చిత్తూరులో రాజకీయ రాబందులు

చిత్లూరు జిల్లా మన్నవరంపై రాజకీయ రాబందులు వాలుతున్నాయి. పేదల భూముల్ని పెద్దలే గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఎన్నికల్లో నువ్వా, నేనా అంటూ కయ్యానికి దిగే కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు మన్నవరం రియల్‌ వ్యాపారంలో వియ్యాలవారిలా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు మూకుమ్మడిగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పావులుగా వాడుకుని పేదల భూములను కబ్జా చేస్తున్నారు. రాజకీయ ప్రముఖుల భూముల వైపే నాలుగు దారుల రహదారి నిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాలరెడ్డి పేదలకు సంబంధించిన 80 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా కాంగ్రెసు, టిడిపి నేతలెవ్వరూ నోరు మెదపకపోవడం వెనుక తమ గుట్టు బయటపడకూడదన్న మతలబు ఉంది.
రెండు నెలల్లో 150 రిజిస్ట్రేషన్లు
చిత్తూరు జిల్లా మన్నవరం సమీపంలో విద్యుత్తు ఉపకరణాల పరిశ్రమకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ భూమిపూజ చేయడంతోనే ఇక్కడ భూ రాబందులు వాలటం ప్రారంభమయింది. పేదలకు కష్టాలూ, నష్టాలూ ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ముఠాల నాయకులు కలగలిసి భూముల వేటకు దిగారు. వెలంపాడు, కల్వగుంట, వాంపల్లి తదితర ఐదు పంచాయతీల పరిధిలో కేవలం రెండు నెలల కాలంలో 150 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీనికితోడు అనధికారికంగా వేలాది ఎకరాల భూములు చేతులు మారినట్లు స్ధానికులు తెలిపారు.
నిన్నటిదాకా కాకులు దూరని కారడవి
నిన్నమొన్నటివరకూ మన్నవరం అంటే ఎర్రబస్సు కూడా వెళ్లని మారుమూల ప్రాంతం. విశాఖ ఉక్కు తర్వాత రాష్ట్రానికి మంజూరయిన అంతటి భారీ ప్రభుత్వ పరిశ్రమ ఇది. ఎన్‌టిపిసి, బెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో 750 ఎకరాల్లో ఆరువేల కోట్ల రూపాయల పెట్టుబడితో విద్యుత్తు ఉపకరణాల ఉత్పత్తి ఇక్కడ జరగబోతోంది. రానున్న ఐదేళ్లలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన సంస్థకు అనుసంధానంగా 400 పరిశ్రమలు కూడా చుట్టుపక్కల రానున్నాయి. ఆరువేల మందికి ప్రత్యక్షంగానూ, 25 వేల మందికి పరోక్షంగానూ ఇక్కడ ఉపాధి లభించనుంది. ఈ పరిశ్రమకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సెప్టెంబరు ఒకటో తేదీన భూమిపూజ చేయడంతో దేశ పరిశ్రమల చిత్ర పటంలో మన్నవరం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మన్నవరం పరిసరాల్లో అప్పటిదాకా ఎకరా 16 వేల రూపాయలు ఉన్న భూమి ప్రస్తుతం రూ. 30 లక్షల దాకా పలుకుతోంది.
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి!
రాష్ట్రానికి చెందిన కేంద్ర జౌళి-చేనేతశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి నిమ్మరాళ్లపల్లి వద్ద వంద ఎకరాల భూమిని కారుచౌకగా ఇటీవలే కొనుగోలు చేశారు. ఇక్కడ ప్రశ్న ఇంత భూమి కొనుగోలుకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయన్నదే. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు, మాజీ మంత్రి బజ్జల గోపాలకృష్ణ ఇనగలూరు, ఆంజనేయపురం వద్ద వంద ఎకరాలు కొన్నారు. వెలంపాడు సమీపంలోని 168/1 సర్వేనెంబరు కింద ఒకటిన్నర ఎకరాను 1959 నుంచీ ఆలం రోశమ్మ అనుభవంలో ఉంది. అయితే ఎస్‌ఎస్‌ కాలువ పనులు జరుగుతోన్న నేపథ్యంలో గుత్తేదారు ఆమె భూమిని షెడ్డు నిర్మాణం కోసం అద్దెకు తీసుకున్నారు. అయితే మన్నవరం రాకతో ఆమెకు తెలియకుండానే ఆ భూమిని స్థానిక ఎంపిపి ఇతరులకు అమ్మేసినట్లు ధ్రువీకరణ పత్రాలు బట్టబయలు చేస్తున్నాయి. అలాగే బత్తలపల్లికి చెందిన బక్కయ్యకు చెందిన మూడున్నర ఎకరాల పొలాన్ని రెండు నెలల క్రితం ఇతరులకు అమ్మేసినట్లు వెల్లడయింది. నెల్లూరుకు చెందిన శాసనసభ్యుడు ఆదాల ప్రభాకరరెడ్డి 50 ఎకరాల భూమిని ఇనగలూరు వద్ద కొనుగోలు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు ఒకరు మామిడిగుంట, గోవిందపురం వద్ద వంద ఎకరాలను కొనేశారు. తిరుపతి పురపాలకసంఘ మాజీ ఛైర్మన్‌ కందాటి శంకరరెడ్డి ఇనగలూరు సమీపంలో 35 ఎకరాలను, వాంపల్లి వద్ద 15 ఎకరాల డికెటి భూమిని ఆక్రమించుకుని పట్టా కూడా పుట్టించుకున్నారు. భీమవరం వద్ద ఎపి 9వ బెటాలియన్‌కు చెందిన భూముల్లో సర్వే నంబరు ఒకటి నుంచి 150 ఎకరాలను స్థానిక సహకార బ్యాంకు అధికారి బంధువుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమయింది. పాణ్యం శాసనసభ్యుడి అనుచరులు పేదల భూములను ఆక్రమించుకున్నారు. దానిపై సిపిఎం పోరాటానికి దిగటంతో పాసు పుస్తకాలను రద్దు చేసిన విషయం విదితమే. ఇదిగాకుండా మరో 70 ఎకరాలను ఆయన కొనేశారు. ఇవన్నీ రాజకీయ రాబందులకు సంబంధించిన చిట్టాలు మాత్రమే. దళారుల వ్యవహారాలను పరిశీలిస్తే వేలాది ఎకరాలు చేతులు మారినట్లు స్పష్టమవుతో oది.
కోరుకున్న వైపే నాలుగు దారుల రహదారి
ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారి నుంచి మన్నవరం పరిశ్రమ వరకూ 14 కిలోమీటర్ల దూరంమేర నాలుగు దారుల రహదారి మంజూరయింది. దీనిని వెంటనే నిర్మించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయి. వాస్తవానికి ఈ రహదారిని వాంపల్లి చెక్‌పోస్టు మీదుగా నిర్మించాలని అధికారులు తొలుత భావించారు. అయితే ఇక్కడ భూముల్ని సొంతం చేసుకున్న నేతలు ఆ వ్యవహారంలోనూ వేలుబెట్టారు. తమ భూములున్న వైపే రహదారిని మరల్చుకునేందుకు ఢిల్లీస్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇనగలూరు-ఆంజనేయపురం మధ్యలో ఈ రహదారిని దారి మళ్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

One response to this post.

  1. అయ్యొ! శ్మశానం కన్నా చొటు వుంచారా వెధవలు .వీళ్ళ దుంపలుతెగ వీళ్ళకు అలెగ్జాండర్ గురించి చెప్పటము కాదు ఆంతకన్నా యెక్కువ ప్రక్రియతొ తెలిపితె అన్నా మారుతారా.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: