కర్నాటక ముఖ్యమంత్రిగా ఎడ్యూరప్పను కొనసాగించేందుకు భాజపా అధిష్టానం పచ్చజెండా ఊపడంతో ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి గాలి జనార్ధనరెడ్డి, ఆయన సోదరులూ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య ఎడ్యూరప్పకు భాజపా అధిష్టానం దాసోహమవటంతో అసంతృప్తి వ్యక్తచేస్తున్న గాలి వర్గం నేతలు భవిష్యత్తు కార్యాచరణపై తలమునకలవుతున్నారు. ఈ మేరకు గాలి ముఠా నాయకులంతా ఏమి చేయాలన్నదానిపై ఇప్పటికే చర్చలు జరిపారు. ఎడ్యూరప్పను ఎలాగైనా గద్దె నుంచి దించేందుకు వారంలోగా మరోమారు సమావేశమై వ్యూహరచన చేయాలని నిర్ణయించారు. ఎడ్యూరప్పతో లబ్ధిపొందిన భాజపా అగ్రనేతలు కొందరు ఆయనకు వత్తాసు పలికారని ఆరోపిస్తున్నారు. ధన బలాన్ని వినియోగించి రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోర్ ఎడ్యూరప్ప పదవిని కాపాడాడని దుయ్యబట్టారు. లింగాయత వర్గానికి చెందిన ఎడ్యూరప్ప గద్దెను కాపాడుకునేందుకు కులం కార్డు ప్రయోగించారని కూడా ఆరోపించారు. లింగాయత మఠం స్వామిజీ వీధుల్లోకి వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటించడమే అందుకు నిదర్శనమని వివరించారు. ఈ తీరు ముందు ముందు భాజపాకు నష్ట కల్గిస్తుందని వాపోయారు. ఈ విషయంలో భాజపా రాష్ట్ర విభాగం కూడా అంత సంతోషంగా లేకపోవటం విశేషం. ఎడ్యూరప్పకు లింగాయత మఠం స్వామిజీ మద్దతు ప్రకటించడంపై గాలి జనార్ధన రెడ్డి ఇదివరకే బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రతిపక్ష జెడిఎస్, కాంగ్రెసు పార్టీలు సైతం భవిష్యత్తు కార్యచరణపై దృష్టి సారించాయి. ఎడ్యూరప్పకు వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణ రూపొందించేందుకు ఆ పార్టీల శాసనసభ్యులతోనూ, పార్లమెంటు సభ్యులతోనూ త్వరలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. కాగా లింగాయత కులం కార్డు ఎడ్యూరప్పను రక్షించిన నేపథ్యంలో ఆ సామాజిక తరగతిని తాము పట్టించుకోక పోవటాన్ని కాంగ్రెసు పార్టీ నేతలు ఇప్పటికి గుర్తించారు. లింగాయతులయిన ఎంపీ ప్రకాశ్, షమనూర్ శివశంకరప్ప, అల్లం వీరభద్రప్ప సమావేశమై ఈ అంశంపై చర్చలు జరిపారు. వీలైనంత త్వరలో సోనియా గాంధీని కలిసి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇవేవీ పట్టని ఎడ్యూరప్ప రాష్ట్రాన్ని ఇక భిన్నమైన రీతిలో పాలిస్తానంటూ కొత్త ఆలాపన అందుకున్నారు.
25 నవం