Archive for నవంబర్ 22nd, 2010

కళ్యాణం … కమనీయం, కాదు కాదు – వ్యాపారమయం

”చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్రుర్రు” అంటారు శ్రీరంగంవారు ఆకలిరాజ్యం చిత్రరాజంలోని ”సాపాటు ఎటూ లేదు, పాటయినా పాడు బ్రదర్‌” అన్న గీతంలో.
చావు కర్మలు పెళ్లికళబట్టాయని కాబోలు ఇప్పుడు వివాహవేడుకలు కన్నుగానకుండా మిన్నంటాయి. 1990 నాటి వివాహవేడుకలతో నేటి వ్యవహారాల్ని పోల్చటం సాధ్యమేకానంతగా మారిపోయాయంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ముంబయికి చెందిన జీవరాజ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి దిలీప్‌ తన కుమార్తె వివాహాన్ని మారిషస్‌లో నిర్వహించాలని నిర్ణయించాడట. నవంబరు 26 నుంచి 29వ తేదీ వరకూ జరిగే పెళ్లికి రూ. 15 కోట్లు కేటాయించారు. మారిషస్‌ తీర ప్రాంతంలోని మూడు ఐదు నక్షత్రాల హోటళ్లను బంధు మిత్రుల బస కోసం అద్దెకు తీసుకున్నారు. ఆహ్వానితులను మారిషస్‌ చేర్చేందుకు మూడు విమానాలను కూడా ఈ పారిశ్రామికవేత్త తీసుకున్నారు. ఇంకేముంది దిలీప్‌ కుమార్తె వివాహం అంగరంగ వైభోగమే. అయితే సమస్యల్లా ఆయన పరిశ్రమలో పనిచేసే కార్మికులు మాత్రం రూపాయి జీతం పెరగాలన్నా నెలల తరబడీ ఆందోళన చేయక తప్పదన్నది వేరే విషయం అనుకోండి.
ఒకనాడు ఐదు రోజుల పెళ్లిళ్లు జరిగేవని విని హబ్బో అనుకున్నాం. ఇప్పుడు ఐదు రోజులకు బదులు రెండుసార్లు పెళ్లి చేసుకోవటం పరిపాటయింది. రెండుసార్లు పెళ్లేమిటని అనుకుంటున్నారా? అదేనండీ, ఎంగేజిమెంటు. ఈ వ్యవహారం గతంలోనూ ఉండేది. అయితే గుట్టుగా, అటిద్దరూ, ఇటిద్దరూ కూర్చుని పూర్తి చేసేవాళ్లు. ఇప్పుడో పెళ్లికి ఏ మాత్రం తీసిపోకుండా నిర్వహించకపోతే తమలపాకులోడి మొదలు క్యాటరింగోడిదాకా ఊరుకోరుగాక ఊరుకోరు. ఒట్టిస్తరి ఎగిరెగిరి పడుద్ది, వడ్డించిన విస్తరి అణిగిమణిగి ఉంటదని పెద్దలంటారుగానీ, పెళ్లి వ్యవహారంలో మాత్రం పులిని జూసి నక్క వాతబెట్టుకున్న చందమే అయిపోయింది. పేద్దోడు ఉన్నదాన్ని వడ్డిస్తే, పేదోడు అప్పుజేసి మరీ పప్పుకూడు పెడుతున్నారు.
మండపంలో జరిగితేనే కళ్యాణం
గతంలో ఇంట్లో పెళ్లి చేసుకుంటే శుభమంటూ పట్టుబట్టేవారు. ఇప్పుడు పాతికవేలన్నా అద్దె చెల్లించి మరీ కళ్యాణమండపాల్లో కళ్యాణాలు చేసేసుకుంటున్నారు. ఇక శుభలేఖల సంగతికొస్తే గత దశాబ్దంలో రూపాయి పెడితే గొప్పగా అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు చాటడంత కార్డుల్ని వందల రూపాయలు పోసి మరీ పంచిపెడుతున్నారు. ఆహ్వానాల తీరూ ఇప్పుడు మారిపోయింది. తెలిసివారికి ఇచ్చే సమయంలో పక్కనున్న ముక్కూమొహమూ తెలియని వారిని కూడా ఆహ్వానిస్తోంది కాక, పెళ్లికి రాకపోతే ఛస్తానన్నట్లుగా వారిని ఒత్తిడి చేయటం రివాజయింది.

ఇరవై ఏళ్ల క్రితం ఒంగోలు బస్డాండు సెంటర్లోని సాగర్‌ హోటల్‌ యజమాని శరత్‌బాబు పెళ్లి చైన్నయిలోని విజయగార్డెన్స్‌లో జరిగింది. దానికి రోజుకు లక్ష రూపాయలు అద్దె అని విని నోరెళ్లబెట్టాము మిత్రులమంతా. దాని పక్కనే విజయావాళ్లదే మరొక కళ్యాణమండపానికి రోజుకు రెండు లక్షల రూపాయలని చెప్పారు. ఇప్పుడెంత ూందో మరి?
ఎక్కడయినా అమేరికానేగానీ ఇక్కడ మాత్రం కాదు
అమేరికా అంటూ ప్రతిదానికీ ఆ దేశాన్ని అనుకరించే జనం కూడా పెళ్లి విషయంలో మాత్రం ఆ… అమెరికాలో జరిగేవి పెళ్లిళ్లా? పాడా! అంటూ మెటికలు విరవటం కద్దు. అమెరికా, రష్యా తదితర దేశాల్లో పెళ్లిళ్లకు హాజరయ్యే బంధుమిత్రులంతా కలిసి పాతిక, ముప్పైమందికి మించరట.
అయినా నిన్నటి పెళ్లిళ్లు కలివిడితనానికి ఉపయోగపడేవి. బంధుమిత్రుల కలయికకు ఉపయోగపడేవి. సహకారం వెల్లివిరిసేది. కనీసం 50, 60 మంది కలిసి పనిచేస్తేనే విందు భోజనాలను తయారు చేసేవాళ్లు.
మా ఊళ్లో నేను చిన్నప్పుడు పెళ్లి జరుగుతుంటే పాడి ఉన్నవాళ్లంతా పాలు, పెరుగు, నెయ్యి ఇచ్చేవాళ్లు. అందరూ కలిసి వండివార్చేవాళ్లు. భోజనానికి ఎవరికి వాళ్లే మంచినీళ్లను కూడా తీసుకుపోయేవాళ్లు. పరిమితంగా తయారు చేసి అపరమితంగా తినేవాళ్లు.
ఇప్పుడంతా భిన్నం. పనులన్నీ కాంట్రాక్టరుకు అప్పగించి సమయానికి చేతులూపుకుంటూ మండపానికి వెళ్లే సరిపోతుంది. అయితే దీనికంతా తడిసి మోపెడవుతుందనుకోండి. తీసుకున్న కట్నం సొమ్మునంతా పటాటోపంగా ఖర్చు చేసి రెండో రోజు నుంచీ మళ్లీ మళ్లీ తెమ్మంటూ కాపురంలో నిప్పులు పోసుకోవటం ఎందుకో నా బోంట్లకు అర్ధమే కాదు.
ఆహ్వానితులేమో అలా చేతులూపుకుంటూ వచ్చి ఇలా భోజనం చేసేస్తే అంతా అయిపోయినట్లే. చెమటలు కక్కుతూ వచ్చి, చేతులు తడారక ముందే పరుగులు పెట్టటం ఎందుకోసం? ఎవరికోసం? అంతా మొక్కుబడి తంతు.
నెల్లూరు జిల్లాలో పెళ్లిళ్ల నిర్వహణ కొంత భిన్నంగా సాగుతోంది. పెళ్లికి ఉదయం ముహూర్తమే పెట్టిస్తారు. ఆహ్వానితులకు ఉపాహారంతో సరి. దగ్గరి బంధువులకు మాత్రమే భోజనాలు. భోజనాల ఖర్చు, విద్యుదలంకరణ వ్యయం వరకూ లెక్కలు వేసినా మధ్యతరగతి కుటుంబాల్లోనే కనీసం రెండు లక్షల రూపాయలన్నా మిగిలినట్లే. ఇక కమ్యూనిస్టు కుటుంబాల్లో పెళ్లిళ్ల కయితే పూలదండలు, మిఠాయి పొట్లాల ఖర్చు తప్ప ఇంకేమీ ఉండకపోవటం మరో విశేషం.
”చెయ్యి తడారక ముందే భోజనం ఎవరు పెట్టారో కూడా గుర్తు పెట్టుకోని వాళ్లందరికీ పెళ్లి పేరిట ఉన్న నాలుగు కాసులతో పంచభక్షపరమాన్నాలు వడ్డించటం అవసరమా నాన్నా?” అంటూ ఓ తెలుగు సినిమాలో కథానాయకుడు వేసిన ప్రశ్న ఎందరిని ఆలోచింపజేసిందో తెలియదుగానీ, ఇప్పటికయినా ఆచరించాల్సిన సమయం దాపురించిందని చెప్పక తప్పదు.