Archive for డిసెంబర్ 23rd, 2010

పంట నష్టాలకు 167 మంది రైతన్నల బలి


కౌలు రైతులే 115 మంది
గుండెపోటుతో 93 మంది … ఆత్మహత్య చేసుకుని 74 మంది
గుంటూరులో అత్యధికం 28 మరణాలు
అందులో కౌలు రైతులు 26 మంది
గుంటూరు, ఖమ్మంలో అత్యధికంగా 10 మంది చొప్పున ఆత్మహత్య
గెండెపోటు మరణాలూ గుంటూరులోనే అధికం

ఈ ఏడాది సార్వా కాలమంతా అతివృష్టి రైతన్నకు ఉరివేసింది. మేలో లైలా తుపానుతో ప్రారంభమయిన వానలు రైతన్న అంతం చూసి డిసెంబరులోగానీ పోలేదు. ఏళ్ల తర్వాత అతివృష్టి వ్యవసాయానికి గుదిబండే అయింది. విత్తిందే విత్తాల్సి వచ్చింది. నాటిందే నాటాల్సి వచ్చింది. ప్రభుత్వ పరపతి పుస్తకాల మదింపుతో సరిపోగా, ప్రైవేటు అప్పులే గతయ్యాయి. ఇక ఎరువుల కోసం నానాపాట్లు తప్పలేదు. అయినా చివరకు పంట చేతికొచ్చే సమయంలోనూ అకాల వర్షాలు అన్నదాతకు శాపమయ్యాయి. దాదాపు 50 లక్షల ఎకరాల్లో పంట నీటిపాలయింది. 20 లక్షల ఎకరాల్లో వరి, 10 లక్షల ఎకరాల్లో పత్తి ఎందుకూ పనికిరాకుండా పోయింది. బాధితుల్లో 60 శాతం మంది కౌలుదారులే కావటంతో రేపటి వ్యవసాయం పరిస్థితి అయోమయంలో పడింది. పంట నష్టపోయిన రైతన్నలు ఇప్పటి వరకూ 167 మంది చనిపోగా అందులో 115 మంది కౌలుదారులు కావటం గమనార్హం. చనిపోయినవారిలో 74 మంది ఆత్మహత్య చేసుకోగా, 93 మంది నేలవాలిన పంట పొలాల్ని చూసి అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలారు. ఈ విషాదానికి గుంటూరు జిల్లా అత్యధికంగా గురయింది. అత్యధిక మరణాలకు తోడు, కౌలుదారుల సంఖ్య, గుండెపోటు మరణాల సంఖ్య కూడా ఈ జిల్లాలోనే అధికం. ఆత్మహత్య చేసుకుని ఖమ్మం, గుంటూరులో పదేసి మంది చనిపోయారు. ఇది స్వాతంత్య్రాననంతర కాలంలోనే పెను విషాదం.
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 11 మంది రైతులు చనిపోగా, అందులో పది మంది కౌలు రైతులే. వారిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలివారు గుండెపోటుతో మరణించారు.
విజయనగరం జిల్లాలో కౌలుదారుడు ఒకరు గుండెపోటుతో చనిపోయాడు.
విశాఖ జిల్లాలో మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఓ మహిళసహా ఇద్దరు రైతులు గుండెపోటుతో చనిపోగా, మరొక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 20 మంది చనిపోయారు. అందులో కౌలుదారులు 16 మంది కాగా, నలుగురు రైతులున్నారు. వారిలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడగా, 15 మంది గుండెపోటుతో చనిపోయారు.
గుంటూరు జిల్లాలో మొత్తం 28 మంది చనిపోయారు. అందులో 26 మంది కౌలుదారులున్నారు. 18 మంది గుండెపోటుతో చనిపోగా, మిగిలిన పది మంది ఆత్మహత్య చేసుకున్నారు.
కృష్ణాజిల్లాలో 24 మంది రైతన్నలు చనిపోగా అందులో 21 మంది కౌలుదారులే. ఈ జిల్లాలో 16 మంది గుండెపోటుతో చనిపోయారు. ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో మొత్తం ఆరుగురు చనిపోగా, అందరూ కౌలు రైతులే. వారిలో ముగ్గురు గుండెపోటుతోనూ, మిగిలినవారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
నల్గండ జిల్లాలో గుండెపోటుకు గురయి ఇద్దరు, ఐదుగురు ఆత్మహత్య చేసుకుని మొత్తం ఏడుగురు చనిపోయారు. అందులో నలుగురు కౌలు రైతులు కాగా, ముగ్గురికి సొంత భూమి ూంది.
వరంగల్‌ జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు, మరొక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఖమ్మం జిల్లాలో 21 మంది చనిపోయారు. అందులో 11 మంది కౌలు రైతులు. 11 మంది గుండెపోటుతో చనిపోగా, పది మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తూర్పుగోదావరి జిల్లాలో 14 మందికిగాను ఆరుగురు కౌలు రైతులు. అందులో 13 మంది గుండెపోటుతో చనిపోగా, ఓ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం జిల్లాలో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
కర్నూలు జిల్లాలో మొత్తం 14 మంది చనిపోగా అందులో ముగ్గురు రైతులు. ముగ్గురు గుండెపోటుతోనూ, ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
కడప జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం ఐదుగురు రైతులు, మరొక కౌలుదారులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.