రు.50-100 మధ్య పెంపుదలకు రంగం
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ‘బాంబు’ను ప్రయోగించే యోచనలో ఉంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వంటగ్యాస్ బండకు రు.50 నుంచి రూ. 100 వరకూ పెంచాలన్న ప్రతిపాదనలను కేంద్ర చమురు మంత్రిత్వశాఖ చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ అంశంపై డిసెంబరు 22 లోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. అంటే కేంద్ర ప్రభుత్వం క్రిస్టమస్ కానుకగా గ్యాస్ బాంబు వదలనున్నదన్నమాట. అంతర్జాతీయంగా గ్యాస్ ధర 66 శాతం పెరగటంతో దేశీయంగా కూడా భారం మోపటం అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపాయి. అంతర్జాతీయ ధర పెరుగుదలతో దేశీయ వినియోగం కోసం ఏటా 30 లక్షల టన్నుల గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థల లాభార్జనకు గండిపడిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అంతర్జాతీయ ధరల పెరుగుదలతో జనవరి నుంచి ఒక్కొక్క బండకు ఇస్తున్న రాయితీ రు.367కు పెరగనున్నదని ఈ వర్గాలు తెలిపాయి. ఇది ప్రస్తుతం వినియోగదారులకు అందచేస్తున్న ధర రు.345.35 కన్నా ఎక్కువ. ధర పెంపుదల తర్వాత రాజకీయ పరిణామాలను అంచనా వేసిన అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఉన్నతాధికార మంత్రుల బృందం గ్యాస్, డీజెల్ ధరల పెంపుదలను పరిశీలించేందుకు బుధవారం న్యూఢిల్లీలో భేటీ అవనుంది. ధరల పెంపుదల ప్రతిపాదనలకు చమురు మంత్రిత్వశాఖ మంత్రుల బృందం ఆమోదాన్ని పొందాల్సి వుంది. వంటగ్యాస్, డీజెల్ ధరలు ఏ మాత్రం పెరుగుతాయన్న విషయాన్ని తాము చెప్పలేమని, కేవలం వాస్తవ పరిస్థితులను మంత్రుల బృందానికి వివరించటమే తమ పని అని చమురు మంత్రిత్వశాఖ అధికారి వివరించారు.
Archive for డిసెంబర్ 20th, 2010
20 డిసెం