ఓటు బ్యాంకుకు చిల్లు … నేతలు, ప్రజాప్రతినిధులూ పొర్లు
బల ప్రదర్శనకు లక్ష్యదీక్ష వేదిక
ముఖ్యమంత్రి ముఠా మల్లగుల్లాలు
కాంగ్రెసుపార్టీ ఓటు బ్యాంకుకు అంతోఇంతో చిల్లుపడినట్లేనని వైఎస్ జగన్మోహనరెడ్డి విజయవాడలో నిర్వహించిన ‘లక్ష్య దీక్ష’ పట్టి చూపింది. ఎన్ని అడ్డంకులు కల్పించినా కొందరు నేతలు, ప్రజాప్రతినిధులూ అటువైపు పొర్లుతున్నారన్న నిజం ఇక్కడ వెల్లడయింది. వెరసి కాంగ్రెసు కోటకు బీటలు పడినట్లేనని తేలిపోయింది. రైతు సమస్యల్ని పరిష్కరించాలని జగన్మోహనరెడ్డి 48 గంటల దీక్ష పేరిట బలప్రదర్శన చేశారు. తొలిరోజు 23 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా, మలినాడు మరొక నలుగురు చేరారు. కాంగ్రెసు, తెలుగుదేశం, పీఆర్పీ నాయకులు, ప్రజాప్రతినిధులు లక్ష్యదీక్ష వేదికపై ఆశీనులయ్యారు. ఎన్టీఆర్ ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి ఈ వేదిక నుంచి ప్రసంగిస్తూ చంద్రబాబు పట్ల తన అక్కసునంతా వెళ్లగక్కింది. కొన్ని కుసంస్కారపు వ్యాఖ్యలు కూడా చేసింది. దీనికితోడు రాజ్యసభ సభ్యురాలు, నటి జయప్రద ఫోనులో మద్దతు తెలిపింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఠా మల్లగుల్లాలు పడుతోంది. అంచనాలకు మించి అభిమానులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తబ్బిబ్బవటమే లక్ష్యదీక్ష అసలు లక్ష్యం వెల్లడవుతోంది. కాంగ్రెసు పార్టీ నుంచి బయటపడిన తర్వాత జగన్మోహనరెడ్డి తొలి కార్యక్రమంగా చేపట్టిన లక్ష్యసిద్ధి కార్యక్రమం ఆయన రహస్య లక్ష్యాన్ని నెరవేర్చింది. ఇక్కడ పైకి కన్పించేది రైతుల సమస్యలయినా అసలు లక్ష్యం మాత్రం బల ప్రదర్శనేనని కొందరు నేతలు వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఇప్పటివరకూ కాంగ్రెసుకు ఓటుబ్యాంకుగా ఉన్న వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నంతోపాటు ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులనూ సభలకు రప్పించేందుకు జగన్మోహనరెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈ పరిణామాలు కాంగ్రెసు పార్టీకి రెండు రకాలుగా దెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి ఓటు బ్యాంకు చీలడం కాగా, కేంద్ర, రాష్ట్ర అధిష్టాన వర్గాలు ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా 27 మంది ఎమ్మెల్యేలు జగన్మోహనరెడ్డికి మద్దతుగా నిలవటం రెండోది. అంటే యువనేత కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకుతోపాటు శాసనసభ్యులనూ చీల్చారు. దీంతో కాంగ్రెసులో కలవరం ప్రారంభమైంది. సీనియరు నాయకుల మాట నమ్మి జగన్మోహనరెడ్డిని దూరం చేసుకోవడంపైనా అధిష్టానం ఆరా తీస్తున్నట్లు చర్చ సాగుతోంది. కాంగ్రెసు పార్టీకి పెద్ద దెబ్బతగిలిందనే భావన నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక దీక్షకు జనాన్ని తరలించటంలో కాంగ్రెసు కార్యకర్తలే ఉత్సాహంగా కదిలారు. వాహనాల ఏర్పాటు మొదలు సిగిరెట్లు, కిళ్లీలు, గుట్కాలు, మందు, విందు తదితర సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేశారు. ఇక మొన్న మంత్రివర్గంలో పదవులు కోల్పోయిన బాలినేని శ్రీనివాసరెడ్డితోటు గోదావరిజిల్లా నుంచి పిల్లిసుభాస్‌చంద్రబోసు కూడా హాజరయ్యారు. వీరితోపాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఎమ్మెల్యేలు జయసుధ, కొండా సురేఖ, తెదేపానుంచి బయటకు వచ్చిన రోజా, ఎన్టీఆర్ తెలుగుదేశం ఏకైక నాయకురాలు, సభ్యురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటులు రాజశేఖర్, ఆయన భార్య జీవిత తదితరులు పాల్గనడం ప్రత్యేక ఆకర్షణ. వారితోపాటు తెదేపాకు చెందిన ఇద్దరు, ప్రజారాజ్యం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పాల్గన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ముప్పై మంది వరకూ ఉన్నారు. కలవడానికి ఇబ్బందిగా భావిస్తున్న పలువురు ఫోన్లల్లోనూ వైఎస్ తనయుడితో మాట్లాడారు. విజయవాడ ఎమ్మెల్యే విష్ణులాంటి కొందరు తెలివిగా తమ కుటుంబ సభ్యులను పంపారు. తొలిరోజునే లక్షమంది దాకా వివిధ జిల్లాలనుంచి హాజరవటంతో జగన్మోహనరెడ్డి అభిమానులను ఉత్సాహ పరిచింది. రెండోరోజు కూడా జనం భారీగానే ఉండేలా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెసు అధిష్టానానికి తన బలమేంటో చూపించుకునే పని చేశారని విశ్లేషిస్తున్నారు. ఇందుకు భారీగానే ఖర్చు కూడా పెట్టారు. జనం తనవెంట ఉన్నారనే హెచ్చరికలను అధిష్టానానికి జగన్మోహనరెడ్డి చేరవేసే లక్ష్యంతోనే ఈ దీక్ష చేపట్టినట్లు పలు అంశాలు తేల్చి చెప్పాయి. ద్వితీయశ్రేణి నేతలు కూడా భారీగా జిల్లాల నుంచి తరలి పోవటంతో కాంగ్రెసులో కలవరం రేపింది. తనను అవమానాలకు గురిచేసిన కాంగ్రెసు పార్టీని సర్వనాశనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్లు విన్పిస్తోంది. తన ఉపన్యాసాల్లో ప్రభుత్వాన్ని తూర్పారా బట్టటమే దీనికి దన్నుగా నిలుస్తోంది. రాష్ట్రంలో పలు పరిణామాలు కాంగ్రెసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో జగన్మోహనరెడ్డి రాజకీయక్రీడ కూడా ప్రారంభంకావడం ఆ పార్టీ అధిష్టానాన్ని గందరగోళానికి గురిచేస్తోంది.
Archive for డిసెంబర్, 2010
22 డిసెం
కాంగ్రెసు కోటకు జగన్మోహన బీటలు
22 డిసెం
నూర్పిడి ఖర్చులు రాక 100 ఎకరాల ధాన్యాన్ని తగలబెట్టిన రైతులు
వర్షాలకు తడిసి ముద్దయిన 100 ఎకరాల్లోని ధాన్యాన్ని రైతులు బుధవారం తగలబెట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని వరి పొలాలు వారం రోజులపాటు నీటమునిగాయి. వరుస వర్షం కారణంగా ఓదెల్ని ఆరబెట్టడానికి కూడా వీలు లేకపోయింది. దీంతో అడ్డులేని ఒదెలు వర్షపు నీటిలో కూడా కొట్టుకుపోయాయి. మిగిలిన పంటయినా పనికొచ్చే పరిస్థితి కన్పించటంలేదు. వడ్లను నలిపితే పిండి అవుతోంది. దీంతో నూర్పిడి చేస్తే కనీసం ఖర్చులు కూడా రావని తేలింది. ఈ కారణంగా ఎకరానికి రూ.1500 ఖర్చు చేసి వరి పనల్ని కుప్పగావేయించి మరీ తగలబెట్టారు. మానుకొండ రాధాకృష్ణ, బి నాగేశ్వరరావు, దూళిపాళ్ల సుబ్బారావు, ఏల్పూరి తిరుపతిరావు, వేల్పూరి శ్రీనివాసరావు, వేల్లూరి బాజీ, కోటేశ్వరరావు తదితర పలువురు కౌలు రైతులు తమ వరి పంటను తగలటెట్టారు. ఈ గ్రామంలో కౌలు రైతులకు ఎకరం వరి సాగుకు రూ.20 వేలకు పైగా ఖర్చయింది.
22 డిసెం
రెండో స్వాతంత్య్రోద్యమానికి తెరతీద్దాం !
రెండో స్వాతంత్య్రోద్యమానికి తెరతీద్దాం !
అవును.
భారతదేశంలో రెండో స్వాతంత్య్రోద్యమానికి తెరతీయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
నేను, మీరు, మనం, మనమందరం పదండి ముందుకు పదండి తోసుకు… అన్నట్లుగా మరోమారు స్వాతంత్య్రోద్యమానికి ఉరకాల్సిన సమయం ఆసన్నమయింది. ఈ స్వాతంత్య్రోద్యమం ఎవరికోసమో కాదు, నా కోసం, మీ కోసం, మనందరి కోసం, మన బిడ్డల కోసం, రేపటి కోసం, ఈ దేశం కోసం సాగాలి.
బ్రిటీష్ ముష్కర పాలనకు అంతం పలికేందుకు సాగిన తొలి స్వాతంత్య్రోద్యమ పోరాటం ఓ అరుణారుణ ఉదయం వేళ రాకపోయినందునే రెండో స్వాతంత్య్రోద్యమాన్ని ప్రారంభించాల్సి వస్తోంది. దేశమంతటా అంధకారం ఆవరించినవేళ, అర్ధరాత్రి వేళ, ఆరు దశాబ్ధాల క్రితం అరుదెంచిన అలనాటి స్వాతంత్య్రం ఆనాటి ఉద్యమకారుల ఆకాంక్షలను ఆవలబెట్టి నల్లదొరల పాల్బడింది.
బిడ్డల ఆకలి నకనకల ఘోష ఇంకా వినపడుతూనే ఉంది…. గెప్పెడు మెతుకులు దొరక్క ఈగల్ని తినే దౌర్భాగ్యం కొనసాగుతోంది. దేశానికి అన్నపూర్ణ అంటూ కితాబులు అందుకునే తూర్పుగోదావరి జిల్లా శంఖవరం గ్రామంలో పట్టెడన్నెం దొరక్క ఓ పేద కుటుంబానికి చెందిన బడి పిల్లలు ఈగల్ని చంపుకుని తింటున్నారని స్వయంగా ఆ పాఠశాల ఉపాధ్యాయుడు గంగిరెడ్డి మురళీకృష్ణ వాపోయారు. ఈ సంఘటనను గురించి ఆయన మాటల్లోనే …. ”ఒక రోజు వారు క్లాసుకు వచ్చిన దగ్గర నుంచీ వాచ్ చేయటం ప్రారంభించాను. నిజంగా నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. వారు చుట్టుపక్కల వాలే ఈగల్ని పట్టుకుని తింటున్నారు! కాసేపు నోట మాట రాలేదు. వెంటనే నాలోని టీచర్ వృత్తి జ్ఞాపకమొచ్చి వారికి ఆ ఆలవాటు మాన్పించాలనుకొని చేతిలోకి బెత్తం తీసుకున్నాను. ”సార్! ఉదయాన్నే తినటానికి ఏమీ ఉండదు. ఎప్పుడన్నా చద్దన్నం ఉంటుంది. అకలేసి ఏమన్నా పెట్టమంటే మా దెబ్బలు పెడుతుంది. అందుకే ఈ ఈ పనిచేస్తున్నాం” వారి మాటలు విని నా చేతిలో బెత్తెం జారిపోయింది.” (జనవిజ్ఞానవేదిక ప్రచురించిన అనుభవాలు పంచుకుందాం పుస్తకం, 78వ పేజీ నుంచి)
ఆహార పదార్థాల కొరత కారణంగా ఆ భావిభారత పౌరులు ఈగల్ని తింటున్నారా? కాదే. దేశంలోని ప్రభుత్వ ఆహార గిడ్డంగుల్లో గత జనవరి ఒకటో తేదీన తీసిన లెక్కల ప్రకారం 10.69 లక్షల టన్నుల ఆహార పదార్ధాలు పనికిరాకుండా పోయినట్లు తేలింది. ఈ ఆహార పదార్ధాలు ఆరు లక్షల మంది పది సంవత్సరాలపాటు తినొచ్చని అంచనా. ఆహార పదార్ధాలను దేనికీ కాకుండా చేస్తోన్న ప్రభుత్వ తీరును సుప్రీం కోర్టు తప్పుపడుతూ, వాటిని ఉచితంగా పేదలకు పంపిణీ చేయమని ఒకటికి నాలుగు సార్లు చెప్పినా ఈ చెవిటి ప్రభుత్వానికి చెవికెక్కలేదు. 1997-2007 మధ్య 1.83 లక్షల టన్నుల గోధుమలు, 6.33 లక్షల టన్నుల బియ్యం, 2.20 లక్షల టన్నుల వరి ధాన్యం, 111 లక్షల టన్నుల మొక్క జొన్నలు పనికి రాకుండా పోయినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఎందుకిలా జరుగుతోంది. ఇదేనా మన స్వాతంత్య్రోద్యమ లక్ష్యం. పెద్దల మాట అటుంచండి. పిల్లల కడుపులు మాడ్చటం ఎందుకు? తప్పో, ఒప్పో పాలకులుగా మీరు కోరినట్లు వాళ్లు బడికొస్తేన్నారే! వారి కడుపు నింపే పని మీది కాదా? మధ్యాహ్న భోజన పథకం అంటూ పెట్టి దానికి నిట్టనిలువునా బొక్కలు పెట్టిన ఘనులారా! మీరు త్యాగమూర్తులా? మీరు మా హితైషులా? మీరు ప్రజాస్వామ్యవాదులా? మీరు ప్రజాతంత్ర పాలకులా? జవాబు చెప్పండి.
చెప్పండి, మిత్రులారా! తక్షణం రెండో స్వాతంత్య్రోద్యమ పోరాటం ప్రారంభించాల్సిన ఆవశ్యకత లేదా?
21 డిసెం
చదువుల సారం చదవండి
చదువుల సారం శీర్షికతో ప్రచురించిన 8 పుస్తకాల అసలు ఖరీదు రూ. 680. అయితే వాటిని ప్రచురణకర్తలు రాయితీ ధరలో రూ. 500కే అందజేస్తున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని డిపిఇపి ప్రచురించిన ‘చదువు విజ్ఞానం’ మాస పత్రిక శీర్షికలను అంశాలవారీగా పుస్తకాల రూపమిచ్చారు. చదువు విజ్ఞానం పత్రికకు ఇప్పటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రమణ్యం సంపాదకుడిగా వ్యవహరించారు. ఆద్భుతంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ పత్రికను ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని నా అభియోగం. ఇది చదివిన పాఠకులు పలువురు పాత విధానాలకూ, పాత భావాలకూ తిలోదకాలు పలికుతున్నారన్న బాధతోనే పాలకులు దీని గొంతు నులిమేసారంటే అతిశయోక్తి లేదు. ఈ పత్రిక కొనసాగి ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కళకళలాడుతుండేవి. ఎన్ని సమస్యలున్నా మధ్యలోనే మానేసేవారు ూండేవారు కాదని నా నమ్మకం. అంట ఉపాధ్యాయులను అంతలా ఈ పత్రిక ప్రభావితం చేసింది. అందుకనే ప్రైవేటురంగ జపం చేసే ప్రభుత్వానికి ఇదంటే గిట్టలేదు. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది విద్యాభిమానులంతా కూడాలి. బాల్యాన్ని బతికించేందుకు పూనుకోవాలి. తల్లి భాషను రక్షించుకునేందుకు అడుగులు కదపాలి. మన సంసృతికి నిలబెట్టుకోవాలి. మన సంప్రదాయాలలో ఉత్తమమైన వాటిని పాటిస్తూ, కొత్తవాటిని అలవరచుకునే విధానానికి తెర తీయాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఈ భావాలకు జవజీవాలనిచ్చే చదువుల సారం పుస్తకాల దొంతరను జనవిజ్ఞానవేదిక, మంచి పుస్తకం సంయుక్తంగా ప్రచురించారు.
ఇందులో
1. కథలు విందాం
2. ఆడుకుందాం
3. అనుభవాలు పంచుకుందాం -1
4. అనుభవాలు పంచుకుందాం – 2
5. పాడుకుందాం –
6. భాషా వ్యాసాలు – 1
7. భాషా వ్యాసాలు – 2
8. చదువుల వెలుగులు … శీర్షికలతో పుస్తకాలున్నాయి.
ఆర్థిక భారం అనుకుంటే ఇందులో ఉపాధ్యేతర రంగాలకు చెందినవారు రెండు, ఐదు పుస్తకాలను మినహాయించవచ్చు. ఇంకా కావాలంటే కథలు విందాం పుస్తకాన్ని కూడా మినహాయించవచ్చు. పుస్తక ప్రియులు మాత్రం అన్నింటినీ ఇంటి గ్రంథాలయంలో ఉంచుకుని చదువుకోదగినవి. హైదరాబాదు, నక్లెస్‌రోడ్డులో ప్రస్తుతం జరుగుతోన్న, విజయవాడలలో జనవరి ఒకటోతేదీ నుంచి పదో తేదీ వరకూ జరిగే పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాలను మంచి పుస్తకం, జనవిజ్ఞానవేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న దుకాణంలో రాయితీ ధరల్లో పొందవచ్చు. జనవిజ్ఞానవేదిక, మంచి పుస్తకం చిరునామాలలో దేనికయినా రూ. 500 + ఖర్చుల కోసం రూ. 25 డీడీ పంపి తెప్పించుకోవచ్చు.
జనవిజ్ఞానవేదిక చిరునామా :
జనవిజ్ఞానవేదిక ప్రచురణల విభాగం,
162, విజయలక్ష్మి నగర్, నెల్లూరు – 524004
ఫోన్ : 9440503061.
మంచి పుస్తకం చిరునామా :
మంచి పుస్తకం,
12-13-450, తార్నాక, సికింద్రాబాద్- 500017.
మరిన్ని వివరాల కోసం
9490175160 (సిఏ ప్రసాద్, జనవిజ్ఞాన వేదిక)
9490746614 (మంచి పుస్తకం) సెల్‌ఫోన్లలో సంప్రదించవచ్చు.
మంచి పుస్తకం వెబ్‌సైట్ చిరునామా ఇదీ ….. http://www.manchipustakam.in
20 డిసెం
మరోసారి గ్యాస్ ‘బండ’
రు.50-100 మధ్య పెంపుదలకు రంగం
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ‘బాంబు’ను ప్రయోగించే యోచనలో ఉంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వంటగ్యాస్ బండకు రు.50 నుంచి రూ. 100 వరకూ పెంచాలన్న ప్రతిపాదనలను కేంద్ర చమురు మంత్రిత్వశాఖ చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ అంశంపై డిసెంబరు 22 లోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. అంటే కేంద్ర ప్రభుత్వం క్రిస్టమస్ కానుకగా గ్యాస్ బాంబు వదలనున్నదన్నమాట. అంతర్జాతీయంగా గ్యాస్ ధర 66 శాతం పెరగటంతో దేశీయంగా కూడా భారం మోపటం అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపాయి. అంతర్జాతీయ ధర పెరుగుదలతో దేశీయ వినియోగం కోసం ఏటా 30 లక్షల టన్నుల గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థల లాభార్జనకు గండిపడిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అంతర్జాతీయ ధరల పెరుగుదలతో జనవరి నుంచి ఒక్కొక్క బండకు ఇస్తున్న రాయితీ రు.367కు పెరగనున్నదని ఈ వర్గాలు తెలిపాయి. ఇది ప్రస్తుతం వినియోగదారులకు అందచేస్తున్న ధర రు.345.35 కన్నా ఎక్కువ. ధర పెంపుదల తర్వాత రాజకీయ పరిణామాలను అంచనా వేసిన అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఉన్నతాధికార మంత్రుల బృందం గ్యాస్, డీజెల్ ధరల పెంపుదలను పరిశీలించేందుకు బుధవారం న్యూఢిల్లీలో భేటీ అవనుంది. ధరల పెంపుదల ప్రతిపాదనలకు చమురు మంత్రిత్వశాఖ మంత్రుల బృందం ఆమోదాన్ని పొందాల్సి వుంది. వంటగ్యాస్, డీజెల్ ధరలు ఏ మాత్రం పెరుగుతాయన్న విషయాన్ని తాము చెప్పలేమని, కేవలం వాస్తవ పరిస్థితులను మంత్రుల బృందానికి వివరించటమే తమ పని అని చమురు మంత్రిత్వశాఖ అధికారి వివరించారు.
19 డిసెం
”కొబ్బరినూనె లేదని మా అమ్మే గుండు చేసింది సార్”
”కొబ్బరినూనె లేదని మా అమ్మే గుండు చేసింది సార్” అంటూ వినపడీ వినిపించనట్లు చెప్పి చొక్కాతో కళ్లు తుడుచుకున్నాడు. – గుండెల్ని పిండే గుండు విషాదం
”మొన్న మీరు మూగజీవుల పాఠం చెప్పారుగా మేడం. బలివ్వటం తప్పని చెప్పారుగా. మా ఇంట్లో నిన్న నేను పెంచుకుంటున్న మేకను కోసి కూర వండారు మేడం. దానికి నేనంటే ఎంత ఇష్టమో! దాన్ని చూడకుండా నేను ముద్దయినా ముట్టేవాణ్ని కాదు. పాపం దాని పొట్టలో రెండు పిల్లలు కూడా ఉండాయి మేడం.” అంటూ మళ్లీ వెక్కి వెక్కి ఏడ్వటం మొదలు పెట్టాడు. వాడి ఏడుపు ఆపటం ఎవ్వరి వల్లా కాలేదు. – బుద్ధం శరణం గచ్ఛామి
”సార్, అంతపెద్ద జంతువులు ఎలా దూరాయి? ఆ అడవిలో కాకులైనా దూరలేవన్నారు? కనీసం చీమలైనా దూరలేవన్నారు? మిరి ఇప్పుడేమో ఏనుగు, నక్క ఉంటున్నాయి అన్నారు. ఎలా దూరాయి సార్?” – ఎలా దూరాయి?
”స్వర్గంలో అన్నం దొరుకుతుందా సార్?” అనింది – ఎవరి స్వర్గం వారిది
”రేపట్నించి బడికి ఆలీసంగా రాను సారూ! అందరి కంటే ముందే వస్తాను. ఎందుకంటే ఇన్నాళ్లూ జరానబడ్డ మాయమ్మ రాత్రే సచ్చిపోయింది. ఇంక మాయమ్మకు మందులిచ్చే పని, జావగాసి తాపే పని లేదుగా” అంది. – ఇంక బడికి అలీశంగా రాను సారూ!
”మా పిల్లలు పెంచలకోన తప్ప ఏ ఊరూ చూసినవాళ్లు కాదు. ఉన్నట్టుండి వాళ్లు నెల్లూర్లో వచ్చి వాలారు. ”ఊళ్లో తిరునాళ్లా సార్?” అని వాళ్లడిగినప్పుడు నా కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. – కొత్త మాస్టారు
”నిన్న మా అమ్మని మా నాన్న తప్పతాగి జుట్టుపట్టి లాగి కొట్టాడు సార్. మా అమ్మ గోడకు అనుకొని రోజంతా ఏడుస్తూనే ఉంది. నాకు బడికి రావాలనిపించటం లేదు సార్.” అని తడబడుతూ, ఉబుకుతున్న కన్నీళ్లను వొత్తుకుంటూ చెప్పింది. – నాకు బడికి రావాలనిపించటం లేదు సారూ!
”మా అమ్మ కొడుతుంది. ఇంక నువ్వు కూడా కొట్టు” అన్నది అంతే రెండోసారి పైకెత్తిన నా చేయి నాకు తెలియకుండానే దిగిపోయింది. – అమ్మ కొడుతుంది, ఇంక నువ్వు కూడా కొట్టు!
”సార్, మాకు ఉదయాన్నే తినటానికి ఏమీ ఉండదు. ఎప్పుడన్నా చద్దన్నం ఉంటుంది. ఆకలేసి ఏమన్నా పెట్టమంటే మా అమ్మ దెబ్బలు కొడుతుంది. అందుకే ఈ పని చేస్తున్నాం”. – ఈగలే వారి బ్రేక్‌ఫాస్ట్.
”నాకే రెక్కలుంటే మబ్బుల్లోకి ఎగిరి దేవుడి దగ్గరకు పోయి మా తరగతిలో అందరికీ మంచి పుస్తకాల సంచీలు ఉన్నాయి. అందరికీ చాలా చొక్కాలున్నాయి. పాస్‌బెల్‌కి కొనుక్కోవటానికి డబ్బులున్నాయి. మా నాన్న నాకేమీ ఇవ్వడు. ఎప్పుడూ కల్లు తాగొచ్చి అమ్మని, నన్ను కొడతాడు. మా నాన్నని కల్లు తాగనీయకుండా చేయమని దేవుడిని అడుగుతాను” – నాకే రెక్కలుంటే …
”టీచరుగారండీ శ్రీను రోజూ సరిగా తోముకోడండి. అందుకే వాడివన్నీ పిప్పి ఫలాలే” అని అన్నాడు. – పిప్పి ‘ఫలాలు’
”తండ్రీ, నేర్చితి చదువుల సారమెల్ల” అన్నాడట ప్రహ్లాదుడు. ఈ రోజుల్లో ఎవరయినా ఆ మాట అంటే నేనూరుకోను. అనుభవాలు పంచుకుందాం పుస్తకాన్ని చదవకుండా అన్నీ నేర్చుకున్నానని ఎవ్వరయినా అంటే నేను ఒప్పుకోను.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బుజ్జి బుజ్జి బుడుగులతోనూ, సీగాన పెసూనాంబలతోనూ తమ అనుభవాలను మనతో పంచుకునే పుస్తకమే … ఈ అనుభవాలు పంచుకుందాం – 1/2 పుస్తకాలు. జనవిజ్ఞానవేదిక, మంచిపుస్తకం ఉమ్మడిగా ప్రచురించిన ఈ పుస్తకాన్ని గత శుక్రవారంనాడు హైదరాబాదు నక్లెస్‌రోడ్డులో జరుగుతోన్న పుస్తక ప్రదర్శనలో కొని ఆ రాత్రికే మొత్తం 212 పేజీలనూ ఒక్కుమ్మడిగా చదివేశాను. వాస్తవానికి వీటిలో కొన్ని అంశాల్ని పదేళ్ల క్రితమే రాష్ట్ర విద్యాశాఖ మాస పత్రిక చదువు విజ్ఞానంలో చదివాను. తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు వి బాలసుబ్రమణ్యం ఆ మాస పత్రికను అద్భుతంగా తెచ్చేవారు. ఆ మాసపత్రికలో ప్రచురించిన అంశాలను విడదీసి ఎనిమిది పుస్తకాలుగా ఇప్పుడు తెచ్చారు. అందులో అనుభవాలు పంచుకుందాం – 1-2 భాగాలున్నాయి.
ఈ అనుభవాలను చదువుతుంటే ఆనాడు ఉపాథ్యాయులు అనుభవించిన స్పందనలే మనకూ కలుగుతాయంటే అతిశయోక్తి కాదు. కొన్న అనుభవాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. మరికొన్ని ఆవేదన కల్గిస్తాయి. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. వెరసి అన్నీ ఆలోచింపజేస్తాయి.
52వ పేజీలో ప్రచురితమయిన ఏ.వీ హనుమకుమార్ అనుభవం ‘ఇంక బడికి ఆలీశంగా రానుసారూ’ కథనం చదివి కన్నీటి పర్యంతం కాని వారెవరూ ఉండరని నా నమ్మకం. పాఠశాలకు వారం రోజులపాటు ఆలస్యంగా వస్తూ, ఉపాధ్యాయుడితో తిట్లు తింటూనే మౌనం పాటించిన నాలుగో తరగతి మమత ”ఓరోజున ఆలస్యానికి చెప్పిన కారణాన్ని వింటే గుండెలు కరిగిపోవలసిందే. ”రేపట్నించి బడికి ఆలీసంగా రాను సారూ! అందరి కంటే ముందే వస్తాను. ఎందుకంటే ఇన్నాళ్లూ జరానబడ్డ మాయమ్మ రాత్రే సచ్చిపోయింది. ఇంక మాయమ్మకు మందులిచ్చే పని, జావగాసి తాపే పని లేదుగా” అంది. దీనికి ఇంకా వ్యాఖ్యానం అవసరమనుకోను. ఈ పుస్తకంలోని కథనాలన్నీ దేనికవే ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తాయి. మనల్ని ఆలోచింపజేస్తాయి.
వీలున్న మిత్రులంతా ‘చదువుల సారం’ శీర్షికన ప్రచురించిన పుస్తకాలను చదువుతారని ఆశిస్తున్నాను.
18 డిసెం
అమ్మే తొలి గురువు
చిన్న పిల్లలకు మాటలు నేర్పడంలో తల్లిదండ్రులతోపాటు ఉత్సాహపడనివారుండరు. పిల్లలు పలికే ముద్దుముద్దు మాటలకు మురిసిపోని వారెవ్వరు! మాటలు వినడంలోనూ, వాటిని గుర్తించడంలోనూ పిల్లల మెదడుపై ముందుగా ప్రభావం చూపేది మాత్రం అమ్మే. ఈ క్రమంలో తల్లి పాత్ర ఎంతో కీలకమని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నారులకు భాష నేర్పడంలో తల్లి స్వరం అద్వితీయమైన పాత్ర పోషిస్తుందని ఇటీవలి ఆవిష్కరణలు రుజువు చేశాయి. తల్లి చెప్పే మాటలకూ, ఆ స్వరానికీ చిన్నారుల మెడదు చురుగ్గా స్పందిస్తుందని మాంట్రియల్ విశ్వవిద్యాలయం, సెయింట్ జూస్టిన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. 24 గంటల కంటే తక్కువ వయసున్న పిల్లల మెదడు శబ్దాలకూ, తల్లి మాటలకు ఏ విధంగా స్పందిస్తోందో పరిశోధించారు. ఇతర మహిళల స్వరానికి కూడా చిన్నారులు స్పందిస్తున్నా, తల్లి మాటలను విన్నప్పుడు వారి మెదడు చురుగ్గా స్పందించటం గమనించారు. తల్లి స్వరం పిల్లలకు ప్రత్యేకమైందని మాంట్రెయిల్ విశ్వవిద్యాలయం ప్రధాన పరిశోధకులు డాక్టర్ మ్యారిస్ లసోండే చెప్పారు. వారి పరిశోధనలో భాగంగా నిద్రపోతోన్న 16 మంది పిల్లల తలలకు ఎలక్ట్రోడ్స్‌ను అమర్చారు. అనంతరం తల్లితో చిన్న శబ్దాన్ని చేయించారు. దీంతో పిల్లల మెదడు ఎడమ అర్ధ భాగంలో ఏర్పడిన స్పందన స్కాన్‌లో నమోదయింది. అదే కొత్తవారితో మాట్లాడించగా మెదడు కుడి అర్ధభాగంలో స్పందనలు వచ్చాయి. అయితే తల్లిని బిడ్డ ప్రత్యేకంగా గుర్తించింది. నర్సుతో అదే విధంగా మాట్లాడించగా బిడ్డ గుర్తు పట్టినా మెదడులో స్పందనలు మాత్రం తీవ్రంగా లేవని తేలింది. దీంతో బిడ్డకు భాష నేర్పడంలో అమ్మే తొలి మార్గదర్శిగా పరిశోధకులు నిర్ధారించారు.
16 డిసెం
రైతు సమస్యలపై నారా రెండు అడుగులు ముందుకు ఒకడుగు వెనక్కు
వర్షబాధిత రైతుల సమస్యల్ని పరిష్కరించాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. రైతులు – సమస్యలు – పరిష్కారం మాటెలాగున్నా ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో తన పార్టీని రక్షించుకునేందుకు, తన భవిష్యత్తును పరిరక్షించుకునేందుకు నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్న చంద్రబాబు రెండడుగులు వేశాడనుకోవచ్చు. అయితే ఆయన శాసనసభ నుంచి నేరుగా దీక్షా శిబిరానికి వెళ్లి ఉంటే ప్రభావం ూప్పెన చందంగా ఉండేది. అయితే ఆయన శుక్రవారం ఉదయం నుంచీ దీక్షకు దిగాలని నిర్ణయించటం ఒకడుగు వెనక్కు వేసినట్లే. శాసనసభలోనే తన దీక్ష కార్యక్రమాన్ని ప్రకటించి ూంటే చంద్రబాబు కార్యక్రమం సంచలనంతో ప్రారంభమయ్యేది. అయితే శాసనసభ వాయిదా పడిన తర్వాత తన నిరాహార దీక్ష ప్రారంభానికి 15 గంటలకు పైగా సమయాన్ని తీసుకోవటం వెనుక ఏదన్నా మతలబు ఉందేమో? పరిశీలించాలి. ఉన్న గొడవలకు తోడు చంద్రబాబు కొరివితో తలగోక్కోవటం ఎందుకని కాంగ్రెసు అధిష్టానమో, రాష్ట్ర ప్రభుత్వమో భావించి రైతులకు మరికొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ూందని తెలుగుదేశం భావించి వెనకడుగు వేసినట్లు విన్పించింది. అయితే వెనకపడితే వెనకేనోయ్! అని గురజాడ ఎప్పుడో హెచ్చరించిన విషయం తెలుగుదేశం నాయకులు గుర్తించినట్లు లేదు. తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పాలన తీరు కారణంగా కోల్పోయిన ప్రజల నమ్మకాన్ని తిరిగి రాబట్టుకోవాలంటే ముందడుగులు తప్ప వెనకడుగులు తమ ప్రగతికి ఏ మాత్రం ఉపకరించవని ఆ పార్టీ గమనించాలి. పదండి, ముందుకు పదండి తోసుకు అన్నట్లుగా అడుగులు వేయాల్సిన తరుణంలో రైతుల కడగండ్ల రూపాన, ప్రభుత్వం తగిన విధంగా స్పందించని ఫలితంగా దొరికిన అవకాశాన్ని చంద్రబాబు చేజేతులా పాడు చేసుకున్నాడు. విమానంలో ప్రయాణించాల్సిన చోట సైకిలు ప్రయాణం ఎంత ఉపయోగమో ఆ పార్టీ నిర్వాహకులు తేల్చుకోవాలి. త్యాగాలకు వెనకాడితే ప్రజలూ తమకు మద్దతు తెలిపేందుకు వెనకాడతారని ఎంత తొందరగా తెదేపా నేతలు గుర్తిస్తే అంత మేలు.
15 డిసెం
రైతు – రైతాంగం … ఇవి వేరు వేరు పదాలు
అవును, రైతు – రైతాంగం ఇవి రెండూ ఒకటి కాదు. ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదు. వీటికి వేరు వేరు అర్ధాలున్నాయి.
అయితే పత్రికలు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ రెండింటినీ కలగలిపి యడాపెడా వాడేశాయి. వాడేస్తున్నాయి. ఫలితంగా సమాజం కూడా అదే బాట పట్టింది.
అంతో ఇంతో పొలముండి, దానిలో వ్యవసాయం చేసేవాడు రైతు. అయితే రైతన్న వ్యవసాయం చేయాలంటే పలు ఇతరేతర అంగాలు పని చేయాలి. సహకరించాలి. తమ సేవలు అందించాలి. పొలం దున్నాలంటే నాగలి కావాలి. నాగలిని కంసాలి చేస్తాడు. దానికి అమర్చే ఇనుప కర్రును కమ్మరి చేస్తాడు. చెక్కను అవసరమయిన కొలతల్లో కోతపెట్టి, చెక్కి వస్తువుల్ని చేసేవాడే కంసాలి. అదే విధంగా బండి కూడా అంతే కంసాలికి కమ్మరి తోడు కావాల్సిందే. బండి చక్రాలకు తాపడం చేసే పట్టాలు, ఇరుసు, ఇరుసు నుంచి చక్రాలు జారిపోకుండా పెట్టే చీల, చక్రం కుండ పగిలిపోకుండా వేసే పట్టా, ఇక కొడవలి, చెలక పార, గొడ్డలి, గునపం ఇలా పలు వస్తువుల్ని కమ్మరే రూపొందిస్తాడు. ఇనుమును నిప్పులో కాల్చి వస్తు రూపమిచ్చేవాడే కమ్మరి. అంతేకాకుండా మేదర కార్మికుడి సేవలు కూడా కలుస్తాయి. బండిమీద జల్లను మేదర కార్మికుడు అల్లుతాడు. వ్యవసాయ పరికరాలయిన బుట్ట, గంప, జల్లెడ, కర్ర ఇలా పలు వస్తువులను మేదర కార్మికులు రైతుకు అందజేయాలి. కుండ, గాబు, తొట్టి ఇలాంటి వాటిని చేసిచ్చే కుమ్మరి కూడా వ్యవసాయంలో ప్రత్యక్ష భాగస్వామే. ఇక పాలేరు, రోజూవారి కూలీ కూడా వ్యవసాయంలో నేరుగా భాగస్వాములే. ఎలుకల్ని పట్టి పైర్లనూ, పంటల్నీ రక్షించే ఎరుకలవాళ్లు, జంతువుల నుంచీ, దొంగల నుంచీ పొలాన్ని, చెరువుల్నీ, కాలువల్నీ కాపలాగాచే కావలిగాళ్లు కూడా వ్యవసాయంలో ముఖ్యులే. వీళ్లు కాకుండా పరోక్షంగా మరి కొందరు తమతమ సేవలను రైతుకు సంక్రమంగా అందజేస్తున్నందునే సాగు పనులు సజావుగా సాగుతాయి. గుడ్డల్ని శుభ్రం చేసే చాకలి, క్షవరం చేసే మంగలి, ముహూర్తాలు పెట్టే పురోహితుడు, ఆ మాట కొస్తే వస్త్రాలను కుట్టే దర్జీ, కర్మకాండల్లో సహకరించే జంగమదేవర ఇలా ఇలా పలువురు రైతన్నలకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ సహకరించి పంటల దిగుబడికి సహకరిస్తుంటారు. వారిలో ఏ ఒక్కరు లేకపోయినా సాగు సక్రమంగా సాగదు. అందువలనే వీళ్లందరినీ రైతు అంగాలు అంటారు. ఈ రెండు పదాల్నీ కలగలిపి వాడితే అదే రైతాంగము అవుతుంది.
అందువలన పొలముండి, సాగు చేసేవాడిని రైతు అని, రైతుకు వివిధ వస్తురూపాలను, సేవలను అందజేసే వృత్తిదారుల్నీ కలిపి రైతాంగం అని అనాలి. ఈ తేడాను ముందుగా వార్తా ప్రపంచం గుర్తించాలి. చెప్పే అంశం రైతుకు సంబంధించినదా? లేక రైతుకు వివిధ రూపాల్లో సహకరించే వారందరిదీనా? అన్న విచక్షణతో ఈ రెండు పదాలనూ విడివిడిగా ఉపయోగించాలి.
10 డిసెం
హిల్లరమ్మ హల్లరి హల్లరి
గూగుల్ విడుదల చేసే సమాచారం తమ సెన్సారు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పినందుకు చైనాను అమెరికన్లు నిరంకుశ, ఇనుపతెరల రాజ్యంగా వర్ణించారు. చైనా వంటి దేశాలపై తాను ప్రధానంగా సెన్సార్‌లేని ఇంటర్నెట్ వ్యవస్థ గురించే వత్తిడి తెస్తానని అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమె ప్రభుత్వ శాఖలతో పాటు విశ్వవిద్యాలయాల ద్వారా బెదిరింపులకు దిగారు. పచ్చినిరంకుశ ఉత్తరువులు జారీ చేయిస్తున్నారు. వికీలీక్స్ విడుదల చేసిన సమాచారం ప్రభుత్వం ప్రకటించే వరకు రహస్యమేనట. దానిని విద్యార్దులెవరైనా చదివి, అభిప్రాయాలను వెల్లడిస్తే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు అనర్హులను చేస్తారట. అదే కార్మికులు, ఉద్యోగులైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తారట.
ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు వాటిని చూసినా, చివరకు వాటిగురించి పత్రికల్లో రాసినవి చదివినా, ఇతరులకు పంపినా అది రహస్య జాతీయ భద్రతా సమాచారాన్ని ఉల్లంఘించినట్లేనట. అపర ప్రజాస్వామిక, స్వేచ్ఛా దేశంగా తనకు తాను కితాబులిచ్చుకొనే అమెరికా ఇప్పుడు ప్రపంచం ముందు నిలబడిన తీరిది. దానికి బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, తటస్థ దేశంగా చెప్పుకొనే స్వీడన్ వంతపాడుతున్నాయి. ఒకవేళ విదేశాల్లో ఉన్న అమెరికన్ సైనికులు పత్రికల్లో వీటి గురించి చదివితే వారిపై కూడా చర్య తీసుకుంటారా? ఎందుకీ అపహాస్యపు ఆదేశాలని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. వికీలీకులను ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలంటే గతంలో కోర్టులిచ్చిన తీర్పులు ఆటంకంగా మారతాయని పరిశీలకులప్పుడే తేల్చి చెప్పారు. అయినా వికీలీక్స్ పత్రాలను ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. ఇది అమెరికన్లు నిత్యం ప్రవచించే పత్రికా స్వాతంత్య్రానికే విరుద్ధం.
అమెరికా ప్రభుత్వం నేడు జారీ చేస్తున్న నిరంకుశ ఆదేశాలు, ఉత్తరువులు గతంలో బ్రిటీష్ చర్యలను తలపింపజేస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ‘మాలపిల్ల’ వంటి ప్రఖ్యాతనవలను, భూసమస్యను ముందుకు తెచ్చిన ‘మా భూమి’ నాటకాన్ని బ్రిటీష్ సర్కార్ ఆనాడు నిషేధించింది. విదేశాల నుంచి ఎవరైనా కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెచ్చినా, ఎవరిచేతుల్లో అయినా ఉంటే వారిని అరెస్టు చేసేది. ఇప్పుడు వికీలీక్స్ విడుదల చేసిన పత్రాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమెరికా సర్కార్‌ను, దోపిడీ వ్యవస్థను కూలదోసేందుకు ప్రేరేపించినట్లు లేవు. నిజానికి ప్రపంచంలో ఎవరు అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు, ఎవరు అమెరికా కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అలాంటి వారిని ఎలా దెబ్బతీయాలి వంటి దుష్టఆలోచనలు, సలహాలు, పథకాలను సూచిస్తూ ప్రపంచమంతటినుంచి అమెరికన్ రాయబారులు, వారి తైనాతీలు సహకరించేవారు పంపిన సమాచార పత్రాలవి. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చడానికి ఇచ్చిన సలహాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా ఇతర దేశాలకు వ్యతిరేకంగా జరుపుతున్న కుట్రలు, అందుకు ఎవరెవరితో చేతులు కలిపిందీ, ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిందీ అనే సమాచారం రాతపూర్వకంగా ఉన్న సాక్ష్యాలవి. అమెరికా, దాని మిత్ర దేశాల అసలు రంగు ప్రపంచానికి తెలిపిన కారణంగానే వికీలీక్స్‌పై అవి మండిపడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై జరుపుతున్న దాడుల సమర్థనకు తమ పౌరులను ఎలా మభ్యపుచ్చుతున్నదీ, అసలు నిజాలేమిటీ అన్న అంశాలు కూడా ఆ పత్రాల్లో ఉన్నాయి. అందుకే అమెరికన్లు వాటిని చదవకూడదని ప్రభుత్వం నిరంకుశ ఆదేశాలు జారీ చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు.
ప్రభుత్వ తీరుతెన్నులు ఇలా ఉంటే తమకు ఎవరన్నా లెక్కలేదు, ఎవరినైనా, ఏమైనా అంటాం, ఎలాంటి సమాచారాన్నాయినా లోకానికి వెల్లడిస్తాం అని భుజకీర్తులు తగిలించుకున్న ‘ట్విటర్, ఫేస్‌బుక్’ సంస్థల బండారం కూడా బయట పడింది. వికీలీక్స్ వెబ్‌సైట్‌ను దానికి సర్వర్లను సమకూర్చిన అమెజాన్‌పై వత్తిడి తెచ్చి అమెరికా ప్రభుత్వం అడ్డుకుంది. పేపాల్, విసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థల ద్వారా వికీలీక్స్‌కు విరాళాలు, ఇతర రూపాలలో డబ్బు బదలాయింపు జరగకుండా వాటిపై వత్తిడి తెచ్చి నిలుపు చేయించింది. ఇంతకంటే నిరంకుశ, అణచివేత చర్యలేముంటాయి.
అయితే ఎక్కడ ఈ దుర్మార్గాలు జరుగుతాయో అక్కడే ప్రతిఘటన ఉంటుందన్నట్లుగా వికీలీక్స్‌ను అడ్డుకొనే సంస్థల వెబ్‌సైట్లపై అసాంజే అభిమానుల దాడులు దీనినే సూచిస్తున్నాయి. తనకు నచ్చని ఇతర దేశాల వెబ్‌సైట్లపై ఇలాంటి దాడులు చేయించటంలో అమెరికన్ల తరువాతే ఎవరైనా. ఇప్పుడు అలాంటి వారికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ప్రతిఘటన ఎదురవుతోంది. అది ఒక ప్రయివేటు సంస్థలకే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటు వాటిపై వత్తిడి తెస్తున్న ప్రభుత్వ సైట్లపై కూడా హాకర్లు దాడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. తన సిఐఏ కనుసన్నలలో పనిచేసే ఒక మహిళతో కండోమ్ లేకుండా శృంగారంలో అసాంజే పాల్గొన్నాడనే గడ్డిపోచ కేసును స్వీడన్‌లో దాఖలు చేయించి, బ్రిటన్‌లో అరెస్టు చేయించింది తప్ప, తన కంతలను పూడ్చుకోలేని అమెరికా సర్కార్ అతనిపై ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలాంటి కేసు నమోదు చేయలేని బలహీన స్థితిలో ఉంది. అమెరికా రాయబార, విదేశాంగశాఖ కార్యాలయాల అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా టన్నులకొద్దీ రహస్య పత్రాలను ఒక వ్యక్తిగా అసాంజే బయటకు తీసుకురావటం అసాధ్యమైన అంశం. ఒక వేళ తనను అరెస్టు చేసినా తమ వద్ద ఇంకా ఉన్న పత్రాలను బయటపెడతామని ఆసాంజే చేసిన ప్రకటన నేపథ్యంలో అమెరికా ఇంత నిరంకుశంగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది.