Archive for డిసెంబర్, 2010

అద్దె అమ్మల కోసం దళారుల వేట

సిలికాన్‌ సిటీ బెంగళూరులో అద్దె అమ్మలకు గిరాకీ పెరుగుతోంది. దీనిని సరోక్రసీ (సంతానం లేని వారికి గర్భాన్ని అద్దెకివ్వడం) అంటూ ఆంగ్లంలో ఉన్న అందమైన పేరుతో ఇక్కడ పిలుచుకుంటున్నారు. ఇప్పటి వరకూ బెంగళూరులో 300 మంది ఈ విధంగా సంతానం పొందారు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న దంపతులు ఒత్తిడి జీవితం కారణంగా వంధ్యత్వానికి గురవుతున్నారు. దీంతో అమ్మదనాన్ని అద్దెకు తీసుకుని తాము తల్లిదండ్రులవుతున్నారు. అద్దెకు అమ్మదనం కావాలనుకుంటున్న దంపతులకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఇందుకు భారీగా డబ్బు వసూలు చేస్తోంది. ఈ సంస్థ తన చిరునామాను ఎక్కడా ప్రకటించకపోయినా, ఆ నోటా ఈ నోటా పడి అవసరార్థుల నోళ్లలో నానుతోంది. అమ్మదనాన్ని అద్దెకు ఇచ్చే మహిళలు రూ. 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం సదరు జంటతో సంబంధం లేకుండానే నడుస్తోంది. గర్భం ధరించే మహిళల ఆరోగ్య, ఇతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఈ స్వచ్ఛంద సంస్థ 20 శాతం కమీవన్‌ వసూలు చేస్తున్నది. అదికాక దంపతుల నుంచి అధికమొత్తం వసూలు చేసుకుని అందులో కొంత మొత్తాన్ని నొక్కేస్తోంది. అమ్మలకు కోత వేసి అద్దె చెల్లిస్తోంది. ఈ వ్యవహారం హైదరాబాదులోనూ జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా గిరిజన మహిళలను దళారులు మోసపుచ్చి సొమ్ముచేసుకుంటున్నారు. ఏడాది పాటు తమతో ఉండి బిడ్డను కంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తీరా కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. దళారులకు భద్రాచలం కేంద్రంగా సాగుతోంది.

ప్రకటనలు

కన్నీటి సంద్రాన రాష్ట్ర రైతన్న


”చేతికొచ్చిన పంట పోయింది. ఏమీ మిగల్లా… వేలకు వేలు అప్పు మాత్రం మిగిలింది.” – అనంతపురం, విశాఖ, రంగారెడ్డి, తూర్పుగోదావరి, మెదక్‌, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్‌ ఇలా ఏ జిల్లా రైతన్నను కదిలించినా ఒకటే మాట వినపడుతోంది. ఒకటే కన్నీరు కారుతోంది. ప్రారతంతో సంబంధం లేదు. పంటతో సంబంధం లేదు. అన్నదాతలందరిదీ ఒకటే మాట. ”ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. పరిశీలించాల్సిన అధికారులూ ఇంతవరకూ ముఖం చూపలేదు. సాయం ఇస్తారో లేదో తెలియడం లేదు. అప్పులిచ్చినోళ్లు రోజూ వెంటబడతన్నారు. పొలం అమ్మి తీర్చుదామంటే కొనుక్కునేవాళ్లూ కనపడటం లేదు.” అంటూ కన్నీటి పాలవుతున్నారు.
ఏడెకరాలు సాగుచేస్తే అప్పులు మాత్రం దండిగా మిగిలాయని మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన కటిక మల్లాది(46) ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రోజు గడవాలంటే కూలికి పోవటం తప్ప మార్గం లేదని ఆ రోజు ఖిన్నుడయ్యాడు. ఇది మల్లాది ఒక్కడి మాట కాదు. గురువారం గుంటూరులో జరిగిన రైతు కోసం సభకు వచ్చిన రైతులందరి గుండె కోత. ప్రజాశక్తి ప్రతినిధులు పలకరించిన రైతులంతా తమగోడు వెళ్లబోసుకుంటూ కంట కన్నీరు పెట్టారు.
వివిధ ప్రాంతాలకు చెందిన రైతుల గోడు వారిమాటల్లోనే….
రూ. 30 వేలు అప్పు మిగిలింది
కటిక మల్లాది, కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా
ఏడెకరాల్లో వరి, వేరుశనగ, కంది పంటలు సాగుచేశాము. నాలుగు ఎకరాలు సొంతం. మూడెకరాలు కౌలుకు తీసుకున్నా. గతంలో వచ్చిన వర్షాలకు వరి సగం దెబ్బతింది. పంట చేతికొస్తుందనుకున్న సమయంలో ఈ నెల్లో కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. గింజ రంగు మారింది. కంది పాడైంది. వేరుశనగ పంట పోయింది. ఇక వ్యవసాయం మానుకుని ఇంటిల్లిపాదీ కూలికి పోదామనుకుంటున్నాము.
రూ.1.55 లక్షల పెట్టుబడి పోయింది
పావులూరి వెంకట్రామయ్య, జంగమహేశ్వరపురం, గుంటూరు జిల్లా
12 ఎకరాలు సాగుచేశా. దీనిలో నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నా. పత్తి, కంది వేశాము. వర్షాలకు అంతా నాశనమైంది. గతంలో కురిసిన వర్షాలకు పత్తి సగం కారిపోయింది. మిగిలిందయినా దక్కుతుందని సరిపెట్టుకున్నా ూపయోగం లేకుండా పోయింది. ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలకు మిగిలిన పత్తి కూడా కారిపోయింది. ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఖర్చయింది. వర్షం పడకపోతే ఎకరానికి పది క్వింటాళ్లపైబడి వచ్చేది. ఇప్పుడు నాలుగున్నర క్వింటాళ్ల నాసిరకం పత్తి మాత్రం దక్కింది. పత్తి బాగుంటే క్వింటాలు రూ.3500 నుంచి రూ.3700 దాకా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రూ.1800 నుంచి రూ.2000కు మించి కొనటం లేదు. మూడు లక్షల రూపాయలకు బదులు, ఇప్పుడు రూ.80 వేలకు మించి వచ్చేట్లు లేదు. పంట పోయింది. పెట్టుబడీ పోయింది. మిగిలింది అప్పులే.
ఎనిమిది ఎకరాలకు 12 బస్తాల శనగ
ఎన్‌ మల్లికార్జునరెడ్డి, నుగటివారిపల్లె, అనంతపురం జిల్లా
ఎనిమిదెకరాల్లో శనగ పెడితే వర్షాలకు పంట మొత్తం పోయింది. చివరకు 12 బస్తాలు దక్కింది. అది కూడా నాణ్యంగా లేదు. మొత్తం రూ.35 వేలు ఖర్చయింది. మొత్తం పంటపోయినా ఎంతో కొంత రాకపోతుందా అన్న ఆశతో నూర్పిడి చేయగా, 12 బస్తాల శనగలు వచ్చాయి. బస్తా రూ.800 అయితే కొంటామని వ్యాపారులు చెబుతున్నారు. అప్పులు తీరాలంటే పొలాన్ని అమ్ముకోవాల్సిందే.
ప్రభుత్వమే ఆదుకోవాలి
చామంతుల చినసత్యనారాయణ, కొలుకులాపల్లి, విశాఖజిల్లా
కౌలుకు తీసుకున్న రెండు ఎకరాల్లో వరి, చెరకు వేశాము. వర్షాలకు పంట మొత్తం పాడైపోయింది. రూ.30 వేలు ఖర్చు చేసినా, ఒక్క రూపాయీ రాలేదు. అదే పంట బాగుంటే రూ.60 వేల దాకా వచ్చేది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

నూతన వత్సర వేడుకల్ని నేను బహిష్కరిస్తున్నానహో !


అవును, నేను ఎప్పటి మాదిరిగానే 2011 నూతన వత్సర వేడుకల్ని బహిష్కరిస్తున్నాను.
ఎందుకంటే…..
1. క్షణాలు రోజులుగా, రోజులు ఏళ్లుగా మారినంత మాత్రాన వీసమంత లాభం లేదని నా భావన. అదే మనసులు మారితే, మనుషులు మారితే నేను, మీరు, మనం, ఈ సమాజం బాగుపడుతుందని నా గట్టి నమ్మకం.
2. జనవరి ఒకటి ఉత్సవాలు ఆసాంతం డబ్బుతోనూ, మత్తుతోనూ, రసాయనికాలతోనూ, విదేశీ ఆచారాలతోనూ ఒక్క మాటలో చెప్పాలంటే అది వ్యాపారమయం.
3. పెద్దవాళ్లకు, పైవాళ్లకు అభినందన పత్రాల్నీ, మిఠాయిల్నీ, యాపిల్‌ కాయల్నీ ఇచ్చే నాటకం వేయలేక.
4. జనవరి ఒకటి వేడుకల వెనుక విదేశీ వ్యాపారస్తుల కుట్ర.
5. భౌతిక అవసరాలు తప్ప వ్యాపారం అంటు, సొంటులేని మన ఉగాదిని వెనక్కు నెట్టే వ్యవహారం పట్ల కోపం.
6. అతివృష్టి నష్టాలతో మన గ్రామీణులు పుట్టెడు దుఖ:లో మునిగి ఉన్నందున వేడుకలు జరుపుకోవటం సరికాదన్న భావన.
మిత్రులారా! నూతన వత్సర వేడుకల బహిష్కరణకు  కారణం స్థూలంగా అర్ధం అయి ఉంటుందని భావిస్తున్నాను.
క్షణాలు- నిమిషంగా,
నిమిషాలు – గంటగా,
గంటలు – రోజుగా,
రోజులు – నెలగా,
నెలలు – ఏడాదిగా మారినంత మాత్రాన,
మొన్న – నిన్న అయినందున,
నిన్న – నేడయినందున,
నేడు – రేపయితే మాత్రాన ఎక్కడయినా, ఎప్పుడన్నా, ఎవరికయినా మహా కాకపోతే మానె కనీసం రవ్వంత మార్పు వచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేవుగాక లేవు. అందువలన ఏ మార్పూ లేనిదానికోసం ఉత్సవాలు చేసుకోవటం ఎందుంట?
దాన్నలా ఉంచి కాలం మార్పు అనేదాన్నే ఉత్సవంగా జరుపుకోవలసి వస్తే, ఈ దొంతరలో తొలిదయిన క్షణం మారగానే కూడా పండగ చేసుకోవద్దూ మరి! అందువలన కాలాల మార్పు పండుగ కాదు.ఉత్సవాలకూ అర్ధం లేదు.
ఉగాది పండుగ మనది. దీనిలో పైసా వ్యాపారానికి తావులేదు. వేప, చెరుకు, బెల్లం, మామిడి, అరటి, కొబ్బరి తొలికాపు వచ్చిన వేళ ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. ఇంట్లో ఉన్నదాన్ని ఆనందంగా వండుకు తినటం తప్ప దీంట్లో దోచిపెట్టటం, దోచుకోవటానికి అవకాశం లేదు. అదే జనవరి ఒకటంటే వ్యాపారం, అంటే వ్యాపారులు లాభాల్ని మూటగట్టుకునే దినం. గ్రీటింగు కార్డు (అభినందన రేకులు)ల వ్యాపారం ఏటా లక్షల కోట్లలో సాగుతుంది. ఇక కార్యాలయాలు, ఇళ్ల అలంకరణ వస్తుసామగ్రి అమ్మకాలూ కోట్ల రూపాయల్లో ఉంటున్నది. పెద్దలకు బహుమతులు, మిఠాయిలు, యాపిల్‌ కాయలు, మాదక ద్రవ్యాలు, మందు – విందు, కోక్‌ కేకులు, అశ్లీల నృత్యాలు ఇలా, ఇలా …ఓహ్‌ వ్యాపారాలకు కొదవే లేని జనవరి పండుగను ప్రమోట్‌ చేయటం అంటే సామాన్యుల్ని దోచుకుతినే పథకమే. ఇప్పుడు సెల్‌లో పొట్టి సందేశం (ఎస్‌ఎంఎస్‌) వ్యాపారం కూడా కోట్లాది రూపాయలతో జతపడింది. ఈ సేవలతో వ్యాపారం చేసుకోవటంతోపాటు సంవత్సరం మొదటి రోజున ఏది చేస్తే ఏడాదంతా అదే జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రచారంలో పెట్టి ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువునో, వాహనాన్నో, సెల్‌ఫోనునో, వంటింటి సామగ్రినో, ఫర్నిచరునో, పసిడి నగనో ఆఖరుకి ఒక్క వస్త్రాన్నయినా కొనిపించటం నూతన సంవత్సర వేడుకల వెనుక ఉన్న అసలుసిసలయిన వ్యాపార సూత్రం. దీనికి ఏటా లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతున్న విషయం వేరే చెప్పాలా?! అందులోనూ ఈ వ్యాపారాలన్నీ బహూళజాతి సంస్థలవే కావటం పరిశీలనార్హం.
ఇక ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, చెరుకు, పసుపు, కూరగాయల తోటలు నాశనమవటంతో రైతన్న ఇంట విషాదం నిండుకుంది. రైతన్న పెడితే తినాల్సిన వాళ్లం, తిండిలేకుండా క్షణం బతకలేని వాళ్లం మనం. అలాంటి అన్నదాత గుండెలు దిటవు తప్పి కొట్టుమిట్టాడుతుంటే మనం ఉత్సవాలు చేసుకోవటం సబబు కాదని నా భావన. కలలు కల్లలయిన రైతన్నను నిట్టనిలువునా కల్లాల్లోనే కూలిపోతుంటే మనకు ఏమీ పట్టనట్లు పండుగలు చేసుకోవటం మానవత్వం కాదని నా భావన. ఇప్పటిదాకా కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాన్ని విభజించమంటూ కొందరు పోరాటాలకు దిగేందుకు జనవరి ఒకటినే ముహూర్తంగా పెట్టుకున్న ఫలితంగా కోట్లాది మంది ప్రజల గుండెలు గుబగుబలాడుతున్న అశుభవేళ మనం పండుగ చేసుకోవటం సబబు కాదని నా భావన.
అందుకనే ఇంతకు ముందు మాదిరిగానే నేను ఎవరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని చెప్పను.
అందుకనే ఇంతకు ముందు మాదిరిగానే నాకు ఎవరయినా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబితే నవ్వి ఊరుకోవటం తప్ప తిరిగి చెప్పను. వారు నాకు తెలిసిన వారయితే నా నవ్వు వెనకున్న వాస్తవాన్ని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను.
మీరేమంటారు? స్పందిస్తే సంతోషిస్తాను.

పొలాల్లో మరణ మృదంగం… ఒక్కరోజే 34 మంది అన్నదాతలకు ప్రభుత్వం చావురాత


మూడెకరాలకు 12 బస్తాల దిగుబడి
కల్లంలోనే కుప్పకూలి రైతు మృతి
కౌలు భూమిలో నలుగురు ఆత్మహత్య

రాష్ట్రంలో ఏ పొలంలో విన్నా మరణమృదంగం వినపడుతోంది. ఒక్క సోమవారంనాడే రాష్ట్రవ్యాపితంగా 34 మంది అన్నదాతలకు ప్రభుత్వం చావురాత రాసింది. కల్లంలోనే రైతన్నలు నిలువునా కుప్పకూలుతున్నా ప్రభుత్వ వైఖరిలో ఏ మాత్రం మార్పులేదు. నలుగురు రైతన్నలు పొలంలోనే పురుగుమందు తాగి గుండె మంటను చల్లార్చుకున్నారు.
ఆ రైతన్న పొలంలో ఇప్పటిదాకా ఎకరానికి సగటున 30 బస్తాల దిగుబడి వచ్చింది. అదే ఇప్పుడు మూడెకరాల్లో కలిపి కేవలం 12 బస్తాలే దిగుబడయ్యింది. దీంతో ఆ రైతు గుండె నిరాశా సముద్రమయింది. మానసిక ఒత్తిడికి గురయ్యాడు. పొలంలోనే పురుగుమందు తాగాడు. ఆ అన్నదాత శ్వాస అనంతవాయువుల్లో కలిసిపోయింది.
అది మూడెకరాల చెక్క. వరి నూర్పిడి జరుగుతోంది. మొత్తం 20 బస్తాల దిగుబడి వచ్చింది. అంతే సాగుదారుడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. తన కలల్ని పండించాల్సిన కల్లంలోనే కన్నుమూశాడు.
మరో ముగ్గురు రైతులు నిన్నటిదాకా తమకూ, సమాజానికీ పట్టెడన్నం పెట్టిన పొలం సాక్షిగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా, ఇంకా పలువురు రైతన్నలు దిటవు తప్పి, ఒత్తిడికి లోనై గుండెపోటుతో కన్నుమూశారు.
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నగరానికి చెందిన కౌలుదారుడు వడ్లమూడి ప్రసాద్‌ (35) లక్షన్నర రూపాయల అప్పు చేసి మూడెకరాల్లో వరి సాగు చేశాడు. ఎకరానికి నాలుగు బస్తాల చొప్పున మూడెకరాలకు 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో అప్పు కళ్లముందు తారట్లాడుతుండగా పొలంలోనే పురుగుల మందు తాగి తుదిశ్వాస విడిచాడు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం పంచాయతీ మాధవరాయపురం గ్రామ రైతు చౌదరి ఎర్రన్నాయుడు (50)కి మూడెకరాల భూమి ఉంది. వరిసాగుకు రూ.45 వేలు ఖర్చు పెట్టాడు. అకాల వర్షాలకు తడిసి ముద్దయిన పంటను కల్లానికి చేర్చి నూర్చాడు. మూడు ఎకరాలకుగాను కేవలం 20 బస్తాల దిగుబడి రావడంతో కల్లంలోనే కుప్పకూలిపోయి కన్నుమూశాడు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రులో కౌలురైతు మేకా వెంకటేశ్వర్లు (43) రెండున్నర ఎకరాల్లో వరిపంట నానిపోయింది. ధాన్యం రంగు మారిపోయింది. ఎవరూ కొనుగోలు చేయలేదు. ఒత్తిడికి గురై సాగుచేసిన భూమిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. కాళ్ల మండలం కోపల్లె కౌలురైతు గాదిరాజు ప్రసాదరాజు (48) ఎనిమిదెకరాలు కౌలుకు చేస్తున్నాడు. వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ప్రాణాలదిలాడు. యలమంచిలి మండలం చించినాడ అరుంధతీపేట కౌలురైతు శెట్టిమి కన్నయ్య (55) తాను కౌలుకు చేసిన పొలంలో ఎకరానికి 10 బస్తాలే దిగుబడి వచ్చింది. కన్నయ్యకు కల్లంలోనే గుండెపోటు వచ్చి మృతి చెందాడు. పాలకోడేరు మండలం పెన్నాడ చినపేట కౌలురైతు గోగి కుటుంబరావు (55) పంట నష్టాన్ని తట్టుకోలేక సోమవారం తెల్లవారు జామున గుండెపోటుతో దుర్మరణం చెందాడు. జీలుగుమిల్లి మండలం పి.రాజవరంలో రైతు కూసం గంగిరామిరెడ్డి (55) కూడా గుండెపోటుతో మృతి చెందాడు. సార్వా పంట నాశనం కావడంతో పోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన గొట్టుముక్కల వెంకట్రాజు (65) గుండెపోటుతో మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అనాతవరం కౌలురైతు దేశింశెట్టి సత్తిబాబు (40) వ్యవసాయ అప్పును పదేపదే తలచుకుని తలచుకుని గుండెపోటుతో మృతి చెందాడు. గొల్లపాలెం మండలం కాజులూరులో పంట నష్టంతో మనస్థాపం చెంది కౌలురైతు తాతయ్య మృతి చెందాడు. ఏడెకరాలు కౌలుకు సాగు చేసి నిండా మునిగిన సామర్లకోట మండలం ఉండూరు రైతు మండపాక కృపారావు (40) దిగులుతో నిద్రలోనే గుండెపోటుకు గురయ్యాడు. విశాఖజిల్లా చీడికాడ మండలం దండిసురవరం గ్రామానికి చెందిన వేపాడ మోదినాయుడు (60)కు ఎకరంన్నర పొలముంది. రూ.30 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. అకాలవర్షాలకు పంట మొత్తం పోవడంతో వారం రోజుల నుంచీ మనోవ్యథతో మంచం పట్టాడు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా తిమ్మలబిడిమిలో కౌలు రైతు గంగారావు గుండెపోటుతో మృతి చెందాడు.
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నగరానికి చెందిన వల్లాల వెంకటేశర్లు (61) పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. ఇదే మండలం గరికపాడులో కటికాల కోటయ్య (55) కౌలుకు తీసుకున్న ఎనిమిదెకరాలకు మూడు లక్షల అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం కానరాక వేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఓర్చు పిచ్చయ్య (60) సాగుకోసం రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. తీర్చేదారి కానరాక గుండెపోటుతో చనిపోయాడు. శావల్యపురం మండలం కారుమంచి రైతు ఉప్పుమాగులూరి రామయ్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సరావుపేట మండలం రంగారెడ్డిపాలెం రైతు కటికం వెంకటేశ్వర్లు (45) దిగుబడి తగ్గడంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. వెల్దుర్తికి చెందిన కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి(26) సాగుకు రెండు లక్షల రూపాయలు అప్పుచేశాడు. దిగుబడులు తగ్గడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ రైతు మంచెంశెట్టి శేషయ్య(55) సాగుకూ, దుక్కిటెడ్లకూ దొరికిన చోటల్లా అప్పులు తెచ్చాడు. స్పందన సూక్ష్మరుణ సంస్థ నుంచి కూడా రూ.50 వేలు అప్పు చేశాడు. చేతిలో చిల్లిగవ్వలేక సార్వాలో విత్తనం వేయలేదు. అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తుండటంతో అతని తలలో నరాలు చిట్లిపోయాయి. ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేశారు. అయినా కోమాలోనే శేషయ్య ఆదివారం రాత్రి మృతి చెందాడు. దర్శి మండలం తూర్పువీరయ్యపాలెంలో రైతు కొండయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన వినుకొండ వెంకట రమణయ్య (60) తన ఐదెకరాల పొలంలో వివిధ పంటలు వేసి నష్టపోయాడు. ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణాజిల్లా గూడూరు మండలం గంటలమ్మపాలెం కౌలు రైతు చండిక బాలయ్య (60) సాగుకు చేసిన అప్పులతో మానసిక ఒత్తిడికి గురయి మృతి చెండాడు. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరికి చెందిన బప్పాళ్ల రంగారావు (44) అప్పుల బాధ తాళలేక సోమవారం గుండె పోటుతో మృతి చెందాడు. వేదాద్రికి చెందిన మహిళా కౌలు రైతు గునిశెట్టి తిరుపతమ్మ కూడా అప్పులోళ్ల వేధింపులను తట్టుకోలేక మృతి చెందింది. ఆమె సూక్ష్మరుణ సంస్థ నుంచి రూ.20 వేలు, ప్రయివేటుగా మరొక లక్ష రూపాయలు వడ్డీకి తీసుకుంది. పంటలు నష్టపోవటంతో వాటిని ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై మృతి చెందింది. విశాఖ జిల్లా మాడుగుల మండలం తాటిపర్తికి చెందిన కౌలుదారుడు పాము చిన్న కొండలరావు (45) కౌలు పొలంలో పంట పూర్తిగా పోవటంతో గుండెపోటుతో చనిపోయాడు.
కరీంనగర్‌ జిల్లా రాజన్నపేటలో భూక్యా నాజం (30) పత్తి సాగుకు రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. పంట చేతికందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మాడుగులలో రైతు పోలే రవి పంటనష్టం కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తళ్లపెంటలో పంటనష్టపోయిన రైతు మహిళ వీరవెంకటమ్మ సాగుకోసం చేసిన లక్ష రూపాయలు అప్పు తీర్చలేక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందింది. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన మేడిద వీరస్వామి(46) కొండాయిల్‌పల్లిలో తనకున్న రెండు ఎకరాల భూమిలో పత్తి సాగుచేశాడు. అకాలవర్షాలతో పత్తికి నష్టం వాటిల్లి దిగుబడి తగ్గిపోయింది. అప్పులు మిగిలాయి. కొన్ని రోజులుగా మనోవేదనతో మౌనంగా కాలం గడిపాడు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల పేరారం నర్సింహా రెడ్డి (52)కి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. అప్పు సొమ్మును తీర్చాలంటూ అప్పుదారులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన తన పొలంలోని చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెక్కల యాదగిరి(45) పంట నష్టపోయి తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వేరుశనగ సాగుకోసం అప్పు ఇచ్చిన దాతలు తమ సొమ్ము చెల్లించాలంటూ వేధించటంతో అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు రైతు చంద్రశేఖర్‌ (55) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.

ఏదయితేనేం! ఏదయితేనేం!! పంచాయతీరాజ్‌శాఖయినా, పర్యాటక రంగమయినా ఒకటే నంచుకు తినటానికి!!!

పరమచెత్త పర్యాటక రంగశాఖను కేటాయించి తనను అవమానించారని అలిగి, రాజీనామా చేసి, గోలగోలచేసిన వట్టి వసంతకుమార్‌ పని వాస్తవానికి తంతే గారెల బుట్టలో పడ్డట్టయింది. ఏదయితేనేం, ఏదయితేనేం నంచుకు తినటానికి అన్న జ్ఞానం ఆయనకు ఆలస్యంగా అబ్బినట్లుంది. రాష్ట్ర పర్యాటక రంగంలో పంచుకు తినే కార్యక్రమం ఇప్పుడు జోరుగా మొదలయింది. సికింద్రాబాద్‌లోని యాత్రినివాస్‌ భవనానికి పర్యాటక శాఖ ఇప్పటి వరకూ నెలకు రూ.25 లక్షలు అద్దె వసూలు చేసింది. అయితే ఇప్పుడు అదే భవనాన్ని కేవలం తొమ్మిది లక్షల రూపాయల అద్దెకే కట్టబెట్టేందుదకు రంగం సిద్ధమయింది. అంటే నెలకు రూ. 16 లక్షల చొప్పున ఏడాదికి రూ. 1.92 కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడనుంది. వాస్తవానికి చేతులు మారినందున అద్దె పెరగటం లోక సహజం. కానీ పర్యాటకశాఖ  మాత్రం లోక విరుద్ధంగా వ్యవహరించబూనుకోవటం పరిశీలనార్హం. అద్దెద్వారా పర్యాటకశాఖకు తగ్గనున్న రెండు కోట్ల ఆదాయాన్ని సంబంధిత నేతలూ, అధికారులూ పంచుకు తినేందుకు రంగం సిద్ధమయిందనే కదా. అదే తీరున నెల్లూరులో పర్యాటకుల ఆదరణ పుష్కలంగా ఉన్న టూరిజం హోటల్‌ను ఇప్పటిదాకా పర్యాటకశాఖ స్వయంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు దానిని ఏ కారణమూ లేకుండానే ప్రయివేటు పరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పర్యాటక రంగశాఖ చీకటి వ్యవహారాలు ఇంకా బోలెడు బోలెడు ఉన్నాయి. హైదరాబాదులోని గచ్చిబౌలిలో పర్యాటకరంగ కళాశాలకు కేటాయించిన భూమిలో మూడు ఎకరాల స్థలాన్ని కొందరు ఆశ్రితులకు అప్పగించేశారు. అంటే ఇక్కడ షరామామూలుగానే కోట్ల రూపాయలు చేతులు మారినట్లే. అదన్నమాట అసలు సంగతి. పర్యాటక శాఖ అయినా, పంచాయతీరాజ్‌ శాఖ అయినా నంచుకు తినేందుకు ఒకటేనని ఒప్పుకుంటారు కదూ!?

కూచిపూడికి గిన్నీస్‌ శోభ


సిలికానాంధ్ర సంస్థ హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి స్డేడియంలో ఆదివారంనిర్వహించిన మహా కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్‌ పురస్కారం సాధించింది. 2800 మంది నర్తకీమణులు ఏక కాలంలో చేసిన నాట్య విన్యాసానికి ఈ అరుదైన పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నృత్య ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ సిలికానాంధ్ర నిర్వాహకులకూ, నృత్య కళాకారులకు అభినందనలు తెలిపారు. గిన్నిస్‌ పురస్కారం సాధించి కూచిపూడికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన అందరినీ అమె ప్రశంసించారు. భారతదేశం నాట్య కళాకారులకు, సంస్కృతీ వైభవానికి తార్కాణంగా నిలిచిందన్నారు. 600 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో అవతరించిన కూచిపూడి నృత్యం గిన్నిస్‌ పురస్కారం సాధించటం అరుదైన ఘట్టంగా రాష్ట్రపతి అభివర్ణించారు. కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందనిగవర్నరు ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన నిర్వాహకులను, నృత్య కళాకారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు.

సొంత జిల్లాలోనే ముఖ్యమంత్రి ఏకాకి

తన సొంత జిల్లా చిత్తూరులోనే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి చుక్కెదురయింది. దీంతో ఆయన ‘ఏక్‌ నిరంజన్‌’ అన్న ఛలోక్తులు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తొలిసారిగా తన జిల్లాకు పోయిన సందర్భంగా ఆరింట నలుగురు శాసనసభ్యులు కనీసం ఆయనను పలకరించేందుకు రాలేదు. తొలిరోజు వచ్చిన మంత్రి గల్లా అరుణకుమారి, చిత్తూరు శాసనసభ్యుడు సీకె బాబు రెండో రోజే కనబడకుండా పోయారు. చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో కాంగ్రెసులో రెండు ముఠాలున్నాయి. దీనికి తోడు ఇప్పుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ముఠా కూడా తోడు కావడంతో ముచ్చటగా మూడయ్యాయి. దీంతో కాంగ్రెసుపార్టీ ద్వితీయశ్రేణి నేతల్లో గందరగోళం నెలకొంది. సొంత జిల్లాలోనే ఈ విధంగా ఉంటే మిగిలిన జిల్లాల్లో నల్లారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసలు ప్రభుత్వం ఉంటుందా? ఊడిపోతుందా? అన్న చర్చ మొదలయింది.
చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడుగురు కాంగ్రెసు శాసనసభ్యులున్నారు. ఇందులో ముఖ్యమంత్రిని మినహాయిస్తే మంత్రి గల్లా అరుణకుమారితో పాటు ఐదుగురు శాసనసభ్యులున్నారు. వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మడి కుతూహలమ్మ, రవి, షాజాహాన్‌ ముఖ్యమంత్రికి ముఖం చూపలేదు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాశమయింది. తొలిరోజు మంత్రి గల్లా అరుణకుమారి, చిత్తూరు ఎంఎల్‌ఏ సికె బాబు మాత్రమే ఆయనకు స్వాగతం పలికారు. రెండో రోజు పర్యటన ఆద్యంతం వాళ్లు కూడా కనిపించలేదు.
ముచ్చటగా మూడు ముఠాలు
చిత్తూరు జిల్లా కాంగ్రెసు పార్టీ నేతల్లో తొలినుంచీ ఐక్యత లేదనేది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఇక్కడ ముఠాలు కొనసాగాయి. కాకపోతే ఆయన మరణం తర్వాత ఈ ముఠాలు బహిరంగంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడున్న రెండు శిబిరాలకు తోడు ఇప్పుడు కడప మాజీ ఎంపి జగన్మోహన్‌రెడ్డి ముఠా తోడయింది.
పెద్దిరెడ్డితో చిరకాలవైరం
తాజా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ, కిరణ్‌కుమార్‌రెడ్డికి మధ్య 30 సంవత్సరాలుగా రాజకీయ శతృత్వం ఉంది. ఏ దశలోనూ ఈ రెండు ముఠాల నడుమ సంబంధాలు లేవు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన మంత్రి వర్గంలో పెద్దిరెడ్డికి చోటు దక్కలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డిపై ప్రత్యక్షపోరు కొనసాగిస్తానని తెగేసి చెప్పారు. అంతేగాకుండా వచ్చే సంవత్సరం మార్చి లోపల ప్రభుత్వం కుప్ప కూలటం ఖాయమని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో ఈయనకు బలమైన అనుచరగణం ఉంది.
సిఎంపై ముగ్గురు ఎంఎల్‌ఏల రుసరుస
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై గుమ్మడి కుతూహలమ్మ, రవి, షాజాహాన్‌ గుర్రుగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో తనకు కాంగ్రెసు అభ్యర్థిత్వం దక్కనీయకుండా కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రయత్నించారని కుతూహలమ్మ విమర్శించారు. ఆమె సోనియాగాంధీ ద్వారా అభ్యర్థిత్వం దక్కుంచుకుని జిడినెల్లూరులో గెలుపు సాధించారు. పైగా జిల్లాలో సీనియర్నయినా తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించింది. బహిరంగంగానే ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తుతోంది. పూతలపట్టు, మదనపల్లి శాసనసభ్యులు రవి, షాజాహాన్‌ కూడా ముఖ్యమంత్రిపై రుసరుసలాడుతున్నారు. తనతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో వేరొకరిని ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారని షాజాహాన్‌ అసంతృప్తిగా ఉన్నారు.
అరుణపై సిఎం అసంతృప్తి
పర్యటనలో కనీసం తొలిరోజు కూడా జనం లేకపోవడంతోపాటు జగన్మోహనరెడ్డి ముఠా, తెలుగుదేశం నాయకులు తన వాహనానికి అడ్డుతగలడం, తిరుమలలో భక్తుల నుంచి నిరసనలు రావడం తదితర సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి లోనయారని చెబుతున్నారు. దీంతో పోలీసు అధికారులతోపాటు, మంత్రి గల్లా అరుణకుమారిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగానే మంత్రి గల్లా రెండోరోజు ముఖ్యమంత్రి సొంత గ్రామ పర్యటనలోనే కనిపించలేదు.