Archive for డిసెంబర్ 19th, 2010

”కొబ్బరినూనె లేదని మా అమ్మే గుండు చేసింది సార్‌”

”కొబ్బరినూనె లేదని మా అమ్మే గుండు చేసింది సార్‌” అంటూ వినపడీ వినిపించనట్లు చెప్పి చొక్కాతో కళ్లు తుడుచుకున్నాడు. – గుండెల్ని పిండే గుండు విషాదం

”మొన్న మీరు మూగజీవుల పాఠం చెప్పారుగా మేడం. బలివ్వటం తప్పని చెప్పారుగా. మా ఇంట్లో నిన్న నేను పెంచుకుంటున్న మేకను కోసి కూర వండారు మేడం. దానికి నేనంటే ఎంత ఇష్టమో! దాన్ని చూడకుండా నేను ముద్దయినా ముట్టేవాణ్ని కాదు. పాపం దాని పొట్టలో రెండు పిల్లలు కూడా ఉండాయి మేడం.” అంటూ మళ్లీ వెక్కి వెక్కి ఏడ్వటం మొదలు పెట్టాడు. వాడి ఏడుపు ఆపటం ఎవ్వరి వల్లా కాలేదు. – బుద్ధం శరణం గచ్ఛామి

”సార్‌, అంతపెద్ద జంతువులు ఎలా దూరాయి? ఆ అడవిలో కాకులైనా దూరలేవన్నారు? కనీసం చీమలైనా దూరలేవన్నారు? మిరి ఇప్పుడేమో ఏనుగు, నక్క ఉంటున్నాయి అన్నారు. ఎలా దూరాయి సార్‌?” – ఎలా దూరాయి?

”స్వర్గంలో అన్నం దొరుకుతుందా సార్‌?” అనింది – ఎవరి స్వర్గం వారిది

”రేపట్నించి బడికి ఆలీసంగా రాను సారూ! అందరి కంటే ముందే వస్తాను. ఎందుకంటే ఇన్నాళ్లూ జరానబడ్డ మాయమ్మ రాత్రే సచ్చిపోయింది. ఇంక మాయమ్మకు మందులిచ్చే పని, జావగాసి తాపే పని లేదుగా” అంది. – ఇంక బడికి అలీశంగా రాను సారూ!

”మా పిల్లలు పెంచలకోన తప్ప ఏ ఊరూ చూసినవాళ్లు కాదు. ఉన్నట్టుండి వాళ్లు నెల్లూర్లో వచ్చి వాలారు. ”ఊళ్లో తిరునాళ్లా సార్‌?” అని వాళ్లడిగినప్పుడు నా కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. – కొత్త మాస్టారు

”నిన్న మా అమ్మని మా నాన్న తప్పతాగి జుట్టుపట్టి లాగి కొట్టాడు సార్‌. మా అమ్మ గోడకు అనుకొని రోజంతా ఏడుస్తూనే ఉంది. నాకు బడికి రావాలనిపించటం లేదు సార్‌.” అని తడబడుతూ, ఉబుకుతున్న కన్నీళ్లను వొత్తుకుంటూ చెప్పింది. – నాకు బడికి రావాలనిపించటం లేదు సారూ!

”మా అమ్మ కొడుతుంది. ఇంక నువ్వు కూడా కొట్టు” అన్నది అంతే రెండోసారి పైకెత్తిన నా చేయి నాకు తెలియకుండానే దిగిపోయింది. – అమ్మ కొడుతుంది, ఇంక నువ్వు కూడా కొట్టు!

”సార్‌, మాకు ఉదయాన్నే తినటానికి ఏమీ ఉండదు. ఎప్పుడన్నా చద్దన్నం ఉంటుంది. ఆకలేసి ఏమన్నా పెట్టమంటే మా అమ్మ దెబ్బలు కొడుతుంది. అందుకే ఈ పని చేస్తున్నాం”. – ఈగలే వారి బ్రేక్‌ఫాస్ట్‌.

”నాకే రెక్కలుంటే మబ్బుల్లోకి ఎగిరి దేవుడి దగ్గరకు పోయి మా తరగతిలో అందరికీ మంచి పుస్తకాల సంచీలు ఉన్నాయి. అందరికీ చాలా చొక్కాలున్నాయి. పాస్‌బెల్‌కి కొనుక్కోవటానికి డబ్బులున్నాయి. మా నాన్న నాకేమీ ఇవ్వడు. ఎప్పుడూ కల్లు తాగొచ్చి అమ్మని, నన్ను కొడతాడు. మా నాన్నని కల్లు తాగనీయకుండా చేయమని దేవుడిని అడుగుతాను” – నాకే రెక్కలుంటే …

”టీచరుగారండీ శ్రీను రోజూ సరిగా తోముకోడండి. అందుకే వాడివన్నీ పిప్పి ఫలాలే” అని అన్నాడు. – పిప్పి ‘ఫలాలు’

”తండ్రీ, నేర్చితి చదువుల సారమెల్ల” అన్నాడట ప్రహ్లాదుడు. ఈ రోజుల్లో ఎవరయినా ఆ మాట అంటే నేనూరుకోను. అనుభవాలు పంచుకుందాం పుస్తకాన్ని చదవకుండా అన్నీ నేర్చుకున్నానని ఎవ్వరయినా అంటే నేను ఒప్పుకోను.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బుజ్జి బుజ్జి బుడుగులతోనూ, సీగాన పెసూనాంబలతోనూ తమ అనుభవాలను మనతో పంచుకునే పుస్తకమే … ఈ అనుభవాలు పంచుకుందాం – 1/2 పుస్తకాలు. జనవిజ్ఞానవేదిక, మంచిపుస్తకం ఉమ్మడిగా ప్రచురించిన ఈ పుస్తకాన్ని గత శుక్రవారంనాడు హైదరాబాదు నక్లెస్‌రోడ్డులో జరుగుతోన్న పుస్తక ప్రదర్శనలో కొని ఆ రాత్రికే మొత్తం 212 పేజీలనూ ఒక్కుమ్మడిగా చదివేశాను. వాస్తవానికి వీటిలో కొన్ని అంశాల్ని పదేళ్ల క్రితమే రాష్ట్ర విద్యాశాఖ మాస పత్రిక చదువు విజ్ఞానంలో చదివాను. తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు వి బాలసుబ్రమణ్యం ఆ మాస పత్రికను అద్భుతంగా తెచ్చేవారు. ఆ మాసపత్రికలో ప్రచురించిన అంశాలను విడదీసి ఎనిమిది పుస్తకాలుగా ఇప్పుడు తెచ్చారు. అందులో అనుభవాలు పంచుకుందాం – 1-2 భాగాలున్నాయి.
ఈ అనుభవాలను చదువుతుంటే ఆనాడు ఉపాథ్యాయులు అనుభవించిన స్పందనలే మనకూ కలుగుతాయంటే అతిశయోక్తి కాదు. కొన్న అనుభవాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. మరికొన్ని ఆవేదన కల్గిస్తాయి. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. వెరసి అన్నీ ఆలోచింపజేస్తాయి.
52వ పేజీలో ప్రచురితమయిన ఏ.వీ హనుమకుమార్‌ అనుభవం ‘ఇంక బడికి ఆలీశంగా రానుసారూ’ కథనం చదివి కన్నీటి పర్యంతం కాని వారెవరూ ఉండరని నా నమ్మకం. పాఠశాలకు వారం రోజులపాటు ఆలస్యంగా వస్తూ, ఉపాధ్యాయుడితో తిట్లు తింటూనే మౌనం పాటించిన నాలుగో తరగతి మమత ”ఓరోజున ఆలస్యానికి చెప్పిన కారణాన్ని వింటే గుండెలు కరిగిపోవలసిందే. ”రేపట్నించి బడికి ఆలీసంగా రాను సారూ! అందరి కంటే ముందే వస్తాను. ఎందుకంటే ఇన్నాళ్లూ జరానబడ్డ మాయమ్మ రాత్రే సచ్చిపోయింది. ఇంక మాయమ్మకు మందులిచ్చే పని, జావగాసి తాపే పని లేదుగా” అంది.  దీనికి ఇంకా వ్యాఖ్యానం అవసరమనుకోను. ఈ పుస్తకంలోని కథనాలన్నీ దేనికవే ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తాయి. మనల్ని ఆలోచింపజేస్తాయి.
వీలున్న మిత్రులంతా ‘చదువుల సారం’ శీర్షికన ప్రచురించిన పుస్తకాలను చదువుతారని ఆశిస్తున్నాను.