Archive for డిసెంబర్ 10th, 2010

హిల్లరమ్మ హల్లరి హల్లరి

గూగుల్‌ విడుదల చేసే సమాచారం తమ సెన్సారు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పినందుకు చైనాను అమెరికన్లు నిరంకుశ, ఇనుపతెరల రాజ్యంగా వర్ణించారు. చైనా వంటి దేశాలపై తాను ప్రధానంగా సెన్సార్‌లేని ఇంటర్నెట్‌ వ్యవస్థ గురించే వత్తిడి తెస్తానని అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమె  ప్రభుత్వ శాఖలతో పాటు విశ్వవిద్యాలయాల ద్వారా బెదిరింపులకు దిగారు. పచ్చినిరంకుశ ఉత్తరువులు జారీ చేయిస్తున్నారు. వికీలీక్స్‌ విడుదల చేసిన సమాచారం ప్రభుత్వం ప్రకటించే వరకు రహస్యమేనట. దానిని విద్యార్దులెవరైనా చదివి,   అభిప్రాయాలను వెల్లడిస్తే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు అనర్హులను చేస్తారట. అదే కార్మికులు, ఉద్యోగులైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తారట.

ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు వాటిని చూసినా, చివరకు వాటిగురించి పత్రికల్లో రాసినవి చదివినా, ఇతరులకు పంపినా అది రహస్య జాతీయ భద్రతా సమాచారాన్ని ఉల్లంఘించినట్లేనట. అపర ప్రజాస్వామిక, స్వేచ్ఛా దేశంగా తనకు తాను కితాబులిచ్చుకొనే అమెరికా ఇప్పుడు ప్రపంచం ముందు నిలబడిన తీరిది. దానికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, తటస్థ దేశంగా చెప్పుకొనే స్వీడన్‌ వంతపాడుతున్నాయి. ఒకవేళ విదేశాల్లో ఉన్న అమెరికన్‌ సైనికులు పత్రికల్లో వీటి గురించి చదివితే వారిపై కూడా చర్య తీసుకుంటారా? ఎందుకీ అపహాస్యపు ఆదేశాలని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. వికీలీకులను ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలంటే గతంలో కోర్టులిచ్చిన తీర్పులు ఆటంకంగా మారతాయని పరిశీలకులప్పుడే తేల్చి చెప్పారు. అయినా వికీలీక్స్‌ పత్రాలను ప్రచురించిన న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కూడా కొందరు ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఇది అమెరికన్లు నిత్యం ప్రవచించే పత్రికా స్వాతంత్య్రానికే విరుద్ధం.

అమెరికా ప్రభుత్వం నేడు జారీ చేస్తున్న నిరంకుశ ఆదేశాలు, ఉత్తరువులు గతంలో బ్రిటీష్‌  చర్యలను తలపింపజేస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందు  ‘మాలపిల్ల’ వంటి ప్రఖ్యాతనవలను, భూసమస్యను ముందుకు తెచ్చిన  ‘మా భూమి’ నాటకాన్ని బ్రిటీష్‌ సర్కార్‌ ఆనాడు నిషేధించింది. విదేశాల నుంచి ఎవరైనా కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెచ్చినా, ఎవరిచేతుల్లో అయినా ఉంటే వారిని అరెస్టు చేసేది. ఇప్పుడు వికీలీక్స్‌ విడుదల చేసిన పత్రాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమెరికా సర్కార్‌ను, దోపిడీ వ్యవస్థను కూలదోసేందుకు ప్రేరేపించినట్లు లేవు. నిజానికి ప్రపంచంలో ఎవరు అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు, ఎవరు అమెరికా కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అలాంటి వారిని ఎలా దెబ్బతీయాలి వంటి దుష్టఆలోచనలు, సలహాలు, పథకాలను సూచిస్తూ ప్రపంచమంతటినుంచి అమెరికన్‌ రాయబారులు, వారి తైనాతీలు సహకరించేవారు పంపిన సమాచార పత్రాలవి. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చడానికి ఇచ్చిన సలహాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా ఇతర దేశాలకు వ్యతిరేకంగా జరుపుతున్న కుట్రలు, అందుకు ఎవరెవరితో చేతులు కలిపిందీ, ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిందీ అనే సమాచారం రాతపూర్వకంగా ఉన్న సాక్ష్యాలవి. అమెరికా, దాని మిత్ర దేశాల అసలు రంగు ప్రపంచానికి తెలిపిన కారణంగానే వికీలీక్స్‌పై అవి మండిపడుతున్నాయి. ఇరాక్‌, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌పై జరుపుతున్న దాడుల సమర్థనకు తమ  పౌరులను ఎలా మభ్యపుచ్చుతున్నదీ, అసలు నిజాలేమిటీ అన్న అంశాలు కూడా ఆ పత్రాల్లో ఉన్నాయి. అందుకే అమెరికన్లు వాటిని చదవకూడదని ప్రభుత్వం నిరంకుశ ఆదేశాలు జారీ చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు.

ప్రభుత్వ తీరుతెన్నులు ఇలా ఉంటే తమకు ఎవరన్నా లెక్కలేదు, ఎవరినైనా, ఏమైనా అంటాం, ఎలాంటి సమాచారాన్నాయినా లోకానికి వెల్లడిస్తాం అని భుజకీర్తులు తగిలించుకున్న ‘ట్విటర్‌, ఫేస్‌బుక్‌’ సంస్థల బండారం కూడా బయట పడింది. వికీలీక్స్‌ వెబ్‌సైట్‌ను దానికి సర్వర్లను సమకూర్చిన అమెజాన్‌పై వత్తిడి తెచ్చి అమెరికా ప్రభుత్వం అడ్డుకుంది. పేపాల్‌, విసా, మాస్టర్‌ కార్డ్‌ వంటి సంస్థల ద్వారా వికీలీక్స్‌కు విరాళాలు, ఇతర రూపాలలో డబ్బు బదలాయింపు జరగకుండా వాటిపై వత్తిడి తెచ్చి నిలుపు చేయించింది. ఇంతకంటే నిరంకుశ, అణచివేత చర్యలేముంటాయి.

అయితే ఎక్కడ ఈ దుర్మార్గాలు జరుగుతాయో అక్కడే ప్రతిఘటన  ఉంటుందన్నట్లుగా వికీలీక్స్‌ను అడ్డుకొనే సంస్థల వెబ్‌సైట్లపై అసాంజే అభిమానుల దాడులు దీనినే సూచిస్తున్నాయి. తనకు నచ్చని ఇతర దేశాల వెబ్‌సైట్లపై ఇలాంటి దాడులు చేయించటంలో అమెరికన్ల తరువాతే ఎవరైనా.  ఇప్పుడు అలాంటి వారికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ప్రతిఘటన ఎదురవుతోంది. అది ఒక ప్రయివేటు సంస్థలకే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటు వాటిపై వత్తిడి తెస్తున్న ప్రభుత్వ సైట్లపై కూడా  హాకర్లు దాడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. తన సిఐఏ కనుసన్నలలో పనిచేసే ఒక మహిళతో కండోమ్‌ లేకుండా శృంగారంలో అసాంజే పాల్గొన్నాడనే గడ్డిపోచ కేసును స్వీడన్‌లో దాఖలు చేయించి, బ్రిటన్‌లో అరెస్టు చేయించింది తప్ప, తన కంతలను పూడ్చుకోలేని అమెరికా సర్కార్‌ అతనిపై ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలాంటి కేసు నమోదు చేయలేని బలహీన స్థితిలో ఉంది. అమెరికా రాయబార, విదేశాంగశాఖ కార్యాలయాల అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా టన్నులకొద్దీ రహస్య పత్రాలను ఒక వ్యక్తిగా అసాంజే బయటకు తీసుకురావటం అసాధ్యమైన అంశం. ఒక వేళ తనను అరెస్టు చేసినా తమ వద్ద ఇంకా ఉన్న పత్రాలను బయటపెడతామని ఆసాంజే చేసిన ప్రకటన నేపథ్యంలో అమెరికా ఇంత నిరంకుశంగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది.