Archive for నవంబర్ 30th, 2010

56 ఏళ్లగా ‘తెప్ప’ ప్రయాణం నూతన ముఖ్యమంత్రి ఇలాకాలో ఇక్కట్లు

అది ఓ గ్రామం. దానికి అనుకుని ఓ ఏరు. దాన్ని దాటాలంటే గ్రామస్తులకు అవస్థే. పడవ ప్రయాణంలో తరచూ ప్రమాదాలు జరగటం కద్దు. వంతెనను నిర్మించమని ఆ గ్రామస్తులు వేడుకొనని నాయకుడు లేడు. ప్రభుత్వానికి ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేది లేక ఆ ఊళ్లోనే ఒకరిని గ్రామస్తులందరూ కలసి పట్టణానికి పంపి బాగా చదివించారు. అతని ద్వారా వంతెన నిర్మించాలని అనుకుంటారు. అయితే అతను బాగా చదివి, వంతెన సంగతిని మరచిపోయి ఆస్తుల్ని కూడబెట్టుకునే పనిలో మునిగిపోతాడు. – ఇది రవితేజ కథానాయయుడిగా నటించిన భగీరథ చిత్ర సారాంశం.
ఈ సినిమాలో మాదిరిగానే చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని ఓ గ్రామస్తులు వంతెన లేక కష్టాలు పడుతున్నారు. వంతెన నిర్మాణం ఆశించి ఆ గ్రామస్తులు కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమరనాథ్‌రెడ్డికి ఓట్లేసి శాసనసభ్యుడిని చేశారు. ఆయన రాష్ట్ర మంత్రిగానూ పల్లకి ఎక్కారు. ఆయన చనిపోయిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డికీ ఓట్లేసి గెలిపిస్తూనే ూన్నారు. ఆయన శాసనసభలో చీఫ్‌విప్‌గా పనిచేశారు. శాసనసభాపతీ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రీ అయిపోయారు. అయినా ఓట్లేసి శాసనసభకు పంపిన తమ గోడు మాత్రం ఆయనకు పట్టడం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా తమ కష్టాల్ని తీర్చే వంతెన వస్తుందన్న ఆశతో ఆ గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.
అది చిత్తూరు జిల్లా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పీలేరు నియోజక వర్గంలోని కెవి పల్లి మండలం జిల్లేలమంద పంచాయతి. ఆ నియోజకవర్గంలోనే ఇది అతి పెద్ద పంచాయతీ. ఇది కడప జిల్లాకు ఆనుకుని ూంటుంది. ఈ పంచాయతీలో 39 గ్రామాలున్నాయి. రెండు తండాలు, ఓ యానాది పల్లె కూడా ూన్నాయి. ఈ గ్రామాల్లో ఏడు వేల కుటుంబాలు నివాసముంటున్నాయి. దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు.
1954లో ఇక్కడి కొండల నుంచి ప్రవహించే నీటిని నిల్వ చేసేందుకుగాను పింఛా ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచే ఈ ప్రాంత గ్రామస్తులకు ఇబ్బందులచ్చి పడ్డాయి. మండల కేంద్రం కెవిపల్లికి రాకపోకలు సాగించే ఒకే ఒక్క దారిని ఈ ప్రాజెక్టు నీరు ముంచింది. 30 అడుగుల లోతున ఏటా పది నెలలపాటు ఈ ప్రాజెక్టు నిండుగాగూంటుంది. దీంతో ఈ గ్రామాలకు దారి లేకుండా పోయింది. అవతలి ఒడ్డుకు చేరాలంటే వీరికి నరకయాతనే.
క్షణ క్షణం.. భయం భయం
ఈ గ్రామాల అవస్థ చూసి స్థానిక నివాసి బాషా సొంతంగా ఓ తెప్పను తయారు చేశాడు. అర కిలోమీటరు దూరాన్ని కలుపుతూ తాడును కట్టాడు. ఇద్దరు మాత్రమే కూర్చొని తాడును లాగుతుంటే తెప్ప ముందుకు కదులుతుంది. పావుగంటపాటు సాగే ఈ ప్రయాణంలో క్షణ క్షణం … భయం భయంగా ూంటుంది. అవతలి ఒడ్డుకు చేరుకునేంత వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సిందే. ఇలా ఈ పంచాయతీవాసులు 56 ఏళ్లుగా ప్రయాణిస్తున్నారు. కాగా పదేళ్ల క్రితం తెప్పలో వస్తూ మధ్యలో తాడు తెగిపోవడంతో తెప్ప బోల్తాపడి బాషా నీట మునిగి ప్రాణాలదిలేశాడని గ్రామస్తులు తెలిపారు. అప్పటి నుంచీ ఈతొచ్చిన వారే ఈ సాహసం చేసేందుకు పూనుకుంటున్నారు.
చుట్టు తిరిగి 70 కిలోమీటర్లు
ఈ ప్రాజెక్టు మీదుగా ప్రయాణిస్తే మండల కేంద్రం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే. అదే తెప్పలో ప్రయాణించలేక నేల మీద ప్రయాణించవలసి వస్తే 70 కిలోమీటర్లు చుట్టు తిరిగి రావాలి. మొదట పీలేరుకు గంట ప్రయాణం. అక్కక నుంచి గంటన్నర పాటు ప్రయాణిస్తే కె.వి. పల్లి చేరుకుంటారు. ఏ చిన్న వస్తువు కావాలన్నా, ఏ పని చేసుకోవాలన్నా ఈ గ్రామాల ప్రజలకు సుదూర ప్రయాణం తప్పదు. ఇక అనారోగ్యంతో ప్రాణాపాయ పరిస్థితులస్తే వారి బాధ వర్ణనాతీతం.
సబ్‌సెంటర్‌ మూత
ఈ పంచాయతీలో ూన్న 39 గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య ూప కేంద్రం మూత పడింది. తెప్పలో ప్రయాణించలేక సిబ్బంది రావటం మానుకున్నారు. దీంతో ఈ కేంద్రంలో కనీసం మందులిచ్చే దిక్కు కూడా లేకుండా పోయింది. చిన్నపాటి జ్వరమొచ్చినా ఈ ప్రాంతవాసులు పీలేరుకు వెళ్లాల్సి వస్తోంది. ఇదంతా వంతెన లేకపోవటమే కారణమని ఈ గ్రామాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటికి కటకట
కాగా ఈ గ్రామాలన్నింటిలోనూ తాగునీటి తిప్పలు తప్పడం లేదు. తాగేనీటి కోసం కొండలు, గుట్టల్లో వెళ్లి బావుల్లోని నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి అడవిలో ూన్న బావిలో నీళ్లు తెచ్చుకుని ఈ గ్రామాలవాసులు తాగుతున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెరిగిన ఆశలు
56 ఏళ్లుగా తమ బాధలు తీర్చే దిక్కు లేకుండా పోయిందని వాపోతోన్న ఈ గ్రామీణుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. తమ శాసనసభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కటమే దీనికి కారణం. ఆయన ఈదఫా తమను ఆదుకుంటాడని వారు ఆశపడుతున్నారు.

బాబాయి పెడ ముఖం ! అబ్బాయి ఎడముఖం !!


పులివెందుల బరిలో వివేక – జగ్గు ఢీ అంటే ఢీ
యువ నేతకు తొలి పరాజయం
కాంగ్రెసు పార్టీ అధిష్టానం తన కుటుంబంలో చిచ్చుపెట్టిందని నవంబరు 29న తన రాజీనామా పత్రంలో ఆరోపించిన జగన్మోహనరెడ్డి మాటలు 30వ తేదీన నిజ్జంగానే నిజ్జమయ్యాయి. తాను కాంగ్రెసుకే బాసటగా నిలుస్తానని వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డి ప్రకటించటంతో అబ్బాయి కెరీర్‌లో తొలి పరాజయం నమోదయింది. అదే నేపథ్యంలో వివేకానందరెడ్డికి మంత్రి పదవి దొరికినట్లేనని భావించవచ్చు. దీనికితోడు అసలయిన ఘట్టం పులివెందులలో జరగాల్సిన ఉప ఎన్నికల బరిలో బాబాయి – అబ్బాయిలే ఢీ అంటే ఢీ అనేందుకు రంగం సిద్ధమవుతున్నారు.
బాబాయి వివేకానందరెడ్డి, అబ్బాయి జగన్మోహనరెడ్డి మధ్య కాంగ్రెసు పార్టీ పెట్టిన గండిని వాళ్లిద్దరితో చర్చలు జరిపి భారతి తండ్రి (జగన్మోహనరెడ్డి మేనమామ) గంగిరెడ్డి పూడ్చాడని ఓ వైపు టీవీల్లో వార్తలు వస్తూ ఉండగానే బాబాయి పెడముఖం పెట్టగా, అబ్బాయి ఎడముఖం పెట్టేసినట్లు తేలిపోయింది. కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్సార్‌ ఎస్టేట్‌లో బాబాయి, అబ్బాయి మధ్య సయోధ్య కోసం బంధువులు ఏర్పాటు చేసిన సమావేశం కేవలం రెండంటే రెండు నిమిషాల్లో ముగిసింది. ఇద్దరి మధ్యా చోటుచేసుకున్న ఒకటి రెండు మాటల వాగ్వాదం అనంతరం వివేకానంద రుసరుసలాడుతూ అక్కడి నుంచి కడపకు వెళ్లిపోయారు. అక్కడే 11.30 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి చల్లచల్లగా అసలు విషయం బయటపెట్టారు. జగన్మోహనరెడ్డి సంధించిన ఐదు పేజీల ఉత్తరంలో తొలి మాటలనే ఆయన ఖండించారు. కాంగ్రెసుపార్టీ అధష్టానం తన కుటుంబంలో చిచ్చుపెడుతుందన్న జగన్మోహనరెడ్డి ఆరోపణల్ని బాబాయి ఖండించారు.
ఈ నేపథ్యంలో తన బాబాయితోనే సయోధ్య కుదుర్చుకోలేని జగన్మోహనరెడ్డి భవిష్యత్తులో వివేకానందరెడ్డి తాతల్లాంటి వారితో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారో ప్రశ్నార్థకమే. కుదరక కుదరక చిట్ట చివరకు కుదిరి మరి కొద్ది గంటల్లోనే దక్కనున్న మంత్రి పదవిని చేజేతులా వదులుకోవాల్సి రావటంతో వివేకానందరెడ్డి ఉద్వేగానికీ, ఉద్రేకానికీ లోనవటం సహజం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ కలుపుకుపోవలసిన జగన్మోహనరెడ్డి ప్రతి అడుగునూ తరచి తరచి చూసి వేయాల్సిందే. అయితే ఆయనలో అదే కన్పించలేదు.
అయినా నూట పాతిక కోట్లమంది భారతీయుల్ని గత 60 ఏళ్లుగా బుట్టలో వేసుకుంటున్న కాంగ్రెసుపార్టీకి ఈ అబ్బాయి, వాళ్ల బాబాయి ఒక లెక్కా ఏంటి!.
కొందరిని ఎదిరించి, మరికొందరిని బెదిరించి, ఇంకొందరిని సముదాయించి, ఇంకా ప్రలోభపెట్టి, భ్రమల్లో ముంచి, మత్తులో దించి, గాంధీ నోట్లు విసిరి, పదవుల ఎరవేసి, పెదవుల రుచిచూపి ఇలా ఎన్నెన్నో దారులు. అన్నీ కాంగ్రెసుకు ఎరుకే. ఎవరు దేనికి లొంగుతారో, కాంగ్రెసు నేతలకు తెలిసినంతగా ఇంకే పార్టీ నాయకులకూ పట్టుబడలేదు. అందువలనే రాష్ట్రాలకు రాష్ట్రాలే ఊడ్చిపెట్టుకుపోయినా కాంగ్రెసు ఇప్పటికీ కేంద్రాన్ని గుప్పిట్లో పెట్టుకుని పేట్రేగి పోతోంది. అలాంటి కాంగ్రెసుకు వివేకానందరెడ్డిని పడేయటం అంటే మిఠాయి తినిపిస్తామని హామీ ఇచ్చి ఐదారేళ్ల పాపలను సముదాయించినంత సులభం మరి.
చేజిక్కబోతోన్న పదవి చేజారిపోతుందేమోనన్న ఆత్రుతలో బాబాయ్‌ పెడముఖం పెట్టగా, ఆయనను ప్రసన్నం చేసుకోలేకపోగా, తాను ఎడముఖం పెట్టటమే జగన్మోహనరెడ్డి తొలి అపజయంగా నమోదు చేయాల్సిన అంశం.