‘వంశధార’ అక్రమార్కులకు క్లీన్‌చిట్‌ … మరి రూ. 20 కోట్లు ఎటు పోయినట్లో?


శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రూ.20 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర నిఘా విభాగం నివేదిక బుట్టదాఖలవనుంది. అవినీతి పరులని ప్రాథమికంగా తేలటంతో సస్పెండు చేసిన అధికారులకు ఇప్పుడు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 2006-07లో వంశధారకు రూ.62.08 కోట్లు వినియోగించి మరమ్మతులు చేశారు. ఈ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావటంతో నిఘా విభాగం దర్యాప్తు జరిపింది. దానికి సంబంధించిన నివేదికను గత ఏడాది మార్చిలో ప్రభుత్వానికి అందించారు. అక్రమాలకు అప్పటి వంశధార ప్రాజెక్టు ఎస్‌ఇ, ఇఇ, డిఇ తదితర 33 మంది ఇంజినీర్లు బాధ్యులని నిఘా విభాగం నిర్ధారించింది. స్వాహాచేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలనీ, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని నిఘా విభాగం స్పష్టంగా పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులందరినీ సస్పెండు చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత సంఖ్యలో ఇంజనీర్లను ఒకేదఫా సస్పెండు చేయటం అదే తొలిసారి. దీంతో గుత్తేదార్లు, ఇంజినీర్లు ఎవరి దోవలో వారు పైరవీలు మొదలెట్టారు. ూద్యోగుల సమస్యల్ని పరిశీలించే విభాగానికి ఫిర్యాదు చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. అయినా వారికి వ్యతిరేకంగానే తీర్పులు వెలువెడ్డాయి. చివరికి ఆ నివేదికను మంత్రులు పొన్నాల, ధర్మాన తదితరులు కలిసి ముఖ్యమంత్రి రోశయ్య ముందు పెట్టారు. దీంతో కనీసం తూతూ మంత్రంగానయినా తిరిగి దర్యాప్తు జరిపించి కొందరికైనా క్లీన్‌చిట్‌ ఇస్తే మినహా సస్పెన్షన్లను ఎత్తివేయలేమని ప్రభుత్వం తేల్చుకుంది. ూత్తరాంధ్ర ప్రాజెక్టుల సలహాదారు రౌతు సత్యనారాయణను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం ూత్తర్వులు జారీ చేసింది. సస్పెండైన 33 మంది ఇంజనీర్లలో, 12 మందికి అవినీతి వ్యవహారాల్లో ఎటువంటి సంబంధమూ లేదని నిర్దారిస్తూ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ మేరకు 12 మందినీ గత ఏప్రిల్‌లో తిరిగి ూద్యోగాల్లో నియమించారు. మిగిలిన 21 మందికీ ప్రభుత్వం దారిమళ్లిన సొమ్మను తిరిగి చెల్లించాలని తాఖీదులు జారీ చేసింది. అక్రమార్కులలో ఒకరు మృతిచెందగా, ముగ్గురు ఉద్యోగ విరమణ చేశారు. నిబంధనల ప్రకారం జీతంలో మూడోవంతుకు మించి జమచేసుకునేందుకు అవకాశం లేదు. సస్పెన్షను కాలంలో ఉద్యోగికి దక్కేది మూడో వంతు జీతమే. అందువలన దారిమళ్లిన సొమ్మును వసూలు చేయాలంటే ఆ ఉద్యోగికి పూర్తి జీతం అందాలి. ఆ మిషతో అక్రమార్కుల సస్సెన్షనును ప్రభుత్వం ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయల మూటలు చేతులు మారినట్లు విమర్శలు విన్పిస్తున్నాయి.

వ్యాఖ్యానించండి