రాళ్లసీమ నుంచి శాసనమండలి ఎన్నికల్లో పోటీబడుతోన్న కాంగ్రెసు అభ్యర్థి శ్రీధరరెడ్డి కోట్లాది రూపాయల్ని వెదజల్లుతున్నాడు. ఈయన లోక్‌సభ నంద్యాల సభ్యుడు, నందిపైపుల సంస్థ అధినేత ఎస్పీవై రెడ్డి అల్లుడు కావటం విశేషం. శ్రీధరరెడ్డి, ఎస్పీవైరెడ్డి నిలువెత్తు ఫొటోలను ముద్రించిన పదో తరగతి స్టడీ మెటీరియల్ పుస్తకాలను పశ్చిమ రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమమంతా విద్యాశాఖ కార్యాలయాల నుంచే, ఆ విభాగం అధికారుల పర్యవేక్షణలో జరుగుతుండటం విశేషం. విద్యాశాఖ కార్యాలయాల్లో నిల్వచేసిన వేలాది పుస్తకాలను అనంతపురంలో శనివారంనాడూ, కడపలో ఆదివారంనాడూ సిఐటియు కార్యకర్తలు పట్టుకున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ఓట్ల కొనుగోలుకు ధనిక అభ్యర్థులు ఎన్ని వ్యూహాలు పన్నుతారో వెల్లడయింది. అక్రమాలను వెల్లడించినందుకేమో సిఐటియు కార్యకర్తలపైనే దాష్టీకం చేసేందుకు పూనుకున్నారు తప్ప, అక్రమార్కులపై కనీసం కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఇచ్చగించలేదు.
కడప జిల్లాకు 18,472 పుస్తకాలను కేటాయించారు. ఒక్కొక్క పుస్తకం విలువ రూ. 200. అంటే ఈ జిల్లాలోనే రూ. 37 లక్షల విలువయిన పుస్తకాలను పంపిణీ చేసేందుకు పూనుకున్నారు. మూడు జిల్లాల్లోనూ పంపిణీ చేసేందుకుగాను కోటి రూపాయలకు పైగా విలువయిన పుస్తకాలను శ్రీధరరెడ్డి ముద్రించారు. ఓట్లను రాబట్టేందు పరోక్షంగా పనికొచ్చే కార్యక్రమానికే కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తే ఇక ప్రత్యక్ష కొనుగోళ్లకు ఎంత వెచ్చిస్తారో మరి?! విలువయిన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసి ప్రతిఫలంగా వారి బంధువుల గ్రాడ్యుయేట్ ఓట్లకు గాలం వేస్తున్నారు. దీనికితోడు తాము దానకర్ణులమంటూ ఉపాధ్యాయులనూ బుట్టలో వేసుకునేందుకు పన్నాగం పన్నారు. ఈ పుస్తకాలను కడప జెడ్పీ కార్యాలయానికి మూడు రోజుల క్రితం తరలించారు. ఈ పుస్తకాలను ఇప్పటికే కడప జిల్లాలో బద్వేలు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరుకు అధికారులు పంపేశారు.
Archive for డిసెంబర్ 5th, 2010
5 డిసెం
రాళ్లసీమలో కోట్లు వెదజల్లుతున్న శాసనమండలి ఎన్నికల కాంగ్రెసు అభ్యర్థి
5 డిసెం
”భార్యపై దాడి చేసి సోదరులు పరారు” ఈనాడు వెబ్‌సైట్ తెలుగుకు తెగులు
దినపత్రికల్లో తప్పులు రాకుండా రాయటంలో ఈనాడుదే ప్రథమ స్థానం. పొరబాట్లు జరగవచ్చుగాక, కానీ ఇప్పుడు ఈనాడులోనూ తరచూ తప్పులు దొర్లటం ప్రారంభమయింది. ఈ తెగులుకు ఆదిలోనే మందేయకపోతే చివరకు ఈనాడునే చంపేసే ప్రమాదముందన్న విషయం ఆ దినపత్రిక సంపాదకుడు రామోజీరావుకు తెలియంది కాదు. వాస్తవానికి భాషాభిమానులంతా తొలుత ఈనాడునే ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు.
సరే, అసలు విషయానికొస్తే… ‘భార్యపై దాడిచేసి సోదరులు పరారీ’ అన్న శీర్షిక 05 డిసెంబరు 2010న ఈనాడు వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. ఈ శీర్షిక చూస్తే, ఇద్దరు సోదరులు ఒక మహిళనే వివాహం చేసుకున్నారేమోనని అన్పిస్తుంది కదూ!. అయితే కథనంలో మాత్రం భిన్నంగా ఉంది. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఓ భర్త తన భార్యపై హత్యాయత్నం చేసిన తదుపరి తన తమ్ముడితో కలిసి పారిపోయాడు. ద్విచక్రవాహనంపై పారిపోతూ ఓ లారీని ఢీకొని సోదరులిద్దరూ అక్కడికక్కడే చనిపోవటం వేరే విషయం అనుకోండి. అదీ జరిగిన సంగతి. అయితే ఈ వార్తకు శీర్షిక రాసిన ఈనాడు వెబ్ ఉపసంపాతకుడు ఎవరోగానీ కనీసం ఆలోచించటం మానేశాడేమోనని అనుకోవాల్సి వస్తోంది.
మహిళపై దాడి చేసిన భర్త తన తమ్ముడితో కలిసి పరారవుతూ మృతి చెందాడు. ఆమె పరారవుతున్నవారిద్దరికీ భార్య కాదు. పెద్దవాడికి మాత్రమే ఆమె భార్య. భర్త తన తమ్ముడితో కలిసి పరారవుతున్నాడు అంతే. ఈ సంఘటనను ఇలా రాయొచ్చు….
1. భార్యపై దాడిచేసి పరారవుతూ భర్త మృతి
2. భార్యపై దాడిచేసిన భర్త
తమ్ముడితో సహా పారిపోతూ ప్రమాదంలో మృతి.
3. భార్యపై హత్యాయత్నం – పారిపోతూ రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
4. భార్యపై దాడిచేసిన భర్త
5. భార్యపై దాడిచేసిన భర్త పారిపోతూ ప్రమాదంలో తమ్ముడిసహా మృతి
6. పెళ్లాన్ని కొట్టి పారిపోతూ ప్రమాదంలో మొగుడు మృతి
7. పెళ్లాన్ని కొట్టి తమ్ముడిసహా పారిపోతూ రోడ్డు ప్రమాదంలో మరణం
8. పెళ్లాంపై హత్యాయత్యం … పరారవుతూ మొగుడు మృతి
9. పెళ్లాంపై హత్యాయత్నం
పారిపోతూ తమ్ముడిసహా భర్త మృతి
10. భార్యపై దాడి అనంతరం పారిపోతూ ప్రమాదంలోతమ్ముడిసహా భర్త మృతి
ఇలా రాసుకుంటే పోతూ ఇంకా చాలా చాలా రాయోచ్చు.
కార్యనిర్వాహక సంపాదకుడు సీహెచ్ కిరణ్ జాగ్రత్త పడకపోతే గతంతో పోలిస్తే అంతోఇంతో వెలుగు కోల్పోయిన ఈనాడు నిన్నగా మారే ప్రమాదం పొంచి ఉంది