Archive for నవంబర్ 20th, 2010

జల్లెడగారు తెలుగిల్లును జల్లించేశారు!

అవును జల్లెడగారు నా తెలుగిల్లును జల్లించేశారు. తిరిగి జల్లెట్లో వేయమని రెండుమూడు దఫాలు విజ్ఞప్తి చేయగా, చేయగా…. పొరబాటు జరిగిందంటూ మళ్లీ అనుసంధానం చేయమని కోరారు. సరే, అనుసంధానించి ఎదురు చూసి, ఎదురు చూసి మళ్లీ అడిగితే, మాకు తీరికే లేదు. కొద్ది రోజులు ఓపికపడితే మీ కోరిక నెరవేరుతుందంటూ రెండు వారాల క్రితమే హామీ ఇచ్చారు. అయితే మన నేతల హామీల మాదిరే జల్లెడగారూ వ్యవహరిస్తున్నారు. నేనెవరో వారికి తెలియదు కనుక నా మీద వ్యక్తిగత కక్ష ఉందనలేను. మరి కొందరివోలె నా రాతల మీద ఏమన్నా వ్యతిరేకత ఉందా? అంటే వారి సమాధానాల్లో ఆ తీరు కనిపించనేలేదు. మరి ఎందువలనో, తెలుగిల్లు మాత్రం జల్లెడ జల్లించిన తాలుతప్పలోనే ఇంకా మిగిలి ఉంటోంది. జల్లెట్లో మిగిలిన గట్టి గింజల సరసన తెలుగింటిని నిలపాలని జల్లెడగారికి నా చిట్టచివరి వినమ్రపూరిత విజ్ఞప్తి. అయినా సంపూర్ణంగా అది  జల్లెడగారి ఇష్టం. కనీసం తెలుగింటిని జల్లించిన కారణం చెబితే వీలయినదయితే దిద్దుకుంటాను. వీలుకాకుంటే విషయం అర్ధం చేసుకుని నోరు మూసుకుంటాను.

అబ్బబ్బో ఎడ్యూరప్పకు ఎన్నెన్ని కోణాలో… అన్నీ భూకుంభకోణాలే


ఆయన భూ దాహం తీరనిది
కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కుంభకోణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కుమారుడు, కుమార్తె తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వానికి అప్పగించి ఒక రోజు గడిచిందో లేదో తాజాగా షిమోగా జిల్లాలో ఈ కుటుంబానికి చెందిన మరో రెండు కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. స్వామి వివేకానంద పేరిటో విద్యా సంస్థను ఎడ్యూరప్ప సొంత ఊరు షికారిపుర్‌లో తొలుత ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇది 30 ఎకరాలకు వ్యాపించింది. ఈ కాలేజీని ఆనుకుని 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును ఎడ్యూరప్ప కలిపేసుకున్నారు. ప్రజలు వినియోగించుకునే చెరువును ఎడ్యూరప్ప విద్యా సంస్థకు ప్రభుత్వం 99 సంవత్సరాలకు అద్దెకు ఇచ్చింది. షిమోగా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎం కుమారుడు బివై రాఘవేంద్రే ఈ విద్యా సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ విద్యా సంస్థకు సమీపానే స్థలం ూన్న రేవంకర్‌ కుటుంబసభ్యులు రాఘవేంద్ర భూ ఆక్రమణకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ దాదాపు 97 రోజుల పాటు తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా కూడా నిర్వహించారు. అయితే వారిని పోలీసులు బలవంతంగా వెళ్ళగొట్టిందికాక, వారిపైనే కేసు కూడా నమోదు చేశారు. ఇదే జిల్లాలో ఎడ్యూరప్ప కుటుంబ సభ్యులు నడుపుతున్న పెసిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు సమీపంలోనే షిమోగా పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) 17.1 ఎకరాల భూమిని పేదల ఇళ్ళ స్థలాల కోసం కేటాయించింది. అయితే అంతలోనే దానిని వాణిజ్య అవసరాల కోసం వినియోగించాలంటూ మార్చివేశారు. రాఘవేంద్ర త్వరలో ఇక్కడ ఓ నక్షత్రాల హోటల్‌ నిర్మాణం చేపట్టబోతున్నాడు. అంటే పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి వాణిజ్య అవసరాల కోసం మార్పిడి వెనుక ఎవరి ఒత్తళ్లు పనిచేశాయో వేరే చెప్పాల్సిన పనేముంది.