Archive for నవంబర్ 28th, 2010

పాజిటివ్‌ పెళ్ళిళ్ళు

పెద్దలు కుదిర్చిన పెళ్లి, ప్రేమ పెళ్లి, రిజిస్టర్‌ మ్యారేజీ…ఇలా పెళ్లిళ్లలో రకరకాలున్నాయి. ఒకవేళ మనకు నచ్చిన అమ్మాయో, అబ్బాయో దొరక్కపోతే వెదికిపెట్టడానికి ఇప్పుడు మ్యారేజ్‌ బ్యూరోలు కూడా వెలిశాయి. వివిధ కులాలకు చెందిన మ్యారేజ్‌ బ్యూరోల గురించో లేదా మతాలకు చెందిన మ్యారేజ్‌ బ్యూరోల గురించో మనం ఇప్పటి వరకు వినిఉంటాం. కానీ హెచ్‌ఐవి మ్యారేజ్‌ బ్యూరో గురించి విన్నారా? అసలీ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మార్యేజ్‌ బ్యూరో ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ మ్యారేజ్‌ బ్యూరో, దాని కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం రండి…..

హైదరాబాద్‌ నుండి విజయవాడ వెళ్లే రహదారిలో దిల్‌సుఖ్‌నగర్‌ దాటగానే కొత్తపేట పండ్ల మార్కెట్‌ ఉంది. అక్కడి నుండి కుడివైపుకు తిరిగితే సరూర్‌నగర్‌ హుడా కాంప్లెక్స్‌ వస్తుంది. ఆ కాంప్లెక్స్‌ పరిధిలో ఉన్న పార్కు సమీపాన ఇద్దరు మనుషులు పట్టే ఒక చిన్న గది. అందులో రెండు కుర్చీలు…ఒక చిన్న బల్ల. ఎర్ర రంగుతో ఉన్న ఆ గది లోపల, వెలుపల గోడలనిండా హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధిని ఎలా నివారించాలి? వ్యాధి సోకిన వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? వ్యాధిగ్రస్థులకు మనం ఎలాంటి మనోధైర్యాన్ని కల్పించాలి? అనే సూచనలు, సలహాలతో కూడిన వ్యాఖ్యలు రాసి ఉన్నాయి. ఆ గదిలోని ఓ కుర్చీలో కూర్చుని వచ్చిపోయే వారిని ఓ వ్యక్తి చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. ఆయనే శ్రీనివాస హనుమత్‌ ప్రసాద్‌. ఈయనే పైన చెప్పిన హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మార్యేజ్‌ బ్యూరోకి రూపశిల్పి. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థులకు వివాహాలు జరిపించే ‘పాజిటివ్‌ పెళ్లిళ్ల పేరయ్య’. ఈ మ్యారేజ్‌ బ్యూరోతోపాటు హైదరాబాద్‌ నగరంలోని నాగోల్‌లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థుల కోసం ఒక ‘ప్రత్యేక’ హాస్టల్‌ను సైతం నిర్వహిస్తూ వారికి తన వంతు చేయూతనిస్తున్నారు.

మాకూ తోడు కావాలి!

శ్రీనివాస హనుమత్‌ ప్రసాద్‌ స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆ పట్టణంలోని బరంపేటలో తన చుట్టూ ఉన్న వారిలోనే 10 మంది ఎయిడ్స్‌ వ్యాధితో మరణించటం ఆయనను కలచివేసింది. దీంతో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు ఏదో చేయాలన్న బలమైన భావన, తపన ఆయన్ను వెంటాడింది. సొంత ఊళ్లో ఓ కళాశాల నడుపుకునే ఆయన ఈ ఆలోచన వచ్చిందే తడవుగా స్వస్థలాన్ని వదిలేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. హెచ్‌ఐవి పాజిటివ్‌ నెట్‌వర్క్‌ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లో 5 సంవత్సరాలపాటు పనిచేశారు. విధుల్లో భాగంగా ఎయిడ్స్‌ వ్యాధి వ్యాపించే విధానం, వ్యాధి లక్షణాలు, నివారణా మార్గాలు, వ్యాధిగ్రస్థులు తీసుకోవాల్సిన ఆహారం తదితర విషయాలపై విస్తృత ప్రచారం చేశారు. అదే క్రమంలో ఆయన ఎంతోమంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులను స్వయంగా కలుసుకున్నారు. వారి జీవన పరిస్థితుల్ని పరిశీలించారు. సాధక బాధకాలను, కష్టనష్టాలను విని చలించిపోయారు. ముఖ్యంగా చుట్టూ ఉన్న సమాజం వారిని తోటి మనుషులుగా గుర్తించకపోవటం ప్రసాద్‌ను కలిచివేసింది. ఎన్జీవోలో పనిచేసే సందర్భంలోనే ఎంతోమంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు ఒక తోడును (జీవిత భాగస్వామిని) కోరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించారు. ‘మేమూ మనుషులమే..ఆనందం, విషాదం పంచుకోడానికి మాకూ ఒక తోడు కావాలి’ అనే వారి ఆవేదనను ప్రసాద్‌ మంచి మనసుతో అర్ధంచేసుకొన్నారు. అదే క్షణంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు ఒక మ్యారేజ్‌ బ్యూరోని నెలకొల్పాలని సంకల్పించారు. అనుకోవటమే కాదు..2008 మేలో మ్యారేజ్‌ బ్యూరోని ఏర్పాటుచేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 83 హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ సోకిన జంటలకు పెళ్లిళ్లు చేసి వారికి తోడు, నీడను కల్పించారు.

ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు…నానాటికీ క్షీణిస్తున్న ఆరోగ్యం, చిన్నచూపు చూస్తున్న సమాజం, వివిధ ఆలోచనలతో కుంచించుకుపోతున్న మస్తిష్కం….నిజ జీవితంలో వారు అనుభవించే బాధలు, గాథలివి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న వ్యక్తులకే సరిజోడును వెదకటం పెద్దపని. అలాంటిది హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధి సోకిన వ్యక్తికి అదే వ్యాధి సోకిన వారిని వెదికి పెళ్లి చేయటం కత్తిమీద సాములాంటిదే. ‘ఎన్నో మ్యారేజ్‌ బ్యూరోల గురించి విన్నాం, చూశాం. కానీ ఈ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మ్యారేజ్‌ బ్యూరో ఏంట్రా? బాబూ’ అంటూ స్నేహితులు, బంధువులు, తెలసినవాళ్లు, చుట్టూ ఉన్న సమాజం ‘ఎగతాళి’ చేసింది. వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులను ‘తాళి’ బంధంతో ఒకటి చేస్తున్న ప్రసాద్‌ తాను చేస్తున్న ఈ పని ద్వారా ఎంతో సంతృప్తిని పొందుతున్నానంటున్నారు.

విస్తృత ప్రచారం

ఏదైనా ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయాలంటే దానికి ముందు ప్రచారం నిర్వహించాలి. ప్రసాద్‌కు తాను నిర్వహించాలనుకున్న హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మ్యారేజ్‌ బ్యూరో గురించి ఎలా ప్రచారం చేయాలో మొదట్లో అర్థం కాలేదు. ఆ తర్వాత మెరుపులాంటి ఆలోచన తట్టింది. తమకు హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధి సోకిందనే అనుమానం వచ్చిన వారు వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాల్లోని ఎఆర్‌టి సెంటర్లకు వస్తారు. వ్యాధి సోకిన వారు కౌన్సిలింగ్‌, చికిత్స నిమిత్తం తమ దగ్గరలోని ఎ.ఆర్‌.టి సెంటర్లు లేదా ఏరియా ఆస్పత్రులకు వస్తారు. ఈ విషయాన్ని గమనించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎ.ఆర్‌.టి సెంటర్లు, ఏరియా ఆస్పత్రులను సందర్శించారు. ఆయా ఆస్పత్రుల గోడలపై తన మ్యారేజ్‌ బ్యూరో గురించిన అన్ని వివరాలను తెలిపే వాల్‌పోస్టర్లను పెద్దఎత్తున అంటించారు. ఇంతేకాకుండా అన్ని జిల్లాల్లో ప్రముఖమైన ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి, అక్కడి వైద్యులకు తాను చేపట్టబోయే కార్యక్రమాన్ని గురించి వివరించారు. ఆ ప్రయివేటు ఆస్పత్రుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. చికిత్స నిమిత్తం వచ్చే ఎయిడ్స్‌ రోగులకు హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మ్యారేజ్‌ బ్యూరో గురించి వివరించాల్సిందిగా ప్రయివేటు వైద్యులను అభ్యర్థించారు. ఇంతగా ప్రయత్నించినప్పటికీ మ్యారేజ్‌ బ్యూరోకు పెద్దగా స్పందన రాలేదు.

హెచ్‌ఐవి పాజిటివ్‌తో జీవించే వారు పెళ్లి కోసం తమ ఫోటోను మ్యారేజ్‌ బ్యూరోకు పంపిస్తే వేరే వారికెవరికైనా చూపిస్తారేమోననే సందేహం వ్యక్తం చేసేవారు. ప్రసాద్‌కు తమ ఫోటోను అప్పగిస్తే ఆయన తమ గురించి, తమకు సోకిన వ్యాధి గురించి నలుగురికి చెబుతారేమోననే భయాందోళనలకు వారు గురయ్యేవారు. ఆ తర్వాత ఎ.ఆర్‌.టి సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, ప్రయివేటు డాక్టర్లు మ్యారేజ్‌ బ్యూరో గురించి పూర్తిగా వివరించటంతో పెళ్లి చేసుకోవాలనుకున్న వారి అనుమానాలు పటాపంచలయ్యాయి. మ్యారేజ్‌ బ్యూరోని సంప్రదించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది.

అర్హతలు… ఫీజులు…

‘హెచ్‌ఐవి సోకింది కాబట్టి…నేను హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మ్యారేజ్‌ బ్యూరోకి వెళ్తాను, నాకు పెళ్లి చేయండి’ అంటే ఒప్పుకోరు ప్రసాద్‌. తన మ్యారేజ్‌ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండి తీరాలంటారు. అవేంటంటే…

-హెచ్‌ఐవి పాజిటివ్‌ అని తెలియాలి. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తికి మాత్రమే ఈ విషయం తెలిస్తే సరిపోదు, ఆ వ్యక్తి తల్లిదండ్రులకు (తల్లిదండ్రులు లేకపోతే రక్త సంబంధీకులకు) కూడా తన కుమారుడు లేదా కుమార్తెకు హెచ్‌ఐవి సోకినట్లు తెలియాలి.

-పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి (అబ్బాయైనా, అమ్మాయైనా) తన ఆరోగ్యం, అవసరాలు తీర్చుకుంటూ/చూసుకుంటూ తనకు కాబోయే జీవిత భాగస్వామి అవసరాలను కూడా తీర్చగలిగే ఆర్థికస్థోమత కలిగి ఉండాలి.

-వ్యాధి సిడి 4-500 దశలో ఉండాలి.

-గుర్తింపు పొందిన వైద్యునితో ధృవీకరింపబడిన సిడి-4 రిపోర్టు, ఫోటో, నివాస ధృవీకరణ పత్రం, వ్యక్తిగత వివరాలు (బయోడేటా) విధిగా మ్యారేజ్‌ బ్యూరోకి సమర్పించాలి.

పైన చెప్పిన ఈ అర్హతలన్నీ ఉంటేనే మ్యారేజ్‌ బ్యూరోని సంప్రదించాలని ప్రసాద్‌ స్ట్రిక్టుగా చెబుతున్నారు.

ఏదైనా ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయాలంటే దానికితగ్గ ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాలి. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ప్రసాద్‌ మ్యారేజ్‌ బ్యూరోను ప్రారంభించారు. అయితే దాని నిర్వహణకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందుకే వివాహ నిమిత్తం తన దగ్గరకు వచ్చే హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థులకు వెయ్యి రూపాయల ఫీజు నిర్ణయించారు. ఫీజు రూపంలో వచ్చిన డబ్బును మ్యారేజ్‌ బ్యూరో నిర్వహణకు వినియోగిస్తున్నారు.

పోషకాహారాన్ని అందించే వసతిగృహం

మ్యారేజ్‌ బ్యూరోను నిర్వహించటం ద్వారానే తన పని పూర్తయిందనుకోలేదు ప్రసాద్‌. హైదరాబాద్‌ నగరంలో హెచ్‌ఐవి సోకిన వారెందరో ఉన్నారు. వీరిలో చాలామంది చిన్నస్థాయి నుండి పెద్దస్థాయి ఉద్యోగాల్లో ఏదో ఒకటి చేసుకుంటూ తమ కాళ్లమీద తాము నిలబడినవారూ ఉన్నారు. అయితే వీరంతా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల నిరాదరణకు గురై మానసికంగా కృంగిపోతున్నారనే విషయం ప్రసాద్‌ దృష్టికి వచ్చింది. వీరికీ ఒక ఆశ్రయాన్ని కల్పించి బాసటగా నిలవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. తన ఆలోచనకు వెంటనే కార్యరూపమిచ్చారు. సరూర్‌నగర్‌ హుడా కాంప్లెక్స్‌లో తన సొంత ప్లాట్‌లోనే ‘హెచ్‌ఐవి పాజిటివ్‌ వర్కింగ్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌’ హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ హాస్టల్‌ను నాగోల్‌కు మార్చారు. హాస్టల్‌లో చేరాలనుకున్న వారు నెలకు రూ.3 వేలు చెల్లించాలి. హాస్టల్‌లో చేరిన వారికి మంచి వసతితోపాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు. ప్రతి రోజు పాలు, రాగిజావ, మొలకలు, గుడ్లు, కాచి చల్లార్చిన నీరు, సీజనల్‌ ఫ్రూట్స్‌, ఆకుకూరలతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ హాస్టల్‌లో వంటవారు, వడ్డించేవారు, ఇతర పనిమనుషులు కూడా ‘హెచ్‌ఐవి పాజిటివ్‌’ వ్యక్తులే కావటం గమనార్హం. ఈ ముగ్గురు పనిమనుషులకు ఉచిత వసతితోపాటు నెలకు రూ.1500 వేతనమిస్తున్నారు.

కులం..ప్రాంతం…కట్నం…

శాస్త్ర సాంకేతికరంగాల్లో మనదేశం ఎంతో పురోగమిస్తున్నా కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు మనల్ని వదలటం లేదు. హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ సోకి జీవితంలో నిరాశకు గురయిన వారు కూడా వీటిని పట్టుకుని వేలాడటం విస్మయాన్ని కలిగిస్తోందని ప్రసాద్‌ చెబుతున్నారు. వివాహం కోసం తన మ్యారేజ్‌ బ్యూరోను సంప్రదించే హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తుల్లో (మగవారు) కొంతమంది…తమకు కూడా కట్నాలు, కానుకలు కావాలని అడుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని చెబుతున్నారు. మరికొంతమంది తమ కులం లేదా మతానికి చెందిన హెచ్‌ఐవి పాజిటివ్‌ అమ్మాయిని / అబ్బాయిని వెదికి పెట్టమని అడుగుతున్నారని వివరించారు. మరికొంతమంది ఒకడుగు ముందుకేసి తమకు తమ ప్రాంతానికే చెందిన అమ్మాయి/అబ్బాయి (ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ…ఇలా) కావాలని అడిగినప్పుడు వారిని చూసి తనకు జాలేస్తోందని చెబుతున్నారు. ఎందుకంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఈ వివరాలన్నీ అడగటం వేరే విషయం. కానీ భయంకరమైన వ్యాధి బారినపడి క్షణ క్షణం చస్తూ బతికే హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు కూడా కట్నాలు, కానుకలు, కులగోత్రాలు, ప్రాంతాల గురించి అడగటం విడ్డూరంకాక మరేమిటి? అసలు ఒక హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తికి పెళ్లి చేయటానికి మరో హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తి దొరకటమే కష్టం కదా? అయితే ఇలాంటి వారందరినీ కూర్చోబెట్టి ఓపిగ్గా వారందరికీ కౌన్సిలింగ్‌ నిర్వహించటం ద్వారా వారిలోని అపోహల్ని, అనుమానాల్ని పటాపంచలు చేస్తున్నారు ప్రసాద్‌. అయితే ఎంతో సహనంతో ఈ కౌన్సిలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుందని, ఎదుటి వ్యక్తి అడిగే అనేక ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన వివరిస్తున్నారు. అన్ని విషయాల్లో వారందరినీ ఈ విధంగా ఒప్పించిన తర్వాతే వివాహాలు జరిపిస్తున్నారు.

సంచార ప్రచార వాహనం

ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన, హెచ్‌ఐవి మ్యారేజ్‌బ్యూరో, హాస్టల్‌ అవి అందిస్తున్న సేవలను రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో డిసెంబరు 1 నుండి ఒక సంచార ప్రచార వాహనాన్ని ప్రారంభిస్తున్నానని ప్రసాద్‌ చెప్పారు. ఈ వాహనం ద్వారా అన్ని జిల్లాల్లోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, గ్రామ పెద్దలు, రాజకీయ నేతల్ని కలిసి తన సేవలపై ప్రచారం నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారు. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పట్టణారోగ్య కేంద్రాల వైద్యుల దగ్గరకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహిస్తానన్నారు.

ధైర్యంగా ముందుకెళ్తున్నా…

హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మ్యారేజీ బ్యూరోను ప్రారంభించినప్పటి దగ్గరి నుండి ఇప్పటి వరకు ప్రసాద్‌ అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే తనకెదురైన ఆటంకాలను, అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని హెచ్‌ఐవి పాజిటివ్‌ పెళ్లిళ్లను జరిపిస్తున్నాని, హాస్టల్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాని ఆనందంతో చెబుతున్నారాయన.

”మొదట్లో నా మ్యారేజ్‌ బ్యూరో గురించి అందరూ ఎగతాళిగా మాట్లాడారు. నన్ను, నేను చేస్తున్న పనులను అసహ్యించుకున్నారు. ముఖ్యంగా సమాజంలోని చాలామంది నాకు కూడా ఎయిడ్స్‌ ఉండటం వల్లే ఈ విధమైన కార్యక్రమాలను చేపడుతున్నానని అపోహ పడుతుంటారు. నిజానికి మా ఇంట్లో హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులెవరూ లేరు. ప్రస్తుతం నాగోల్‌లో నిర్వహిస్తున్న ‘హెచ్‌ఐవి పాజిటివ్‌ వర్కింగ్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌’ హాస్టల్‌ను మొదట్లో సరూర్‌నగర్‌ హుడా కాంప్లెక్స్‌లోని నా సొంత ప్లాట్‌లో ప్రారంభించా. అయితే మా అపార్టుమెంట్‌లోని వారు, చుట్టుపక్కల వారు ఈ హాస్టల్‌ను ఇక్కడి నుండి తొలగించాలంటూ నానా గొడవ చేశారు. హాస్టల్లో చేరే వారి వల్ల తమకు, తమ పిల్లలకు హెచ్‌ఐవి సంక్రమిస్తుందనేది వారి వాదన. దీనిపై నేను మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. ఈ వ్యాజ్యం కమిషన్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత చుట్టుపక్కల వారితో గొడవలు భరించలేక హాస్టల్‌ను నాగోల్‌కు మార్చా. మ్యారేజ్‌బ్యూరోతోపాటు హాస్టల్‌ను నిర్వహించేందుకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో నేను చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (ఎపిశాక్స్‌) ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించాను. ఆర్థికసాయం చేయాలని అర్థించాను. ఫలితం లేకపోయింది. దీంతో నాకు తెలిసిన స్నేహితులు, వైద్యులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకుల నుండి విరాళాలు సేకరించటం ద్వారా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నా. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిశా. నన్ను, నేను చేస్తున్న కార్యక్రమాలను సహృదయంతో అర్థం చేసుకున్న ఎంతోమంది ఇచ్చిన విరాళాలతో నా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నా. మ్యారేజ్‌బ్యూరో, హాస్టల్‌ నిర్వహణలో నా భార్య సహకారం మరువలేనిది. మంచి మనసుతో నన్ను అర్థం చేసుకున్న ఆమె నాకు అన్ని విధాలా సహకరిస్తుంది కాబట్టే నేను ఈ విధమైన సేవలు చేయగలుగుతున్నా”.

ప్రజాశక్తి కోసం రచన … బి.వి.యన్‌.పద్మరాజు


కేవీపీ ఔట్‌ !


వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావుకు ఎట్టకేలకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్‌ హయాంలో ‘అధికార కేంద్రం’గా ఆయన హావా సాగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏ ముఖ్య నిర్ణయమైనా ఆయన అనుమతితోనే జరిగేది. కాంట్రాక్టులు, బదిలీలు ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన మాట వేదవాక్కుగా అమలయ్యేది. వైఎస్‌ మరణానంతరం ఏర్పడ్డ రోశయ్య ప్రభుత్వంలోనూ ఆయన హావా కొనసాగింది. సలహాదార్లను తప్పించాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఇక రాష్ట్రంలో కెవిపి జమానా ముగిసినట్లే.

అయితే గియితే కేవీపీ ఇక యువ వైఎస్ కు సలహాదారుగా రూపాంతరం చెందవచ్చు. అంటే జగన్మోహనరెడ్డి వ్యవహారం ముదురు పాకాన పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆవేశపరుడికి అపర చాణక్యుడు జతపడితే నిప్పు ఉప్పు చందమే కదా.

2010… కుంభకోణాల నామ సంవత్సరం

2010 దేశంలో మిగతా అన్నింటికన్నా కుంభకోణాలు పైచేయి సాధించాయి. ఈ ఏడాది ఐదు భారీ కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి. అందులోనూ నాలుగు కుంభకోణాలు చివరి నాలుగు నెలల్లోనే వెలుగు చూశాయి. అవినీతిని నివారిస్తామనీ, పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామని పాలకులు చెప్తున్న మాటలు ఏ మాత్రమూ ప్రభావం చూపలేకపోతున్నాయి. అంతర్జాతీయ పారదర్శకత నివేదికలో భారత్‌ స్థానమే ఇందుకు నిదర్శనం. అవినీతిలో మనం 87వ స్థానంలో నిలవటమే పరిపాలనలో పారద్శకత ఏ పాటిదో తేటతెల్లం చేస్తోంది. వాషింగ్టన్‌కు చెందిన పరిశోధన సంస్థ గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటెగ్రిటీ ప్రకారం పలువురు సంపన్నులు, సంస్థలు పన్నుల ఎగవేత ద్వారా ఏడాదికి రూ.72,496 కోట్లను దేశం కోల్పోతోంది. అంతెందుకు ఢిల్లీకి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ అంచనా ప్రకారం 1983-84 సమయంలోనే దేశంలో రూ.36,786 కోట్ల నల్లధనం చెలామణి అయినట్లు అంచనా వేసింది.
మహా కుంభకోణాలు ఇవీ :
1. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌
2. కామన్వెల్త్‌ క్రీడలు
3. ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ
4. స్పెక్ట్రమ్‌ – 2జి కేటాయింపులు
5. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కుంభకోణం