నేరెళ్లోళ్ల కొట్టు భారతం


అది స్వాతంత్య్రోదయానికి ముందు కాలం. ఈదుమూడికి సమీపంలోని రాచపూడి గ్రామం నుంచి ఓ బాలుడు రోజూ ఈదుమూడికి వచ్చి గుగ్గిళ్లు అమ్ముకుని వెళ్తుండేవాడు. తీసుకొచ్చిన గుగ్గిళ్లన్నీ ఏ రోజుకు ఆరోజే అమ్ముడు పోతుండటంతో అంతో ఇంతో మిగులు కనపడేది. దీంతో ఆ బాలుడి కుటుంబ పెద్దలకు ఓ కోరిక కలికింది. దాని ప్రకారం ఆ కుటుంబం బ్రిటీష్‌ పాలనకు ముందు సామంత రాజ్యానికి కేంద్రంగా భాసిల్లిన రాచపూడి నుంచి ఈదుమూడికి చేరింది. ఆ కుటుంబ పెద్దల పేర్లు నాకు తెలియదుగానీ, ఆ బాలుడే నేరెళ్ల వెంకటేశ్వర్లు. నాకు తెలిసేటప్పటికి ఆయన వయస్సు 55 ఏళ్లు. చెరువు కట్టకు ఆనుకుని ఉన్న చిన్న పెంకుటింట్లో వాళ్ల కొట్టు ఉంటుంది. దీనికి సంబంధించి మొదటి టపాలో కన్పించే చెరువు పక్కనే ఆ ఇల్లు. ఏటా కనీసం ఒక్కసారన్నా మూడు నాలుగు రోజులపాటు ముసురుపట్టి చెరువు పూర్తిగా నిండిపోయేది. ఊరు ఊరంతా అక్కడ చేరేవాళ్లు. నీటి రాకడ ఇంకా కొనసాగితే కట్ట తెగిపోయి ఊరు మునిగి పోతుందని భయపడేవాళ్లు. అప్పుడు నేరెళ్ల వెంకటేశ్వర్లు తల్లి లక్ష్మమ్మ చెరువుకు పూజలు చేసేది. మెట్లకు పసుపు రాసి కుంకుమ అద్దేదా వృద్ధురాలు. ఎవరికి, ఏమని మొక్కుకునేదోగానీ దండాలు పెట్టటం కన్పించేది. చివరలో ఓ టెంకాయ కొట్టి చెరువలో విసిరేసేది. అయితే మా చెరువు ఎప్పుడూ తెగలేదు. ఊరికి ప్రమాదం జరగలేదు. మళ్లీ నేరెళ్ల వారి చరిత్రలోకి వెళ్లే వెంకటేశ్వర్లు కుటుంబం మా ఊరికి చేరిన కొన్నాళ్లు గుగ్గిళ్ల అమ్మకంతోనే బతికేదట. కొంత సొమ్ము జమపడిన తర్వాత ఓ చిన్న చిల్లర కొట్టును ప్రారంభించారు. ఇక మళ్లీ వెనక్కు తిరిగి చూడనేలేదు. రోజూ పోగుబడే చిల్లర, నోట్ల కట్టలై వెంకటేశ్వర్లు లక్షాధికారి అయ్యాడు. అన్నట్లు ఆనాడు డబ్బులిచ్చి కొనుక్కుది కొందరే. అత్యధికులు వడ్లతోనో, బియ్యంతోనో మార్పిడి చేసుకునేవాళ్లు. ఈ వ్యాపారం రెండు విధాల లాభం. ఒకటి వస్తువు మీద వచ్చే లాభం కాగా, రెండోది వడ్లకు తక్కువ ధర కట్టేవాళ్లు. దీనికి తోడు వడ్లను తాలున్నా లేకపోయినా విధిగా చెరిగేవాళ్లు. వీలయినంత ఎక్కువ వడ్డను కిందకు చెరిగేసి, తర్వాత వాటిని వెంకటేశ్వర్లు పోగుజేసుకునేవాడు. వెంకటేశ్వర్లుకు ఒక కూతురు, ఐదుగురు కుమారులు. ఆనాడు కొలతకు గిద్ద, సోల, మానిక అని ఉండేవి. 16 గిద్దలు ఓ మానిక. నాలుగు గిద్దలు ఓ సోల. నాలుగు సోలలు ఓ మానిక. ఇప్పటి కిలోగ్రాముతో పోలిస్తే సుమారు రెండు కిలోలు ఓ మానికనుకుంటాను. అన్నట్లు సోలకూ, మానికకూ మధ్య తవ్వ కూడా ఉండేది. అయితే దాన్ని అంతగా వినియోగించేవాళ్లు కాదు. ఎవరన్నా డబ్బులిచ్చి దేన్నయినా కొనుక్కోవటానికి వస్తే ”ఒరేయ్‌ చిన్నోడా మానిక తీసుకురారా” అంటూ వెంకటేశ్వర్లు కేకేసి పిలిచేవాడు. అంటే కొట్టుకు సంబంధించి రెండో గదిలో అప్పుడు ఉంది పెద్దవాడయినా చిన్న మానికను తెమ్మని ఆయన అర్ధం. అదే వడ్లను తెస్తే ”ఒరేయ్‌ పెద్దోడా మానిక తీసుకురా” అని కేకేసేవాడు. అంటే పెద్ద మానికను తీసుకు రమ్మని అర్ధం. దీన్లో ఇంకో మతలబు ఉంది వడ్లు తెచ్చిన వినియోగదారుడికి మానికతోనే కొలవాల్సి వస్తే ఏమి చేసేవాళ్లో తెలుసా? తాలు పేరిట కిందకు చెరిగేసింది కాక, పెద్ద మానికతో కొలుచుకుని వాటిని దాచేందుని రెండో గదిలోకి తీసుకుపోయేవాళ్లు. వస్తూవస్తూ చిన్న మానికను తెచ్చేవాళ్లు. అవి రెండూ చూడటానికి ఒకే విధంగా ఉంటాయి కాబట్టి సాధారణంగా చూడగానే ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా అడిగే ధైర్యం ఉండేది కాదు. పొరబాటున అడిగారో వాళ్లతో వెంకటేశ్వర్లు తగాదా పడేవాడు. తన కొట్టుకు రావద్దంటూ బెదిరించేవాడు. దీంతో ఆ వినియోగదారుడే మెత్తబడేవాడు. అలా లాభాలు పండించేవాడు వెంకటేశ్వరు. నాకు తెలిసేనాటికే వాళ్లు మా దాయాది నుంచి రూపాయికో, అర్ధరూపాయికో అద్దెకు తీసుకున్న ఇంటిని కొనుగోలు చేసేశారు. మరొక స్ధలాన్నీ, మరో మట్టి గోడల పెంకుటింటినీ కొనుగోలు చేశాడు వెంకటేశ్వర్లు. కొత్త ఇంటిని కట్టేందుని ఓ రోజు ఆ మట్టి గోడల ఇంటిని పడగొట్టేపని పెట్టుకున్నారు. అంటే వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులే పనంతా చేసుకున్నారు లెండి. వాళ్లా పని చేస్తుండగా నేనూ చూశాను. ఓ వారానికల్లా ఆ ఇంటిని కూల్చటం పూర్తయింది. మట్టి గోడలకు సంబంధించి ఇక్కడ కొంత గుర్తు చేసుకుందాం. పేరుకు మట్టి గోడలేగానీ రాళ్లు కూడా అంతగట్టిగా ఉండేవి కావు. వాటిని పగలగొట్టటం అంటే సామాన్యమైన పనికాదు. ఆ పని పూటకు తవ్వెడు బువ్వ తినేవాడు చేయాల్సిందే అని పెద్దవాళ్లు అంటుంటే విన్నాను. పాటిమట్టిలో కరక్కాయలు, బెల్లం, కోడిగుడ్డనూ వేసి పదిపదిహేను రోజులపాటు పశువులతో తొక్కించి, ఆ తర్వాతే దాంతో గోడలు పెట్టేవాళ్లని చెప్పుకునేవాళ్లు. ఆ మట్టి ఒక్కసారి గట్టిపడిందంటే అంతే సంగతులు. దాన్ని పగలగొట్టటం అయ్యేపనికాదు. వెంకటేశ్వర్లు కుటుంబం ఆ ఇంటిని పూర్తిగా నిర్మూలించి పునాదుల్ని తొవ్వుతున్న రోజున ఊళ్లో ఓ పుకారు పుట్టింది. పునాదుల్లో వాళ్లకు ఓ రాగి పాత్ర దొరికిందనీ, దాంట్లో బంగారపు నాణాలు ఉన్నాయని ఊళ్లోవాళ్లు చెప్పుకున్నారు. వెంకటేశ్వర్లు చిన్న కొడుకు శ్రీనివాసరావు నా సహచర విద్యార్థే. ఆ విషయాన్ని అడిగితే ”రాగి చెంబుకాదు దొరికింది. మట్టి కుండ. దాంట్లో ఏమీ లేదు.” అన్నాడు. అలా చెప్పమని వాళ్ల నాన్నే పిల్లలందరికీ హితబోధ చేశాడని చెప్పుకున్నారు కూడా. సరే ఏమయితేనేం, ఆ కుటుంబం ఊళ్లో మరో రెండు బంగళాలను నిర్మించింది. వాటిల్లోనూ కొట్లు పెట్టారు. ఆ తర్వాత కాలంలో వెంకటేశ్వర్లు కుమారుల్లో ఒకడయిన వీరాస్వామి మా గ్రామానికి సమీపంలోని ఉప్పుగుండూరులో ఎరువుల దుకాణం పెట్టాడు. కోట్ల రూపాయల విలువయిన వ్యాపారం చేశాడు. చివరకు 1995లో తెల్లదోమ తెగులు సోకి పత్తి రైతులు నష్టపోయారు. ఆ కాలంలోనే జిల్లాలో 55 మంది పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంతర్జాతీయ స్ధాయికి చేరింది. ఏమి జరిగిందో బయటకు వెల్లడవలేదుగానీ, మొత్తం మీద వీరాస్వామి దివాలా తీశాడు. కోటి రూపాయలకు పైగా ఐపి పెట్టాడనుకున్నారు. మళ్లీ ఊళ్లోకి చేరి తిరిగి చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. సూదిలాగా వచ్చి దబ్బనమయ్యాడని సామెత. వెంకటేశ్వర్లు కుమారులంతా ఇప్పుడు లక్షాధికారులు. ఆయనా, ఆయన భార్య చనిపోయారు. ఐదుగురూ ఐదు చిల్లర కొట్లు పెట్టుకున్నారు ఇప్పుడు. పున్నయ్య కొట్టు సంగతులు మరో టపాలో రాస్తానేం.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

  1. రాచపూడి , ఈదుమూడి , నూజిల్లపల్లి , గోనశపూడి అన్నీ బలే ఉంటాయి ఆ ఊర్లపెర్లు 🙂

    స్పందించండి

  2. మీరు మీ టపా లో చెప్పిన ఉప్పు గుండూరురు నాకు తెలిసిందే .ఆ రైలు స్టేషన్ లో దిగి తూర్పు వైపుకి మూడు కిలోమీటర్లు కాలి బాటన పోతే మా తాతగారి వూరు పెద్ద గంజాం వస్తుంది.నేను చిన్న తనంలో పొలం మీది కౌలు డబ్బులకోసం వెళ్ళిన ఆ రోజులు మళ్ళి మధురంగా గుర్తుకొచ్చాయి kvsr గారూ !ఇంకా మీ ఈ టపా విషయానికి వస్తే మీరు చెప్పిన పెద్దవాడి చిన్న మానిక ,చిన్నవాడి పెద్ద మానిక కథ మా వేటపాలెం లో కూడా ప్రచారం లో వుంది. కాకపోతే మీ వెంకటే స్వర్లకు బదులు మా వూరిలో శేషయ్య ..పేరే తేడా ! ఏమయినా మీరు ఇలాంటి టపాలను రాయటం మాత్రం ఆపవద్దు. నిత్యం రాజకీయాలతో వేడి ఎక్కి పోయి వున్న బ్లాగ్ మధ్య మధ్య ఇలాంటి LV వల్ల చల్ల బడుతుంది అని నా అభిప్రాయం.అదీ కాక మీ చెయ్యి తిరిగిన సులభ శైలి వల్ల ఆ వాతావరణం అంతా ఒకసారి మళ్ళి నా బోటి వాళ్ళకు కళ్ళకు కట్టినట్లు వుంటుంది.ఇలాంటివి చాలా అయినతరువాత ఒక పుష్టకం లాగా అచ్చేసినా బాగుంటుంది కదా ౧.మొత్తానికి నేను మీ బ్లాగ్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాను ,కృతజ్ఞతలు.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: