”మోసపు మాటలు అరిసెలకన్నా తీపి. వాటి తాట తీసి నిజమేందో ముందే తెలుసుకోలేకపోతే నిండా మునగటం ఖాయమబ్బాయి” అంటూ మా నాయనమ్మ తరచూ హెచ్చరిస్తుండేది.
అన్నట్లు 21 నవంబరు 2010నాటి ఆంధ్రప్రభ ఆదివారం ప్రత్యేక సంచికలో సగటు మనిషి స్వగతం శీర్షికన ప్రచురితమయిన కస్తూరి మురళీకృష్ణ రచన సొమ్మొకడిది – సోకొకడిది… చదివితే మా నాయనమ్మ హెచ్చరికలు ఘంటానాదం చేశాయి.
విదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా సితార్ విద్యాంసుడు రవిశంకర్‌కన్న, గాయని లతామంగేష్కర్‌కు అధిక ఆదాయం పొందటాన్నీ, కష్టపడి పనిచేసే రైతులకన్నా పెట్టుబడి పెట్టే వ్యాపారులకు అధిక లాభాలు చేకూరుతున్న వైనాన్నీ కస్తూరి తెలివిగా ముడిపెట్టి రాసేశారు. ఎందుకో తెలుసా? ఏముందండీ, తక్కువ ఆదాయం రావటం లోక సహజం, కాబట్టి రైతులూ మీరు బాధపడొద్దు. ప్రశ్నించవద్దు. నోరెత్తవద్దు. ఉద్యమించవద్దు అని పరోక్షంగా నూరిపోసేందుకుగాక మరెందుకు?
తాను నూరిపోయదలచుకున్న పాత చింతకాయ పచ్చడిని తీపి తీపి లడ్డూల మాదిరిగా ఎలా రాసేశారో ఒక్కసారి పరిశీలించండి మీరే. ”సొమ్మొకడిది-సోకొకడిది అని మనవాళ్లు అంటారుగానీ …. సొమ్మెవడిదో – సోకూ వాడిదే నిజమని అన్పిస్తుంది.” అంటూ అదే నిజమన్నట్లుగా తేల్చేశారు. అంటే ఆ నిజాన్ని జీర్ణం చేసుకోవటం తప్ప దాన్ని మార్చేందుకు పూనుకోవటం వ్యర్ధమని చెప్పటమన్నమాట.
ఏదీ సృజించకున్నా, పెట్టుబడి పెట్టినవాడిదే ఫలితం కదా! అంటూ ఒప్పించే ప్రయత్నాన్ని రచయిత తెలివిగా చేసేశారు.
ఈ కస్తూరివారి కంపు ఇంకా బాగా అర్ధం కావాలంటే ఈ చివరి మాటలు చదివితే సరి.
”అందుకే సృజనాత్మకత ఉన్నవారికి పెట్టుబడి ఉండదు. పెట్టుబడి ఉన్నవారు సృజించలేరు. అందుకేనేమో మన పూర్వీకులు లక్ష్మీ, సరస్వతి అని రెండు వేర్వేరు దేవతలను గుర్తించారు. ఒకరున్నచోట ఇంకొకరుండరని తీర్మానించారు. సరస్వతి కన్నా ఎక్కువ పూజలు లక్ష్మికే అందించారు.”
అర్ధమవలేదూ? మాటల తీపి వెనుక మోసమేమిటో? కస్తూరి రాతల ప్రకారం చూస్తే ఆయన రచనలకు ప్రతిఫలం ఇవ్వాల్సిన పనేలేదంటే ఒప్పుకుంటారా? అది సహజమని నోరుమూసుకుని రాస్తూనే ఉంటారా? అయితే ఈ సూత్రాలు ఎదుటివారికోసమే తప్ప తనకోసం కాదుగదా? అందుకని ఒప్పుకోరుగాక ఒప్పుకోరు. మీదపడి పీకి వసూలు చేసుకుంటారు. పైగా ఈయనగారి తీపితీపి కూతలకు పూర్వీకుల సాక్ష్యం. లక్ష్మీ, పార్వతులు ఒకచోట ఉండరని తీర్మానం. నమ్మమని బొ0కులు. కష్టపడేవారికి సొమ్మురాకపోవటం సహజాతి సహజం అన్నట్లు నమ్మించే ప్రయత్నం.
మరి రతన్‌టాటా, బిర్లా, అంబానీ, గోద్రెజ్ ఇలా పరికిస్తే దేశంలోనూ, రాష్ట్రంలోనూ డబ్బున్నోళ్లందరినీ అటు సరస్వతి, ఇటు లక్ష్మి ఎలా పెనవేసుకుని ఉండాయో? కస్తూరి చెప్పాలి.
అయితే పాపం కస్తూరి రాతలన్నీ ఉన్న దానిని ఉన్నట్లుగానే ఉంచటానికే. కష్టపడేవాడు నష్టపడటం ప్రకృతి సహజమని చెప్పేందుకే. పెద్దలూ, దేవుడూ, పురాణాలు అదే చెబుతున్నాయని నమ్మించేందుకే. పెట్టుబడిదారుడే లక్ష్మీపుత్రుడవటం సహజమని బోధించటానికే.
పైగా ఇవన్నీ సామాన్యుడి స్వగతాలట….హా హా హా హా హ హ హ హ