పొలాల్లో మరణ మృదంగం… ఒక్కరోజే 34 మంది అన్నదాతలకు ప్రభుత్వం చావురాత


మూడెకరాలకు 12 బస్తాల దిగుబడి
కల్లంలోనే కుప్పకూలి రైతు మృతి
కౌలు భూమిలో నలుగురు ఆత్మహత్య

రాష్ట్రంలో ఏ పొలంలో విన్నా మరణమృదంగం వినపడుతోంది. ఒక్క సోమవారంనాడే రాష్ట్రవ్యాపితంగా 34 మంది అన్నదాతలకు ప్రభుత్వం చావురాత రాసింది. కల్లంలోనే రైతన్నలు నిలువునా కుప్పకూలుతున్నా ప్రభుత్వ వైఖరిలో ఏ మాత్రం మార్పులేదు. నలుగురు రైతన్నలు పొలంలోనే పురుగుమందు తాగి గుండె మంటను చల్లార్చుకున్నారు.
ఆ రైతన్న పొలంలో ఇప్పటిదాకా ఎకరానికి సగటున 30 బస్తాల దిగుబడి వచ్చింది. అదే ఇప్పుడు మూడెకరాల్లో కలిపి కేవలం 12 బస్తాలే దిగుబడయ్యింది. దీంతో ఆ రైతు గుండె నిరాశా సముద్రమయింది. మానసిక ఒత్తిడికి గురయ్యాడు. పొలంలోనే పురుగుమందు తాగాడు. ఆ అన్నదాత శ్వాస అనంతవాయువుల్లో కలిసిపోయింది.
అది మూడెకరాల చెక్క. వరి నూర్పిడి జరుగుతోంది. మొత్తం 20 బస్తాల దిగుబడి వచ్చింది. అంతే సాగుదారుడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. తన కలల్ని పండించాల్సిన కల్లంలోనే కన్నుమూశాడు.
మరో ముగ్గురు రైతులు నిన్నటిదాకా తమకూ, సమాజానికీ పట్టెడన్నం పెట్టిన పొలం సాక్షిగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా, ఇంకా పలువురు రైతన్నలు దిటవు తప్పి, ఒత్తిడికి లోనై గుండెపోటుతో కన్నుమూశారు.
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నగరానికి చెందిన కౌలుదారుడు వడ్లమూడి ప్రసాద్‌ (35) లక్షన్నర రూపాయల అప్పు చేసి మూడెకరాల్లో వరి సాగు చేశాడు. ఎకరానికి నాలుగు బస్తాల చొప్పున మూడెకరాలకు 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో అప్పు కళ్లముందు తారట్లాడుతుండగా పొలంలోనే పురుగుల మందు తాగి తుదిశ్వాస విడిచాడు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం పంచాయతీ మాధవరాయపురం గ్రామ రైతు చౌదరి ఎర్రన్నాయుడు (50)కి మూడెకరాల భూమి ఉంది. వరిసాగుకు రూ.45 వేలు ఖర్చు పెట్టాడు. అకాల వర్షాలకు తడిసి ముద్దయిన పంటను కల్లానికి చేర్చి నూర్చాడు. మూడు ఎకరాలకుగాను కేవలం 20 బస్తాల దిగుబడి రావడంతో కల్లంలోనే కుప్పకూలిపోయి కన్నుమూశాడు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రులో కౌలురైతు మేకా వెంకటేశ్వర్లు (43) రెండున్నర ఎకరాల్లో వరిపంట నానిపోయింది. ధాన్యం రంగు మారిపోయింది. ఎవరూ కొనుగోలు చేయలేదు. ఒత్తిడికి గురై సాగుచేసిన భూమిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. కాళ్ల మండలం కోపల్లె కౌలురైతు గాదిరాజు ప్రసాదరాజు (48) ఎనిమిదెకరాలు కౌలుకు చేస్తున్నాడు. వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ప్రాణాలదిలాడు. యలమంచిలి మండలం చించినాడ అరుంధతీపేట కౌలురైతు శెట్టిమి కన్నయ్య (55) తాను కౌలుకు చేసిన పొలంలో ఎకరానికి 10 బస్తాలే దిగుబడి వచ్చింది. కన్నయ్యకు కల్లంలోనే గుండెపోటు వచ్చి మృతి చెందాడు. పాలకోడేరు మండలం పెన్నాడ చినపేట కౌలురైతు గోగి కుటుంబరావు (55) పంట నష్టాన్ని తట్టుకోలేక సోమవారం తెల్లవారు జామున గుండెపోటుతో దుర్మరణం చెందాడు. జీలుగుమిల్లి మండలం పి.రాజవరంలో రైతు కూసం గంగిరామిరెడ్డి (55) కూడా గుండెపోటుతో మృతి చెందాడు. సార్వా పంట నాశనం కావడంతో పోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన గొట్టుముక్కల వెంకట్రాజు (65) గుండెపోటుతో మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అనాతవరం కౌలురైతు దేశింశెట్టి సత్తిబాబు (40) వ్యవసాయ అప్పును పదేపదే తలచుకుని తలచుకుని గుండెపోటుతో మృతి చెందాడు. గొల్లపాలెం మండలం కాజులూరులో పంట నష్టంతో మనస్థాపం చెంది కౌలురైతు తాతయ్య మృతి చెందాడు. ఏడెకరాలు కౌలుకు సాగు చేసి నిండా మునిగిన సామర్లకోట మండలం ఉండూరు రైతు మండపాక కృపారావు (40) దిగులుతో నిద్రలోనే గుండెపోటుకు గురయ్యాడు. విశాఖజిల్లా చీడికాడ మండలం దండిసురవరం గ్రామానికి చెందిన వేపాడ మోదినాయుడు (60)కు ఎకరంన్నర పొలముంది. రూ.30 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. అకాలవర్షాలకు పంట మొత్తం పోవడంతో వారం రోజుల నుంచీ మనోవ్యథతో మంచం పట్టాడు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా తిమ్మలబిడిమిలో కౌలు రైతు గంగారావు గుండెపోటుతో మృతి చెందాడు.
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నగరానికి చెందిన వల్లాల వెంకటేశర్లు (61) పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. ఇదే మండలం గరికపాడులో కటికాల కోటయ్య (55) కౌలుకు తీసుకున్న ఎనిమిదెకరాలకు మూడు లక్షల అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం కానరాక వేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఓర్చు పిచ్చయ్య (60) సాగుకోసం రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. తీర్చేదారి కానరాక గుండెపోటుతో చనిపోయాడు. శావల్యపురం మండలం కారుమంచి రైతు ఉప్పుమాగులూరి రామయ్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సరావుపేట మండలం రంగారెడ్డిపాలెం రైతు కటికం వెంకటేశ్వర్లు (45) దిగుబడి తగ్గడంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. వెల్దుర్తికి చెందిన కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి(26) సాగుకు రెండు లక్షల రూపాయలు అప్పుచేశాడు. దిగుబడులు తగ్గడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ రైతు మంచెంశెట్టి శేషయ్య(55) సాగుకూ, దుక్కిటెడ్లకూ దొరికిన చోటల్లా అప్పులు తెచ్చాడు. స్పందన సూక్ష్మరుణ సంస్థ నుంచి కూడా రూ.50 వేలు అప్పు చేశాడు. చేతిలో చిల్లిగవ్వలేక సార్వాలో విత్తనం వేయలేదు. అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తుండటంతో అతని తలలో నరాలు చిట్లిపోయాయి. ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేశారు. అయినా కోమాలోనే శేషయ్య ఆదివారం రాత్రి మృతి చెందాడు. దర్శి మండలం తూర్పువీరయ్యపాలెంలో రైతు కొండయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన వినుకొండ వెంకట రమణయ్య (60) తన ఐదెకరాల పొలంలో వివిధ పంటలు వేసి నష్టపోయాడు. ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణాజిల్లా గూడూరు మండలం గంటలమ్మపాలెం కౌలు రైతు చండిక బాలయ్య (60) సాగుకు చేసిన అప్పులతో మానసిక ఒత్తిడికి గురయి మృతి చెండాడు. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరికి చెందిన బప్పాళ్ల రంగారావు (44) అప్పుల బాధ తాళలేక సోమవారం గుండె పోటుతో మృతి చెందాడు. వేదాద్రికి చెందిన మహిళా కౌలు రైతు గునిశెట్టి తిరుపతమ్మ కూడా అప్పులోళ్ల వేధింపులను తట్టుకోలేక మృతి చెందింది. ఆమె సూక్ష్మరుణ సంస్థ నుంచి రూ.20 వేలు, ప్రయివేటుగా మరొక లక్ష రూపాయలు వడ్డీకి తీసుకుంది. పంటలు నష్టపోవటంతో వాటిని ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై మృతి చెందింది. విశాఖ జిల్లా మాడుగుల మండలం తాటిపర్తికి చెందిన కౌలుదారుడు పాము చిన్న కొండలరావు (45) కౌలు పొలంలో పంట పూర్తిగా పోవటంతో గుండెపోటుతో చనిపోయాడు.
కరీంనగర్‌ జిల్లా రాజన్నపేటలో భూక్యా నాజం (30) పత్తి సాగుకు రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. పంట చేతికందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మాడుగులలో రైతు పోలే రవి పంటనష్టం కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తళ్లపెంటలో పంటనష్టపోయిన రైతు మహిళ వీరవెంకటమ్మ సాగుకోసం చేసిన లక్ష రూపాయలు అప్పు తీర్చలేక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందింది. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన మేడిద వీరస్వామి(46) కొండాయిల్‌పల్లిలో తనకున్న రెండు ఎకరాల భూమిలో పత్తి సాగుచేశాడు. అకాలవర్షాలతో పత్తికి నష్టం వాటిల్లి దిగుబడి తగ్గిపోయింది. అప్పులు మిగిలాయి. కొన్ని రోజులుగా మనోవేదనతో మౌనంగా కాలం గడిపాడు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల పేరారం నర్సింహా రెడ్డి (52)కి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. అప్పు సొమ్మును తీర్చాలంటూ అప్పుదారులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన తన పొలంలోని చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెక్కల యాదగిరి(45) పంట నష్టపోయి తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వేరుశనగ సాగుకోసం అప్పు ఇచ్చిన దాతలు తమ సొమ్ము చెల్లించాలంటూ వేధించటంతో అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు రైతు చంద్రశేఖర్‌ (55) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.

One response to this post.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: