Archive for నవంబర్ 4th, 2010

మా పూలపొట్లాల ముందు శివకాశి మెరుపులు దిగదుడుపు


నా చిన్నప్పుడు  మా ఊళ్లో దసరాకు ఏ ప్రాథాన్యతా ఉండేది కాదు. బడికి పదిరోజులపాటు సెలవులొచ్చేవి కాబట్టి రోజంతా ఆటలాడుకుంటూ బాగా సంతోషపడేవాళ్లం. అయితే దీపావళిలో భాగమయిన సామాజిక కోణాలే ఈ ఉత్తరాది పండుగ ద్రవిడుల దరి జేరగలిగింది. పిండి వంటలు, కొత్తబట్టలంటే ఎవరికి ఇష్టముండదూ? సామూహికంగా చేసే కార్యక్రమాలలో వెల్లువెత్తే ఆనందం సరేసరి. అన్నింటినీ మించి చీకట్లో మగ్గే మానవుడు వెలుగు కోసం పడే తపన దీన్లో కన్పిస్తాయి.
సరే ఈ పండుగ అసలు చరిత్రను మరుగుకు నెట్టి అంటే పరాజితుల సంగతులను కాలరాసి, విజేతలు రుద్దిన కతల్ని తవ్వేపని ఇప్పుడు పెట్టుకోదలచుకోలేదు. ముప్పై, ముప్పైఐదేళ్లనాటి సామాజికాంశాలను గుర్తుకు తేదలచిన రచన ఇది.
ఇది రోలు – రోకలి కథ
దసరా సెలవులు ప్రారంభం కాగానే మొదలయ్యేది దీపావళి సందడి. ఊరంతా రోలు-రోకలి మోతలతో దద్దరిల్లేది. ఆ మోతలకు చెవులు దిబ్బిడి పడి కొండొకచో పెద్దలు విసుక్కునేవాళ్లు. అయినా ఉడుకు రక్తం ఊరుకుంటుందా? అన్నట్లు రోలు- రోకలి కథ చెప్పద్దూ. అచ్చం రోలు, రోకలి మాదిరిగానే ఉంటాయివి. అరచేతిలో ఇమిడేంత పరిమాణం. ఈ రోలు, రోకలి చివర రంధ్రాల ఆధారంగా రెండు మూరల తాడుతోగానీ, అంతే ఉండే ఇనుప చువ్వతోగానీ రెండింటినీ అనుసంధానం చేస్తారు. రోటిలో గంథకాన్ని (రోలు-రోకలి మందు అని పిలిచేవాళ్లం) పోయాలి. అనంతరం రోకలిని రోట్లో పెట్టాలి. తాడుతో కట్టిన రోలు రోకలినయితే వీపు వెనక నుంచి చేతిని బలంగా ముందుకు తెస్తూ (రోకలి కింద ఉండేలా చూసుకోవాలి) ఓ బండపైగానీ, గోడపైగానీ మోదాలి. అదే చువ్వతో బిగించిన రోలు రోకలయితే నిలువుగా చేతిని పైకెత్తి అదే తీరున బలంగా కిందకు దించుతూ బండ మీద బాదాలి. అప్పుడు ఏర్పడే ఒత్తిడికి గంధకం పేలుతుంది. ఢాం అంటూ పెద్ద శబ్దం వస్తుంది. అదొక ఆనందం. ఐదు పైసలకి మందు కొని రోజంతా సందడి చేసేవాళ్లం అప్పట్లో.
ఒకవైపున రోలు-రోకళ్ల మోతలు మోగిస్తూనే, మరొక వైపున పూల పొట్లాల తయారీకి కూడా ఉపక్రమించేవాళ్లం.
పూలపొట్లాల తయారీ అదో కుటీర పరిశ్రమే
బొగ్గులతోపాటు కొబ్బరిపీచుగానీ, సజ్జపొట్టుగానీ, రంపపు పొట్టుగానీ ఏది దొరికితే దానిని నాలుగయిదు రోజులపాటు ఎండబెట్టేవాళ్లం. అనంతరం బొగ్గుల్ని పొడిచేసి, పొట్టుని కలపాలి. ఈ రెండింటి మిశ్రమానికి సూర్యకారం (గంథకంతోపాటు మరేదో రసాయనిక పదార్థాలు కలగలిసి ఉండేవి) అని దాన్ని కూడా కొద్దిగా జతచేసేవాళ్లం. ఈ మిశ్రమాన్ని కూడా ఒకటి రెండు రోజులపాటు ఎండనిచ్చేవాళ్లం. మిశ్రమం బాగా ఎండిన తర్వాత దాన్ని పొట్లం కట్టేవాళ్లం. పొట్లమంటే ఓ పాత గుడ్డను ఆరేడు మడతలు వేసి జానెడు వెడల్పున బారెడు పొడవున చుట్టేవాళ్లం. దాంటో నాలుగు గుప్పిళ్ల మిశ్రమాన్ని పరిచి గుడ్డను గుండ్రంగా చుట్టేస్తే పూలపొట్లం దాదాపు తయారయినట్లే. బెత్తెడు వెడల్పున, జాన కంటె కొంచెం తక్కువ ఎత్తుతో ఈ పొట్లం తయారయ్యేది. ఈ పొట్లాన్ని బిగించేందుకుగాను బారెడు బారెడు పుల్లల్ని సేకరించేవాళ్లం. ఒక్కొక్క పొట్లానికి మూడు పుల్లలు అవసరం. మూడు పుల్లల్నీ కలిపీ కింద, పైనా గట్టిగా కట్టేయాలి. మూడు పుల్లల్నీ మధ్య భాగంలో విడదీసినట్లు లాగి అక్కడ పొట్లాన్ని అమర్చాలి. పైన బారెడు తాడును కడితే అదే పూలపొట్లం. తయారయిన ఈ పూల పొట్లాలను దీపావళి వరకూ రోజూ ఎండబెట్టవాళ్లం. దీపావళి ముందు ప్రారంభించి నాలుగయిదు చొప్పున ఎన్ని ఉంటే అన్ని రోజులపాటు వాటిని తిప్పి ఆనందపడేవాళ్లం. తిప్పటం అంటే ఏమిటో చెప్పాలి కదూ! పొట్లం పై భాగాన కాలే బొగ్గును ఉంచాలి. అది రెండు మూడు నిమిషాల్లో రగులుకొని గుడ్డ పై భాగం కాలి, అనంతరం దాని లోపలున్న మిశ్రమానికి కూడా నిప్పు అంటుకునేది. అప్పుడు పై వైపున కట్టిన తాడును చేతిలో బిగించి మనచుట్టూ దానిని తిప్పాలి. అది వేగంగా తిరుగుతూ నిప్పు రవ్వలను వెదజల్లుతుంది. వలయాలు వలయాలుగా రవ్వలు వెదజల్లుతుంటే అదో అద్భుత దృశ్యం. ఒకపరి ఎడమవైపు, మరొకపరి కుడివైపు పొట్లాన్ని తిప్పుతుంటే చూసేవారికీ ఆనందం కులుగుతుంది. రవ్వలు నేలరాలుతూనే ఆరిపోతుంటాయి కాబట్టి ప్రమాదానికి అస్కారమే లేదు. దీనికితోడు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఉండేది కాదు. అందువలన పేదలు కూడా వీటిని సులభంగా తయారు చేసుకుని దండగ లేకుండా పండగ జరుపుకునేవాళ్లు.
మర హనుమంతరావు, కోమటి సత్యం
అంతో ఇంతో డబ్బులుండేవాళ్లు మాత్రం బాణాసంచాను కొనేవాళ్లు.
మా దాయాది, బియ్యం మిల్లు యజమాని కావూరి హనుమంతరావు ఆ రోజుల్లోనే రెండు మూడు వందల రూపాయలు వెచ్చించి బాణాసంచా కొనేవారు. ప్రత్యేకించి లక్ష్మీ ఆటంబాంబుల్నీ. వంకాయ బాంబుల్నీ చెప్పుకోవాలి. వాటిని పేల్చే సమయంలో ఆ పరిసరాల్లో ఎవ్వరూ ఉండేవాళ్లు కాదు. వాటిని కాలిస్తే పెద్ద మోత పుట్టి భయం పుట్టించేవి. సీమ టపాకాయల దండల్ని ఓ రేకు డబ్బాలో పోసి నిప్పు పెట్టేవాడు. అమ్మో ఇంకే ముంది కనీసం పది నిమిషాలపాటు ఢమఢమలతో రొద పుట్టేది. ఆయనకు తోడు కోమటి (నేరెళ్ల) సత్యం పోటీపడేవాడు. తన దుకాణంలో అమ్మటానికి తెచ్చిన బాణాసంచాలో మిగిలిన వాటిని  రాత్రి పదకొండు గంటలకు ప్రారంభించి సందడి చేసేవాడు. ఇక నాలాంటి వాళ్లు ఓ ఐదారు రూపాయలకు బాణా సంచా కొని, పూలపొట్లాలతోపాటు రెండు రోజులన్నా సందడి చేసేవాళ్లం.
కాలుష్యానికి ఖండన
అయితే బాణాసంచా కాలిస్తే కాలుష్యం ఏర్పడుతుందంటూ ఉపాధ్యాయుడయిన మా నాన్న వ్యతిరేకించేవాడు. అయితే పూలపొట్లాల వలన కాలుష్యం ఏర్పడదంటూ దాన్ని వ్యతిరేకించేవారు కాదు. దీనికితోడు త్రిపురనేని రామస్వామి చౌదరి భావాలతో ప్రభావితుడయిన మా నాన్న దీపావళి పట్ల అంతగా ఆసక్తి ప్రదర్శించేవాడు కాదు. ఈ విషయం నాకు పెద్దయిన తర్వాతగానీ అర్ధం కాలేదనుకోండి.
మల్లారప్పంతులుగారి సామ్యవాదం
దీపావళికి సంబంధించి చెప్పుకోదగిన విషయం మరొకటుంది. మల్లారప్పంతులని పొనుగబాటి వెంకటసుబ్బారావుగారు మా గ్రామంలో ఇరవై సంవత్సరాలకు పైగా ఉన్నారు. సైన్సు ఉపాధ్యాయుడాయన. భలే మంచివాడు లెండి. చదువు ఎంతబాగా చెప్పేవాడో. దాన్నలా ఉంచితే దీపావళిని ఆయన పిల్లలకు అంకితం చేసేవారు. వారం పది రోజుల ముందు నుంచే ఇంట్లో ఉన్న పాత కాగితాలను బయటకు తీసేవారు. మైదా ఉడకబెట్టించేవారు. ఆ కాగితాలను కర్రలకు చుట్టి వెన్నముద్దల గొట్లాల తయారీని పిల్లలకు నేర్పించేవారు. వేలాది గొట్లాలు తయారయ్యేవి. ఓ ఇద్దరు పదో తరగతి విద్యార్థుల్ని మా గ్రామ సమీపంలోని ఉప్పుగుండూరు పంపి వెన్న ముద్దల్లో కూరే ఇనుపరజను, గంధకం ఇంకేవో రసాయనికాలను తెప్పించేవారు. వాటిని రెండు మూడు రొజులపాటు ఎండబెట్టి అనంతరం గొట్లాల్లో కూరేవాళ్లం. పట్టుకునేందుకు వీలుగా ఒక చివర మాత్రం ఇసుకతో నింపేవాళ్లం. వాటిని మళ్లీ ఎండబెట్టి కనీసం పది రోజులపాటన్నా వాటిని కాల్చి ఆనందపడేవాళ్లం. ఇదండీ నాచిన్ననాటి దీపావళి అనందపర్వం. అయితే గత ఇరవై ఏళ్లుగా నేను సిద్ధాంతరీత్యా దూరంగా ఉంటున్నానని చెప్పాలి. ఒకటి ద్రవిడ సిద్ధాంతం కాగా, రెండోది కాలుష్య నివారణపట్ల మొగ్గు. ద్రవిడ సిద్ధాంతం మాటెలాగున్నా కనీసం మనం కాలుష్య నివారణకు కట్టుబడి ఉండకపోతే ఆర్య సిద్ధాంతమూ ఉండదు, ద్రవిడ సిద్ధాంతమూ ఉండదు. అంటే మానవాళి భవితను దీపావళి చిదిమేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీనూ. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షల్ని చెప్పలేనుగానీ, మిత్రులంతా ప్రతి నిత్యమూ సుఖసంతోషాలతో వెలిగేందుకు వీలుకలిగే సమాజం ఆవిర్భవించాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాను. సర్వేజనో సుఖినోభవంతు.