక దృక్పథం కొడగంటిపోతుంది. ఆథ్మాత్రిక ప్రక్రియలూ అదీ చాలా యాంత్రికంగా తంతు ముగించుకోవడం జరుగుతుంది. ఉయ్యాలలు కట్టడం కూడా చాలా అరుదై పోయింది. ఁజమే మన పిల్లల్ని ఉయ్యాలలు ఊపిన సందర్భాలే లేవు. ఏమైనా చాలా బాగా మీ జ్ఞాపకాల పందిరి వేశారు. మాలాంటి వాళ్లనూ ఆ పందిరి కిందకఁ చేర్చినందుకఁ ధన్యవాదాలు..

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: