అది ఓ గ్రామం. దానికి అనుకుని ఓ ఏరు. దాన్ని దాటాలంటే గ్రామస్తులకు అవస్థే. పడవ ప్రయాణంలో తరచూ ప్రమాదాలు జరగటం కద్దు. వంతెనను నిర్మించమని ఆ గ్రామస్తులు వేడుకొనని నాయకుడు లేడు. ప్రభుత్వానికి ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేది లేక ఆ ఊళ్లోనే ఒకరిని గ్రామస్తులందరూ కలసి పట్టణానికి పంపి బాగా చదివించారు. అతని ద్వారా వంతెన నిర్మించాలని అనుకుంటారు. అయితే అతను బాగా చదివి, వంతెన సంగతిని మరచిపోయి ఆస్తుల్ని కూడబెట్టుకునే పనిలో మునిగిపోతాడు. – ఇది రవితేజ కథానాయయుడిగా నటించిన భగీరథ చిత్ర సారాంశం.
ఈ సినిమాలో మాదిరిగానే చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని ఓ గ్రామస్తులు వంతెన లేక కష్టాలు పడుతున్నారు. వంతెన నిర్మాణం ఆశించి ఆ గ్రామస్తులు కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమరనాథ్‌రెడ్డికి ఓట్లేసి శాసనసభ్యుడిని చేశారు. ఆయన రాష్ట్ర మంత్రిగానూ పల్లకి ఎక్కారు. ఆయన చనిపోయిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డికీ ఓట్లేసి గెలిపిస్తూనే ూన్నారు. ఆయన శాసనసభలో చీఫ్‌విప్‌గా పనిచేశారు. శాసనసభాపతీ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రీ అయిపోయారు. అయినా ఓట్లేసి శాసనసభకు పంపిన తమ గోడు మాత్రం ఆయనకు పట్టడం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా తమ కష్టాల్ని తీర్చే వంతెన వస్తుందన్న ఆశతో ఆ గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.
అది చిత్తూరు జిల్లా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పీలేరు నియోజక వర్గంలోని కెవి పల్లి మండలం జిల్లేలమంద పంచాయతి. ఆ నియోజకవర్గంలోనే ఇది అతి పెద్ద పంచాయతీ. ఇది కడప జిల్లాకు ఆనుకుని ూంటుంది. ఈ పంచాయతీలో 39 గ్రామాలున్నాయి. రెండు తండాలు, ఓ యానాది పల్లె కూడా ూన్నాయి. ఈ గ్రామాల్లో ఏడు వేల కుటుంబాలు నివాసముంటున్నాయి. దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు.
1954లో ఇక్కడి కొండల నుంచి ప్రవహించే నీటిని నిల్వ చేసేందుకుగాను పింఛా ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచే ఈ ప్రాంత గ్రామస్తులకు ఇబ్బందులచ్చి పడ్డాయి. మండల కేంద్రం కెవిపల్లికి రాకపోకలు సాగించే ఒకే ఒక్క దారిని ఈ ప్రాజెక్టు నీరు ముంచింది. 30 అడుగుల లోతున ఏటా పది నెలలపాటు ఈ ప్రాజెక్టు నిండుగాగూంటుంది. దీంతో ఈ గ్రామాలకు దారి లేకుండా పోయింది. అవతలి ఒడ్డుకు చేరాలంటే వీరికి నరకయాతనే.
క్షణ క్షణం.. భయం భయం
ఈ గ్రామాల అవస్థ చూసి స్థానిక నివాసి బాషా సొంతంగా ఓ తెప్పను తయారు చేశాడు. అర కిలోమీటరు దూరాన్ని కలుపుతూ తాడును కట్టాడు. ఇద్దరు మాత్రమే కూర్చొని తాడును లాగుతుంటే తెప్ప ముందుకు కదులుతుంది. పావుగంటపాటు సాగే ఈ ప్రయాణంలో క్షణ క్షణం … భయం భయంగా ూంటుంది. అవతలి ఒడ్డుకు చేరుకునేంత వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సిందే. ఇలా ఈ పంచాయతీవాసులు 56 ఏళ్లుగా ప్రయాణిస్తున్నారు. కాగా పదేళ్ల క్రితం తెప్పలో వస్తూ మధ్యలో తాడు తెగిపోవడంతో తెప్ప బోల్తాపడి బాషా నీట మునిగి ప్రాణాలదిలేశాడని గ్రామస్తులు తెలిపారు. అప్పటి నుంచీ ఈతొచ్చిన వారే ఈ సాహసం చేసేందుకు పూనుకుంటున్నారు.
చుట్టు తిరిగి 70 కిలోమీటర్లు
ఈ ప్రాజెక్టు మీదుగా ప్రయాణిస్తే మండల కేంద్రం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే. అదే తెప్పలో ప్రయాణించలేక నేల మీద ప్రయాణించవలసి వస్తే 70 కిలోమీటర్లు చుట్టు తిరిగి రావాలి. మొదట పీలేరుకు గంట ప్రయాణం. అక్కక నుంచి గంటన్నర పాటు ప్రయాణిస్తే కె.వి. పల్లి చేరుకుంటారు. ఏ చిన్న వస్తువు కావాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా ఈ గ్రామాల ప్రజలకు సుదూర ప్రయాణం తప్పదు. ఇక అనారోగ్యంతో ప్రాణాపాయ పరిస్థితులస్తే వారి బాధ వర్ణనాతీతం.
సబ్‌సెంటర్ మూత
ఈ పంచాయతీలో ూన్న 39 గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య ూప కేంద్రం మూత పడింది. తెప్పలో ప్రయాణించలేక సిబ్బంది రావటం మానుకున్నారు. దీంతో ఈ కేంద్రంలో కనీసం మందులిచ్చే దిక్కు కూడా లేకుండా పోయింది. చిన్నపాటి జ్వరమొచ్చినా ఈ ప్రాంతవాసులు పీలేరుకు వెళ్లాల్సి వస్తోంది. ఇదంతా వంతెన లేకపోవటమే కారణమని ఈ గ్రామాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటికి కటకట
కాగా ఈ గ్రామాలన్నింటిలోనూ తాగునీటి తిప్పలు తప్పడం లేదు. తాగేనీటి కోసం కొండలు, గుట్టల్లో వెళ్లి బావుల్లోని నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి అడవిలో ూన్న బావిలో నీళ్లు తెచ్చుకుని ఈ గ్రామాలవాసులు తాగుతున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెరిగిన ఆశలు
56 ఏళ్లుగా తమ బాధలు తీర్చే దిక్కు లేకుండా పోయిందని వాపోతోన్న ఈ గ్రామీణుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. తమ శాసనసభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కటమే దీనికి కారణం. ఆయన ఈదఫా తమను ఆదుకుంటాడని వారు ఆశపడుతున్నారు.
Archive for నవంబర్, 2010
30 నవం
56 ఏళ్లగా ‘తెప్ప’ ప్రయాణం నూతన ముఖ్యమంత్రి ఇలాకాలో ఇక్కట్లు
30 నవం
బాబాయి పెడ ముఖం ! అబ్బాయి ఎడముఖం !!
పులివెందుల బరిలో వివేక – జగ్గు ఢీ అంటే ఢీ
యువ నేతకు తొలి పరాజయం
కాంగ్రెసు పార్టీ అధిష్టానం తన కుటుంబంలో చిచ్చుపెట్టిందని నవంబరు 29న తన రాజీనామా పత్రంలో ఆరోపించిన జగన్మోహనరెడ్డి మాటలు 30వ తేదీన నిజ్జంగానే నిజ్జమయ్యాయి. తాను కాంగ్రెసుకే బాసటగా నిలుస్తానని వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డి ప్రకటించటంతో అబ్బాయి కెరీర్‌లో తొలి పరాజయం నమోదయింది. అదే నేపథ్యంలో వివేకానందరెడ్డికి మంత్రి పదవి దొరికినట్లేనని భావించవచ్చు. దీనికితోడు అసలయిన ఘట్టం పులివెందులలో జరగాల్సిన ఉప ఎన్నికల బరిలో బాబాయి – అబ్బాయిలే ఢీ అంటే ఢీ అనేందుకు రంగం సిద్ధమవుతున్నారు.
బాబాయి వివేకానందరెడ్డి, అబ్బాయి జగన్మోహనరెడ్డి మధ్య కాంగ్రెసు పార్టీ పెట్టిన గండిని వాళ్లిద్దరితో చర్చలు జరిపి భారతి తండ్రి (జగన్మోహనరెడ్డి మేనమామ) గంగిరెడ్డి పూడ్చాడని ఓ వైపు టీవీల్లో వార్తలు వస్తూ ఉండగానే బాబాయి పెడముఖం పెట్టగా, అబ్బాయి ఎడముఖం పెట్టేసినట్లు తేలిపోయింది. కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్‌లో బాబాయి, అబ్బాయి మధ్య సయోధ్య కోసం బంధువులు ఏర్పాటు చేసిన సమావేశం కేవలం రెండంటే రెండు నిమిషాల్లో ముగిసింది. ఇద్దరి మధ్యా చోటుచేసుకున్న ఒకటి రెండు మాటల వాగ్వాదం అనంతరం వివేకానంద రుసరుసలాడుతూ అక్కడి నుంచి కడపకు వెళ్లిపోయారు. అక్కడే 11.30 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి చల్లచల్లగా అసలు విషయం బయటపెట్టారు. జగన్మోహనరెడ్డి సంధించిన ఐదు పేజీల ఉత్తరంలో తొలి మాటలనే ఆయన ఖండించారు. కాంగ్రెసుపార్టీ అధష్టానం తన కుటుంబంలో చిచ్చుపెడుతుందన్న జగన్మోహనరెడ్డి ఆరోపణల్ని బాబాయి ఖండించారు.
ఈ నేపథ్యంలో తన బాబాయితోనే సయోధ్య కుదుర్చుకోలేని జగన్మోహనరెడ్డి భవిష్యత్తులో వివేకానందరెడ్డి తాతల్లాంటి వారితో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారో ప్రశ్నార్థకమే. కుదరక కుదరక చిట్ట చివరకు కుదిరి మరి కొద్ది గంటల్లోనే దక్కనున్న మంత్రి పదవిని చేజేతులా వదులుకోవాల్సి రావటంతో వివేకానందరెడ్డి ఉద్వేగానికీ, ఉద్రేకానికీ లోనవటం సహజం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ కలుపుకుపోవలసిన జగన్మోహనరెడ్డి ప్రతి అడుగునూ తరచి తరచి చూసి వేయాల్సిందే. అయితే ఆయనలో అదే కన్పించలేదు.
అయినా నూట పాతిక కోట్లమంది భారతీయుల్ని గత 60 ఏళ్లుగా బుట్టలో వేసుకుంటున్న కాంగ్రెసుపార్టీకి ఈ అబ్బాయి, వాళ్ల బాబాయి ఒక లెక్కా ఏంటి!.
కొందరిని ఎదిరించి, మరికొందరిని బెదిరించి, ఇంకొందరిని సముదాయించి, ఇంకా ప్రలోభపెట్టి, భ్రమల్లో ముంచి, మత్తులో దించి, గాంధీ నోట్లు విసిరి, పదవుల ఎరవేసి, పెదవుల రుచిచూపి ఇలా ఎన్నెన్నో దారులు. అన్నీ కాంగ్రెసుకు ఎరుకే. ఎవరు దేనికి లొంగుతారో, కాంగ్రెసు నేతలకు తెలిసినంతగా ఇంకే పార్టీ నాయకులకూ పట్టుబడలేదు. అందువలనే రాష్ట్రాలకు రాష్ట్రాలే ఊడ్చిపెట్టుకుపోయినా కాంగ్రెసు ఇప్పటికీ కేంద్రాన్ని గుప్పిట్లో పెట్టుకుని పేట్రేగి పోతోంది. అలాంటి కాంగ్రెసుకు వివేకానందరెడ్డిని పడేయటం అంటే మిఠాయి తినిపిస్తామని హామీ ఇచ్చి ఐదారేళ్ల పాపలను సముదాయించినంత సులభం మరి.
చేజిక్కబోతోన్న పదవి చేజారిపోతుందేమోనన్న ఆత్రుతలో బాబాయ్ పెడముఖం పెట్టగా, ఆయనను ప్రసన్నం చేసుకోలేకపోగా, తాను ఎడముఖం పెట్టటమే జగన్మోహనరెడ్డి తొలి అపజయంగా నమోదు చేయాల్సిన అంశం.
29 నవం
ఆరంగేట్రం నాడే ఆరాటం
ఉన్నత పదవుల కోసం ఆరంగేట్రం నాడే అతనిలో ఆరాటం ప్రారంభమయింది. లోక్‌సభలో అడుగుపెట్టాలన్న కోరికతో తన కక్క (చిన్నాన్న)తోనే కొట్లాటకు దిగాడన్న విమర్శల్నీ తొలిరోజుల్లోనే మూటగట్టుకున్నాడు. అంతలావున అతి కోరికలు వద్దని అధిష్టానం చీవాట్లు పెట్టగా చేసేది లేక అప్పటికి మౌనం పాటించాడన్న అపప్రధ సరేసరి. చివరకు తండ్రి చనిపోయినాది అధిష్టానంతో ఉప్పు-నిప్పు వ్యవహారం నిత్యకృత్యంగా సాగించటం అతని అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందన్న సూచనలకూ కనీసంగా విలువిచ్చిన దాఖలాలు లేవు. చివరకు తనకున్న అనుమానాలను అధినేతల వద్ద నిగ్గుతేల్చుకోకుండానే స్వీయ మానసిక ధోరణితో పార్టీ సభ్యత్వానికీ, తాను కోరుకుని మరీ ఎన్నికయిన లోక్‌సభ సభ్యత్వానికీ సోమవారం రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి శైలి ఆది నుంచి వివాదాస్పదమేనన్న వాదనలకు కొదవ లేదు. ఇంతచేసీ అటు కాంగ్రెసు పార్టీ నాయకుడిగానో/కార్యకర్తగానో లోక్‌సభ సభ్యుడిగానో, చివరకు వైఎస్ కుమారుడిగానన్నా ఏనాడూ ప్రజల్ని పరామర్శించిన పాపాన పోలేదు. వారి సమస్యల్ని తెలుసుకున్న జాడలూ లేవు. పరిష్కరించిన ఛాయలు అసలే లేవు. అయితే ఓదార్పు యాత్ర అదేగదా అని ఆయన అభిమానులు వివరించటం కద్దు.
తనను అణగదొక్కేందుకుగాను తన కుటుంబంలోనే అధిష్టానం చిచ్చుపెడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెసుపార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ, లోక్‌సభ కడప స్థానానికీ సోమవారం రాజీనామా చేసిన వైఎస్ జగన్మోనరెడ్డి రాజకీయ ఆరంగేట్రమే వివాదాలతో మొదలైంది. లోక్‌సభలో అడుగుపెట్టి కేంద్రంలో చక్రం తిప్పాలన్న కోరికతో తన చిన్నాన్న వివేకానందరెడ్డితో పేచీపడి మరీ అడ్డుతొలగించుకున్నాడు. తన తండ్రి వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్టానంతో పరోక్షంగా అమీతుమీకి సిద్దమయ్యారు. ప్రజాప్రతినిధిగా పట్టుమని ఏడాది కాలం కూడా పదవిలో కొనసాగలేకపోయారు. ఇప్పుడు ఆ లోక్‌సభ స్థానానికే రాజీనామా చేసి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. జగన్ ఏ పని చేసినా అది వివాదాస్పదమవటం సాధారణమన్న అపప్రధ ఉంది. ఓదార్పుయాత్ర కూడా ఆ బాటలోనే సాగింది.
జగన్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే… 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఆయన కేవలం వ్యాపారాల నిర్వహణలోనే కాలం వెళ్లబుచ్చారు. తండ్రికి తగిన వేదిక దొరకగానే, జగన్మోహనరెడ్డి కూడా అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చారు. తండ్రి లాగే తానూ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలన్న కోరికను తొలినాడే తన చేతలద్వారా వ్యక్తం చేశారు. రాజకీయాలంటే పదవేనన్నట్లుగా పావులు కదిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు, అందులోనూ తన వ్యాపారాలకు దన్నుగా నిలిచే లోక్‌సభ సభ్యత్వాన్ని ఆయన కోరుకున్నాడు. దీంతో ఆనాడు లోక్‌సభ సభ్యుడిగా ఏడాది కాలం గడవక ముందే 2005లో వివేకానందరెడ్డిని రాజీనామా చేయించి, తన కుమారుడిని పోటీ చేయించాలని వైఎస్ బలంగా భావించినట్లు ఆనాడు వార్తలు విన్పించాయి. వాస్తవానికి జగన్మోహరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు అప్పట్లో వైఎస్ వివేకానందరెడ్డిపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించేందుకు పూనుకున్నారన్న విమర్శలు కూడా విన్పించాయి. వైఎస్ పక్కా ప్రణాళికకు వివేకానందరెడ్డి బలయ్యారు. కుటుంబ ఒత్తిళ్లకు తలొగ్గిన ఆయన 2005లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని లోక్‌సభాపతికి బదులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారు. దీంతో సోనియా వైఎస్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారని వినికిడి. ఫలితంగా వివేకానందరెడ్డి రాజీనామా వ్యవహారం సద్దుమణిగింది. అయితే జగన్ యువసేన పేరిట ఇష్టారీతిన నిధులు వెచ్చిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభించారు. దీనికితోడు 2004 నుంచీ 2009 వరకూ జగన్ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. జిల్లాలో వైఎస్ పాల్గొనే ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ జగన్మోహనరెడ్డి నిబంధనలకు విరుద్దంగా పాల్గొనేవారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అభివృద్ధి సమీక్షా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో కూడా వేదికలెక్కారు. సిఎం కాన్వాయ్‌తో కలసి ప్రయాణించారు. జగన్ కడపకు వస్తే ఇప్పటికీ ముఖ్యమంత్రి పర్యటనను తలపించే రీతిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అడుగడుగునా మెటల్ డిటెక్టర్ల తనిఖీలు, పోలీసులు తాళ్లు పట్టి జనసందోహాన్ని అదుపు చేసేవారు. ఇవన్నీ అప్పట్లోనే వివాదాలకు కారణమయ్యాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కూడా కుటుంబంలో వివాదాలకు కారణమయ్యారు. ఆనాడు తాజా మాజీలకే లోక్‌సభ అభ్యర్తిత్వమంటూ అధిష్టానం ప్రకటించింది. దీంతొ జగన్ మళ్లీ తన బాబాయిపై ఒత్తిడి పెంచారు. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని కూడా వివేకానంద రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. ఒకానొక దశలో అప్పట్లో వివేకానందరెడ్డి రెండు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయినా వివాదాల మధ్యే జగన్మహనరెడ్డికి లోకసభ కాంగ్రెసు అభ్యర్ధిత్వం దక్కింది. లోకసభ సభ్యునిగాాయన ఎన్నికయ్యారు. అయితే వెఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పొందారు. వైఎస్ మరణించిన రోజే పదవిపై కన్నేసిన జగన్మోహనరెడ్డి తనను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్టానంపై ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్ననలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, రాజీనామాలు, ఆత్మహత్యాయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ వ్యూహం కూడా అప్పట్లో బెడిసికొట్టింది.
పావురాళ్లగుట్టలో వైఎస్ మరణాన్ని జీర్జించుకోలేక అశువులుబాసిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓదార్పుయాత్రను ప్రారంభించారు. అధిష్టానం ఓదార్పుయాత్ర వద్దన్నా వినకుండా అది తన వ్యక్తిగత యాత్ర అంటూ కొనసాగించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులూ ఆయనను పరోక్షంగా విమర్శిస్తూనే వచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమారరెడ్డిని అధిష్టానం నియమించింది.మంత్రి వర్గంలో జగన్మోహనరెడ్డి ముఠాకు ప్రాతినిథ్యం లేకుండా చేసేందుకు పూనుకుంది. ఏకంగా వివేకానందరెడ్డిని ఢిల్లీకి పిలిచి మంత్రి మంత్రి పదవి ఆశపెట్టింది. బాబాయ్ ద్వారా తమ కుటుంబంలో చివరకు అన్నీ వికటించటంతో తమ కుటుంబంలో చీలికతెచ్చేందుకు అధిష్టానం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ లోకసభ కడప స్థానానికీ, కాంగ్రెసుపార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసి సంచనలం సృష్టించారు. తనతో పాటు తన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మతోనూ రాజీనామా చేయించారు. ఇలా … జగన్ శైలి ఆది నుంచీ వివాదాస్పదం కావడంతో తాను ఒంటరినని చివర లేఖలో రాసుకున్నారు.
29 నవం
వైఎస్ జగన్మోహనరెడ్డి తనకుతానే గెటవుట్
లోక్‌సభ కడప సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి విజయలక్ష్మి చట్టసభలకూ, కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ 28 నవంబరు 2010 ఉదయం 11.30 గంటలకు రాజీనామా చేశారు. కాంగ్రెసుపార్టీ అధిష్టానం తన కుటుంబం పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగానే జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని సోమవారం ఉదయం నుంచే ఆయన ముఠా ప్రచారంలో పెట్టటం వెనుక మతలబు దాగి ఉంది. తన అవసరాలు, ఆకాంక్షల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నెరవేర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెసు అధిష్టానం ఆయనను మారుస్తూ, పనిలో పనిగా జగన్మోహనరెడ్డికి ముకుతాడు వేసేందుకు కూడా పావులు కదపటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. కుర్చీ రాజకీయాల్లో సహజమయిన ఎత్తుకు పైఎత్తు వ్యవహారం ఇది. వైఎస్ కుటుంబాన్ని అదుపులో పెట్టేందుకు కాంగ్రెసు అధినాయకత్వం ముఖ్యమంత్రి మార్పుతో ఎత్తులు వేయగా, జగన్మోహనరెడ్డి ముఠా తమ రాజీనామాలతో పైఎత్తులు మొదలు పెట్టింది. ఇందంతా ఇప్పటికే సంపదను మూటగట్టుకుని స్థిరపడ్డ వర్గానికీ, మూటగట్టుకుంటూ స్థిరపడాలన్న తపన ఉన్న వర్గానికీ జరుగుతోన్న పోరు తప్ప మరొకటి కాదు. కాకపోతే పైకి మాత్రం ప్రజల పక్షాన నిలబడినందునే తనపై వేటేస్తున్నారని జగన్మోహనరెడ్డి, వ్యవస్థ ముఖ్యం తప్ప వ్యక్తులు కాదని కాంగ్రెసు అధిష్టానం మాయామేయ నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కొన్నాళ్లు మాత్రమే సాగుతాయి. తస్మాత్ జాగ్రత్త.
28 నవం
పాజిటివ్ పెళ్ళిళ్ళు
పెద్దలు కుదిర్చిన పెళ్లి, ప్రేమ పెళ్లి, రిజిస్టర్ మ్యారేజీ…ఇలా పెళ్లిళ్లలో రకరకాలున్నాయి. ఒకవేళ మనకు నచ్చిన అమ్మాయో, అబ్బాయో దొరక్కపోతే వెదికిపెట్టడానికి ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు కూడా వెలిశాయి. వివిధ కులాలకు చెందిన మ్యారేజ్ బ్యూరోల గురించో లేదా మతాలకు చెందిన మ్యారేజ్ బ్యూరోల గురించో మనం ఇప్పటి వరకు వినిఉంటాం. కానీ హెచ్‌ఐవి మ్యారేజ్ బ్యూరో గురించి విన్నారా? అసలీ హెచ్‌ఐవి/ఎయిడ్స్ మార్యేజ్ బ్యూరో ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ మ్యారేజ్ బ్యూరో, దాని కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం రండి…..
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రహదారిలో దిల్‌సుఖ్‌నగర్ దాటగానే కొత్తపేట పండ్ల మార్కెట్ ఉంది. అక్కడి నుండి కుడివైపుకు తిరిగితే సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్ వస్తుంది. ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పార్కు సమీపాన ఇద్దరు మనుషులు పట్టే ఒక చిన్న గది. అందులో రెండు కుర్చీలు…ఒక చిన్న బల్ల. ఎర్ర రంగుతో ఉన్న ఆ గది లోపల, వెలుపల గోడలనిండా హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధిని ఎలా నివారించాలి? వ్యాధి సోకిన వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? వ్యాధిగ్రస్థులకు మనం ఎలాంటి మనోధైర్యాన్ని కల్పించాలి? అనే సూచనలు, సలహాలతో కూడిన వ్యాఖ్యలు రాసి ఉన్నాయి. ఆ గదిలోని ఓ కుర్చీలో కూర్చుని వచ్చిపోయే వారిని ఓ వ్యక్తి చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. ఆయనే శ్రీనివాస హనుమత్ ప్రసాద్. ఈయనే పైన చెప్పిన హెచ్‌ఐవి/ఎయిడ్స్ మార్యేజ్ బ్యూరోకి రూపశిల్పి. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థులకు వివాహాలు జరిపించే ‘పాజిటివ్ పెళ్లిళ్ల పేరయ్య’. ఈ మ్యారేజ్ బ్యూరోతోపాటు హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల కోసం ఒక ‘ప్రత్యేక’ హాస్టల్‌ను సైతం నిర్వహిస్తూ వారికి తన వంతు చేయూతనిస్తున్నారు.
మాకూ తోడు కావాలి!
శ్రీనివాస హనుమత్ ప్రసాద్ స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆ పట్టణంలోని బరంపేటలో తన చుట్టూ ఉన్న వారిలోనే 10 మంది ఎయిడ్స్ వ్యాధితో మరణించటం ఆయనను కలచివేసింది. దీంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఏదో చేయాలన్న బలమైన భావన, తపన ఆయన్ను వెంటాడింది. సొంత ఊళ్లో ఓ కళాశాల నడుపుకునే ఆయన ఈ ఆలోచన వచ్చిందే తడవుగా స్వస్థలాన్ని వదిలేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. హెచ్‌ఐవి పాజిటివ్ నెట్‌వర్క్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లో 5 సంవత్సరాలపాటు పనిచేశారు. విధుల్లో భాగంగా ఎయిడ్స్ వ్యాధి వ్యాపించే విధానం, వ్యాధి లక్షణాలు, నివారణా మార్గాలు, వ్యాధిగ్రస్థులు తీసుకోవాల్సిన ఆహారం తదితర విషయాలపై విస్తృత ప్రచారం చేశారు. అదే క్రమంలో ఆయన ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను స్వయంగా కలుసుకున్నారు. వారి జీవన పరిస్థితుల్ని పరిశీలించారు. సాధక బాధకాలను, కష్టనష్టాలను విని చలించిపోయారు. ముఖ్యంగా చుట్టూ ఉన్న సమాజం వారిని తోటి మనుషులుగా గుర్తించకపోవటం ప్రసాద్‌ను కలిచివేసింది. ఎన్జీవోలో పనిచేసే సందర్భంలోనే ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఒక తోడును (జీవిత భాగస్వామిని) కోరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించారు. ‘మేమూ మనుషులమే..ఆనందం, విషాదం పంచుకోడానికి మాకూ ఒక తోడు కావాలి’ అనే వారి ఆవేదనను ప్రసాద్ మంచి మనసుతో అర్ధంచేసుకొన్నారు. అదే క్షణంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఒక మ్యారేజ్ బ్యూరోని నెలకొల్పాలని సంకల్పించారు. అనుకోవటమే కాదు..2008 మేలో మ్యారేజ్ బ్యూరోని ఏర్పాటుచేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 83 హెచ్‌ఐవి/ఎయిడ్స్ సోకిన జంటలకు పెళ్లిళ్లు చేసి వారికి తోడు, నీడను కల్పించారు.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు…నానాటికీ క్షీణిస్తున్న ఆరోగ్యం, చిన్నచూపు చూస్తున్న సమాజం, వివిధ ఆలోచనలతో కుంచించుకుపోతున్న మస్తిష్కం….నిజ జీవితంలో వారు అనుభవించే బాధలు, గాథలివి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న వ్యక్తులకే సరిజోడును వెదకటం పెద్దపని. అలాంటిది హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధి సోకిన వ్యక్తికి అదే వ్యాధి సోకిన వారిని వెదికి పెళ్లి చేయటం కత్తిమీద సాములాంటిదే. ‘ఎన్నో మ్యారేజ్ బ్యూరోల గురించి విన్నాం, చూశాం. కానీ ఈ హెచ్‌ఐవి/ఎయిడ్స్ మ్యారేజ్ బ్యూరో ఏంట్రా? బాబూ’ అంటూ స్నేహితులు, బంధువులు, తెలసినవాళ్లు, చుట్టూ ఉన్న సమాజం ‘ఎగతాళి’ చేసింది. వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను ‘తాళి’ బంధంతో ఒకటి చేస్తున్న ప్రసాద్ తాను చేస్తున్న ఈ పని ద్వారా ఎంతో సంతృప్తిని పొందుతున్నానంటున్నారు.
విస్తృత ప్రచారం
ఏదైనా ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయాలంటే దానికి ముందు ప్రచారం నిర్వహించాలి. ప్రసాద్‌కు తాను నిర్వహించాలనుకున్న హెచ్‌ఐవి/ఎయిడ్స్ మ్యారేజ్ బ్యూరో గురించి ఎలా ప్రచారం చేయాలో మొదట్లో అర్థం కాలేదు. ఆ తర్వాత మెరుపులాంటి ఆలోచన తట్టింది. తమకు హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధి సోకిందనే అనుమానం వచ్చిన వారు వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాల్లోని ఎఆర్‌టి సెంటర్లకు వస్తారు. వ్యాధి సోకిన వారు కౌన్సిలింగ్, చికిత్స నిమిత్తం తమ దగ్గరలోని ఎ.ఆర్.టి సెంటర్లు లేదా ఏరియా ఆస్పత్రులకు వస్తారు. ఈ విషయాన్ని గమనించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎ.ఆర్.టి సెంటర్లు, ఏరియా ఆస్పత్రులను సందర్శించారు. ఆయా ఆస్పత్రుల గోడలపై తన మ్యారేజ్ బ్యూరో గురించిన అన్ని వివరాలను తెలిపే వాల్‌పోస్టర్లను పెద్దఎత్తున అంటించారు. ఇంతేకాకుండా అన్ని జిల్లాల్లో ప్రముఖమైన ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి, అక్కడి వైద్యులకు తాను చేపట్టబోయే కార్యక్రమాన్ని గురించి వివరించారు. ఆ ప్రయివేటు ఆస్పత్రుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. చికిత్స నిమిత్తం వచ్చే ఎయిడ్స్ రోగులకు హెచ్‌ఐవి/ఎయిడ్స్ మ్యారేజ్ బ్యూరో గురించి వివరించాల్సిందిగా ప్రయివేటు వైద్యులను అభ్యర్థించారు. ఇంతగా ప్రయత్నించినప్పటికీ మ్యారేజ్ బ్యూరోకు పెద్దగా స్పందన రాలేదు.
హెచ్‌ఐవి పాజిటివ్‌తో జీవించే వారు పెళ్లి కోసం తమ ఫోటోను మ్యారేజ్ బ్యూరోకు పంపిస్తే వేరే వారికెవరికైనా చూపిస్తారేమోననే సందేహం వ్యక్తం చేసేవారు. ప్రసాద్‌కు తమ ఫోటోను అప్పగిస్తే ఆయన తమ గురించి, తమకు సోకిన వ్యాధి గురించి నలుగురికి చెబుతారేమోననే భయాందోళనలకు వారు గురయ్యేవారు. ఆ తర్వాత ఎ.ఆర్.టి సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, ప్రయివేటు డాక్టర్లు మ్యారేజ్ బ్యూరో గురించి పూర్తిగా వివరించటంతో పెళ్లి చేసుకోవాలనుకున్న వారి అనుమానాలు పటాపంచలయ్యాయి. మ్యారేజ్ బ్యూరోని సంప్రదించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది.
అర్హతలు… ఫీజులు…
‘హెచ్‌ఐవి సోకింది కాబట్టి…నేను హెచ్‌ఐవి/ఎయిడ్స్ మ్యారేజ్ బ్యూరోకి వెళ్తాను, నాకు పెళ్లి చేయండి’ అంటే ఒప్పుకోరు ప్రసాద్. తన మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండి తీరాలంటారు. అవేంటంటే…
-హెచ్‌ఐవి పాజిటివ్ అని తెలియాలి. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తికి మాత్రమే ఈ విషయం తెలిస్తే సరిపోదు, ఆ వ్యక్తి తల్లిదండ్రులకు (తల్లిదండ్రులు లేకపోతే రక్త సంబంధీకులకు) కూడా తన కుమారుడు లేదా కుమార్తెకు హెచ్‌ఐవి సోకినట్లు తెలియాలి.
-పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి (అబ్బాయైనా, అమ్మాయైనా) తన ఆరోగ్యం, అవసరాలు తీర్చుకుంటూ/చూసుకుంటూ తనకు కాబోయే జీవిత భాగస్వామి అవసరాలను కూడా తీర్చగలిగే ఆర్థికస్థోమత కలిగి ఉండాలి.
-వ్యాధి సిడి 4-500 దశలో ఉండాలి.
-గుర్తింపు పొందిన వైద్యునితో ధృవీకరింపబడిన సిడి-4 రిపోర్టు, ఫోటో, నివాస ధృవీకరణ పత్రం, వ్యక్తిగత వివరాలు (బయోడేటా) విధిగా మ్యారేజ్ బ్యూరోకి సమర్పించాలి.
పైన చెప్పిన ఈ అర్హతలన్నీ ఉంటేనే మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలని ప్రసాద్ స్ట్రిక్టుగా చెబుతున్నారు.
ఏదైనా ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయాలంటే దానికితగ్గ ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాలి. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ప్రసాద్ మ్యారేజ్ బ్యూరోను ప్రారంభించారు. అయితే దాని నిర్వహణకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందుకే వివాహ నిమిత్తం తన దగ్గరకు వచ్చే హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థులకు వెయ్యి రూపాయల ఫీజు నిర్ణయించారు. ఫీజు రూపంలో వచ్చిన డబ్బును మ్యారేజ్ బ్యూరో నిర్వహణకు వినియోగిస్తున్నారు.
పోషకాహారాన్ని అందించే వసతిగృహం
మ్యారేజ్ బ్యూరోను నిర్వహించటం ద్వారానే తన పని పూర్తయిందనుకోలేదు ప్రసాద్. హైదరాబాద్ నగరంలో హెచ్‌ఐవి సోకిన వారెందరో ఉన్నారు. వీరిలో చాలామంది చిన్నస్థాయి నుండి పెద్దస్థాయి ఉద్యోగాల్లో ఏదో ఒకటి చేసుకుంటూ తమ కాళ్లమీద తాము నిలబడినవారూ ఉన్నారు. అయితే వీరంతా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల నిరాదరణకు గురై మానసికంగా కృంగిపోతున్నారనే విషయం ప్రసాద్ దృష్టికి వచ్చింది. వీరికీ ఒక ఆశ్రయాన్ని కల్పించి బాసటగా నిలవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. తన ఆలోచనకు వెంటనే కార్యరూపమిచ్చారు. సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లో తన సొంత ప్లాట్‌లోనే ‘హెచ్‌ఐవి పాజిటివ్ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్’ హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ హాస్టల్‌ను నాగోల్‌కు మార్చారు. హాస్టల్‌లో చేరాలనుకున్న వారు నెలకు రూ.3 వేలు చెల్లించాలి. హాస్టల్‌లో చేరిన వారికి మంచి వసతితోపాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు. ప్రతి రోజు పాలు, రాగిజావ, మొలకలు, గుడ్లు, కాచి చల్లార్చిన నీరు, సీజనల్ ఫ్రూట్స్, ఆకుకూరలతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ హాస్టల్‌లో వంటవారు, వడ్డించేవారు, ఇతర పనిమనుషులు కూడా ‘హెచ్‌ఐవి పాజిటివ్’ వ్యక్తులే కావటం గమనార్హం. ఈ ముగ్గురు పనిమనుషులకు ఉచిత వసతితోపాటు నెలకు రూ.1500 వేతనమిస్తున్నారు.
కులం..ప్రాంతం…కట్నం…
శాస్త్ర సాంకేతికరంగాల్లో మనదేశం ఎంతో పురోగమిస్తున్నా కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు మనల్ని వదలటం లేదు. హెచ్‌ఐవి, ఎయిడ్స్ సోకి జీవితంలో నిరాశకు గురయిన వారు కూడా వీటిని పట్టుకుని వేలాడటం విస్మయాన్ని కలిగిస్తోందని ప్రసాద్ చెబుతున్నారు. వివాహం కోసం తన మ్యారేజ్ బ్యూరోను సంప్రదించే హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తుల్లో (మగవారు) కొంతమంది…తమకు కూడా కట్నాలు, కానుకలు కావాలని అడుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని చెబుతున్నారు. మరికొంతమంది తమ కులం లేదా మతానికి చెందిన హెచ్‌ఐవి పాజిటివ్ అమ్మాయిని / అబ్బాయిని వెదికి పెట్టమని అడుగుతున్నారని వివరించారు. మరికొంతమంది ఒకడుగు ముందుకేసి తమకు తమ ప్రాంతానికే చెందిన అమ్మాయి/అబ్బాయి (ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ…ఇలా) కావాలని అడిగినప్పుడు వారిని చూసి తనకు జాలేస్తోందని చెబుతున్నారు. ఎందుకంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఈ వివరాలన్నీ అడగటం వేరే విషయం. కానీ భయంకరమైన వ్యాధి బారినపడి క్షణ క్షణం చస్తూ బతికే హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు కూడా కట్నాలు, కానుకలు, కులగోత్రాలు, ప్రాంతాల గురించి అడగటం విడ్డూరంకాక మరేమిటి? అసలు ఒక హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తికి పెళ్లి చేయటానికి మరో హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తి దొరకటమే కష్టం కదా? అయితే ఇలాంటి వారందరినీ కూర్చోబెట్టి ఓపిగ్గా వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించటం ద్వారా వారిలోని అపోహల్ని, అనుమానాల్ని పటాపంచలు చేస్తున్నారు ప్రసాద్. అయితే ఎంతో సహనంతో ఈ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని, ఎదుటి వ్యక్తి అడిగే అనేక ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన వివరిస్తున్నారు. అన్ని విషయాల్లో వారందరినీ ఈ విధంగా ఒప్పించిన తర్వాతే వివాహాలు జరిపిస్తున్నారు.
సంచార ప్రచార వాహనం
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన, హెచ్‌ఐవి మ్యారేజ్‌బ్యూరో, హాస్టల్ అవి అందిస్తున్న సేవలను రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో డిసెంబరు 1 నుండి ఒక సంచార ప్రచార వాహనాన్ని ప్రారంభిస్తున్నానని ప్రసాద్ చెప్పారు. ఈ వాహనం ద్వారా అన్ని జిల్లాల్లోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, గ్రామ పెద్దలు, రాజకీయ నేతల్ని కలిసి తన సేవలపై ప్రచారం నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారు. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పట్టణారోగ్య కేంద్రాల వైద్యుల దగ్గరకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహిస్తానన్నారు.
ధైర్యంగా ముందుకెళ్తున్నా…
హెచ్‌ఐవి/ఎయిడ్స్ మ్యారేజీ బ్యూరోను ప్రారంభించినప్పటి దగ్గరి నుండి ఇప్పటి వరకు ప్రసాద్ అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే తనకెదురైన ఆటంకాలను, అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని హెచ్‌ఐవి పాజిటివ్ పెళ్లిళ్లను జరిపిస్తున్నాని, హాస్టల్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాని ఆనందంతో చెబుతున్నారాయన.
”మొదట్లో నా మ్యారేజ్ బ్యూరో గురించి అందరూ ఎగతాళిగా మాట్లాడారు. నన్ను, నేను చేస్తున్న పనులను అసహ్యించుకున్నారు. ముఖ్యంగా సమాజంలోని చాలామంది నాకు కూడా ఎయిడ్స్ ఉండటం వల్లే ఈ విధమైన కార్యక్రమాలను చేపడుతున్నానని అపోహ పడుతుంటారు. నిజానికి మా ఇంట్లో హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులెవరూ లేరు. ప్రస్తుతం నాగోల్‌లో నిర్వహిస్తున్న ‘హెచ్‌ఐవి పాజిటివ్ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్’ హాస్టల్‌ను మొదట్లో సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లోని నా సొంత ప్లాట్‌లో ప్రారంభించా. అయితే మా అపార్టుమెంట్‌లోని వారు, చుట్టుపక్కల వారు ఈ హాస్టల్‌ను ఇక్కడి నుండి తొలగించాలంటూ నానా గొడవ చేశారు. హాస్టల్లో చేరే వారి వల్ల తమకు, తమ పిల్లలకు హెచ్‌ఐవి సంక్రమిస్తుందనేది వారి వాదన. దీనిపై నేను మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. ఈ వ్యాజ్యం కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత చుట్టుపక్కల వారితో గొడవలు భరించలేక హాస్టల్‌ను నాగోల్‌కు మార్చా. మ్యారేజ్‌బ్యూరోతోపాటు హాస్టల్‌ను నిర్వహించేందుకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో నేను చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎపిశాక్స్) ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించాను. ఆర్థికసాయం చేయాలని అర్థించాను. ఫలితం లేకపోయింది. దీంతో నాకు తెలిసిన స్నేహితులు, వైద్యులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకుల నుండి విరాళాలు సేకరించటం ద్వారా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నా. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిశా. నన్ను, నేను చేస్తున్న కార్యక్రమాలను సహృదయంతో అర్థం చేసుకున్న ఎంతోమంది ఇచ్చిన విరాళాలతో నా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నా. మ్యారేజ్‌బ్యూరో, హాస్టల్ నిర్వహణలో నా భార్య సహకారం మరువలేనిది. మంచి మనసుతో నన్ను అర్థం చేసుకున్న ఆమె నాకు అన్ని విధాలా సహకరిస్తుంది కాబట్టే నేను ఈ విధమైన సేవలు చేయగలుగుతున్నా”.
ప్రజాశక్తి కోసం రచన … బి.వి.యన్.పద్మరాజు
28 నవం
కేవీపీ ఔట్ !
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావుకు ఎట్టకేలకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ హయాంలో ‘అధికార కేంద్రం’గా ఆయన హావా సాగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏ ముఖ్య నిర్ణయమైనా ఆయన అనుమతితోనే జరిగేది. కాంట్రాక్టులు, బదిలీలు ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన మాట వేదవాక్కుగా అమలయ్యేది. వైఎస్ మరణానంతరం ఏర్పడ్డ రోశయ్య ప్రభుత్వంలోనూ ఆయన హావా కొనసాగింది. సలహాదార్లను తప్పించాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఇక రాష్ట్రంలో కెవిపి జమానా ముగిసినట్లే.
అయితే గియితే కేవీపీ ఇక యువ వైఎస్ కు సలహాదారుగా రూపాంతరం చెందవచ్చు. అంటే జగన్మోహనరెడ్డి వ్యవహారం ముదురు పాకాన పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆవేశపరుడికి అపర చాణక్యుడు జతపడితే నిప్పు ఉప్పు చందమే కదా.
28 నవం
2010… కుంభకోణాల నామ సంవత్సరం
2010 దేశంలో మిగతా అన్నింటికన్నా కుంభకోణాలు పైచేయి సాధించాయి. ఈ ఏడాది ఐదు భారీ కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి. అందులోనూ నాలుగు కుంభకోణాలు చివరి నాలుగు నెలల్లోనే వెలుగు చూశాయి. అవినీతిని నివారిస్తామనీ, పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామని పాలకులు చెప్తున్న మాటలు ఏ మాత్రమూ ప్రభావం చూపలేకపోతున్నాయి. అంతర్జాతీయ పారదర్శకత నివేదికలో భారత్ స్థానమే ఇందుకు నిదర్శనం. అవినీతిలో మనం 87వ స్థానంలో నిలవటమే పరిపాలనలో పారద్శకత ఏ పాటిదో తేటతెల్లం చేస్తోంది. వాషింగ్టన్‌కు చెందిన పరిశోధన సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ ప్రకారం పలువురు సంపన్నులు, సంస్థలు పన్నుల ఎగవేత ద్వారా ఏడాదికి రూ.72,496 కోట్లను దేశం కోల్పోతోంది. అంతెందుకు ఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అంచనా ప్రకారం 1983-84 సమయంలోనే దేశంలో రూ.36,786 కోట్ల నల్లధనం చెలామణి అయినట్లు అంచనా వేసింది.
మహా కుంభకోణాలు ఇవీ :
1. ఇండియన్ ప్రీమియర్ లీగ్
2. కామన్వెల్త్ క్రీడలు
3. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ
4. స్పెక్ట్రమ్ – 2జి కేటాయింపులు
5. హౌసింగ్ ఫైనాన్స్ కుంభకోణం
27 నవం
వైఎస్ (అ)వివేకానంద జగన్నాటకం
వైఎస్ వివేకానందరెడ్డి హస్తినాపురంలో ఆడుతోన్న జగన్నాటకం ఒకవైపు నవ్వులు పూయిస్తోంది. మరోవైపు ”ఔరా, కాంగ్రెసు నాయకులెంతకయినా తగుదురే!” అని కోపం తెప్పిస్తోంది.
ఆయన శుక్రవారంనాడు హస్తినకు చేరాడు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు, జగన్మోహనరెడ్డికి చిన్నాన్న కావటంతో ఆయన పట్ల మీడియాకు ఆసక్తి ఉండటం సహజం.
ఢిల్లీకి ఎందుకొచ్చారంటూ విలేకరులు ఆయన ముందు గొట్టాలు పెట్టారు.
”ఏందోనమ్మా, ప్రాపబుల్స్‌లో నా పేరుందని టీవీలో స్క్రోలింగు వస్తుంటే చూసి, ప్రయత్నిద్దామని వచ్చాను.” అయన మాటలు కచ్చితంగా ఇవే కాకపోయినా, ఈ అర్ధంతో అమాయకుడి మాదిరిగా మాట్లాడాడు. ఇది శుక్రవారం నాటి సంగతి.
శనివారంనాడు పొంతనలేని ప్రకటనలు చేయటం మరో విశేషం. అధిష్టానంతో ఆయన నాటకం మరీ విచిత్రం.
సోనియాగాంధీ పెద్ద మనసుతో జగన్మోహన్‌రెడ్డిని క్షమించాలని మీడియాతో వ్యాఖ్య.
మంత్రి పదవి కట్టబెడితే జగన్మోహన్‌రెడ్డితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటానని సోనియా రాజకీయ సలహాదారు ఆహ్మద్‌పటేల్‌తో అన్నాడని విశ్వశనీయ వార్త.
వచ్చే నెలలో తానూ, జగన్మోహనరెడ్డి సోనియాను కలిసి చిన్న తప్పులేమయినా జరిగి ఉంటే క్షమించమని కోరతామని ప్రకటన.
ఆ విషయాన్ని జగన్మోహనరెడ్డితో మాట్లాడారా? అంటే లేదని వివరణ.
పైగా ”జగన్మోహనరెడ్డి ఏమి తప్పు చేశాడని సోనియాకు క్షమాపణ చెప్పాలి?” అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం మరో అంకం. వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టేందుకే వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఆశపెడుతున్న పెద్దమనుషుల వలలో పడొద్దని ఆయన సూచించారు.
‘తప్పులు చేయడం మానవ సహజం. వాటిని క్షమించడం దైవత్వం. దాసుడి తప్పులు దండంతో సరి..అన్నట్లు…మేము (జగన్) చేసిన తప్పులను సోనియా క్షమించాలి. త్వరలోనే జగన్మోహనరెడ్డిని తీసుకుని మరోసారి ఢిల్లీ వస్తాను. సోనియాను కలుస్తాను. వారిద్దరి మధ్యా ఏర్పడ్డ అగాధాన్ని పూడ్చటం కోసమే నేను కృషి చేస్తున్నాను. జగన్మోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీకీ అవసరం’ అంటూ వివేకానంద విలేకరుతో వ్యాఖ్యానించారు. జగన్మోహరెడ్డి శిబిరంపై దాడి చేయడానికే కాంగ్రెసు మీకు మంత్రి పదవి ఆశచూపుతుందన్న విమర్శలున్నాయి కదా అని ప్రస్తావించగా’ మీకు ఇష్టం లేకపోతే పదవి తీసుకోనులే’ అని సమాధానమిచ్చారు.
ఇదో విచిత్రం
సాక్షిలో వచ్చిన కథనాలపై మీ స్పందనేమిటి అని ప్రశ్నించగా ”ఆ కథనాలు నేను చూడలేదు” అని జవాబిచ్చారు. జాతీయ మీడియా ప్రతినిధులు వేరొక సమయంలో ఇదే ప్రశ్నను అడిగినప్పుడు..”సాక్షిలో వచ్చిన కథనాలు కాంగ్రెసు కార్తకర్తల మనోభావాలను దెబ్బతీశాయి” అని ఆయన చెప్పటం గమనార్హం.
పటేల్, జైపాల్‌తో భేటీ
సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో వివేకానంద రెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. సాక్షిలో వచ్చిన కథనాలతో తాను కలత చెందానని ఆయన వారికి వివరించినట్లు సమాచారం. మంత్రి పదవిని ఇస్తే, కడప జిల్లాలో కాగ్రెసు పార్టీ ప్రయోజనాలను కాపాడతానని పేర్కొన్నట్లు తెలిసింది. జగన్మోహనరెడ్డితో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి కూడా తాను సిద్ధమని వివేకానందరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.
25 నవం
భాజపా అధిష్టానంపై గాలి అసంతృప్తి
కర్నాటక ముఖ్యమంత్రిగా ఎడ్యూరప్పను కొనసాగించేందుకు భాజపా అధిష్టానం పచ్చజెండా ఊపడంతో ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి గాలి జనార్ధనరెడ్డి, ఆయన సోదరులూ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య ఎడ్యూరప్పకు భాజపా అధిష్టానం దాసోహమవటంతో అసంతృప్తి వ్యక్తచేస్తున్న గాలి వర్గం నేతలు భవిష్యత్తు కార్యాచరణపై తలమునకలవుతున్నారు. ఈ మేరకు గాలి ముఠా నాయకులంతా ఏమి చేయాలన్నదానిపై ఇప్పటికే చర్చలు జరిపారు. ఎడ్యూరప్పను ఎలాగైనా గద్దె నుంచి దించేందుకు వారంలోగా మరోమారు సమావేశమై వ్యూహరచన చేయాలని నిర్ణయించారు. ఎడ్యూరప్పతో లబ్ధిపొందిన భాజపా అగ్రనేతలు కొందరు ఆయనకు వత్తాసు పలికారని ఆరోపిస్తున్నారు. ధన బలాన్ని వినియోగించి రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోర్ ఎడ్యూరప్ప పదవిని కాపాడాడని దుయ్యబట్టారు. లింగాయత వర్గానికి చెందిన ఎడ్యూరప్ప గద్దెను కాపాడుకునేందుకు కులం కార్డు ప్రయోగించారని కూడా ఆరోపించారు. లింగాయత మఠం స్వామిజీ వీధుల్లోకి వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటించడమే అందుకు నిదర్శనమని వివరించారు. ఈ తీరు ముందు ముందు భాజపాకు నష్ట కల్గిస్తుందని వాపోయారు. ఈ విషయంలో భాజపా రాష్ట్ర విభాగం కూడా అంత సంతోషంగా లేకపోవటం విశేషం. ఎడ్యూరప్పకు లింగాయత మఠం స్వామిజీ మద్దతు ప్రకటించడంపై గాలి జనార్ధన రెడ్డి ఇదివరకే బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రతిపక్ష జెడిఎస్, కాంగ్రెసు పార్టీలు సైతం భవిష్యత్తు కార్యచరణపై దృష్టి సారించాయి. ఎడ్యూరప్పకు వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణ రూపొందించేందుకు ఆ పార్టీల శాసనసభ్యులతోనూ, పార్లమెంటు సభ్యులతోనూ త్వరలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. కాగా లింగాయత కులం కార్డు ఎడ్యూరప్పను రక్షించిన నేపథ్యంలో ఆ సామాజిక తరగతిని తాము పట్టించుకోక పోవటాన్ని కాంగ్రెసు పార్టీ నేతలు ఇప్పటికి గుర్తించారు. లింగాయతులయిన ఎంపీ ప్రకాశ్, షమనూర్ శివశంకరప్ప, అల్లం వీరభద్రప్ప సమావేశమై ఈ అంశంపై చర్చలు జరిపారు. వీలైనంత త్వరలో సోనియా గాంధీని కలిసి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇవేవీ పట్టని ఎడ్యూరప్ప రాష్ట్రాన్ని ఇక భిన్నమైన రీతిలో పాలిస్తానంటూ కొత్త ఆలాపన అందుకున్నారు.
25 నవం
వామ్మో! వాయ్యో!! ముఖేష్ ఇంటి విద్యుత్తు నెల ఖర్చు రూ. 70 లక్షలు పైనే
ప్రపంచస్థాయి శత కోటీశ్వరులలో ఒకడైన ముఖేష్ అంబానీ ఇల్లు ‘ఆంటీలియా’ ఇప్పటికే ప్రపంచంలోనే ప్రసిద్ధ కట్టడంగా ప్రసిద్ధిపొందింది. అన్ని విశేషాలున్న ఇల్లు మరే ధనవుంతుడికీ లేదని తేల్చారు కూడా. ఆ ఇల్లు ఇప్పుడు మళ్లీ ప్రపంచస్ధాయిలోనే వార్త అయింది. అంబానీ కుటుంబం ఒక్క నెలలోనే డెబ్బై లక్షల రూపాయలకు పైగా విలువయిన విద్యుత్తును వినియోగించారు. ఇంట్లో చేరిన నెలరోజులకే అంటే సెప్టెంబరు నెలకుగాను రూ. 70 లక్షల, 69 వేల, 488 రూపాయల విద్యుత్తు బిల్లును అంబానీ కుటుంబం చెల్లించింది. 6 లక్షల 37 వేల 240 యూనిట్ల విద్యుత్తును వినియోగించారు.
అంతేనా ఇంకో విచిత్రం కూడా తెలుసుకోవాలి మనం. విద్యుత్తు బిల్లులో 48 వేల 354 రూపాయల రాయితీ ఇచ్చి అధికారులు తమ ధాతృత్వాన్ని ఘనంగా చాటుకున్నారు. అదేమంటే ముఖేష్ నెలనెలా కచ్చితంగా చెల్లిస్తాడు కాబట్టి రాయితీ ఇచ్చామని సమర్థించుకున్నారు.
నాలాంటి 15 వేల మధ్యతరగతి కుటుంబాలు వినియోగించే విద్యుత్తును ఒక్క ముఖేష్ కుటుంబం వినియోగించుకుంటోందన్నమాట. కడుపుమండిన నాలాంటివాడు ఎవరయినా ముఖేష్‌ను ఉదహరించి పెట్టుబడిదారీ వ్యవస్థ తీరును ప్రశ్నిస్తే చాలు బుర్రల నిండా సమసమాజ సిద్ధాంత వ్యతిరేకతను నింపుకున్న కొందరు బుస్సుమంటూ బుసలు కొట్టటం తెలుగు బ్లాగుల్లో నిండా కన్పిస్తోంది. మిత్రులారా! ఆలోచించండి.
పంట పడించే రైతుకు కడుపు నిండా తిండి ఎందుకు దక్కటం లేదు?
రైతన్నకు అండదండగా నిత్యం చెమటోడ్చే వ్యవసాయ కార్మికుడు కనీస అవసరాలకు దూరంగా వెలేసినట్లు ఎందుకు ఉండాల్సి వస్తోంది?
చేనేత కార్మికు(రాలు)డు ఒంటినిండా బట్ట ఎందుకు కప్పుకోలేక పోతున్నాడు?
తాళాలు బాగుచేసే వీధి పక్క మెకానిక్కు మదీనా ఇంటి తలుపును తాళంతో కాకుండా, తాడుతో ఎందుకు బంధించి సరిపెట్టుకుంటున్నాడు?
చెప్పులు కుట్టే చౌడయ్య చుర్రుమని కాలే నడివేసవిలోనూ ఎందుని చెప్పులు వేసుకోలేక పోతున్నాడు?
చిన్నా పెద్దా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది తరచూ ఆందోళనలకు దిగాల్సి వస్తోంది?
వీళ్లందరికీ భిన్నంగా ముఖేష్‌కు అంత ఖరీదయిన ఇల్లు ఎలా సమకూరింది? అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా జమపడ్డాయి?