Archive for నవంబర్ 29th, 2010

ఆరంగేట్రం నాడే ఆరాటం

ఉన్నత పదవుల కోసం ఆరంగేట్రం నాడే అతనిలో ఆరాటం ప్రారంభమయింది. లోక్‌సభలో అడుగుపెట్టాలన్న కోరికతో తన కక్క (చిన్నాన్న)తోనే కొట్లాటకు దిగాడన్న విమర్శల్నీ తొలిరోజుల్లోనే మూటగట్టుకున్నాడు. అంతలావున అతి కోరికలు వద్దని అధిష్టానం చీవాట్లు పెట్టగా చేసేది లేక అప్పటికి మౌనం పాటించాడన్న అపప్రధ సరేసరి. చివరకు తండ్రి చనిపోయినాది అధిష్టానంతో ఉప్పు-నిప్పు వ్యవహారం నిత్యకృత్యంగా సాగించటం అతని అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందన్న సూచనలకూ కనీసంగా విలువిచ్చిన దాఖలాలు లేవు. చివరకు తనకున్న అనుమానాలను అధినేతల వద్ద నిగ్గుతేల్చుకోకుండానే స్వీయ మానసిక ధోరణితో పార్టీ సభ్యత్వానికీ, తాను కోరుకుని మరీ ఎన్నికయిన లోక్‌సభ సభ్యత్వానికీ సోమవారం రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి శైలి ఆది నుంచి వివాదాస్పదమేనన్న వాదనలకు కొదవ లేదు. ఇంతచేసీ అటు కాంగ్రెసు పార్టీ నాయకుడిగానో/కార్యకర్తగానో లోక్‌సభ సభ్యుడిగానో, చివరకు వైఎస్‌ కుమారుడిగానన్నా ఏనాడూ ప్రజల్ని పరామర్శించిన పాపాన పోలేదు. వారి సమస్యల్ని తెలుసుకున్న జాడలూ లేవు. పరిష్కరించిన ఛాయలు అసలే లేవు. అయితే ఓదార్పు యాత్ర అదేగదా అని ఆయన అభిమానులు వివరించటం కద్దు.
తనను అణగదొక్కేందుకుగాను తన కుటుంబంలోనే అధిష్టానం చిచ్చుపెడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెసుపార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ, లోక్‌సభ కడప స్థానానికీ సోమవారం రాజీనామా చేసిన వైఎస్‌ జగన్మోనరెడ్డి రాజకీయ ఆరంగేట్రమే వివాదాలతో మొదలైంది. లోక్‌సభలో అడుగుపెట్టి కేంద్రంలో చక్రం తిప్పాలన్న కోరికతో తన చిన్నాన్న వివేకానందరెడ్డితో పేచీపడి మరీ అడ్డుతొలగించుకున్నాడు. తన తండ్రి వైఎస్‌ మరణానంతరం ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్టానంతో పరోక్షంగా అమీతుమీకి సిద్దమయ్యారు. ప్రజాప్రతినిధిగా పట్టుమని ఏడాది కాలం కూడా పదవిలో కొనసాగలేకపోయారు. ఇప్పుడు ఆ లోక్‌సభ స్థానానికే రాజీనామా చేసి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. జగన్‌ ఏ పని చేసినా అది వివాదాస్పదమవటం సాధారణమన్న అపప్రధ ఉంది. ఓదార్పుయాత్ర కూడా ఆ బాటలోనే సాగింది.
జగన్‌ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే… 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఆయన కేవలం వ్యాపారాల నిర్వహణలోనే కాలం వెళ్లబుచ్చారు. తండ్రికి తగిన వేదిక దొరకగానే, జగన్మోహనరెడ్డి కూడా అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చారు. తండ్రి లాగే తానూ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలన్న కోరికను తొలినాడే తన చేతలద్వారా వ్యక్తం చేశారు. రాజకీయాలంటే పదవేనన్నట్లుగా పావులు కదిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు, అందులోనూ తన వ్యాపారాలకు దన్నుగా నిలిచే లోక్‌సభ సభ్యత్వాన్ని ఆయన కోరుకున్నాడు. దీంతో ఆనాడు లోక్‌సభ సభ్యుడిగా ఏడాది కాలం గడవక ముందే 2005లో వివేకానందరెడ్డిని రాజీనామా చేయించి, తన కుమారుడిని పోటీ చేయించాలని వైఎస్‌ బలంగా భావించినట్లు ఆనాడు వార్తలు విన్పించాయి. వాస్తవానికి జగన్మోహరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు అప్పట్లో వైఎస్‌ వివేకానందరెడ్డిపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించేందుకు పూనుకున్నారన్న విమర్శలు కూడా విన్పించాయి. వైఎస్‌ పక్కా ప్రణాళికకు వివేకానందరెడ్డి బలయ్యారు. కుటుంబ ఒత్తిళ్లకు తలొగ్గిన ఆయన 2005లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా  పత్రాన్ని లోక్‌సభాపతికి బదులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారు. దీంతో సోనియా వైఎస్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారని వినికిడి. ఫలితంగా వివేకానందరెడ్డి రాజీనామా వ్యవహారం సద్దుమణిగింది. అయితే జగన్‌ యువసేన పేరిట ఇష్టారీతిన నిధులు వెచ్చిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభించారు. దీనికితోడు 2004 నుంచీ 2009 వరకూ జగన్‌ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. జిల్లాలో వైఎస్‌ పాల్గొనే ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ జగన్మోహనరెడ్డి నిబంధనలకు విరుద్దంగా పాల్గొనేవారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అభివృద్ధి సమీక్షా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో కూడా వేదికలెక్కారు. సిఎం కాన్వాయ్‌తో కలసి ప్రయాణించారు. జగన్‌ కడపకు వస్తే ఇప్పటికీ ముఖ్యమంత్రి పర్యటనను తలపించే రీతిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అడుగడుగునా మెటల్‌ డిటెక్టర్ల తనిఖీలు, పోలీసులు తాళ్లు పట్టి జనసందోహాన్ని అదుపు చేసేవారు. ఇవన్నీ అప్పట్లోనే వివాదాలకు కారణమయ్యాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కూడా కుటుంబంలో వివాదాలకు కారణమయ్యారు. ఆనాడు తాజా మాజీలకే లోక్‌సభ అభ్యర్తిత్వమంటూ అధిష్టానం ప్రకటించింది. దీంతొ జగన్‌ మళ్లీ తన బాబాయిపై ఒత్తిడి పెంచారు. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని కూడా వివేకానంద రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. ఒకానొక దశలో అప్పట్లో వివేకానందరెడ్డి రెండు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయినా వివాదాల మధ్యే జగన్మహనరెడ్డికి లోకసభ కాంగ్రెసు అభ్యర్ధిత్వం దక్కింది. లోకసభ సభ్యునిగాాయన ఎన్నికయ్యారు. అయితే వెఎస్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకు హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పొందారు. వైఎస్‌ మరణించిన రోజే పదవిపై కన్నేసిన జగన్మోహనరెడ్డి తనను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్టానంపై ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్ననలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, రాజీనామాలు, ఆత్మహత్యాయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ వ్యూహం కూడా అప్పట్లో బెడిసికొట్టింది.
పావురాళ్లగుట్టలో వైఎస్‌ మరణాన్ని జీర్జించుకోలేక అశువులుబాసిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓదార్పుయాత్రను ప్రారంభించారు. అధిష్టానం ఓదార్పుయాత్ర వద్దన్నా వినకుండా అది తన వ్యక్తిగత యాత్ర అంటూ కొనసాగించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులూ ఆయనను పరోక్షంగా విమర్శిస్తూనే వచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమారరెడ్డిని అధిష్టానం నియమించింది.మంత్రి వర్గంలో జగన్మోహనరెడ్డి ముఠాకు ప్రాతినిథ్యం లేకుండా చేసేందుకు పూనుకుంది. ఏకంగా వివేకానందరెడ్డిని ఢిల్లీకి పిలిచి మంత్రి మంత్రి పదవి ఆశపెట్టింది. బాబాయ్‌ ద్వారా తమ కుటుంబంలో చివరకు అన్నీ వికటించటంతో తమ కుటుంబంలో చీలికతెచ్చేందుకు అధిష్టానం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ లోకసభ కడప స్థానానికీ, కాంగ్రెసుపార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసి సంచనలం సృష్టించారు. తనతో పాటు తన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మతోనూ రాజీనామా చేయించారు. ఇలా … జగన్‌ శైలి ఆది నుంచీ వివాదాస్పదం కావడంతో తాను ఒంటరినని చివర లేఖలో రాసుకున్నారు.

వైఎస్‌ జగన్మోహనరెడ్డి తనకుతానే గెటవుట్‌


లోక్‌సభ కడప సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి విజయలక్ష్మి చట్టసభలకూ, కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ 28 నవంబరు 2010 ఉదయం 11.30 గంటలకు రాజీనామా చేశారు. కాంగ్రెసుపార్టీ అధిష్టానం తన కుటుంబం పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగానే   జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి  రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని సోమవారం ఉదయం నుంచే ఆయన ముఠా ప్రచారంలో పెట్టటం వెనుక మతలబు దాగి ఉంది. తన అవసరాలు, ఆకాంక్షల్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నెరవేర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెసు అధిష్టానం ఆయనను మారుస్తూ, పనిలో పనిగా జగన్మోహనరెడ్డికి ముకుతాడు వేసేందుకు కూడా పావులు కదపటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.  కుర్చీ రాజకీయాల్లో సహజమయిన ఎత్తుకు పైఎత్తు వ్యవహారం ఇది. వైఎస్‌ కుటుంబాన్ని అదుపులో పెట్టేందుకు కాంగ్రెసు అధినాయకత్వం ముఖ్యమంత్రి మార్పుతో ఎత్తులు వేయగా, జగన్మోహనరెడ్డి ముఠా తమ రాజీనామాలతో పైఎత్తులు మొదలు పెట్టింది. ఇందంతా ఇప్పటికే సంపదను మూటగట్టుకుని స్థిరపడ్డ వర్గానికీ, మూటగట్టుకుంటూ స్థిరపడాలన్న తపన ఉన్న వర్గానికీ జరుగుతోన్న పోరు తప్ప మరొకటి కాదు.  కాకపోతే పైకి మాత్రం ప్రజల పక్షాన నిలబడినందునే తనపై వేటేస్తున్నారని జగన్మోహనరెడ్డి, వ్యవస్థ ముఖ్యం తప్ప వ్యక్తులు కాదని కాంగ్రెసు అధిష్టానం మాయామేయ నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కొన్నాళ్లు మాత్రమే సాగుతాయి. తస్మాత్‌ జాగ్రత్త.