Archive for నవంబర్ 27th, 2010

వైఎస్‌ (అ)వివేకానంద జగన్నాటకం


వైఎస్‌ వివేకానందరెడ్డి హస్తినాపురంలో ఆడుతోన్న జగన్నాటకం ఒకవైపు నవ్వులు పూయిస్తోంది. మరోవైపు ”ఔరా, కాంగ్రెసు నాయకులెంతకయినా తగుదురే!” అని కోపం తెప్పిస్తోంది.
ఆయన శుక్రవారంనాడు హస్తినకు చేరాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తమ్ముడు, జగన్మోహనరెడ్డికి చిన్నాన్న కావటంతో ఆయన పట్ల మీడియాకు ఆసక్తి ఉండటం సహజం.
ఢిల్లీకి ఎందుకొచ్చారంటూ విలేకరులు ఆయన ముందు గొట్టాలు పెట్టారు.
”ఏందోనమ్మా, ప్రాపబుల్స్‌లో నా పేరుందని టీవీలో స్క్రోలింగు వస్తుంటే చూసి, ప్రయత్నిద్దామని వచ్చాను.” అయన మాటలు కచ్చితంగా ఇవే కాకపోయినా, ఈ అర్ధంతో అమాయకుడి మాదిరిగా మాట్లాడాడు. ఇది శుక్రవారం నాటి సంగతి.
శనివారంనాడు పొంతనలేని ప్రకటనలు చేయటం మరో విశేషం. అధిష్టానంతో ఆయన నాటకం మరీ విచిత్రం.
సోనియాగాంధీ పెద్ద మనసుతో జగన్మోహన్‌రెడ్డిని క్షమించాలని మీడియాతో వ్యాఖ్య.
మంత్రి పదవి కట్టబెడితే జగన్మోహన్‌రెడ్డితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటానని సోనియా రాజకీయ సలహాదారు ఆహ్మద్‌పటేల్‌తో అన్నాడని విశ్వశనీయ వార్త.
వచ్చే నెలలో తానూ, జగన్మోహనరెడ్డి సోనియాను కలిసి చిన్న తప్పులేమయినా జరిగి ఉంటే క్షమించమని కోరతామని ప్రకటన.
ఆ విషయాన్ని జగన్మోహనరెడ్డితో మాట్లాడారా? అంటే లేదని వివరణ.
పైగా ”జగన్మోహనరెడ్డి ఏమి తప్పు చేశాడని సోనియాకు క్షమాపణ చెప్పాలి?” అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం మరో అంకం. వైఎస్‌ కుటుంబంలో చిచ్చుపెట్టేందుకే వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఆశపెడుతున్న పెద్దమనుషుల వలలో పడొద్దని ఆయన సూచించారు.
‘తప్పులు చేయడం మానవ సహజం. వాటిని క్షమించడం దైవత్వం. దాసుడి తప్పులు దండంతో సరి..అన్నట్లు…మేము (జగన్‌) చేసిన తప్పులను సోనియా క్షమించాలి. త్వరలోనే జగన్మోహనరెడ్డిని తీసుకుని మరోసారి ఢిల్లీ వస్తాను. సోనియాను కలుస్తాను. వారిద్దరి మధ్యా ఏర్పడ్డ అగాధాన్ని పూడ్చటం కోసమే నేను కృషి చేస్తున్నాను. జగన్మోహనరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకీ అవసరం’ అంటూ వివేకానంద విలేకరుతో వ్యాఖ్యానించారు. జగన్మోహరెడ్డి శిబిరంపై దాడి చేయడానికే కాంగ్రెసు మీకు మంత్రి పదవి ఆశచూపుతుందన్న విమర్శలున్నాయి కదా అని ప్రస్తావించగా’ మీకు ఇష్టం లేకపోతే పదవి తీసుకోనులే’ అని సమాధానమిచ్చారు.
ఇదో విచిత్రం
సాక్షిలో వచ్చిన కథనాలపై మీ స్పందనేమిటి అని ప్రశ్నించగా ”ఆ కథనాలు నేను చూడలేదు” అని జవాబిచ్చారు. జాతీయ మీడియా ప్రతినిధులు వేరొక సమయంలో ఇదే ప్రశ్నను అడిగినప్పుడు..”సాక్షిలో వచ్చిన కథనాలు కాంగ్రెసు కార్తకర్తల మనోభావాలను దెబ్బతీశాయి” అని ఆయన చెప్పటం గమనార్హం.
పటేల్‌, జైపాల్‌తో భేటీ
సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో వివేకానంద రెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. సాక్షిలో వచ్చిన కథనాలతో తాను కలత చెందానని ఆయన వారికి వివరించినట్లు సమాచారం. మంత్రి పదవిని ఇస్తే, కడప జిల్లాలో కాగ్రెసు పార్టీ ప్రయోజనాలను కాపాడతానని పేర్కొన్నట్లు తెలిసింది. జగన్మోహనరెడ్డితో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి కూడా తాను సిద్ధమని వివేకానందరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.