కన్నీటి సంద్రాన రాష్ట్ర రైతన్న


”చేతికొచ్చిన పంట పోయింది. ఏమీ మిగల్లా… వేలకు వేలు అప్పు మాత్రం మిగిలింది.” – అనంతపురం, విశాఖ, రంగారెడ్డి, తూర్పుగోదావరి, మెదక్‌, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్‌ ఇలా ఏ జిల్లా రైతన్నను కదిలించినా ఒకటే మాట వినపడుతోంది. ఒకటే కన్నీరు కారుతోంది. ప్రారతంతో సంబంధం లేదు. పంటతో సంబంధం లేదు. అన్నదాతలందరిదీ ఒకటే మాట. ”ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. పరిశీలించాల్సిన అధికారులూ ఇంతవరకూ ముఖం చూపలేదు. సాయం ఇస్తారో లేదో తెలియడం లేదు. అప్పులిచ్చినోళ్లు రోజూ వెంటబడతన్నారు. పొలం అమ్మి తీర్చుదామంటే కొనుక్కునేవాళ్లూ కనపడటం లేదు.” అంటూ కన్నీటి పాలవుతున్నారు.
ఏడెకరాలు సాగుచేస్తే అప్పులు మాత్రం దండిగా మిగిలాయని మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన కటిక మల్లాది(46) ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రోజు గడవాలంటే కూలికి పోవటం తప్ప మార్గం లేదని ఆ రోజు ఖిన్నుడయ్యాడు. ఇది మల్లాది ఒక్కడి మాట కాదు. గురువారం గుంటూరులో జరిగిన రైతు కోసం సభకు వచ్చిన రైతులందరి గుండె కోత. ప్రజాశక్తి ప్రతినిధులు పలకరించిన రైతులంతా తమగోడు వెళ్లబోసుకుంటూ కంట కన్నీరు పెట్టారు.
వివిధ ప్రాంతాలకు చెందిన రైతుల గోడు వారిమాటల్లోనే….
రూ. 30 వేలు అప్పు మిగిలింది
కటిక మల్లాది, కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా
ఏడెకరాల్లో వరి, వేరుశనగ, కంది పంటలు సాగుచేశాము. నాలుగు ఎకరాలు సొంతం. మూడెకరాలు కౌలుకు తీసుకున్నా. గతంలో వచ్చిన వర్షాలకు వరి సగం దెబ్బతింది. పంట చేతికొస్తుందనుకున్న సమయంలో ఈ నెల్లో కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. గింజ రంగు మారింది. కంది పాడైంది. వేరుశనగ పంట పోయింది. ఇక వ్యవసాయం మానుకుని ఇంటిల్లిపాదీ కూలికి పోదామనుకుంటున్నాము.
రూ.1.55 లక్షల పెట్టుబడి పోయింది
పావులూరి వెంకట్రామయ్య, జంగమహేశ్వరపురం, గుంటూరు జిల్లా
12 ఎకరాలు సాగుచేశా. దీనిలో నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నా. పత్తి, కంది వేశాము. వర్షాలకు అంతా నాశనమైంది. గతంలో కురిసిన వర్షాలకు పత్తి సగం కారిపోయింది. మిగిలిందయినా దక్కుతుందని సరిపెట్టుకున్నా ూపయోగం లేకుండా పోయింది. ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలకు మిగిలిన పత్తి కూడా కారిపోయింది. ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఖర్చయింది. వర్షం పడకపోతే ఎకరానికి పది క్వింటాళ్లపైబడి వచ్చేది. ఇప్పుడు నాలుగున్నర క్వింటాళ్ల నాసిరకం పత్తి మాత్రం దక్కింది. పత్తి బాగుంటే క్వింటాలు రూ.3500 నుంచి రూ.3700 దాకా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రూ.1800 నుంచి రూ.2000కు మించి కొనటం లేదు. మూడు లక్షల రూపాయలకు బదులు, ఇప్పుడు రూ.80 వేలకు మించి వచ్చేట్లు లేదు. పంట పోయింది. పెట్టుబడీ పోయింది. మిగిలింది అప్పులే.
ఎనిమిది ఎకరాలకు 12 బస్తాల శనగ
ఎన్‌ మల్లికార్జునరెడ్డి, నుగటివారిపల్లె, అనంతపురం జిల్లా
ఎనిమిదెకరాల్లో శనగ పెడితే వర్షాలకు పంట మొత్తం పోయింది. చివరకు 12 బస్తాలు దక్కింది. అది కూడా నాణ్యంగా లేదు. మొత్తం రూ.35 వేలు ఖర్చయింది. మొత్తం పంటపోయినా ఎంతో కొంత రాకపోతుందా అన్న ఆశతో నూర్పిడి చేయగా, 12 బస్తాల శనగలు వచ్చాయి. బస్తా రూ.800 అయితే కొంటామని వ్యాపారులు చెబుతున్నారు. అప్పులు తీరాలంటే పొలాన్ని అమ్ముకోవాల్సిందే.
ప్రభుత్వమే ఆదుకోవాలి
చామంతుల చినసత్యనారాయణ, కొలుకులాపల్లి, విశాఖజిల్లా
కౌలుకు తీసుకున్న రెండు ఎకరాల్లో వరి, చెరకు వేశాము. వర్షాలకు పంట మొత్తం పాడైపోయింది. రూ.30 వేలు ఖర్చు చేసినా, ఒక్క రూపాయీ రాలేదు. అదే పంట బాగుంటే రూ.60 వేల దాకా వచ్చేది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: