Archive for నవంబర్ 3rd, 2010

జల్లెడపై తెలుగింటికి ప్రదర్శన భాగ్యం లేకపోయే

జల్లెడగారు తెలుగింటినే జల్లించేశారు
ఎందుకో తెలియదు
పనిగట్టుకొని అడిగితే
ఏదో పొరబాటు, చూస్తున్నామన్నారు
మళ్లీ చేయి కలపమంటే
సరేనని కలిపాను
వారం గడుస్తోంది
మరి ఏమయిందో తెలియదు
జల్లెడపై
తెలుగింటికి ప్రదర్శన భాగ్యం మాత్రం లేకపోయే
ఏమి సేతురా లింగా… ఏమీ సేతు?

మనం చిన్నపిల్లలమా..????

మనం చిన్నపిల్లలమా..???? అంటూ  ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంత్రులపై  బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించకూడదని  ఎన్నిసార్లు నిర్ణయించుకున్నా అమలుకావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాలు బయటకు పొక్కుతూనే ఉన్నాయని ఆందోళన పడ్డారు.  మనమేమన్నా చిన్నపిల్లలమా???  అని  ప్రశ్నించారు.  బుధవారం  మంత్రివర్గ సమావేశం వాడివేడిగా సాగింది. వర్షాలు, రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, అసెంబ్లీ సమావేశాలు, ప్రధాని రాష్ట్ర పర్యటన తదితర అంశాలు చర్చించారు. ఈ నెల 22 నుంచి శాసనసభ  శీతాకాల సమావేశాలు జరపడానికి అధికారులు సమయ పట్టికలను తయారుచేసినట్లు తెలిసింది. అయితే అదేరోజు పుట్టపర్తి సాయిబాబా జన్మదిన వేడుకలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వస్తుండడంతో శాసనసభ
సమావేశాల తేదిల్లో మార్పులు చేయాలని రోశయ్య కోరారు. సాయిబాబా జన్మదిన వేడుకలకు సగం మంది మంత్రులు పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ప్రధాని రాక సందర్భంగా తానూ ముఖ్యమంత్రి హౌదాలో వెళ్ళాల్సి ఉన్నందున  శాసనసభ సమావేశాలకు కొత్త తేదీలను ఖరారు చేయాలని మంత్రులకు సిఎం చెప్పినట్లు తెలిసింది. డిసెంబరు మొదటివారంలో పెట్టుకుందామని కొంతమంది మంత్రులు సూచించారు.

2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం రూ. 1.76 లక్షల కోట్లు


  • జాతి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టారు
  • బాధ్యుడు డిఎంకే రాజా
  • నిగ్గు తేల్చిన కాగ్‌ – ప్రభుత్వానికి తుది నివేదిక

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో జరిగిన కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం వచ్చిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన తుది నివేదికలో తేల్చి చెప్పింది. దీనికి కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజా  బాధ్యుడని పేర్కొంది.  ఈ విలువ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌కు దాదాపు రెండు రెట్లుంది.  జాతి సంపదను అక్రమరాజాలు కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టారు. స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు అనుసరించిన పద్ధతి మొత్తం నిర్హేతుకమైందని, పక్షపాతమని తన నివేదికలో కాగ్‌ పేర్కొంది. మంగళవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టే అవకాశముంది. ‘గౌరవనీయులైన సమాచార, సాంకేతికశాఖ  మంత్రికి ఎలాంటి సహేతుక కారణాల్లేవు. న్యాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖల సలహాలను పట్టించుకోలేదు. 2జి సెక్ట్రమ్‌ కేటాయింపులపై టెలికాం కమిషన్‌తో ఎలాంటి చర్చలూ జరపలేదు. కొంత మంది ఆపరేటర్లు లబ్ధి పొందే విధంగా వ్యవహరించారు. జాతి సంపదను వాస్తవ విలువకంటే తక్కువకే కట్టబెట్టారు’ అని కాగ్‌ ఆక్షేపించింది. ఈ విషయంలో రాజా వ్యక్తిగత జోక్యాన్ని వెల్లడించిన కాగ్‌, తన ప్రతిపాదనలను  పట్టించుకోకపోవడం తోపాటు  దుర్వినియోగపర్చడం వల్ల ట్రారు కూడా నిస్సహాయంగా చూస్తుండి పోయిందని పేర్కొంది.

ఈ 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో అవకతవకలపై  విచారణ జరిపిన సుప్రీం కోర్టు, టెలికాం శాఖ మంత్రి రాజా ఇంకా ఎందుకు ఆ పదవిలో కొనసాగుతున్నారంటూ ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే. 2జి కేటాయింపుల్లో రాజా  పక్షపాతంగా వ్యవహరించారని కాగ్‌ స్పష్టం చేసింది. ‘ 3జి రేటు ప్రకారం లెక్కిస్తే  టెలికాం మంత్రిత్వ శాఖ పేర్కొన్న రూ.9,013 కోట్లు కాకుండా రూ.1,11,511 కోట్లు ఉంటుంది. అదేవిధంగా డ్యూయల్‌ టెక్నాలజీ కింద కేటాయించిన స్పెక్ట్రమ్‌కు రూ.40,526 కోట్లు వస్తాయి. అయితే 3,372 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. మొత్తం వచ్చిన, వచ్చే అవకాశమున్న ఆదాయం భేదం రూ.1,39,652 కోట్లు’ అని నివేదిక తెలిపింది. తమకు కేటాయించిన స్పెక్ట్రమ్‌ పరిధిని దాటి వినియోగించుకుంటున్న దానికి  ఛార్జీ వసూలు చేయాలని గత మే నెలలో టెలికాం మంత్రిత్వ శాఖ చేసిన  ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పట్టించుకున్నా ప్రభుత్వానికి అదనంగా రూ.36,729 కోట్ల ఆదాయం వచ్చేదని కాగ్‌ తెలిపింది.

ఈ విధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం  కారణంగా ఖజానాకు  రూ.1,76,379 కోట్లు నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2003 నవంబర్లో  రూపొందించిన విధానాన్నే 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లోనూ టెలికాం మంత్రిత్వ శాఖ అనుసరించిందని తెలిపింది. దాన్ని ఏ మాత్రమూ ఆధునీకరించలేదని ఆక్షేపించింది.  స్పెక్ట్రమ్‌ను సరిగ్గా ఉపయోగించుకునేందుకు, దాని మార్కెట్‌ ధరను గుర్తించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ  కసరత్తు చేయ లేదని కాగ్‌ తప్పుబట్టింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాటించాల్సిన అన్ని నియమాలను, పద్ధతులను టెలికాం మంత్రిత్వ శాఖ ఉల్లంఘించిందని కూడా కాగ్‌ ఆక్షేపించింది. ‘స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలని గౌరవనీయులైన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నొక్కి చెప్పారు. స్పెక్ట్రమ్‌ ధర నిర్ణయం విషయంలో మంత్రుల సాధికార బృందం నిర్ణయం పరిశీలించాలని ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖలు కోరాయి. అయినా  ఏమీ  పట్టించుకోకుండా 2008లో టెలి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ 2001లో నిర్ణయించిన ధరలకే 122 కొత్త లైసెన్సులు మంజూరు చేసింది.
తన సొంత మార్గదర్శకాలను కూడా మంత్రిత్వ శాఖ పాటంచలేదని నివేదిక తప్పుబట్టింది. దరకాస్తు చివరి తేదీని ఉద్దేశపూర్వకంగానే  మార్చింది. తాను అనుసరించిన ”ముందొచ్చిన వారికి ముందుగా” విధాన నిబంధనలను కూడా మార్చింది. కొన్ని సంస్థలకు  అనైతికరీతిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించింది’ అని నివేదిక పేర్కొంది. స్పెక్ట్రమ్‌కున్న గిరాకీని టెలికాం మంత్రిత్వ శాఖ సమగ్రంగా విశ్లేషించలేదని కూడా నివేదిక ఆరోపించింది. 2జి స్పెక్ట్రమ్‌  విలువను మార్కెట్టు  ఆధారంగా నిర్ణయించలేదని కాగ్‌ విమర్శించింది.