Archive for డిసెంబర్ 25th, 2010

ప్రజల నాడి పట్టేందుకు 15 కోట్లు ఎరవేసిన జగన్మోహనరెడ్డి


స్వచ్ఛంద సంస్థలకు ఆహ్వానం
ద్వితీయ స్థాయి నాయకత్వానికి ఫోను రాయబేరాలు
రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించిన కడప మాజీ ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజల నాడి తెలుసుకునేందుకు సిద్ధమౌతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు స్వచ్చంద సంస్థలతో పరిశీలన చేయించనున్నారు. పరిశీలన చేసినందుకుగాను ప్రతి సంస్థకూ లక్ష రూపాయల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ. 14.70 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోన్న స్వచ్ఛంద సంస్థలకు ఆయన అంతర్జాలంలో ఆహ్వానం పలికారు. పరిశీలన ఎలా ఉండాలో సూచించారు. పరిశీలన కార్యక్రమానికి సిద్ధమైతే అంగీకారాన్ని తెలపాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలతోపాటు మరో మూడు సంస్థల ద్వారా కూడా ప్రజల నాడిని పట్టుకునేందుకు జగన్మోహనరెడ్డి నిర్ణయించారు.
మండలానికి రెండువేల మందితో ముఖాముఖి
ప్రతి మండలంలో రెండు వేల మందిని ముఖాముఖి ప్రశ్నించి నాడిని పట్టాలని అంతర్జాలంలో సూచించారు. నియోజకవర్గంలో సాధారణంగా నాలుగయిదు మండలాలు ఉంటాయి. అందువల్ల నియోజకవర్గానికి కనీసం ఎనిమిది వేల మంది నుంచి పది వేల మంది అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసిన గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి తాము సూచించిన ప్రశ్నలతో వారిని వేధించాలి.
పట్టాల్సిన అంశాలు ఇవీ
జగన్మోహనరెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారా? ఇలా ఆయన వ్యవహారశైలి గురించీ, రాజకీయ ప్రవేశంపైనా పది అంశాలున్నాయి. దీనికితోడు నియోజకవర్గంలో బలమైన సామాజిక తరగతికి చెందిన ముగ్గురి నాయకుల పేర్లను కూడా సంస్థలు సూచించాలి. ఎంపిక చేసిన నాయకులు రాజకీయ కుటుంబానికి చెంది, ఆర్థికంగా బలంగా ఉండాలని సూచించారు. ప్రజల్లో వారికున్న పలుకుబడి తీరును సంస్థలు సేకరించాలి.
స్థానిక నేతలపై ప్రత్యేక దృష్టి
జగన్మోహనరెడ్డి తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు స్థానిక నేతలపై దృష్టి సారించారు. సర్పంచుల, ఎంపిపి, జెడ్‌పిటిసి సభ్యుల వివరాలను తన సాక్షి యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన వారిపైనే దృష్టి సారించారు. నేతల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్నీ, రాజకీయ పలుకుబడికి సంబంధించిన సమాచారాన్ని సాక్షి విలేకరుల బృందాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాపితంగా సేకరిస్తున్నాయి.
నాయకులతో ఫోను రాయబేరాలు
సాక్షి యంత్రాంగం ద్వారా ముఖ్యుల ఫోను నంబర్లను కూడా సేకరిస్తున్నారు. అనంతరం వారికి ఫోను చేసి మాట్లాడుతున్నారు. కడప కేంద్రంగా ఈ పని సాగుతోంది. రాష్ట్ర భవనాలు- రహదారులశాఖ మంత్రి ధర్మాన సోదరుడు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనభ్యుడు కృష్ణదాస్‌కు ప్రత్యేకంగా జగన్మోహనరెడ్డి ఫోను చేసి తన కొత్త పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిసింది. మాజీ ప్రజాప్రతినిధులనూ ఆయన ఆహ్వానిస్తున్నారు. ముఠా రాజకీయాల నేపథ్యంలో నేతలను గుర్తించి వారిని ఆకర్షించేందుకు ఫోను రాయబేరాలు సాగిస్తున్నారు.

మన ఆరోగ్యానికి మనమే తూట్లు … హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఆయర్వేద వైద్యుడు ఏల్చూరి


మన ఆరోగ్యానికి మనమే తూట్లు పొడుచుకుంటున్నామని ఆయుర్వేద వైద్యుడు ఏల్చూరి వెంకటరావు వివరించారు. హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఆయన శుక్రవారం జనరంజకంగా ప్రసంగించారు. తన అనర్గళ ఉపన్యాసంతో ఆయన ప్రేక్షకులను నిజంగా కట్టిపడేశారు. ఉపన్యాసంలో ఆంగ్ల పదాలు లేకపోవటం విశేషం. సహజసిద్ధమయిన పల్లె పదాలను అలవోకగా ఉపయోగిస్తూ ఏల్చూరి చేసిన ఉపన్యాసం కమ్మని కంఠంతో సాగింది. ఆయన బోధనల్లో శాస్త్రీయ ఎంతుందో నాకు తెలియదు. అయితే ఆయన ఏ రోగానికీ రసాయనిక పదార్థాలను ఔషదాలుగా సూచించలేదు. సహజ పదార్ధాలను మాత్రమే నానబెట్టో, పిండి చేసుకునే, రెండు మూడు రకాలను కలుపుకునో తినమని సూచించటం గమనార్హం. అందువలన ఆయన సూచనలను పాటిస్తే లాభం, రోగం తగ్గటం మాట అటుంచి నష్టం మాత్రం లేదని చెప్పవచ్చు. దీనికితోడు తాను చెప్పినంత మాత్రాన నమ్మాల్సిన పనిలేదనీ, ఎవరి అనుభవంతో వారే రోగ నిదానాన్ని గుర్తించొచ్చని చెప్పటం ప్రశంసనీయం. ఆచరణీయం.
ఏల్చూరి ప్రవచించిన ఆరోగ్య సూత్రాలు ఇవీ :
1. విదేశీ వ్యాపారుల మాయమాటలకు లొంగి రసాయనికాలను వినియోగించి రోగాలు కొనితెచ్చుకోవద్దు.
2. రసాయనిక టూత్‌పేస్టుల వలన చిన్నతనంలోనే దంత సమస్యలు ఏర్పడుతున్నాయి. వేప పుల్లతో తోముకున్న పాత తరాలవారికి ఈ సమస్యలు లేవు.
3. రోజూ నాలుగు చెంచాల యవలు, ఒక చెంచా మెంతుల్నీ 24 గంటలపాటు నానపెట్టి తింటే పలు రోగాలు దరిచేరవు.  రోగాలు నిదానిస్తాయి.
4. ఉదయం పూట తొమ్మిది గంటల లోపు, రాత్రి వేళ ఏడు గంటల లోపు భోజనం పూర్తి చేసేవారికి అనారోగ్యం దరిచేరదు. మధ్యాహ్నం ఉపాహారం తినవచ్చు. అయితే ఆ సమయంలో నిద్ర పోవద్దు.
5. పీఠమీదగానీ, కిందగానీ కూర్చుని భోజనం చేయాలి. ముద్ద కోసం వంగాల్సిన సమయంలో పొట్ట నిండిన విషయాన్ని గుర్తించే వీలుంది. పైగా అది శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది.
6. ఆహారాన్ని కొంతయినా నమిలి తినాలి.
7. పడుకునే సమయానికి కనీసం మూడు గంటల ముందు భోజనాన్ని పూర్తిచేయాలి.
8. ఇంటిలోనే చిన్నపాటి వ్యాయామాలు చేసినా ఆరోగ్యం పాడవదు.
9. వంటకు ఆముదం మంచిది. వంటికి నువ్వుల నూనె రాసుకుంటే మేలు చేస్తుంది.
10. తినకూడని పదార్ధాలు లేవు. అయితే ఎంత, ఎప్పుడు తినాలో తెలుసుకుని ఆచరించాలి.
సమాజిక అంశాలు :
1. స్వాతంత్య్రద్యమకారుల ఆశయాలు నెరవేరలేదు.
2. విదేశీ వ్యాపారుల రాజ్కం కొనసాగుతోంది.
3. 23వ ఏటనే ఉరికంభానికెక్కిన భగత్‌సింగ్‌ సిద్ధాంతాలను ఆచరిస్తే మంచి సమాజం ఏర్పడుతుంది.
4. ఈ లోకాన్ని వదిలిపోయినవాళ్లెవ్వరూ ఇంత వరకూ తిరిగొచ్చి స్వర్గం, నరకం ఉందని చెప్పలేదు. అందువలన ఈ భూమి మీదే మంచి అలవాట్లతో స్వర్గాన్ని సృష్టంచుకోవాలి. మన అక్రమ చర్యలే నరకాన్ని సృష్టిస్తున్నాయి.
5. ప్రత్యేకంగా దేవుడు, దయ్యం లేవు. మంచి అలవాట్లే దేవుడు. చెడ్డ అలవాట్లే దెయ్యాలు.
6. అమ్మ భాషలో చదువు మానసిక అభివృద్ధికి దోహదపడుతుంది. విదేశీ భాషల్ని అవసరం మేరకు నేర్చుకోవటం తప్పుకాదు.
7. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు.
8. విదేశీయులు తమ వ్యాపారాలు చేసుకునేందుకే ఖర్చులేని ఆయుర్వేదాన్ని తొక్కేస్తున్నారు.
9. పిల్లల్లో దేశభక్తిని పెంపొందింపజేయండి.
10. ధైర్యమే అన్నింటినీ జయింస్తుంది. భయపడితే తాడే పామై కాటేస్తుంది.