Archive for నవంబర్ 7th, 2010

పేరులో ఎంతో ఉంది! పేరులోనే అంతా ఉంది!!


పేరులో ఎంతో ఉంది! పేరులోనే అంతా ఉంది!! అని ఘంటాపదంగా చెప్పగలను. అసలు పేర్లను గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నిరోజులయినా చాలవంటాను కూడా. ఎన్ని వేల పుటలయినా రాసేయొచ్చు అనిపిస్తుంది నాకు. ఆ మాటకొస్తే ఓ డజనుకు తక్కువకాకుండా పీహెచ్‌డీలు చేసేందుకు సరిపడా సరుకూ – సరంజమా పేర్లకు సంబంధించి ఉందంటే అతిశయోక్తి కాదు.
ఏమి పేరు పెట్టారో!?
ఏ ఇద్దరు కలిసినా, వారి మధ్య రెండో అంశంగా దొర్లే విషయం పిల్లల గురుంచేకదా! అప్పుడు మొదటగా అవతలివాళ్ల నుంచి వచ్చే మొదటి ప్రశ్న ”పిల్లలకు పేర్లేమి పెట్టారు?” అనేకదా? అంతటితో ఆగిపోద్దా? ”ఎవరి పేరది?” అనడుగుతారు తర్వాత? మా నాయనమ్మదనో, తాతయ్యదనో చెబుతారు మీరు. ”మంచి పనిచేశారు. పెద్దవాళ్లను ఆ మాత్రం గుర్తుపెట్టుకోవటం మన విధండీ” అంటూ మీకు ప్రశంసలూ, మానవత్వం గురించి ఒకింత బోధనా చేసేస్తారు.
పేర్ల కోసం సినీ స్టంట్లు
ఇక పేర్ల విషయంలో సినిమా రంగంలో ఎంతెంత యుద్ధాలు జరిగాయో, జరుగుతున్నాయోగదా! అందులోనూ మన తెలుగు సినిమా పరిశ్రమే పెద్ద పీఠేసుకు కూర్చుందట. ఒక్క 2010 అక్టోబరులోనే మూడు సినిమా పేర్లు వివాదమయ్యాయి. పవన్‌కళ్యాణ్‌ ”కొమరం పులి, మహేష్‌బాబు సినిమా ”ఖలేజా”, నందమూరి కళ్యాణ్‌రాం ”కత్తి” చర్చోపచర్చలకు దారితీసిన విషయం అందరికీ తెలిసిందేగదా. అసలు ఒక్క వాక్యం కూడా కథంటూ లేకుండానే తెలుగు సినీ నిర్మాతలు ధరావత్తు చెల్లించి మరీ పేర్లను నమోదు చేయిస్తారని జగమెరిగిన సత్యం.
పేర్లు తెచ్చిన తంటాలెన్నెన్నో
ఆ మాటకొస్తే పిల్లలకూ, సినిమాలకేనా? దేనికయినా ఓ పేరంటూ ఉండాల్సిందేగదా. దానికోసం రోజుల తరబడీ ఆలోచించటం, తమ అభిరుచికి అనుగుణంగా ఖరారు చేసుకోవటం మామూలే. ఆమాటకొస్తే అన్నిసార్లూ మామూలు కాదు. కొన్నిసార్లు వివాదమవటమూ మామూలే. కొండొకచో ప్రపంచస్ధాయి కీర్తినీ, హిమాలయాలంత కనకాన్నీ పోగేసి పెట్టిన పేర్లకూ కొదవలేదు. అందుకే కాబోలు కొందరు పేరు పెట్టేటప్పుడూ మంత్రగాళ్లనో, తంత్రగాళ్లనో కలిసి వాళ్ల ఆదేశాల ప్రకారం పేరును ఖరారు చేసేసుకుంటారు. ఇంతచేసినా ఆ పేరు ఆశించిన లాభాల మాట అలాగుంచి సమస్యలు తెచ్చిపెట్టిన సందర్భాలూ ఉన్నాయండోయ్‌. జైళ్లకు పంపిన దాఖలాలూ లేకపోలేదు. విజయవాడకు చెందిన వ్యాపారి ఒకరు ఓ పేరున్న జ్యోతిష సామ్రాట్‌కు ఓ లకారాన్ని గుట్టుగా ముట్టజెప్పి, గ్రహాల బలాబలాలను కిందామీదా వెదికించి మరీ తన చిట్‌ఫండ్‌ సంస్ధకు పెట్టించుకున్న పేరు దాన్ని దివాలా తీయకుండా కాపాడనూ లేదు, అతగాడిని ఆత్మహత్య నుంచి తప్పించనూ లేదు పాపం. అంతెందుకు రామలింగరాజు ఐటీ సంస్ధకు సత్యం అని పేరు పెట్టింది దారినబోయే సోదిమ్మ కాదుగదా! తమకు తాము జ్ఞానసంపన్నులమని భుజకీర్తులు తగిలించుకు తిరిగే ఏ జ్యోతిష మహారాజావారో పెట్టి ఉంటారు. చివరికి ఏమయిందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదుగదా.
అనుభవించాలి … పలవరించాలి
పేరంటే గుర్తుకొచ్చే రాష్ట్రస్ధాయి సంఘటన విశాఖ నౌకాశ్రమానికి దక్కుతుంది. 1960 దశకంలో విశాఖ నౌకశ్రమానికి ప్రభుత్వం రష్యా నుంచి డ్రెడ్జర్‌ను కొనుగోలు చేసింది. అది రేవుకు చేరబోతున్నట్లు సమాచారం అందుకున్న ఉన్నతాధికారులంతా శీతల మందిరంలో సమావేశమయ్యారు. తినటానికి వేయించిన జీడిపప్పు, తాగటానికి విదేశీ శీతలపానీయాలు సిద్ధం చేశారు సిబ్బంది. డ్రెడ్జర్‌ అని నిరక్షరకుక్షులయిన కార్మికులు పిలవలేరు కాబట్టి, దానికి సులభమయిన తెలుగు పేరు పెట్టాలని అధికారులు ఆ సమావేశంలో గంటలకొలదీ మల్లగుల్లాలు పడుతుండగానే ఆ యంత్రభూతం రానేవచ్చింది. కార్మికులు దానిచుట్టూ చేరిపోయారు. దాన్ని ముట్టుకుని తన్మయత్నం చెందుతూ ‘తవ్వోడ’ వచ్చేసిందంటూ సంతోషంగా చిందులేస్తున్నారు. తెలుగు పేరు కోసం మల్లగుల్లాలు పడుతోన్న అధికారులకు డ్రెడ్జర్‌ వచ్చిన విషయం తెలిసి కాసేపు సమావేశాన్ని వాయిదా వేసి బయటకు వచ్చారు. దాన్ని కళ్లారా చూశారు. కార్మికులు దాన్ని తవ్వోడ అంటూ పిలవటాన్ని చెవులారా విన్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తెల్లబోయారు. తెలుగు పేరు ఎజెండా సమావేశాన్ని శాశ్వతంగా నిలిపేశారు. ఇంకేముంది కార్మికులు పెట్టేసిన తవ్వోడ పేరు శాశ్వతమయి నిలిచిపోయింది.
ఒకటే పేరున్నా తోకలతో ఇట్టే పరిష్కారం
గ్రామాల్లో ఇంటిపేరు సహా ఒకటే ఓ నలుగరయిదుగురికి ఉండటం కద్దు. మా నాన్న పేరు కావూరి కోటేశ్వరరావు. అదే పేరుతో మరో ముగ్గురున్నారు. అందుకని నలుగురికీ నాలుగు ప్రత్యేకతల్ని తగిలించేశారు జనం. మా నాన్నను పంతులు కోటేశ్వరరావు అంటారు. కళ్లజోడు ఉండే ఇంకో కోటేశ్వరరావుకు అద్దాల అని తగిలించారు. ఇంకో బాబాయికి ఆయన దత్తు పోయిన ఇంటిపేరు దేముడుని అతికించి పిలిచేవాళ్లు. ఇక చెరువుకట్టమీద ఇల్లున్న నాలుగో కోటేశ్వరరావుకి కట్టమీద అని జతచేసుకుని పిలుస్తారు. ఒకాయన నల్లకోటయ్య, ఒకాయన సుబ్బయ్యగారి పేరయ్య, పేరయ్యగారి బుల్లోడు అంటూ సహజాతి సహజంగా పిలిచేవాళ్లు. నన్ను పంతులుగారి సుబ్బారావు అంటారు. మా బాబాయిని ఇంజిను కాడ సుబ్బారావు అని, తమ్ముడి వరుసయ్యే ఇంకో సుబ్బారావుని అంజయ్యగారి సుబ్బారావు అని పిలుస్తూ ఒకటే పేర్లతో ఏర్పడే గందరగోళాన్ని అతి సులభంగా మా ఊరోళ్లు తీర్చేశారు. ఆమాటకొస్తే ఏ ఊరోళ్లయినా ఇంతేనంటాను.
ఒంగోల్లో పనే పేరు
ఒంగోలు పట్టణంలో ఓ ధియేటరు సిబ్బంది పేర్లు వింటే నవ్వులు పూయకుండా ఉండవు. వాళ్ల అసలు పేర్లేమిటో తల్లిదండ్రులకన్నా గుర్తుందో లేదో తెలియదు. పోస్టర్లు అతికించేవాడిపేరు పోస్టరు, దానికి మైదా పిండి పూసేవాడి పేరు మడ్డోడు. గోడలు ఎక్కి పోస్టరు అతికించేవాడి పేరు నిచ్చెనోడు. ఇలా ఆ థియేటరు సిబ్బంది పేర్లన్నీ ఇలానే ఉంటాయి.
ఇప్పుడు చెప్పండి పేర్లలో ఎంతో ఉంది అంటే నమ్ముతారా? లేదా?
పేర్ల మీద ఓ అరడజను పీహెచ్‌డీలు చేసేయొచ్చు అంటే ఒప్పుకుంటారా లేదా??