Archive for నవంబర్ 5th, 2010

ఒబామ … మన్మోహనసింగ్…..ఒక గొర్రెపిల్ల

సాధారణంగా ఏ దేశాధినేత అయినా భారత పర్యటనకు వచ్చినప్పుడు దేశ రాజధాని ఢిల్లీని మొదట సందర్శించడం ఆనవాయితీ. అమెరికా అధ్యక్షుడు ఒబామా మాత్రం తన పర్యటనలో తొలి మజిలీగా ముంబయిని ఎంచుకున్నాడు. వాణిజ్యం ఒబామా ఎజెండాలో ఒక అతి ముఖ్యమైన అంశంగా ఉండబోతున్నదనడానికి ఇదొక సంకేతం. వాణిజ్యంలో కూడా లక్షల కోట్ల రూపాయలతో కూడిన రక్షణ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలకు ఆయన అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. రానున్న అయిదేళ్లలో రక్షణ కొనుగోళ్ల కోసం భారత్‌ రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించనున్న తరుణంలో దాంట్లో సింహ భాగం దక్కించుకోవడానికి అమెరికా ఆయుధ వ్యాపార లాబీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఒబామా పర్యటనను ఇందుకు ఒక సోపానంగా మార్చుకోవాలని అది చూస్తున్నది.

రెండు రోజుల్లో ప్రారంభం కానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటనలో వాణిజ్య అంశాలు ఒక అతి ముఖ్యమైన ఎజెండాగా ఉండబోతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియనప్పటికీ ఈ విషయం పర్యటన సన్నాహాలలోనే అనేక విధాలుగా స్పష్టమయింది. ఏ దేశాధినేత అయినా భారత పర్యటనకు వస్తే ముందుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకొని అక్కడ లాంఛన పూర్వకమైన స్వాగత సత్కారాలను స్వీకరించి ప్రభుత్వ నేతలతో సంప్రదింపులు జరిపి, ఆ తర్వాత వాణిజ్య రాజధాని ముంబయికి కాని, ఐటి రాజధాని బెంగుళూరుకు కాని వెళ్లి ఆర్థిక, వాణిజ్య సంబంధాలు, సహకారం గురించి పరిశీలించడం, ఏర్పాట్లు చేసుకోవడం ఆనవాయితీ.

కానీ, ఇప్పుడు ఒబామా పర్యటన దీనికి పూర్తి భిన్నంగా మొదలవుతున్నది. ఆరవ తేదీన ఆయన నేరుగా ముంబయిలోనే దిగుతున్నారు. అంతే కాదు సాధారణంగా ఏ దేశాధినేత అయినా విదేశాలకు వెళ్ళేటపుడు ఆ దేశ విదేశాంగ మంత్రిని వెంటబెట్టుకెళతారు. కాని ఒబామా వెంట వస్తున్నది ఆ దేశ వాణిజ్య మంత్రి గ్యారీ లాక్‌. వీరి వెంట వివిధ అమెరికా కంపెనీలకు చెందిన సుమారు 200 మంది సిఇఓలు వస్తున్నారంటే ఈ పర్యటన ఉద్దేశం ఏమిటో తేలిగ్గానే అర్థ్ధం చేసుకోవచ్చు. ఈ అమెరికా పటాలం అంతా బస చేసేది భారత దేశంలోని అతి బడా గుత్త సంస్థల్లో ఒకటయిన టాటాలకు చెందిన తాజ్‌ హోటల్లో. ఈ గ్రూపు అధినేత అయిన రతన్‌ టాటా ఇండో అమెరికన్‌ సిఇఓ ఫోరం సహాధ్యక్షుడు కూడా కావడం గమనించదగిన అంశం. భారత్‌ వస్తున్న సిఇఓల బృందంలో ఈ సిఇవో ఫోరంకు అమెరికా వైపునుండి సహాధ్యక్షునిగా పనిచేస్తున్న హానీవెల్‌ సిఇఓ డేవిడ్‌ ఎం కోట్‌ ఉన్నారని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. జనరల్‌ ఎలక్ట్రిక్స్‌ సంస్థకు చెందిన జెఫ్‌ ఇమ్మెల్ట్‌, బోయింగ్‌కు చెందిన జిమ్‌ మెకెనెర్రీ, ప్రముఖ ప్రచురణ సంస్థ మెక్‌గ్రాహిల్‌ సిఇఓ టెర్రీ మెక్‌గ్రా, పెప్సికో చైర్మన్‌ నూయీ లాంటి వారు ఈ బృందంలో ఉంటున్నారు. రెండు రోజుల పాటు ముంబయిలో ఉండే ఒబామా భారత గుత్త పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే ఫిక్కి, సిఐఐల సంయుక్త సమావేశంలో పాల్గొంటారు. అలాగే ఇండో అమెరికా సిఇఓల ఫోరం సమావేశంలోనూ పాల్గొంటారు. ముంబయిలోనే వాణిజ్యపరమైన అనేక ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు.

1930ల తర్వాత అతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అమెరికా దాని నుండి బయటపడేందుకు సతమతవుతున్నది. ఎన్నో వేల కోట్ల డాలర్లను ఉద్దీపన పథకాల ద్వారా వెచ్చించినప్పటికీ ఆర్థ్ధిక వ్యవస్థ అతి నెమ్మదిగా పుంజుకుంటున్నది. ఈ నిధులను ఉపాధి కల్పనను పెంచే ఉత్పాదక రంగానికి కేటాయించకుండా ఆర్థిక సంస్థలకే, ఓ రకంగా ఈ సంక్షోభానికి కారణమైన సంస్థలకే అందజేయడంతో దేశంలో నిరుద్యోగం మాత్రం 9.6 శాతం అత్యధిక స్థాయిలో కొనసాగుతున్నది. ఒబామా అధికారంలోకి వస్తే ఏదో ఒరగబెడతాడని ఉత్సాహంగా ఓట్లేసిన అమెరికా యువత తీవ్ర ఆశాభంగానికి గురయింది. దాని ఫలితంగానే కొద్దిరోజుల క్రితం జరిగిన అమెరికా పార్లమెంటు ఎన్నికల్లో ఒబామాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీని ప్రభావం ఒబామా భారత పర్యటలోను వ్యక్తమవుతుంది. అందుచేతనే పర్యటనకు ముందు అమెరికా నుండి ఒబామా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఏకైక లక్ష్యం ఇప్పుడు ఉద్యోగాల కల్పన మాత్రమేనని ఉద్ఘాటించారు.

ఇలాంటి సమయంలో తన ఎగుమతులను విదేశాలకు పెంపొందించి ఉద్యోగకల్పనను పెంచుకోవడం, ఔట్‌సోర్సింగ్‌ లాంటి వాటిని నిరుత్సాహపరచడం అమెరికాకు అధిక ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఈ రెండూ ప్రస్తుత ఒబామా పర్యటనలో కనిపిస్తున్నాయి. ఎగుమతుల విషయానికొస్తే, భారత్‌తో అమెరికా వాణిజ్యం అంత ఎక్కువేమీ కాదు. కాని దాని దిశ మాత్రం అమెరికాకు పూర్తి అనుకూలంగా ఉండటం, ఆ సానుకూలత అంతకంతకూ పెరుగుతుండటం గమనించవచ్చు. అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాలలో భారత్‌ది 14వ స్థానం. చైనాది మూడవ స్థానం. ప్రస్తుతం అమెరికా, భారత్‌ల మధ్య సరుకుల వాణిజ్యం 3,650 కోట్ల డాలర్లు. దీన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపుకు పెంచాలన్నది అమెరికా ఆకాంక్ష. ప్రస్తుతం అమెరికా, భారత్‌ల మధ్య సరుకులు, సేవల మొత్తం వాణిజ్యం 5,000కోట్ల డాలర్లు. కాని చైనాతో ఆ దేశ వాణిజ్యంలో ఇది పదో వంతు మాత్రమే. 2004-09 మధ్య ఐదేళ్ల కాలంలో భారత దేశానికి అమెరికా ఎగుమతులు 269 శాతం పెరిగాయి. కాని ఇదే సమయంలో భారత్‌ నుండి అమెరికాకు ఎగుమతులు 135 శాతం మాత్రమే పెరిగాయి. భారత్‌ వాణిజ్యం చేస్తున్న దేశాలలో అమెరికా స్థానం ఒకటి నుండి మూడుకు తగ్గిపోయింది. చైనాతో అమెరికా వాణిజ్య లోటు ప్రతికూలంగా ఉంది. అమెరికా చైనాకు ఎగుమతి చేస్తున్న సరుకుల కన్నా, చైనా అమెరికాకు ఎగుమతి చేస్తున్న సరుకుల విలువ చాల ఎక్కువ. భారత దేశం కూడ అమెరికాతో వాణిజ్య మిగులును కలిగి ఉంటున్నప్పటికీ, దాని వాటా అంతకంతకూ తగ్గిపోతున్నది. నేడు భారత్‌కు చేస్తున్న అమెరికా ఎగుమతుల ద్వారా 57,000 ఉద్యోగాలు సృష్టించబతున్నాయని అంచనా. అందుచేత ఒబామా పర్యటనలో తమ ఎగుమతులను మరింత అధికం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా జరుగుతాయి.

అమెరికా ప్రధానంగా కేంద్రీకరిస్తున్నది భారత దేశానికి రక్షణ సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం పైనే. 2010-11 బడ్జెట్లో భారత ప్రభుత్వం రక్షణ రంగానికి రు.1,47,344 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సోవియట్‌ సరఫరా చేసిన రక్షణ ఉత్పత్తులనే కొనసాగిస్తున్నది. ఇప్పుడు వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ద్వారా పునర్నవీకరించాలని భారత్‌ భావిస్తున్నది. డాలర్లలో చూసుకుంటే రాబోయే ఐదేళ్లలో 5,000 కోట్ల డాలర్లు దీనికోసం వెచ్చించాలన్నది భారత్‌ ప్రణాళిక. ఇలాంటి భారీ గిరాకీపై ఇతర సంపన్న దేశాలూ కన్నేశాయి. అయినా ఆ దేశాలను వెనక్కినెట్టి తామే అత్యధిక ఆర్డర్లు స్వంతం చేసుకోవాలని అమెరికాకు చెందిన రక్షణ ఉత్పత్తి సంస్థలు ఆరాటపడుతున్నాయి. ఇలాంటి పలు ఒప్పందాలపై ఒబామా పర్యటన సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది.

బోయింగ్‌ సంస్థ తయారుచేసే సి-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాలు పదింటిని కొనేందుకు ఇప్పటికే అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. ఈ విమానాల విలువ 220 కోట్ల డాలర్లు ఉంటుంది. దానికి సంబంధించిన అనుబంధ సామగ్రితో కలుపుకుని 300 కోట్ల డాలర్లు అవుతాయి. ఇంకా విడి పరికరాలు, శిక్షణ, తోడ్పాటు సేవలు మొదలైన వాటితో కలుపుకుంటే ఈ ఒప్పందం విలువ మొత్తం 580 కోట్ల డాలర్లు ఉంటుంది. అసలు విమానాల ఖరీదుతో సమానంగా మిగతా వ్యయమే ఉండటాన్ని ఇక్కడ గమనించాలి. 126 మధ్యశ్రేణి పోరాట విమానాలను కొనుగోలు చేసే ఉద్దేశం కూడ భారత దేశానికి ఉంది. వీటి విలువ 1,060 కోట్ల డాలర్లు ఉంటుంది. అయితే మన్మోహన్‌ సింగ్‌ ఫ్రాన్స్‌, రష్యా పర్యటనలు ముగిసే వరకు వీటిపై ఒప్పందం ఖరారు కాదని అంటున్నారు. అయినా అమెరికా దీనికోసం పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. భారత దేశ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైన ఇండో అమెరికా అణుఒప్పందంపై మన్మోహన్‌ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే సంతకం చేసింది. తాజాగా అణుపరిహార బిల్లును కూడ విద్యుత్‌ కేంద్రాలను సరఫరా చేసే బహుళజాతి సంస్థలకు పూర్తి అనుకూలంగా తెచ్చిన భారత ప్రభుత్వం దాన్ని యథాతధంగా ఆమోదింపచేసుకోవడంలో విఫలమయింది. ఆ మార్పులు పెద్దగా చెప్పుకోదగినవి కానప్పటికీ బహుళజాతి సంస్థలు వాటిని సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఆ సంస్థల వత్తిడి ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతుందీ చూడాలి.

ఇలాంటి ఒప్పందాలన్నీ అమెరికా సంస్థలకు నేరుగా ప్రయోజనం కల్గించేవి, అక్కడ ఉపాధి పెంచడానికి దోహదపడేవి. అందుచేతనే వాటికోసం ఏకోన్ముఖంగా అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మరో వైపున భారత సంస్థలు సైతం ఈ ఒప్పందాలు కుదిరితే అనుబంధ కాంట్రాక్టుల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లంరాజు ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ 3,000 కోట్ల డాలర్ల భారత్‌ రక్షణ కొనుగోళ్లలో వెయ్యి కోట్ల డాలర్ల వరకు భారత్‌ సంస్థలకు తిరిగి పనుల రూపంలో లభిస్తాయని చెప్పారు. అందుచేత, ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు, వీటికి సంబంధించిన భారత కంపెనీలు కూడ సహకరిస్తాయని భావించవచ్చు.

భారత దేశానికి అమెరికా నుండి లభిస్తున్న పెట్టుబడులలో పెద్ద వాటా విదేశీ మదుపు సంస్థలు స్టాక్‌ మార్కెట్‌ లాంటి స్పెక్యులేషన్‌ కోసం ఉద్దేశించిందే అత్యధికం. ఎంతోకొంత ఉత్పత్తికి దోహదపడే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) వాటా నామమాత్రమే. భారత దేశానికి లభిస్తున్న మొత్తం విదేశీ మదుపు సంస్థల పెట్టుబడుల్లో అమెరికా నుండి వస్తున్న దాని వాటా దాదాపు 40 శాతం. కాని ఎఫ్‌డిఐలలో అమెరికా వాటా సుమారు ఐదు శాతం మాత్రమే. ఈ ఎఫ్‌డిఐలు సైతం ఉపాధిని హరించే రీటైల్‌ రంగం లాంటి వాటిలోకి, దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి భంగం కలిగించే బీమా, బ్యాంకింగ్‌ వంటి రంగాలలో ప్రవేశించడానికే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వాల్‌మార్ట్‌ లాంటి సంస్థల ప్రతినిధులు ఒబామా బృందంలో వూరికే రావడం లేదు. తమ ప్రవేశానికి మార్గాన్ని సుగమం చేసుకోవడమే వాటి ప్రధాన లక్ష్యం.

అమెరికాతో వాణిజ్య సంబంధాలలో ప్రధానంగా ముందుకొచ్చే మరో సమస్య ఔట్‌సోర్సింగ్‌. ముఖ్యంగా ఐటి రంగంలో ఎక్కువగా ఉన్న ఈ ఔట్‌సోర్సింగ్‌ వల్ల మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తున్నప్పటికీ, అంతకన్నా ఎక్కువగా లాభపడుతున్నది ఆ సేవలను వినియోగించుకుంటున్న అమెరికాకు చెందిన సంస్థలే. అవే పనులను అక్కడి వారితోనే చేయించుకోవాలంటే వాటి లాభాలకు గండిపడుతుంది. కాని ఈ ఔట్‌సోర్సింగ్‌ వల్ల తమ ఉద్యోగాలు పోతున్నాయని అమెరికా యువత ఆందోళన చేస్తున్నది. ఈ రెండు అంశాలతోను అధ్యక్షుడు ఒబామా ఎలా వ్యవహరిస్తాడన్నది చూడాల్సిందే. మరో వైపున ఔట్‌సోర్సింగ్‌ రంగంలో ఉన్న భారతీయ సంస్థలు కూడ తమ శాయశక్తులా లాబీయింగ్‌ చేస్తున్నాయి.

ఒబామా పర్యటనలో వీటికి సమాధానాలు లభించే అవకాశం ఉంది. ఏ ఏ ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి, వాటి పర్యవసానాలు ఏమిటన్నది పర్యటన ముగిశాక కాని తెలియదు. కాని ఒక్క విషయం మాత్రం చెప్పుకోవచ్చు. నిరంతరం అమెరికా అడుగులకు మడుగులొత్తే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీరును గమనించినప్పుడు సానుకూలమైన ఫలితాల కోసం ఆశలేమీ పెట్టుకోనక్కర లేదని అర్థం అవుతుంది. ఒబామా అధ్యక్ష పీఠం అధిరోహించిన ఈ రెండేళ్ల కాలంలో మన్మోహన్‌ ఆయనను ఎనిమిది సార్లు కలుసుకున్నారంటే అమెరికాతో ఎంతగా అంటకాగుతున్నారో స్పష్టమవుతుంది.

భారతదేశమే బలికానున్న గొర్రెపిల్ల

గుడిపూడి విజయరావు