Archive for డిసెంబర్ 18th, 2010

అమ్మే తొలి గురువు


చిన్న పిల్లలకు మాటలు నేర్పడంలో తల్లిదండ్రులతోపాటు ఉత్సాహపడనివారుండరు. పిల్లలు పలికే ముద్దుముద్దు మాటలకు మురిసిపోని వారెవ్వరు! మాటలు వినడంలోనూ, వాటిని గుర్తించడంలోనూ పిల్లల మెదడుపై ముందుగా ప్రభావం చూపేది మాత్రం అమ్మే. ఈ క్రమంలో తల్లి పాత్ర ఎంతో కీలకమని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నారులకు భాష నేర్పడంలో తల్లి స్వరం అద్వితీయమైన పాత్ర పోషిస్తుందని ఇటీవలి ఆవిష్కరణలు రుజువు చేశాయి. తల్లి చెప్పే మాటలకూ, ఆ స్వరానికీ చిన్నారుల మెడదు చురుగ్గా స్పందిస్తుందని మాంట్రియల్‌ విశ్వవిద్యాలయం, సెయింట్‌ జూస్టిన్‌ విశ్వవిద్యాలయ ఆసుపత్రి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. 24 గంటల కంటే తక్కువ వయసున్న పిల్లల మెదడు శబ్దాలకూ, తల్లి మాటలకు ఏ విధంగా స్పందిస్తోందో పరిశోధించారు. ఇతర మహిళల స్వరానికి కూడా చిన్నారులు స్పందిస్తున్నా, తల్లి మాటలను విన్నప్పుడు వారి మెదడు చురుగ్గా స్పందించటం గమనించారు. తల్లి స్వరం పిల్లలకు ప్రత్యేకమైందని మాంట్రెయిల్‌ విశ్వవిద్యాలయం ప్రధాన పరిశోధకులు డాక్టర్‌ మ్యారిస్‌ లసోండే చెప్పారు. వారి పరిశోధనలో భాగంగా నిద్రపోతోన్న 16 మంది పిల్లల తలలకు ఎలక్ట్రోడ్స్‌ను అమర్చారు. అనంతరం తల్లితో చిన్న శబ్దాన్ని చేయించారు. దీంతో పిల్లల మెదడు ఎడమ అర్ధ భాగంలో ఏర్పడిన స్పందన స్కాన్‌లో నమోదయింది. అదే కొత్తవారితో మాట్లాడించగా మెదడు కుడి అర్ధభాగంలో స్పందనలు వచ్చాయి. అయితే తల్లిని బిడ్డ ప్రత్యేకంగా గుర్తించింది. నర్సుతో అదే విధంగా మాట్లాడించగా బిడ్డ గుర్తు పట్టినా మెదడులో స్పందనలు మాత్రం తీవ్రంగా లేవని తేలింది. దీంతో బిడ్డకు భాష నేర్పడంలో అమ్మే తొలి మార్గదర్శిగా పరిశోధకులు నిర్ధారించారు.