యథా రాజా తథా ప్రజ


ఏ అంశం చర్చకు వచ్చినా, యథా రాజా తథా ప్రజ అనేవాడు నా మిత్రుడొకడు. అదేందో అర్ధంకాక ఎవడన్నా దేభ్యపు మొహం పెట్టాడో! ఆ మాత్రం తెలీదా? అని ప్రశ్నిస్తూనే, వెధవ రాజుంటే ప్రజలు కూడా వెధవలే అవుతారు అంటూ మా మిత్రుడొకడు అర్ధం చెబుతుండేవాడు తమాషాగా. రాజును బట్టి ప్రజలా? ప్రజలను బట్టి రాజా? వాస్తవానికిదో పెద్ద చర్చనీయాంశమే. అమాయ ప్రజలు రాజును అనుసరిస్తూ ఉంటారంటారు కొందరు. రాచరికం మాటేమోగానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యస్ధాయిని బట్టి రాజు ఎంపికవుతాడు. కాబట్టి ఆ రాజు కూడా అదే స్థాయిలో ఉంటాడని విశ్లేషిస్తారు మరికొందరు.
ఈ చర్చోపచర్చల మాటేమోగానీ, మన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డీజీపీ అరవిందరావు ఆదేశాలను రాష్ట్ర రాజధాని ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు. పాలకులకూ, ప్రజలకూ ఉన్న అంతరం ఎంతుందో ఈ వ్యవహారం మరోమారు పట్టి చూపింది. అధికారులకూ, ప్రజలకూ ఉన్న శతృవైఖరి ఏ తీరునుందో ఈ వ్యవహారం మరోమారు అద్దం పట్టింది. అసలు విషయానికొస్తే… ఈ వ్యవహారం దీపావళికి సంబంధించింది. మామూలుగా చూస్తే చిన్న విషయమూ, తరచి చూస్తే బోలెడంత పెద్ద విషయమూను.
రాత్రి 10 గంటల లోపే బాణాసంచా కాల్చటం పూర్తిచేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశాడు. దీనికి తోడు ఆసుపత్రులకు 100 అడుగుల లోపు మతాబుల్ని కాల్చకూడదని కూడా ఆదేశించాడు. ఆయన ఆదేశాలను తెలుగు వార్తా చానళ్లన్నీ పెద్ద పెట్టున ఠీవిగా ప్రచారం చేశాయి పాపం.
అయితే… డీజీపీ అయితే మాకేంటి, వాడెమ్మ మొగుడయితే మాకేంటి అన్నట్లు వ్యవహరించారు భాగ్యనగర వాసులు.
రాత్రి పది గంటలు ఎటో పోయింది. అర్ధరాత్రి 12 గంటలూ కరిగిపోయింది. ఒంటిగంట సమయాన్నీ గమనించలేదు. రెండు గంటల తర్వాత కూడా ఠమా, ఠమా అంటూ లక్ష్మీ బాంబులు, వంకాయ బాంబులు ఇంకా ఏమేమి బాంబులున్నాయో నాకు తెలియదుగానీ మోగుతూనే ఉన్నాయి నగరంలో దీపావళి రోజున. ప్రధాన వీధుల్లోనూ అదే పరిస్థితి. పోలీసు స్టేషన్ల ముందు, వెనుకా, పక్కనా, కూతవేటు దూరంలోనూ డీజీపీ ఆదేశాలు బేఖాతురు. ఆసుపత్రుల ఎదుటా, వెనుకా, పక్కనా అదే దుస్ధితి. డీజీపీ ఆదేశాల మాట దేవుడెరుగు కనీసం వాతావరణ కాలుష్యం, శబ్దకాలుష్యం ఘోష ఎవ్వరకీ పట్టలేదు. ఎవ్వరికీ కనీసం గుర్తున్న దాఖలాలు కూడా లేవు.
ఇక విఎస్‌టీ (వజీర్‌ సుల్తాన్‌ టుబాకోస్‌, అదేనండీ ఛార్మినార్‌ సిగిరెట్‌ తయారీ సంస్థ) సమీపంలోని రాంనగర్లో పరిస్ధితిని చూద్దాం.
రాంనగర్‌ చౌరాస్తాలోని ఓ మతాబుల దుకాణం కూడా రాత్రి రెండు గంటల వరకూ తెరిచే ఉంది. అప్పటిదాకా జోరుగా కాకపోయినా అడపాదడపా అమ్ముతూనే ఉన్నారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో, అప్పటికయ్యది అన్నట్లుగా ఇది వాస్తవానికి వస్త్ర దుకాణం. అయితే వినాయక చవితికి గణేశ విగ్రహాలు అమ్మారు. దీపావళికి బాణాసంచా అమ్మకాలకు పెట్టారు. బట్టలన్నింటీని పెట్టెల్లో సర్దేసి వీటిని అమ్మకానికి పెడుతున్నారు లెండి.
నిషేధాన్ని ఆవలబెట్టి రాంనగర్‌ గుండులోని ఆసుపత్రుల చుట్టూ కూడా మతాబుల్ని రాత్రంతా పేలుస్తూనే ఉన్నారు.
అక్కడే ఉన్న నల్లకుంట పోలీసుస్టేషను చుట్టూకూడా ఏ మాత్రం లెక్కాడొక్కా లేకుండా మతాబులు పేలాయి.  దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఉందేమో!
రాత్రి 11 గంటల వేళ. ఓ వృద్ధుడు పార్సీగుట్టరోడ్డులోకి మలుపు తిరిగాడు.  ఓ దుకాణదారుడు కాల్చిన బాంబు అతడికి సమీపంలోనే  పేలింది. ఆ వృద్ధుడు భయపడిపోయాడు. పక్కకు పరుగుదీశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ దుకాణం వాడిని నాలుగు తిట్టి వెళ్లిపోయాడు. ఇద్దరు యువతులూ అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. బాంబు పేలగానే చెవులు మూసుకుని పరుగులు తీశారు. భయం వారి మొఖాల్లో స్పష్టంగా కన్పించింది.
ఇదండీ రాంనగర్‌ పరిస్థితి. డీజీపీ ఆదేశాలు అమలు కానేలేదు పోలీసుల సాక్షిగా.
కాలుష్యం కాటు ప్రమాదకరమయిన స్ధితికి చేరుకున్నా ఎవ్వరికీ పట్టటం లేదు. డీజీపీ నామకా ప్రకటించిన ఆదేశాలు పాక్షిక నిషేధం ఒక్కశాతం కూడా అమలు కాలేదు.
చట్టాలు చేసి లాభమేమి? బహూశా వరకట్నం చిత్రంలో అనుకుంటాను ఎన్టీఆర్‌ సమాజాన్ని ప్రశ్నిస్తాడు. చట్టాల్ని ఆమోదించే పెద్దమనుషులే వాటిని అనుసరించని నేపథ్యంలో, చట్టాల్ని రూపొందించే అధికారులే  అవంటే లేకుండా వ్యవహరిస్తున్ననేపథ్యంలో, చట్టాలు అమలు కాకపోతే మొట్టికాయవేయాల్సిన న్యాయవ్యవస్థే గాడి తప్పిన దేశంలో దీర్ఘకాలిక నష్టాలపట్ల ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరికి శిక్షవేయాలి? ఈ తప్పులతో సంబంధమే లేని వారూ దానికి బలవటం ఎప్పటికి ఆగిపోతుందో?

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: