అవును, రైతు – రైతాంగం ఇవి రెండూ ఒకటి కాదు. ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదు. వీటికి వేరు వేరు అర్ధాలున్నాయి.
అయితే పత్రికలు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ రెండింటినీ కలగలిపి యడాపెడా వాడేశాయి. వాడేస్తున్నాయి. ఫలితంగా సమాజం కూడా అదే బాట పట్టింది.
అంతో ఇంతో పొలముండి, దానిలో వ్యవసాయం చేసేవాడు రైతు. అయితే రైతన్న వ్యవసాయం చేయాలంటే పలు ఇతరేతర అంగాలు పని చేయాలి. సహకరించాలి. తమ సేవలు అందించాలి. పొలం దున్నాలంటే నాగలి కావాలి. నాగలిని కంసాలి చేస్తాడు. దానికి అమర్చే ఇనుప కర్రును కమ్మరి చేస్తాడు. చెక్కను అవసరమయిన కొలతల్లో కోతపెట్టి, చెక్కి వస్తువుల్ని చేసేవాడే కంసాలి. అదే విధంగా బండి కూడా అంతే కంసాలికి కమ్మరి తోడు కావాల్సిందే. బండి చక్రాలకు తాపడం చేసే పట్టాలు, ఇరుసు, ఇరుసు నుంచి చక్రాలు జారిపోకుండా పెట్టే చీల, చక్రం కుండ పగిలిపోకుండా వేసే పట్టా, ఇక కొడవలి, చెలక పార, గొడ్డలి, గునపం ఇలా పలు వస్తువుల్ని కమ్మరే రూపొందిస్తాడు. ఇనుమును నిప్పులో కాల్చి వస్తు రూపమిచ్చేవాడే కమ్మరి. అంతేకాకుండా మేదర కార్మికుడి సేవలు కూడా కలుస్తాయి. బండిమీద జల్లను మేదర కార్మికుడు అల్లుతాడు. వ్యవసాయ పరికరాలయిన బుట్ట, గంప, జల్లెడ, కర్ర ఇలా పలు వస్తువులను మేదర కార్మికులు రైతుకు అందజేయాలి. కుండ, గాబు, తొట్టి ఇలాంటి వాటిని చేసిచ్చే కుమ్మరి కూడా వ్యవసాయంలో ప్రత్యక్ష భాగస్వామే. ఇక పాలేరు, రోజూవారి కూలీ కూడా వ్యవసాయంలో నేరుగా భాగస్వాములే. ఎలుకల్ని పట్టి పైర్లనూ, పంటల్నీ రక్షించే ఎరుకలవాళ్లు, జంతువుల నుంచీ, దొంగల నుంచీ పొలాన్ని, చెరువుల్నీ, కాలువల్నీ కాపలాగాచే కావలిగాళ్లు కూడా వ్యవసాయంలో ముఖ్యులే. వీళ్లు కాకుండా పరోక్షంగా మరి కొందరు తమతమ సేవలను రైతుకు సంక్రమంగా అందజేస్తున్నందునే సాగు పనులు సజావుగా సాగుతాయి. గుడ్డల్ని శుభ్రం చేసే చాకలి, క్షవరం చేసే మంగలి, ముహూర్తాలు పెట్టే పురోహితుడు, ఆ మాట కొస్తే వస్త్రాలను కుట్టే దర్జీ, కర్మకాండల్లో సహకరించే జంగమదేవర ఇలా ఇలా పలువురు రైతన్నలకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ సహకరించి పంటల దిగుబడికి సహకరిస్తుంటారు. వారిలో ఏ ఒక్కరు లేకపోయినా సాగు సక్రమంగా సాగదు. అందువలనే వీళ్లందరినీ రైతు అంగాలు అంటారు. ఈ రెండు పదాల్నీ కలగలిపి వాడితే అదే రైతాంగము అవుతుంది.
అందువలన పొలముండి, సాగు చేసేవాడిని రైతు అని, రైతుకు వివిధ వస్తురూపాలను, సేవలను అందజేసే వృత్తిదారుల్నీ కలిపి రైతాంగం అని అనాలి. ఈ తేడాను ముందుగా వార్తా ప్రపంచం గుర్తించాలి. చెప్పే అంశం రైతుకు సంబంధించినదా? లేక రైతుకు వివిధ రూపాల్లో సహకరించే వారందరిదీనా? అన్న విచక్షణతో ఈ రెండు పదాలనూ విడివిడిగా ఉపయోగించాలి.
Archive for డిసెంబర్ 15th, 2010
15 డిసెం