- కుళ్లిపోయిన కాయలు
- నష్టాల్లో గుమ్మడి రైతు
గత సంవత్సరం వచ్చిన లాభాలను చూసి ఈ ఏడాది కూడా బూడిద గుమ్మడిని సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం గుమ్మడి కాయలను కొనుగోలు చేసే నాథుడే లేడు. దీనికితోడు నిల్వ చేసే అవకాశం లేకపోవటం వల్ల కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. లాభం కాదు కదా పెట్టుబడిలో ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల కాలంలో తమిళనాడులో ఉదయాన్నే దుకాణదారులు బూడిద గుమ్మడి కాయతో దిష్టి తీయటం సంప్రదాయం. మన రాష్ట్రంలో శుభకార్యాలకు కొబ్బరికాయ కొట్టినట్లు అక్కడ ప్రతి కార్యక్రమాన్ని బూడిద గుమ్మడితో ప్రారంభిస్తారు. అంతేకాకుండా బూడిద గుమ్మడి కాయ జ్యూస్‌కు తమిళనాడులో గిరాకీ ఉంది. చెన్నై మార్కెట్‌లో బూడిద గుమ్మడికి సాధారణంగా గిట్టుబాటు ధర పలుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లొ గుమ్మడిని సాగు చేస్తారు.
గత సంవత్సరం టన్ను గుమ్మడి కాయల ధర రూ. 12 వేల నుండి రూ. 15 వేల వరకు పలికింది. అంటే కిలో గుమ్మడికాయ 15 రూపాయల ధర పలి కింది. గుమ్మడికాయ కిలో నుండి 10 కిలోల వరకు ఉంటుంది. ఎకరాకు 15 టన్నుల గుమ్మడికాయల దిగుబడి వస్తుంది. గత సంవత్సరం మార్కెట్‌లో గుమ్మడికి మంచి గిరాకీ ఉండటం, టన్ను 15 వేల రూపాయలు పలకటంతో ఈ సంవత్సరం ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో రైతులు బూడిద గుమ్మడి సాగు చేశారు. అద్దంకి, బల్లికురవ, ముప్పవరం, మురికిపూడిలో గుమ్మడిని సాగుచేశారు. బల్లికురవ మండలంలోని ఒక రైతు 150 ఎకరాల్లో సాగు చేశారు. అయితే మంచి దిగుబడి వచ్చినా, మార్కెట్‌లో ధర లేకపోవటం, నిల్వ చేసే అవకాశం లేకపోవటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. అద్దంకిలోని నర్రావారిపాలెంకు చెందిన మెరసాల లక్ష్మయ్య అనే రైతు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఈ బూడిద గుమ్మడి సాగు చేశాడు. ఎకరాకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. దిగుబడి బాగానే వచ్చింది. అయితే మార్కెట్ బలహీనంగా ఉంది. కిలో మూడు రూపాయలు మాత్రమే పలుకుతోంది. అదీ అడిగిన వాళ్లు లేరు. అప్పటికీ అమ్మటానికి చెన్నై, విశాఖపట్నం మార్కెట్‌లను విచారించినా అడిగే దిక్కేలేరని రైతు లక్ష్మయ్య చెప్పారు. చేసేది లేక కాయలను అద్దంకి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఉంచారు. వారం రోజులు గడిచేసరికి అవి కాస్తా కుళ్లటం ప్రారంభించాయి. వ్యవసాయ అధికారుల సలహా మేరకు కుళ్లిపోకుండా రసాయనం పిచికారీ చేసినా ఫలితం కనపడటం లేదు. ఇప్పటికి సగానికి పైగానే కాయలు కుళ్లిపోయాయని రైతు తెలిపారు. మిగతావి కూడా మిగులుతాయన్న ఆశ లేదన్నారు. మొదట వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు విత్తనాలు నాటామని అవి సరిగా మొలకెత్తక పోవటంతో మళ్లీ విత్తనాలు కొని నాటామని చెప్పారు. 10 ఎకరాలకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినా ఒక్క పైసా కూడా తిరిగి వచ్చే పరిస్థితి కానరావటం లేదని రైతు లక్ష్మయ్య వాపోయాడు.