Archive for నవంబర్ 16th, 2010

మట్టి మనుషులే… కానీ మానవత్వం పరిమళించే మంచి మనుషులు వాళ్లు


మేమెవరిమో వాళ్లకు తెలియదు. వాళ్లెవరో మాకు తెలియదు. పల్లెటూళ్ల మట్టిమనుషులు వాళ్లు. అయితేనేం, వాళ్లలో మానవత్వం నిండుగా పరిమళిస్తోంది.
ఇంట్లో జారిపడిన మా అమ్మకు, ఆమెకు తోడుగా ూన్న నాకు అడుగడుగునా సాయ మందించిన ఆ మహానుభావులకు తొలుత ధన్యవాదాలు చెప్పనీయండి.
12 నవంబరు 2010.
సాయంత్రం 5.30 గంటల వేళ.
మిత్రుల కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గనేందుకుగాను హైదరాబాదు నుంచి వెళ్లిన నేను మా గ్రామం ఈదుమూడిలో ఉన్నానా సమయంలో.
అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. గదిలో ఉన్న నాకు బయట నుంచి మా అమ్మ ”అమ్మో” అంటూ అరచిన అరుపు విన్పించింది. గబగబా బయటకు పరిగెత్తి చూద్దునుగదా. మా అమ్మ దండెం నుంచి ఆరిన బట్టల్ని తీస్తూ జారి కిందపడిపోయింది. ఆమెను లోపలికి తీసుకొచ్చి అమృతాంజనం రాసి, తడి గుడ్డ చుట్టాను. ఏమి జరిగిందో చెబుతుండగానే చేయి వాచిపోయింది. చేతిని కనీసం తాకేందుకు కూడా వీలు కానంతగా నెప్పి ఉన్నందున ఎముక చిట్లి ఉంటుందని నిర్ధారణకొచ్చాను. పైగా ముంజేయి మెలి తిరిగినట్లు కన్పిస్తోంది. అందువలన అది పెద్ద దెబ్బేనని భావించి ఒంగోలు ఆసుపత్రికి వెళ్తామని చెప్పి అమ్మను సిద్ధం చేస్తుండగానే ఆ విషయం తెలుసుకుని మా బంధువులు, దాయాదులు చేరుకున్నారు. వాళ్లందరి సాయంతో ఉప్పుగుండూరు వరకూ ఆటోలో చేరుకున్నాము. ఆటోలో పావుగంట సేపు మాతో ప్రయాణించిన మా ఊరి దళిత మహిళలు ఇద్దరు మా అమ్మ బాధను తమదన్నట్లుగా సాంత్వన పరిచారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఉప్పుగుండూరులో నొప్పి తగ్గించే మాత్రలు, నీళ్ల సీసా కొనుక్కుని ఒంగోలు బస్సెక్కాము. అంతే మా అమ్మ బాధనూ, చేతినీ చూసి ప్రయాణికులంతా ఎంతో సహకరించారు. వాస్తవానికి ముందే చెప్పినట్లుగా వాళ్లెవరూ మాకు తెలియదు. ముందు భాగంలో రెండు సీట్లు ఖాళీచేసి మాకిచ్చారు. ఎలా కూర్చోవాలో సలహా ఇచ్చారు. మా అమ్మ చీర కాళ్లకు అడ్డం పడకుండా ఓ గిరిజన మహిళ చొరవచేసి ఎంతగానో సాయం అందించింది. అంతేనా, ఒంగోలు చేరే వరకూ ఆమె మా అమ్మ చేతినే గమనిస్తూ కూర్చుంది. బిళ్లలు మింగేందుకూ, నీళ్లు తాగేందుకూ, చేతికి చుట్టిన రుమాలును తరచూ తడిపేందుకూ మా చుట్టూ కూర్చున్న వారంతా వారంతట వారే సాయం అందించారు. దెబ్బ తగలగానే గాజులు తీసి ూండాల్సిందని వైద్యశాఖ ఉద్యోగి ఒకరు సూచించారు. సీటుకు దగ్గరగా చెయ్యి పెట్టటం గమనించిన ఓ దంపతులు ఆందోళన పడుతూ, గతుకుల్లో బస్సు ఎగిరిపడి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని గుర్తుచేశారు. చివరకు ఆసుపత్రి సమీపంలో దిగేందుకు మహిళా కండక్టరు పెద్ద మనసుతో సహకరించారు. ఆసుపత్రికి చేరుతూనే మిత్రుడు మారెళ్ల సుబ్బారావుకు సమాచారం అందించగా మాజీ కౌన్సిలర్‌ మల్లికార్జునరావు, వీరరాఘవులు, ఎస్‌వి బ్రహ్మం, ఎమ్మెల్వీ ప్రసాద్‌, ఈలపాట అర్లయ్య, టి. భక్తసింగ్‌రాజు తదితరులంతా వచ్చి పరామర్శించారు. డాక్టర్‌ ఎం కృష్ఱారావు తన ఆసుపత్రిలో పనిని ఆవలబెట్టి వచ్చి చూసి వెళ్లారు. అంతేనా, అమ్మ తినేందుకు అర్ధరాత్రి వేళ బిస్కత్తులు అవసరపడగా ఆయనే స్వయంగా బస్టాండుకు వెళ్లి తెచ్చిచ్చారు. వాస్తవానికి తన సిబ్బందిలో ఎవరినయినా పంపి తెప్పించే వీలుంది. ఇక మారెళ్లయితే శస్త్రచికిత్స పూర్తయ్యేవరకూ నాతో ఉండటమే కాకుండా, భోజనం తీసుకురావటం, ఎప్పటికప్పుడు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడటం, ఇలా ప్రతి పనిలోనూ వెన్నంటి నిలిచాడు. రావినూతల (మీసాల) రామకృష్ణ తన గ్రామంలో ఉన్నా అక్కడి నుంచే డాక్టర్‌ మధుకిరణ్‌ రెడ్డి (ఎముకల వైద్యుడు)తో మాట్లాడి సహకరించారు. మా ఊళ్లో బంధువులు, బస్సులో ప్రయాణికులు, నా మిత్రులు ఇలా వీళ్లంతా మానవత్వం పరిమళిస్తోన్న మనుషులంటే అది ఎంతో చిన్నమాటే అన్పిస్తోంది నాకు. అయితే నాదగ్గర అంతకన్నా పదాలు లేవు, హృదయంలో నిండైన స్ధానం తప్ప.