Archive for అక్టోబర్, 2010

ఇదిగిదిగిదిగో ఇది రెవెన్యూ మంత్రి (అ)ధర్మాన మాయధార

రాష్ట్ర మంత్రుల్లో పలువురు మధుకోడాలున్నారని లోక్‌సభ గుంటూరు సభ్యుడు రాయపాటి సాంబశివరావు గోలగోల చేస్తే అదంతా ప్రత్యర్థుల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరని కొట్టేశారు కొందరు. అయితే పలువురు మాటేమోగానీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మాలు శృతి మించి రాగాన పడుతున్నాయి. తన కొడుకు రామ మనోహర్‌నాయుడుకు శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ఆవృత కన్నెధార గ్రానైట్‌ గనుల్ని కట్టబెట్టటం సక్రమమేనని చెప్పేందుకు ప్రభుత్వాన్ని ఆయన తెలివిగా సిద్ధం చేస్తున్నారు.
అసలు ఏమి జరిగిందో?
శ్రీకాకుళం జిల్లా సీతంపేట పరిధిలోని కన్నెధార కొండల్లో మనోహరనాయుడికి 38 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టటం వివాదస్పదమయింది. వాస్తవానికి ఈ భూమిని ప్రభుత్వం 501 మంది గిరిజనులకు పట్టాలిచ్చింది. అయితే వారికి భూమిని మాత్రం ఇంతవరకూ చూపలేదు.
మంత్రి కుమారుడికి గనులు ఇవ్వటం నేరమా?
గిరిజనులకు పట్టాలిచ్చిన సర్వే నంబరు 289లోనే గతేడాది మనోహర్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. దాంట్లో గ్రానైటు రాళ్లను తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే చట్టం అమలు కాలేదు.
ఒకటి
తొలుత గ్రానైటు తవ్వకాలకు అనుమతి ఇచ్చేముందే స్ధానికుల నుంచి అభిప్రాయం సేకరించాలి – ఆ పని జరగలేదు. పైగా ఆ ప్రాంత గిరిజనులంతా తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు.
రెండు
పంచాయతీ పాలకవర్గ తీర్మానం ప్రకారం ఆచరణకు దిగాలి. – పంచాయతీ అసలే ఏ తీర్మానమూ చేయలేదు.
మూడు
గనుల మంజూరు బహిరంగంగా సాగాలి. ప్రముఖ పత్రికలలో ప్రకటనలు జారీ చేయాలి. అదే విధంగా ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తారో వారికే అనుమతి ఇవ్వాలి. – కన్నెధార కొండను ధారాదత్తం చేసే విషయంలో అంతా గుట్టుగా సాగింది.
దీనికితోడు ఆ భూమిని ముందే గిరిజనులకు పట్టాలిచ్చిన విషయాన్ని ఆర్డీఓగానీ, తహశీలుదారు జారీ చేసిన పత్రాల్లో పేర్కొనలేదు. ఈ వ్యవహారం రచ్చకెక్కిన సమయంలో ఈ అధికారులు నిర్వహించిన విలేకరుల సమావేశాల్లోనూ వెల్లడించలేదు. వివరించలేదు. పైగా ఆ వ్యవహారం తనకు తెలియనే తెలియదని తహశీలుదారు బంకటం వృత్తి ధర్మం మాటెలాగున్నా బాధ్యతా రాహిత్యాన్ని పట్టి చూపుతోంది. దీనికిగాను ఆ తహశీలుదారును వాస్తవానికి ఇంటికి పంపించాలి.
సహజ నటశేఖర ధర్మాన
ఇంత జరిగిన తర్వాత నటశేఖరుడు ధర్మాన నటించకుండా ఉంటాడా? ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించి తన నిజాయితీని లోకానికి వెళ్లడించాలంటూ ఆయన ముఖ్యమంత్రి రోశయ్యకు ఉత్తరం రాసిపారేశారు.
తందాన తాన రోశయ్య
ఇక ఘనత వహించిన రోశయ్య సారు ఊరుకుంటారా? ఓ దర్యాప్తు సంఘాన్ని వేసిపారేశారు. ఎవరితోనో తెలుసా? ధర్మాన ఏరికోరిన వారితోనేనండోయ్‌! ధర్మాన వారినే ఎందుకు కోరుకున్నారంటే వాళ్లంతా ఆయన చాటుమాటుగా వేసిన మేత మేసినవాళ్లు. ఈ వ్యవహారంలో తప్పులు మీద తప్పులు చేసినవాళ్లు. తప్పులు చేసి కూడా ఏ తప్పూ చేయలేదని తిమ్మిని బమ్మిని చేయబూనుకున్నవాళ్లు.
ఎవరెవరు?
ఇంకెవరు?!
సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యులతో విచారణ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 50 రోజుల్లో నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టరు ఎన్‌ శ్రీకాంత్‌ ఆ సంఘాన్ని ఆదేశించారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారితోపాటు ఆర్‌డిఒ, భూగర్భ గనులశాఖ ఎడి, డివిజనల్‌ అటవీశాఖాధికారి, భూసర్వే రికార్డుల ఎడి, దేవాదాయశాఖ ఎడి సభ్యులుగా ఉన్నారు. తహశీల్దారు ఇచ్చిన అక్రమ అనుమతులకు మద్దతు తెలిపిన ఆర్‌డిఒ, భూగర్భ గనులశాఖ ఎడి దర్యాప్తు బృందంలో ఉన్నారు. తప్పులన్నీ ఒప్పులేనని ఆ ఇద్దరు అధికారులూ మొదటే పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందనీ ఆర్‌డిఓ ప్రకటించారు. గనుల కేటాయింపు వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనీ, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ నిత్యసత్యాలు వల్లెవేశారు. అందువలనే నిరభ్యంతర పత్రం ఇచ్చామని ఆయన లిఖితపూర్వకంగా తెలిపారు. తహశీల్దారు ఇచ్చిన నివేదిక ఆధారంగానే గనుల కేటాయింపుకు అంగీకరించామని గనులు – భూగర్భశాఖ సహాయ సంచాలకుడు ప్రకటించారు.
ఏమి జరగబోతోంది?!
ఇంకేమి జరుగుతుంది. ఎప్పటి మాదిరే. గప్‌చుప్‌. హూష్‌ కాకి. ఇప్పటిదాకా వాగిన వాగుడుకే అధికారులు కట్టుబడి గనుల అనుమతి సక్రమమేనని నివేదికిస్తారనడంలో సందేహంలేదు. పైగా అధికారులు నివేదికను తయారు చేసినా కలెక్టరుకు అందజేయటంలో ఏదో ఆలస్యం జరుగుతోంది. ఆ మతలబు ఏమిటో ఆ..ధర్మాన మహాశయుడికే తెలియాలి. లోగుట్టు ప్రజలకెరుగనుకోండి.

ఇస్తినమ్మ వాయినం … తీసుకుంటి వాయినం


అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌, ముద్దపప్పు మూడట్లోయ్‌ అంటారు ఆరుద్ర ఏదో తెలుగు సినిమాలో. రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారో తెలియదుగానీ కోస్తా గ్రామాల్లో మాత్రం పదేళ్ల క్రితందాకా ప్రశస్తంగా జరిగేది. మారిన పరిస్ధితుల్లో ఈ పండుగ నామమాత్రమయింది. అందులోనూ సాంఘీక కోణం పూర్తిగా మరుగున పడిపోతోంది. ఆథ్యాత్మిక కోణంతో పండుగను ముగిస్తున్నారు.
ఆథ్యాత్మిక కోణాన్ని ఆవలబెట్టి చూస్తే అట్లు, ఊయళ్లు ఈ పండుగ ప్రత్యేకతలు.
మా ఊళ్లో (ప్రకాశం జిల్లా ఈదుమూడి) దసరా ఆనవాళ్లు కూడా కన్పించేవి కాదు. దసరా సెలవుల్ని దీపావళి ఏర్పాట్లకు ఉపయోగించుకునేవాళ్లం. అయితే అట్లతద్దె మాత్రం కనీసం వారం రోజులపాటు సందడి సందడి చేసేది.
ఆడపిల్ల వివాహానికి తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ పండుగ ప్రారంభమయి ఉండొచ్చు. వివాహాననంతరం వచ్చే తొలి ఆశ్వయుజ బహుళ తదియనాడు అట్లతద్దె పండుగను జరుపుకుంటారు. కనీసం ఐదుగురు ముత్తైదవలను, ఓ పోతురాజునూ ఎంపికచేసుకుని వారి ఆధ్వర్యంలో పూజలు – పునస్కారాలు, వ్రత, భోజన, వాయనాల కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దాపన అని పిలుస్తారు మా ప్రాంతంలో. ముత్తైదవలతోపాటు బంధువులకు కూడా 11 అట్లచొప్పున అందజేస్తారు. చూసేందుకు ఈ వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుందిలే. 11 అట్లను ఉంచిన మూకుడుని వెనక్కు పెట్టుకుని ”ఇస్తినమ్మ వాయినం” అని ఇచ్చేవాళ్లు అంటుంటే, ”తీసుకుంటి వాయినం” అంటూ తీసుకునేవాళ్లు కూడా వెనక నుంచి తీసుకుంటారు. ఇదేదో మూఢ నమ్మకం కారణంగా ఏర్పడి, కొనసాగి ఉంటుందనిపిస్తోంది తప్ప ఔచిత్యం కన్పించటం లేదు. ఉద్దాపన తీర్చదలచుకుంటే ఆ ఇంట్లో వారం రోజుల ముందు నుంచే సందడే సందడి. సమీప బంధువులంతా చేరుకుంటారు. చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ ఆ ఇల్లే కేంద్రం. అందరూ చేరి పిండి వంటలకు ఏర్పాట్లు చేస్తుంటారు. పండుగ ముందు రోజే నాలుగయిదు పొయ్యిలు పెట్టి తట్టలకొలదీ అట్లు పోస్తారు.
ఇక ఊరి నిండా ఇంటింటా, చెట్టుచెట్టుకూ ఉయ్యాళ్లు కన్పించటం పండుగ ప్రత్యేకత. అవికాక కనీసం వీధికి ఒక్కటయినా పెద్ద ఊయల వేస్తారు. దీనికితోడు కనీసం ఊరికి రెండయినా రంగుల రాట్నాలనూ వేయటం కద్దు. రంగులరాట్నం అంటే దాంట్లో సాంకేతిక విషయాలు కూడా ఇమిది ఉంటాయి. ఓ పెద్ద దూలాన్ని భూమిలో పాతుతారు. దాని కొసన బండి ఇరుసును తాళ్లతో బంధిస్తారు. ఆ ఇరుసుకు ఎడ్లబండి చక్రాన్ని తగిలిస్తారు. ఆ చక్రంపైన ఇంటూ ఆకారంలో బయటకు వచ్చే విధంగా  బొంగుల్ని కట్టేస్తారు. ఆ బొంగుల చివర్లలో ఎదురబళ్ల ఊయళ్లను నాలిగింటిని ఏర్పాటు చేస్తారు. ఈ ఊయళ్లలో ఒక్కొక్కరు (కొండొకచో ఇద్దరు కూడా) ఎక్కిన తర్వాత ఒక ఊయలకుగానీ, రెండింటికిగానీ పెద్ద గడను తగిలించి చుట్టూ తిప్పటంతో అవి వేగం అందుకుంటాయి. గుడ్రంగా కనీసం 20 అడుగుల ఎత్తుకుపోయి తిరుగుతాయి. ఇక బజార్లలో వేసే ఊయలను బలంగా ఊపితే ఆకాశానికి చేరుతుందంటే నమ్మాల్సిందే.  అటూ ఇటూ కనీసం 15 అడుగుల నుంచి 20 అడుగుల మేర ఎత్తుకు పోయి తిరిగొస్తుంటుంది. అన్ని వయస్సుల ఆడవాళ్లూ, యువకులు, పిల్లలంతా ఊయళ్లు, రంగుల రాట్నాలూ ఎక్కి ఊగుతుంటారు. వీటిని కనీసం వారం, పది రోజులపాటు ఉంచుతారు. అందరికన్నా ఈ పండుగ పిల్లల్లో ఆనందం అంబరాన్నంటుతుంది. కొత్త దుస్తులు, పిండి వంటలు లేకపోయినా ఓ తాడును ఇంటి దూలానికి కట్టి ఊగటంతో ఆ ఆనందం పిల్లలందిరి సొంతమవుతుంది. పండుగ మాటెలాగున్నా ఓ చెట్టుకో, ఇంటి వసారా కొక్కేనికో ఓ తాడును కట్టి మీ బుడుగుల్నీ, సీగాన పెసూనాంబలనూ అందులో కూర్చోబెట్టి ఊపండి. అన్నట్లు  ఊయల తాడు రెండు మడతలు  ఉండాలి. పిల్లలు కూర్చునేందుకు గుడ్డతో తొట్టిని ఏర్పాటు చేయాలంటే రెండు మడతల తాడు అవసరం మరి. ఆ ఊయలలో మీ పిల్లలు ఊగుతుండగా వారి ముఖాల్ని చూడండి. ఎన్నడూ లేనంతగా వెలిగిపోతుంటాయి. అన్నట్లు పిల్లల పాటల్ని, వీలయితే ఊయల పాటల్ని విన్పిస్తూ వాళ్లను ఊపండి. అది వారికి స్వర్గారోహణమేనంటే నమ్మండి మరి.

బతకలేక కంప్యూటరు పంతులు

”ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి. మాకిచ్చేది నెలకు రెండు వేల రూపాయలే. అది కూడా క్రమంగా ఇవ్వరు. ఇలా అయితే మేమెలా బతకాలి?”  ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఉపాధ్యాయులు ఆవేదనిది. ఇచ్చే కొద్దిపాటి వేతనం కూడా నెలనెలా చెల్లించక పోవటం  వారిని  ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏదో ఒకరోజు జీతం పెంచుతారన్న ఆశతో పనిచేస్తున్న వీరి బతుకులు దుర్భరం.

కనీస వేతనం అమలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవట్లేదని కంప్యూటర్‌ ఉపాధ్యాయులు వాపోతున్నారు. తమకు జీతాలు పెంచాలని, క్రమంగా చెల్లించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో జాతీయ సాంకేతిక (ఐఇజి) పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో కలిపి  10,000 మంది పనిచేస్తున్నారు. వీరికి నెలకు 2000-2500 చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల అంతకంటే తక్కువ కూడా ఇస్తున్నారు. ఏదోఒక రోజు క్రమబధ్ధీకరించకపోతారా అన్న ఆశతో పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యవహారం మరోలా ఉండటంతో వీరిని అభద్రతా భావం వెంటాడుతోంది.

జాతీయ సాంకేతిక పథకం కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయ్తిన్నప్పటికీ అందులో పని చేసే సిబ్బందికి మాత్రం కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఈ డబ్బులన్నీ ఏమౌతున్నాయి?…. అంటే ఐ.ఇ.జి. సంస్థ ఎన్‌ఐఐటి, ఎస్‌ఎస్‌ఐ లాంటి ప్రయివేటు ఏజన్సీలకు కంప్యూటర్‌ పాఠ్యాంశాల బోధన బాధ్యతలు అప్పగించింది. ఆ నిధుల్ని కూడా వాటికోసం కేటాయిస్తోంది. దీనివల్ల ఉపాధ్యాయుల సంగతేమోగానీ ప్రయివేటు ఏజన్సీలు నిధులు దండుకుంటున్నాయి. ఉపాధ్యాయులకు మాత్రం కనీస వేతనం కూడా చెల్లించట్లేదు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే బాధ్యత  చూసుకుంటే అలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రయివేటీకరణ మోజులో ఉన్న ప్రభుత్వం అలా చేయట్లేదు. కంప్యూటర్‌ ఉపాధ్యాయుల గోడు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ని వినియోగించుకోవాలనీ, దీనివల్ల ప్రయివేటు ఏజన్సీలపై ఆధారపడకుండా ఉండొచ్చని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కంప్యూటర్‌  ఉపాధ్యాయుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవట్లేదు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకోసం ప్రభుత్వం సాంకేతిక విద్యా పథకం (ఐటిసి ఎడ్యుకేషన్‌) ప్రారంభించింది. అయితే దీనికోసం కేటాయిస్తున్న నిధులు ఎక్కువభాగం ప్రొప్రయిటరీ హక్కులుగల మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోనుగోలుకే ఖర్చవుతున్నాయి. ఫ్రీ  సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటే ఈ దుబారాను తగ్గించుకోవచ్చు కానీ ప్రభుత్వం ఆ పనిచేయట్లేదు. ప్రయివేటు కంపెనీలకు లాభం చేకూర్చేందుకే వాళ్లదగ్గర సాఫ్ట్‌వేర్‌ కొంటున్న ప్రభుత్వం కంప్యూటర్‌ ఉపాధ్యాయులకు మాత్రం వేతనాలు చెల్లించడంలో, వారికి సౌకర్యాలు కల్పించడంలో ఆసక్తిచూపట్లేదు.

రాజధాని నడుబొడ్డున తెలుగుతల్లి హత్య!


నిందితుడు ముఖ్యమంత్రి రోశయ్య
రాష్ట్ర మంతటా నిరసనలు … పట్టించుకోని ప్రభుత్వం
(హైదరాబాదు, తెలుగిల్లు ప్రత్యేక ప్రతనిధి)
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాష్ట్ర రాజధాని నడిబొడ్డున తెలుగుతల్లిని నిలువునా హత్యచేశాడు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్లు విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగుతల్లిని ఖూనీ చేసేందుకుగాను కాంగ్రెసు నాయకుడు టి సుబ్బిరామిరెడ్డి రూ 10 కోట్ల విలువయిన కరకు కత్తిని అందించాడు.
1990లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రత్యేక శ్రద్ధపెట్టి రాష్ట్ర శాసనసభకు సమీపంలో ఏర్పాటు చేయించిన తెలుగు లలిత కళాతోరణాన్ని నామరూపాలు లేకుండా చరిత్రలో కలిపేందుకుగాను దానిని సుబ్బిరామిరెడ్డికి ధారాదత్తం చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారంనాడు ఉత్తర్వును విడుదల చేసింది. సుబ్బిరామిరెడ్డి అందజేసే రూ. 10 కోట్ల నిధులతో పాత లలిత కళాతోరణాన్ని మట్టిలో కలిపి దానికి కొత్త రూపం ఇస్తారు. దాంతో తెలుగు పదానికి స్వస్తి పలుకుతారు. దాని స్థానంలో రాజీవుడి పేరు చేరుతుంది. ఆ తర్వాత సుబ్బిరామిరెడ్డి కోరుకునే వందలాది కోట్ల విలువయిన గుత్తపని ఏదో ఆయనకు దక్కుతుంది. దాన్ని ముక్కల ముక్కల లెక్కన అమ్ముకుంటే ప్రతి వంద కోట్ల రూపాయల విలువయిన పనికి కనీసం పది కోట్ల రూపాయలు  చమటోడ్చకుండానే ఆయన బ్యాంకు ఖాతాలో ముందే జమపడతాయి. ఇది ఎన్నాళ్లుగానో అతి సాధారణంగా జరిగిపోతోన్న తీరు. అయితే ఇప్పటిదాకా అలాంటి చీకటి వ్యవహారాలకు గాంధీతాత బొమ్మలు చేతులు మారేవి. ఇప్పుడు తెలుగుతల్లిని నిలువునా ఘూనీ చేసేందుకు కాంగ్రెసు నేతలు తెగబడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య   మహా పాపపంకిలుడయ్యాడు. అతి పెద్ద నేరస్తుడయ్యాడు.
రాష్ట్రంలో ప్రభుత్వం లేదు లేదంటుంటే, ఉందనిపించుకోవాలనుకున్నాడో? ఏమోగానీ? కొణిజేటి రోశయ్య తెలుగుతల్లిని నిలువునా హత్య చేయటం క్షమించరాని నేరం, ఘోరం.
తెలుగుకూ రాజీవుగాంధీకి ఏమన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా సంబంధం ఉందా?
కనీసం తెలుగు లలిత కళాతోరణం అనేది ఒకటుందని రాజీవుగాంధీకి తెలుసా?
తెలుగు లలిత కళాతోరణం రూపు రేఖల్ని మార్చవలసిన అవసరం ఏమొచ్చింది?
మార్చవలసి వస్తే పది కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా?
ఊరూ, పేరు లేనివాడు వోక్స్‌వ్యాగిన్‌ నాదంటే వాడికి అలవోకగా రూ. 11 కోట్లు విసిరేసిన బొత్స ఈ ప్రభుత్వ ప్రతినిధే కదా? అతనిని అడిగితే ఆ డబ్బేదో పారేయడా?
లేదూ కాదూ అనుకుంటే తెలుగు పదాన్ని తీసేయకుండానే అవసరమయిన నిర్మాణ మార్పులకు పరిమితమయ్యే విధంగా రూ. 10 కోట్లు కాదు, వంద కోట్ల రూపాయల్ని ఒక్కరోజులో పోగేసే సత్తా లేదా మనకు?
అయినా, బహిరంగ వేదికను మూతేసి తైతక్కలాడాలన్న కోరిక ఎవరికి? ఎందుకు కలిగింది?
హైదరాబాదు నడిబొడ్డులో కనీస వసతులున్న ఒకే ఒక బహిరంగ వేదికను ఎందుకు మార్చాలో తెలుగు ప్రజలకు చెప్పి ఒప్పించగలరా?
మూతేసిన శీతల వేదిక కావాలనుకుంటే ఇంకొకటి నిర్మించుకోవచ్చుగదా?
ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రోశయ్యగానీ, కళా(రా)బంధు సుబ్బిరామిరెడ్డిగానీ సమాధానం చెప్పగలరా?
మీకు రాజీవుగాంధీ తీట ఇంకా తీరకపోతే మీ ఇంటి పేరును, మీ పేరును కూడా మార్చుకోండి. ఎవడికీ ఏ అభ్యంతరమూ ఉండదుకాక ఉండదు.
లేదా ఎందుకూ కొరగాని శాసనసభకు తగిలించుకోండి. అదీ చాలదనుకుంటే మీ ముఖాలకు సున్నం కొట్టించుకుని దానిపైన రంగురంగుల్లో రాయించుకుని ఊరేగండి. ఎవడు కాదంటాడు. కానీ తెలుగుతల్లిని నిలువునా ఖూనీ చేయబూనుకుంటే మీకు బడితె పూజ తప్పదు.
తెలుగు సమాజాన్ని అవమానించటం, తెలుగు భాషను నిలువు లోతున పాతేయబూనుకోవటం, తెలుగు పేర్ల స్ధానంలో రోతగాళ్లను చేర్చి తెలుగు భూమిని రోతపట్టించే పనికి పూనుకుంటే మాత్రం మీకు నూకలు చెల్లిస్తాం.
జై తెలుగు తల్లి! జైజై తెలుగు తల్లి.!!
నమో తెలుగుతల్లి ! నమో నమో తెనుగు తల్లి.!!
తెలుగోళ్లంతా స్పందించాలి! తెలుగు వాడి- వేడి చూపించాలి మరి!!

కాలేజి కాలేజి భలె భలె బతికిన కాలేజి


అక్కినేని నాగేశ్వరరావు-సావిత్రి నటించిన ఆరాధన (1962) చిత్రంలో గిరిజతో కలిసి రేలంగి వెంకటరామయ్య ఈ పాడారనుకుంటాను. జంతు ప్రదర్శనశాలను చూస్తూ పాడుకుంటారు ఈ పాటను.
అన్నట్లు, బతికిన కాలేజి అంటే?!
నాకు ఈ పాట వింటే  మా నాయనమ్మ సీతమ్మ ఓ పెళ్లికి మొదట తిరుపతికీ, అటునుంచి అటే వాళ్లతోపాటు మదరాసు పర్యటనకూ వెళ్లిన నాటి సంగతులు గుర్తుకొస్తాయి.
చచ్చిన కాలోజి, బతికిన కాలోజి, పద్దనాబంగాడిని చూసొచ్చామని అడిగినోళ్లకూ, అడిగినోళ్లకూ తెగ చెప్పేది మా నాయనమ్మ.
అది విన్నవాళ్లంతా తెగబడి నవ్వేవాళ్లు. బాగా చిన్నవాడినే అయినా ఆ మాటలు నాకూ తెగ నవ్వు తెప్పించేవి. ఎన్నిసార్లు విన్నా విచిత్రంగా ఉండేవి ఆ సంగతులు.
బతికిన కాలేజి అంటే జంతు ప్రదర్శనశాల.
చచ్చిన కాలేజి అంటే మదరాసు వైద్య కళాశాల.
జంతు ప్రదర్శనశాలో అన్నీ బతికిన జంతువులు ూంటాయి కాబట్టి ఆరోజుల్లో దానిని అలా పిలిచేవాళ్లు. ఇప్పటిలా ఏడాదికి ఒకసారి ప్రదర్శన పెట్టటం కాకుండా ఆ రోజుల్లో మదరాసు వైద్యకళాశాలలో ఏరోజయినా ప్రదర్శన చూడొచ్చు. ఆ ప్రదర్శనలో అన్నీ చచ్చిన జంతువులు ఉండేవి. సీసాల్లో ఫార్మలిన్‌ ద్రవాన్ని పోసి అందులో చనిపోయిన జంతువులు, కీటకాలతోపాటు మానవ శరీరాల్నీ భద్రపరచి చూపించేవారు. పెద్ద శరీరాలయితే తొట్లలో పడుకోబెట్టి ఉండేవట. అదే పిల్లల్ని పెద్ద పెద్ద సీసాల్లోనే ప్రదర్శనకు పెట్టారు. పాములు, కప్పలు, సముద్ర జంతువులు, కీటకాలు ఇతర విచిత్రమయిన జీవుల్నీ ఈ ప్రదర్శనలో చూసే అవకాశం ఉండేది. పదిపదిహేను అడుగుల పొడవయిన చేప ఎముకల గూడు కూడా అక్కడ ఓ గది కప్పుకు వేలాడదీసి ఉందని మా నాయనమ్మ చెప్పినట్లు గుర్తు. దాంట్లో నుంచి బస్సు ప్రయాణించవచ్చని మా నాయనమ్మ తనే కనుక్కున్నంత ఆనందంగా అందిరికీ వివరించటం ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఇప్పుడు మదరాసు వైద్య కళాశాల ఉంది, ప్రదర్శనశాలా ఉంది. అయితే దాన్ని పర్యాటకుల కోసం రోజూ తెరవటం మాత్రం లేదు. ఎప్పుడో ఏడాదికి ఒకసారి మాత్రం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అనుమతిస్తున్నారట.
అదండీ చచ్చిన కాలేజి, బతికిన కాలేజి సంగతులు.
ఇక పద్దనాబం అనే తెలుగు సినీనటుడు పద్మనాభం సంగతి మా నాయనమ్మ మాటల్లోనే చదవండి మరి.
”బస్సు దిగి అందరిమీ బిలబిల లోపలికి వెళ్లామా! అక్కడ పేద్ద కుర్చీలో ఎద్దంత మనిషి పడుకుని ఉన్నాడబ్బాయి. ఆయనే పద్దనాబం అంట. ఒకొక్క కాలు నా లావునుంది మరి. బలే నవ్విచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. అన్నం తిన్నారా? అని కూడా అడిగాడు.” అంటూ ముగించేది మా నాయనమ్మ. తన మదరాసు పర్యటన విశేషాలతో పది పదిహేను రోజులపాటు సందడి చేసినట్లు గుర్తు.

తెలుగులో డిస్కవరీ

 

ప్రపంచ ప్రసిద్ది గాంచిన డిస్కవరీ చానల్‌ తెలుగులో ప్రసారాలను ప్రారంభించినట్లుగా 20 అక్టోబరు 2010న ప్రకటించింది. కల్పన రహిత  సైంటిఫిక్‌ కార్యక్రమాలను అందిస్తూ  ప్రపంచ వ్యాపితంగా 180 దేశాలలో 150 కోట్ల టీవి చూపరుల అభిమానం పొందిన తమ సంస్థ దేశంలో ప్రసారాలను ప్రారంభించి 15 వసంతాలు పూర్తి చేసిన తరుణంలో తెలుగు ప్రసారాలను ప్రారంభించినట్లుగా  ఆసియా-పసిఫిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ బక్షీ వివరించారు. ప్రస్తుతానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ తెలుగు ప్రసారాలను చేస్తున్నట్లు తెలిపారు.  జనవరి,2011 నుంచి 24 గంటలూ తెలుగు ప్రసారాలను అందించనున్నట్లు  వివరించారు. ఇప్పటిదాకా దేశంలో ఇంగ్లీష్‌, హిందీలతో పాటుగా ఈ ఏడాది మొదటి నుంచి తమిళ  ప్రసారాలను ప్రారంభించిన తమ చానల్‌ నాల్గవ భాషగా తెలుగు ప్రసారాలతో దూసుకొని పోతున్నదని వివరించారు. ప్రస్తుతం దేశంలోని 604 జిల్లాలోని పట్టణాలు, గ్రామాలలో కలిపి 5కోట్ల 30 లక్షల మంది వీక్షకులతో దూసుకుపోతున్నామని వివరించారు. ముఖ్యంగా తమిళ ప్రసారాలు ప్రారంభించిన తరువాత 27 స్ధానాలు ముందుకు వచ్చి 18వ స్థానంలో తమ చానల్‌ నిలిచిందని వివరించారు. ఆ అనుభవంతోనే తెలుగు ప్రసరాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు

బరాక్‌ ఒబామాతో మమతాయణం

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నవంబరు అయిదో తేదీ నుంచి  తొమ్మిదో తేదీ వరకూ మన దేశంలో  పర్యటించనున్నారు.   ఒబామా కనీసం రూ. 60 వేల కోట్ల  విలువయిన మిలిటరీ, ఇతర పరికరాలను  విక్రయించేందుకు వస్తున్నారు. మన దేశం ఇంకా పూర్తిగా తలుపులు తెరవని విద్యుత్తు, సాంకేతిక, చిల్లర వర్తకం, ఆరోగ్యం, బ్యాంకింగు,  బీమా రంగాల్లో ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలని, రోడ్ల నిర్మాణాలకు భూసేకరణ సులభంగా జరిగేట్లు చూడాలని కూడా ఒబామా ఈ సందర్భంగా ఒత్తిడి చేయబోతున్నారు.  అమెరికాకు చెందిన బోయింగ్‌ కంపెనీ రానున్న కొద్ది సంవత్సరాల్లో మన దేశానికి కనీసం రూ. 1. 50 లక్షల కోట్ల విలువగల విమానాలు, ఆయుధాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఒబామా పర్యటన సందర్భంగా సి-17 రకం మిలిటరీ రవాణా విమానాలను పదింటినైనా మనకు కట్టబెట్టాలని చూస్తోంది. బోయింగ్‌ మిలిటరీ విమానాలతో పాటు జనరల్‌ ఎలక్ట్రిక్‌ మిలిటరీ జెట్‌ విమాన ఇంజన్లు, గూఢచార, నిఘా విమానాలను కూడా అంటగట్టేందుకు చూస్తోంది.  ఇప్పటి వరకూ పూర్వపు సోవియట్‌ తయారీ ఆయుధాలు, విడి భాగాలు మన మిలిటరీలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వాటి స్థానంలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని  మన దేశం-అమెరికా మధ్య కుదిరిన రక్షణ, అణు ఒప్పందాలలో ఒక ముఖ్య అంశం. ఈ ఏడాది మన రక్షణ బడ్జెట్టు  1. 47  లక్షల కోట్ల రూపాయలు. ఈ మొత్తం ఏటా పది శాతం పెరగవచ్చని పరిశీలకుల అంచనా . దాంతో అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో ఆయుధాలను తయారు చేసే సంస్థలు  ఎలాగైనా  తమ ఉత్పత్తులను మనకు కట్టబెట్టాలని చూస్తున్నాయి. బోయింగ్‌ కంపెనీ తయారు చేసే గ్లోబ్‌మాస్టర్‌-3  విమానాలను భారత్‌కు విక్రయించవచ్చని అమెరికా పార్లమెంటు అనుమతించినట్లు  ఆ దేశ రక్షణ సహకార సంస్థ ఏప్రిల్‌ 26న మన దేశంలోని అమెరికా  రాయబార కార్యాలయానికి తెలిపింది. పది విమానాల విలువ 580 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ  నిబంధనలకు భిన్నంగా ఉండే దేశాలకు తాము అణు సరఫరాలను చేయలేమని జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల మన పార్లమెంటు ఆమోదించిన అణు ప్రమాద పరిహార బిల్లునుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని వేరే చెప్పనవసరం లేదు. ఈ చట్టాన్ని తిరగదోడాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఒబామా కూడా ఈ ప్రస్తావన చేయవచ్చని చెబుతున్నారు. అమెరికా సంస్థల
అవకాశాలను దెబ్బతీసే విధంగా ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యన్‌ లాబీలు ప్రయత్నిస్తున్నాయని, భారత సర్కారుపై వాటి ప్రభావం పడకుండా చూడాలని ఒబామాకు ఇటీవల జియి కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి జెఫ్‌ లిమెల్ట్‌ ఫిర్యాదు చేశారు. ఒకేసారి 126 జెట్‌ విమానాలను కొనుగోలు చేయాలని మన రక్షణశాఖ ప్రతిపాదించింది. అదే జరిగితే అంతర్జాతీయంగా గత పదిహేను సంవత్సరాల్లో ఇంత భారీ కొనుగోళ్లు జరిపిన దేశం మరొకటి ఉండదు.

యుఎస్‌కు  రైల్వే ఔట్‌ సోర్సింగ్‌

మమత నిర్వాకం

రైల్వే పనులను అమెరికాకు ఔట్‌సోర్సింగ్‌ ఇచ్చేందుకు కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ సిద్ధపడ్డట్లు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటన నేపథ్యంలో 20 వేల కోట్ల రూపాయల విలువైన ఔట్‌సోర్సింగ్‌ పనులను అప్పగిం చాలనే నిర్ణయం తీసుకున్నట్లు  సమాచారం. ఇందుకు  అమెరికా పౌరులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకుఅనుగుణంగా ఆ దేశంలోని భారతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల కాంట్రాక్టులను రద్దు చేయాలని ఒబామా నిర్ణయించిన నేపథ్యంలో మమత చేసిన ఈ నిర్ణయం వివాదాస్పదమౌతోంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.  ఔట్‌సోర్సింగ్‌ ఒప్పందం చేసుకోవడమంటే లక్షలాది భారతీయుల ఉద్యోగావకాశాలను అమెరికాకు బలి చేయడమే అవుతుంది

రోశయ్యాగారూ ! మీ పాలన ఎంత గౌరవమెంతగౌరవమోగదా!!


”విపక్షాల ఆందోళన రాష్ట్ర గౌరవాన్ని పెంచేదిగా లేదు” – రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.
సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలను వివరించేందుకుగాను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ 18 అక్టోబరు 2010 హైదరాబాదులో పర్యటన సందర్బంగా, అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, ప్రజారాజ్యం తదితర ఏడు పార్టీలు కోరగా రాష్ట్ర ప్రభుత్వం సలహాతో పిఎం పేషీ తిరస్కరించింది. దీంతో ఆ పార్టీలు ధర్నా జరిపి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ప్రతిపక్షపార్టీలు అగౌరవంగా వ్యవహరించాయని రోశయ్య మండిపడ్డారు.
రోశయ్య, ఆయన పరివారమూ నిర్వహిస్తోన్న ఘనత వహించిన కార్యక్రమాలు రాష్ట్రానికి తెచ్చిపెడుతోన్న గౌరవాన్ని మోయలేక తెలుగు ప్రజలు తబ్బిబ్బవుతున్నారు. వాటిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం!
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో? లేదో? అంటూ నిత్యం పలువర్గాల నుంచి విన్పించే విమర్శలు రాష్ట్ర గౌరవానికి అసలయిన ప్రతీక.
రాష్ట్ర మంత్రుల్లో పలువురు కోడాలున్నారని లోక్‌సభ గుంటూరు సభ్యుడు రాయపాటి సాంబశివారావు కితాబిచ్చాడు చూడండి, అది చాలదూ! ఎవడన్నా స్పందించటానికీ, నోబుల్‌ బహూమతి ఇప్పించి మన గౌరవాన్ని ఇతోధికంగా ఇనుమడింపజేయటానికీ.
వరద సాయాన్ని దోచుకుని దాచుకున్న కర్నూలు శాసనసభ్యుడు టిజి వెంకటేష్‌ మీ హయాంలోనే శాసనసభ్యుడిగా ఉండటం ఎంతటి గౌరవమో కదా!
మిమ్మల్ని దించి మీ గద్దెనెక్కాలని తహతహలాడుతోన్న జగన్మోహనరెడ్డి వున్న పళాన రూ. 84 కోట్ల ముందస్తు పన్నును చెల్లించటం సామాన్యమైన గౌరవమా? మీ యంత్రాంగంలో మంత్రాగం నడిపే ఆయన బంధువొకరి రోజు ఆదాయం రెండు కోట్ల రూపాయలట! హతవిధీ, పాపం శమించుగాక!!
గతేడాది ధాన్యాన్ని కొనేదిక్కులేక రైతన్న విలవిలలాడుతుంటే అది రాష్ట్రానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కదా? రోశయ్యగారూ!
ఉల్లి రైతును ముంచుతోన్న బ్రోకరుగాళ్లకూ, వినియోగదారుడి జేబులు కొడుతోన్న దగుల్బాజీ దళారులకు భజన చేస్తోన్న మీ ప్రభుత్వం వలన ఈ రాష్ట్రానికి ఎంత గౌరవమో కదా?
చెరుకు రైతులకు గతేడాది బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవటం కొణిజేటి సారూ, ఎంత మర్యాదో మరి!?
కొనేదిక్కులేక శనగల్ని శీతలగిడ్డంగుల్లో పెట్టుకుని, ఎవడు కొంటాడా? ఎప్పుడు కొంటాడా? అని రైతన్నలు ఎదురు చూడటం అబ్బో ఎంత మర్యాదకరమైన అంశమో?
ఎన్నాళ్లకెన్నాళ్లకో సరిపడేంత వర్షాలు పడ్డాయని ఆనందడోలికల్లో మునిగిన అనంతపురం రైతన్నలకు చచ్చు పుచ్చు వేరుశనగ విత్తనాలను అంటగట్టిన ఆ జిల్లాకే చెందిన కె రఘువీరారెడ్డి మీ కొలువులో వ్యవసాయశాఖ వెలగబెట్టటం ఎంతటి మహద్భాగ్యమో?
రైతుల కోసం రాయితీ ధరల్లో కేంద్రం కేటాయించిన ఎరువుల్ని మీ తమ్ముడు, కీర్తిశేషుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి ఘనత వహించిన బావమరిది రవీంద్రనాథ్‌రెడ్డి పరిశ్రమలకు తరలించటం ఎంతటి గౌరవనీయమైన కార్యక్రమమోగదా?
పొలాలకు సాగునీరు అందుతుందో లేదోగానీ, కోకోకోలాకు నీటి సరఫరా చేసేందుకు మీరు కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకం కాదూ?
ఇక సూక్ష్మ రుణ సంస్థలు పన్నిన విషపు వలల్లో చిక్కి విలవిలలాడుతూ రోజుకు ఒకరో ఇద్దరో బలవన్మరాణాలను ఆహ్వానిస్తుంటే, ఒకరో ఇద్దరో కిడ్మాపులకు గురవతుంటే, పదో, పదిహేను కుటుంబాలో పారిపోతుంటే మీకూ, మీ కాబోయే ప్రధానమంత్రి రాహూల్జీకీ, వాళ్లమ్మ సోనియాకూ, వెరసి ఆంధ్రప్రదేశ్‌కూ ఎంతటి కీర్తోకదా!
పావలా వడ్డీతో మహిళామతల్లులందరినీ లక్షాధికారుల్ని చేస్తామంటూ 2009 ఎన్నికల సందర్భంగా కాంగ్రెసుపార్టీ చేసిన వాగ్దానం వికటించి ఆడోళ్లంతా లక్షల అప్పులకు అధిపతులు కావటం మీకూ, మీ పరివారానికీ ఎంతటి గౌరవమో ఎలా కీర్తించాలి!
కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆస్తుల్ని పరిశోధన పేరిట కార్పొరేట్‌ దిగ్గజానికి కట్టబెట్టటం కూడా రాష్ట్రానికి ఎనలేని గౌరవమే. కాదన్నవాడి మూతి పగలగొట్టాలి మరి! ఆ పరిశోధనాశాల ఫలితాలతో ఆంధ్రులంతా రాబోయే రోజుల్లో సర్వేజన సుఖినోభవంతన్న రీతిన బతకబోతున్నారుగదా మరి!

అయోడిన్‌ లోపం ఉంటే మరుగుజ్జులు

అక్టోబర్‌ 21ని ప్రపంచ అయోడిన్ ‌లోప వ్యాధుల దినంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రక్షణలో అయోడిన్‌ పాత్ర గురించి తెలుసుకుందాం…

అయోడిన్‌ ఒక మూలకం. ఉప్పు, కొన్ని కూరగాయలు, సముద్రం నుండి లభించే కొన్ని ఆహార పదార్థాలలో అయోడిన్‌ ఉంటుంది.

మన దేశంలో ప్రతి ఐదుగురులో ఒకరు ఏదో ఒక స్థాయి అయోడిన్‌ లోపంతో బాధపడుతున్నారు.

మనం గొంతుపై బంతి లాంటి గడ్డ ఉన్నవారిని చూస్తుంటాం. దీన్ని గాయిటర్‌ అంటారు. ఈ గడ్డకు కారణం అయోడిన్‌ లోపమే.

మనం సర్కస్‌ కంపెనీలలో మరుగుజ్జులను చూస్తుంటాం. తల్లికి గర్భధారణ సమయంలో అయోడిన్‌ లోపం ఉంటే మరుగుజ్జులు పుట్టవచ్చు.

గర్భవతులలో అయోడిన్‌ లోపం ఉంటే – పిల్లలు తెలివి తక్కువతో, చెవుడు, మూగ, మెల్లకన్ను సమస్యలతో పుట్టొచ్చు.

అయోడిన్‌ లోపముండే గర్భవతులలో గర్భస్రావాలు కూడా ఎక్కువ.

మన శారీరక, మానసిక ఎదుగుదల అయోడిన్‌పై ఆధారపడి ఉంటుంది.

మనకు రోజూ కావాల్సిన అయోడిన్‌ 150 మైక్రోగ్రాములు. అంటే గుండు సూది తలపై పెట్టేంత మాత్రమే. ఈ లెక్కన జీవితాంతం ఒక స్పూను అయితే సరిపోతుంది.

కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలలో అయోడిన్‌ లోపం ఎక్కువ.

ఇప్పుడు అయోడిన్‌ కలిపిన ఉప్పు ప్రతి చోటా లభిస్తోంది.

అయోడిన్‌ కలిపిన ఉప్పునే వాడండి. భావితరాలు చురుకుగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడండి.

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌

సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్

సామాజిక సేవతో పునీతుడవుతోన్న  ఓ వైద్య మిత్రుడు రాసిన ఈ రచనపై వైద్య మిత్రులు స్పందిస్తే ఉపయోగం.
1. కల్లు ఉప్పులో అయోడిన్ సహజంగా ఉంటుందా/
2. కల్లు ఉప్పు ఉపయోగం?
3. టేబుల్; సాల్ట్ పేరి పేరిత లభ్యమవుతోన్న ఉప్పు ఉపయోగము ఎంత? నస్టాలు ఉన్నాయా?
4. హిమాలయేతర ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పు వాడాల్సిన పని లేదా?
అందరూ స్పందించండీ
అయోడిన్ టేబుల్; సాల్ట్ లాభాల మూట

ఇసుక పలక నుంచి ఈ – పలక దాకా

పలక… ప్రాథమిక విద్యార్థులు అక్షరాలు నేర్చుకునే సాధనం. ఇసుకపై అక్షరాలను దిద్దించటం సాతంత్య్రోద్యమ కాలంనాటి ప్రక్రియ. తొలిగా రాతి పలక వచ్చింది. అయితే దానికి ముందు కొంత కాలం రాతి బండలపైనే అక్షరాలను దిద్దించేవారు. రెండున్నర దశాబ్దాల క్రితం రాతి పలకను వెనక్కు నెట్టేసి దాని స్థానంలో చేరింది ఎనామిల్‌ పలక. ఇప్పుడిప్పుడే జొరబడుతోంది ఈ- పలక.
ఇసుక పలక మొన్నటి తరానికి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడే ఏ తొంభై ఏళ్లవయస్సులోనే ఉన్నవారికి గుర్తుండవచ్చు. ఇసుక లేకుంటే మట్టి, తవుడు తదితరాలను కూడా వినియోగించేవారానాడు. ఇసుకను నేలమీద దీర్ఘ చతురస్రాకారంంలో నున్నగా పరిచి చేతి చూపుడు వేలితో అక్షరాలను దిద్దించేవారు. తర్వాత కాలంలో ఇసుక స్థానంలో రాతి బండనే పలకగా వినియోగించారు. సున్నపు రాళ్లను ఎన్నుకుని పంతుళ్లు బండలపై అక్షరాలను దిద్దించారు. ఆ తర్వాత భూమి పొరల నుంచి వివిధ ఖనిజాలు, నిక్షేపాలను విసృతంగా తీయటం ప్రారంభమయిన క్రమంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లోని గనుల నుంచి తీసిన రాతి పొరను పలకగా మలిచారు. తొలతు గని నుంచి తీసిన రాతిని చేతితోనే మలిచి పలకగా తయారు చేసేవాళ్లు. మొద్దుగా ఉండే దానినే రాతకు వినియోగించారు. కొంత కాలం తర్వాత ఆ రాతిని కొలతల ప్రకారం కోసేందుకూ, రుద్ది సన్నబరచేందుకూ ఇంగ్లండు నుంచి యంత్రాలు రావటంతో పలకల రూపంలో విప్లవం చోటుచేసుకుంది. పలకను క్రమబద్ధంగా కత్తిరించిన సన్నగా, నునుపు దేల్చిన తర్వాత చెక్కల చట్టంలో రాతి పలకను బిగించేవారు. దానిపైన రాసేందుకు కూడా అదే రాతిని పుల్ల ఆకారంలో మలిచేవారు. రాయలసీమలో దొరికే మెత్తటి తెల్లరాయిని కూడా పుల్లమాదిరిగా కత్తిరించి తయారు చేసిన బలపం కూడా అక్షరాభ్యాసంలో ఇప్పటికీ ప్రధానమయిందే. ఈ బలపం గీతలు స్పష్టంగానూ, తెల్లగానూ ూండటంతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో మార్కాపురం నల్లబలపానికి కాలం చెల్లింది. తర్వాత కాలంలో సున్నం తదితర పదార్థాలను పోతపోసి కృత్రిమంగా బలపాలను తయారు చేశారు. ఇది తొలుత తెలుపు రంగులో వచ్చినా, వ్యాపారంలో ఏర్పడిన పోటీ ఫలితంగా పరిశోధనలు చోటుచేసుకుని చాక్‌పీస్‌ తరహాలోనే రంగురంగుల బలపాలు కూడా ఉత్పత్తయ్యాయి. అయితే ఈ బలపం తడిస్తే గీతలు కనిపించవు. పైగా ఆ గీతలు ఆరిన తర్వాత తుడిపేయటం చేతులతో సాధ్యమయ్యేది కాదు. దానికి పలకను నీటితో కడగాల్సిందే. దీనికితోడు నీరు తగలగానే ఈ బలపం పొడిగా రాలిపోయేది. లేకుంటే మ్కులయ్యేది. అందువలన దీని వినియోగం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా మొగ్గుచూపలేదు. దీంతో ఈ పిండి బలపాల తయారీ దాదాపుగా నిలిచిపోయింది.


పలక పరిణామంలో తర్వాత యనామిల్‌ స్లేట్‌ పేరుతో తొలిగా కృత్రిమ పల వచ్చింది. ఈ పలకను కూడా మార్కాపురం పారిశ్రామికవేత్తలే తయారు చేశారు. చెట్టు బెరడు పొట్టుతో తయారు చేసిన కృత్రిమ చెక్కకు రెండువైపులా ఎనామిల్‌ రంగులు పూస్తారు. తొలుత నలుపు రంగులో మాత్రమే వచ్చినా, తర్వాత అన్ని రంగుల్లోనూ పలకలను తయారు చేశారు. రాతి పలకకు చెక్క చట్రాన్ని తొడగ్గా, ఈ ఎనామిల్‌ పలకకు తొలినుంచీ ప్లాస్టిక్‌ చట్రాన్ని అమరుస్తున్నారు. భాస్కర్‌స్లేట్స్‌ లాంటి ఒకటి రెండు సంస్థలు ఇతర ప్రాంతాలలో పలకల పరిశ్రమను నెలకొల్పినా, ఇప్పటికీ దేశావసరాల్లో 80శాతాన్ని మార్కాపురంలోనే ఉత్పత్తి అవుతోంది. దీనికితోడు మార్కాపురం పలకలు స్విజ్జర్‌ల్యాండు, మలేషియా తదితర డజను దేశాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. అన్ని రకాలుగానూ అందుబాటులో ఉండటంతో ఎనామిల్‌ పలకే ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.


అయితే కొన్న కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ ప్రత్యేకతను చాటుకునేందుకుగాను ఈ-పలకల వినియోగాన్ని ప్రారంభించాయి. ఈ పలక కనీస ధర మూడు వేల రూపాయలు పలుకుతోంది. సాంకేతిక సౌలభ్యాలు, పరిమాణాన్ని బట్టి ఈ -పలకలు పాతిక వేల రూపాయలదాకా కూడా ఉన్నాయి. వీటిని వినియోగించాలంటే విద్యుత్తు అవసరం. అందువలన ధర ఇతర సమస్యలరీత్యా ఇప్పటికిప్పుడే ఎనామిల్‌ పలకలను తోసిరాజని ఈ పలక ముందుకు వచ్చే అవకాశాలు ఇప్పటికిప్పుడే లేవు. అయితే కార్పొరేట్‌ విద్యా సంస్థలు మాత్రం ఈ పలక వినియోగంలోకి వెంటనే వెళ్లే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ పలకలో రంగురంగుల్లో అక్షరాలు రాసే అవకాశాలున్నందున పిల్లలు ఇదంటే ఇష్టపడే అవకాశం ఉంది. పైగా బొమ్మల్ని కూడా రంగుల్లో వేయించవచ్చు. వాటిని కంప్యూటరులోకి ఎక్కించి చూసేందుకూ వీలుంది. మెయిల్‌ద్వారా వాటిని విద్యార్థుల తల్లిదండ్రులకు పంపవచ్చు. ప్రింటు తీసి చూపించే వీలు కూడా ఉంది. ఇన్ని సౌలభ్యాలున్నందున దానిని వినియోగించే విద్యార్థులు సహజంగానే సాధారణ పలకలో అక్షరాలు దిద్దేవారికన్నా వేగాన్నీ, సునిశిత దృష్టినీ ప్రదర్శించే వీలుంది.

భవిష్యత్తులో ఈ పలకలను కొనగలిగిన ధనవంతుల పిల్లలు చదువుల్లో దూసుకపోయే అవకాశాలు ఉండగా పేద విద్యార్థులు మాత్రం కునారిల్లక తప్పని పరిస్థితిని ఈ వ్యవస్థ భవిష్యత్తులో సృష్టించే ప్రమాదం పొంచి ఉంది.