మూసి పెడితే పాచి పోతుందన్న సామెత చందంగా నాటి జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నేటి మన్మోహన్ సింగ్ వరకూ గత ఆరుదశాబ్దాలుగా చేస్తున్నదదే. ‘మీరిలాగే వ్యవహరిస్తే ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్న అవినీతిని కాదు మొత్తం కాంగ్రెసు పార్టీనే గౌరవ ప్రదంగా పూడ్చి పెట్టేందుకూ వెనుకాడను నేను’ అంటూ ఓ పరి మహాత్ముడు మండిపడ్డారు. 1935 బ్రిటీష్ ఇండియా చట్ట ప్రకారం 1937లో ఆరు రాష్ట్రాలలో ఏర్పడిన కాంగ్రెసు మంత్రివర్గాల తీరుతెన్నులపై ఆయన అలా స్పందించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఒకసారి కాంగ్రెసు కార్యనిర్వాహక సంఘ సభ్యుల జాబితా ఆమోదం కోసం దానిని గాంధీ దగ్గరకు పంపారు. దానిని చూసిన ఆయన ఫార్వర్డ్‌బ్లాక్ నాయకుడు ఈశ్వర్‌సింగ్ కేవేశ్వర్ పేరును ప్రస్తావిస్తూ, ఇదేమిటీ ఈ పేరును ఎలా చేర్చారు అని అడిగారు. ఇది తెలిసిన కేవేశ్వర్ అయ్యా నా తప్పిదం ఏమిటి? అని అడిగారు. వెంటనే గాంధీ తన అల్మారాలోంచి ఒక పోస్టుకార్డును తీసి కేవేశ్వర్ తీసుకున్న ఐదు వందల రూపాయల అప్పును తిరిగి చెల్లించలేదని వచ్చిన ఫిర్యాదును చదివి వినిపించారు. దానికాయన ”బాపూ అదెప్పుడో జరిగింది, ఇప్పుడు చట్టం ప్రకారం చెల్లించనవసరం లేదు” అన్నాడు. దానిపై గాంధీ స్పందిస్తూ ఇక్కడ సమస్య చట్టబద్దంగా చెల్లించాలా? లేదా? అని కాదు, నైతిక సమస్య’ అని వివరించారు. మరో సందర్భంలో గాంధీ మాట్లాడుతూ, ”అవినీతి, నంగనాచితనం ప్రజాస్వామ్య తప్పనిసరి ఉత్పాదనలు కానవసరం లేదు.
కానీ ఈ రోజు నిస్సందేహంగా అదే జరుగుతోంది.