Archive for అక్టోబర్ 29th, 2010

15 రోజుల్లో 32 ఆలయాల దర్శనo

  • గుళ్లూ గోపురాల చుట్టూ ఎడ్యూరప్ప ప్రదక్షిణలు
  • రూ.1.6 కోట్ల ప్రజా ధనం వృథా

దేవుడే రక్షిస్తాడు! ఇది కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నమ్మకం. తనకు సమస్యలు ఎదురైనప్పుడు, ఎదురవుతున్నట్లు కనిపించినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న గుళ్లూగోపురాల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎడూరప్ప నమ్మకానికి అంతే లేకుండా పోయింది. తన ప్రభుత్వానికి పొంచి వున్న ముప్పును తప్పించాలంటూ గుళ్లూ గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేపట్టారు. అదీ ఒకట్రెండు గుడులనుకుంటే పొరపాటే. కేవలం 15 రోజుల వ్యవధిలో 32 గుళ్లను దర్శించి ‘చరిత్ర’ సృష్టించారు. ఇలా దర్శించిన గుళ్లలో జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణోదేవీ మందిరం కూడా ఉంది. తమిళనాడులో ఏడు, కేరళలో మూడు, దక్షిణ కర్నాటకలో ఆరు, బెంగళూరు, తన సొంత పట్టణం షిమోగాలో మూడేసి గుడులను ఆయన దర్శించారు. ఒకవైపు గుళ్ల చుట్టూ తిరుగుతూనే హోమాలు కూడా నిర్వహించారు. ఇలా తన వ్యక్తిగత భక్తి విశ్వాసాలకు వినియోగించిన ధనం మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చయింది.

పర్యటనలకు ప్రభుత్వ హెలికాప్టరే వినియోగించుకున్నారు. ఈ విధంగా రూ.1,58,24,700 ప్రభుత్వ ధనం ఖర్చయినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన కేబినెట్‌లోని ‘విశ్వాసపాత్రులైన’ మంత్రులది కూడా ఇదే దారి. దక్షిణ భారత్‌లోని కొన్ని ప్రముఖ ను వారు దర్శించారు. ఎడ్యూరప్ప సన్నిహితురాలు, విద్యుత్‌ శాఖ మంత్రి శోభా కరందాజ్లే అయితే మరో అడుగు ముందుకేశారు. ఎడ్యూరప్ప పీఠాన్ని కాపాలంటూ వారం రోజులపాటు ఉపవాస ప్రార్థనలు చేపట్టారు. ఆమె కేవలం కొన్ని పళ్లు, నీరు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్‌ సహచరుల తీరు ఈ విధంగా ఉంటే, ఎడ్యూరప్పకు గట్టి మద్దతిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఇలాంటి పూజలకే పది లక్షలు ఖర్చు పెట్టారు. ఎడ్యూరప్ప జాతక చక్రాన్ని బట్టి దోష నివారణ పూజలు చేయించారు.

అత్యున్నత పురస్కారం గెలుచుకున్నానహో


అవును. నిజ్జంగా నిజం. నేను అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్నాను. ఈ పురస్కారాన్ని సభ జరిపి ప్రదానం చేయలేదు. నాకు తెలియకుండానే నాకు ప్రదానం చేసేశారు. శాలువాలు కప్పరు. మంగళవాయిద్యాలు అంటూ ప్రతేకంగా ఉండవు.  మనసున మల్లెలు మాలలూగుతాయి. ఆనందం అంబరమంటుతుంది. సాధారణంగా ఇచ్చే జ్ఞాపిక అంటూ ప్రత్యేకంగా ఉండదు. అయినా జీవితాంతం వెన్నంటి ఉండే మృధుమధురమైన జ్ఞాపకాన్ని మాత్రం ఈ పురస్కారం నాకు అందించింది.
అదేనండి. ప్రముఖ రచయిత కర్లపాలెం హనుమంతరావుగారు తన ‘నా లోకం’ బ్లాగులో నా బొమ్మేసి మరీ నన్ను పరిచయం చేశారు. దాని కిందే గత నెలలో ప్రజాశక్తి స్నేహలో ప్రచురితమయిన నా కథ ‘ఖూని’ని కూడా టపా పెట్టారు.
శుక్రవారం (29. 10.10) ఉదయం అలాఅలా తెలుగు బ్లాగ్లోకాన్ని వీక్షించుకుంటూ నడుస్తుండగా, నడుస్తుండగా…ఓ చోట … నా లోకం. దానిలోకి జొరబడకుండా పోనెప్పుడూ. ఈ రోజూ అలానే జొరబడి చూద్దునుకదా. ఒక్కసారిగా దిమ్మతిరిగిందనుకోండి. అక్కడ నా బొమ్మ పెట్టుంది. ఇదేందిరా అనుకునేంతలోనే దాని కింద ‘పేరు వెంకటసుబ్బారావు కావూరి’ అంటూ శీర్షిక. ఆ కింద నా గురించి నా వరకూ లక్షలు, కోట్లు విలువచేసే నా పరిచయం. పైగా నన్ను గురించి, నా నిజాయితీ గురించి వకాల్తా. నా బ్లాగును వీక్షిస్తే కచ్చితంగా సంతృప్తి కలుగుతుందని యోగ్యతా పత్రం. ఆమ్మో ఇంకేం కావాలి రాతగాడిగా నాకు. ఇంకా కిందకొస్తే ఖూనీ కథ. అదండీ సంగతి. నాకొచ్చింది ఈనాడు ఎడిట్‌పేజీ రచయిత కర్లపాలెం హనుమంతరావుగారు మెచ్చి ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం. గతంలో బలిపీఠం కథకు ప్రముఖ రచయిత కాలువ మల్లయ్యగారి చేతులమీదుగా జాతీయ స్ధాయి పురస్కారాన్ని అందుకున్నాను. బీసీ నారాయణరావు ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని ఈనాడు జర్నలిజం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం నాగేశ్వరరావుగారి చేతులు మీదుగా, నాకు ఇష్టమయిన వ్యక్తిత్వ స్వరూపులు, పూర్వ జర్నలిస్టు వీ. శ్రీనివాసరావుగారి సమక్షంలో అందుకున్నాను. ఆ రెండింటి మాదిరే కర్లపాలెం హనుమంతరావుగారి తన నా లోకం బ్లాగ్లోకం ద్వారా అందజేసిన యోగ్యతాపత్రాన్ని గొప్ప పురస్కారంగా భావిస్తున్నాను. కృతజ్ఞతలు.