Archive for జనవరి, 2011

ప్రజారాజ్యానికి పడింది తెర … చిరంజీవీ చిరంజీవ చిరంజీవ


రేపో, మాపో ప్రజారాజ్యం పార్టీ కథ ముగిసిపోనుంది. దీంతో సినిమావాళ్లంతా రాజకీయాల్లో ఘన విజయాలు సాధించలేరని మరోసారి తేలిపోయింది. సభలకు వచ్చిన ప్రజలంతా మద్దతు పలకబోరని ఎప్పుడో తేలిపోయిందనుకోండి. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల మధ్య నిర్థిష్టమైన బంధం వేసే పనులకు సోమవారంనాడు హైదరాబాదు వేదిక అయింది. ఈ రెండు పార్టీల మధ్య కొన్నాళ్ళుగా సాగుతోన్న ముసుగులో గుద్దులాట బహిరంగమయింది. కాంగ్రెసు ఆహ్వానం మేరకు ప్రభుత్వంలో చేరడానికి ప్రజారాజ్యం సిద్ధమైంది. ప్రస్తుతానికి బయట నుంచి మద్దతు ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకున్నా ఎన్నికల సమీపకాలంలో ఈ రెండు పార్టీలూ ఏక కంఠంతో యుగళగీతం పాడుకుంటాయి. అయితే ఎన్నికల వేళ పీఆర్పీ విలీనమయ్యే విషయాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్టు సమావేశాలకు ముందే ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వంలో చేరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పీఆర్పీపి కేబినెట్‌లో స్థానం కల్పించడం ద్వారా వైఎస్‌ తనయుడికి కళ్ళెం వేయాలని కాంగ్రెసు అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. పిఆర్పీ శాసనసభ్యులకు మంత్రి పదవులతో పాటు చిరంజీవికి కేంద్రంలో చోటు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. రెండు శాసనమండలి స్థానాలు కూడా పిఆర్పీకి కట్టబెట్టేందుకు కాంగ్రెసు కసరత్తు ప్రారంభించింది. దీనికి నాందిగా సోమవారం సాయంత్రం ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎ.కె. ఆంటోని చర్చలు జరిపారు. సోనియాతో చర్చించేందుకు ఢిల్లీకి రావాలని చిరంజీవిని ఆయన ఆహ్వానించారు.
ఆంటోని ఆకస్మికంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కుదుపు ప్రారంభమయింది. ప్రత్యేక విమానంలో హైదరాబాదు చేరుకున్న ఆంటోనీని పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ వెంటపెట్టుకుని చిరంజీవి ఇంటికి తీసుకెళ్ళారు. చిరంజీవితో ఆంటోని గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిఎస్‌తోపాటు పిఆర్పీనేతలు రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు, విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని గతంలో చిరంజీవిపై ఒత్తిడి చేశారు. అయితే పొత్తుకు సిద్ధంగా ఉన్నాం తప్ప పార్టీని విలీనం చేయబోమని చిరంజీవి చెప్పినట్లు తెలిసింది. ఈ నెలలో రాష్ట్ర బడ్జెట్టు సమావేశాలు ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా కాంగ్రెసు అధిష్టానం ముందస్తు చర్యలు ప్రారంభించింది. వారం రోజుల్లో కేబినెట్‌ విస్తరణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రకటనలు

యండమూరీ! నీ అంతర్ముఖం బండబారి…


తనకు తనే అతీతుడనని అనుకునే యండమూరి వీరేంద్రనాధ్‌ అను క్షుద్ర రచయిత సొమ్ముల్ని దండుకునేందుకు మా టీవీలో కొత్త నాటకం ప్రారంభించాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ అరవీర భయంకర పిశాచ రచయిత సిరి సంపదల్ని పోగేసుకోవటంతోపాటు సామ్యవాద సిద్ధాంతంపై ఉమ్మేందుకు కూడా ఈ నాటకాన్ని వినియోగించుకుంటున్నాడు. వైఎస్‌ పంచనజేరి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మత్స్యకారుల నోట మట్టిగొట్టి వాన్‌పిక్‌ పేరుతో 40 వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్న నిమ్మగడ్డ ప్రసాద్‌ అలియాస్‌ మాట్రిక్స్‌ ప్రసాద్‌, అలియాస్‌ వాన్‌పిక్‌ ప్రసాద్‌ అలియాస్‌ మా టీవీ ప్రసాద్‌ అను నయా పెట్టుబడిదారుడి విధానాలకు తగ్గట్టుగానే బండబారిన యండమూరి అంతర్ముఖం అంటూ నాటకానికి తెరలేపాడు. ఏటా కోట్లాది రూపాయల భారతీయ పంటను లక్స్‌, క్లోజప్‌ తదితర పేర్లతో ఎత్తుకుపోతోన్న విదేశీ బహూళజాతి సంస్థ హిందూస్థాన్‌ లెవర్స్‌ ఈ అంతర్ముఖ కార్యక్రమాన్ని సగర్వంగా సమర్పిస్తోంది. ఎందుకంటే దెయ్యాల రచయిత పనిలో పనిగా యూనీ లెవర్స్‌ (మాతృ సంస్థ) అంతర కోరికను కూడా నెరవేర్చే పనిలో తలమునకలవుతున్నాడు గనుక.
కుళ్లిపోతోన్న వ్యవస్థను ఏదో ఒక చిట్కా వేసి రక్షించాలన్న తాపత్రయమున్న గూటి పక్షులు సమర్పకుడు, ప్రసారకుడు, దర్శకుడు ఒక వైదికపై చేరి వాళ్ల అంతర్ముఖాన్ని కొందరు సామాన్యుల ముఖాల వెనుక దాచిపెట్టి మరీ నాటకమాడుతున్నారు.


ఈ ముగ్గురి కిలాడీలకు మరో ముగ్గురు వంతలు ప్లకార్డులతో మార్కులు వేస్తూ తందాన తానతందనాన పలుకుతుంటారు.
స్వయంకృషితోనూ, ఆత్మబలంతోనూ, నిక్కచ్చిగానూ, స్వీయకృషితోనూ తొలుత ఇంద్రజాలకుడిగా, అనంతరం హిప్నటిస్టుగానూ, హిప్నోథెరపిస్టుగానూ, సైక్రియాటిస్టుగానూ, ఇప్పుడు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ శిక్షుడిగానూ, రచయితగానూ తన పనేదో తను చేసుకుపోయే పట్టాభితో తనకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని యండమూరి ఆయనను ఈ అంతర్ముఖంలో న్యాయనిర్ణేత ఆసనంలో కూర్చోబెట్టి వంత కొట్టించుకుంటున్నాడు. నిన్నటిదాకా ఈ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అంతగా తెలియని, ప్రస్తుతం వైఎస్‌ జగన్మోహననాటక సూత్రధారుల్లో ఒకతెగా భాసిల్లుతోన్న తెలుగు సినీనటి రోజా మరో వంత. పేర్లు తెలియదుగానీ ఓ మగ, ఓ ఆడ ఆథ్యాత్మికవాదులు విడతలవారీగా మూడో వంత పుచ్చుకుంటున్నారు.
ఇక అంతర్మఖానికి తెరతీస్తే… ఈ అంతర్జాతీయ దొంగల ముఠా అంతర్ముఖ నాటకాన్ని రక్తి కట్టించేందుకు సూత్రధారి, సిద్ధాంత సూరి యండమూరి తనకు ఇష్టం లేని ఆదర్శాలపై ఉమ్మేందుకు క్షణం క్షణం తాపత్రయ పడుతూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు గుప్పిస్తుంటాడు. తిక్క వాగుడుతో తలకాయను కుళ్లబొడుస్తుంటాడు. క్షుద్రదేవు(తో)డో, పిశాచమో యండమూరిని పూని నీచ, నికృష్ణ, మదాంధ పూరిత అనుమానాలను వదులుతుంటే దానికి తట్టుకోలేక సామాన్యులు బిక్క ముఖం వేస్తూనే, అంతలోనే కెమెరాలు తమను వేలాది మంది నగ్నంగా నిలబెడుతున్నాయన్న సత్యం స్ఫురించి నవ్వలేక నవ్వుతూ యండమూరికి తగ్గట్టే ఏవేవో సమాధానాలిస్తుంటారు. ఎవరో అమాయకులు ఈ అంతర్ముఖుల వలలో పడితే అయ్యయ్యో అనుకోవచ్చు. శుక్రవారం రాత్రి కొద్దిసేపు మాత్రమే ఈ కార్యక్రమాన్ని వీక్షించాను. విచారించాల్సిన విషయం ఏమిటంటే ఓ వీర మార్క్సిస్టు విప్లవ సాయుధపోరాట యోధుడి కుమార్తె, అవినీతిని చీల్చి చెండాడతాననే ఇంకొకాయన, ఐఏఎస్‌ అయి పేదల్ని ఆదుకోవాలని కలలుగనే (ఈమె ఐఎఎస్‌ కలలు సాకారం కావాలని మనసారా కోరుకుంటూనే, చమురు మాఫియా కరకు కత్తులకు మహారాష్ట్రలో బలయిన ఐఎఎస్‌ అధికారి యశ్వంత్‌ సోనవానే సంఘటనను గుర్తుంచుకోవాలని వినమ్రంగా సూచిస్తున్నాను.) మరొకామె యండమూరి కోసం బలిపీఠం ఎక్కారు. అయితే పాపం వాళ్లు అడుగడుగునా బలవటం చూళ్లేక టీవీని కట్టేసి అటు దొంగనాటకానికి తెరవేశాను. ఇటు టీవీ వీక్షణతో కలిగే రోగాలకూ తెరవేశాను. చూసిన కాసేపూ యండమూరి అంతర్ముఖాన్నుంచి గబ్బు ఉమ్మి వెలువడుతూనే ఉంది. ఎవరి మీదమ్మా మీ పోరాటం అంటూ భయపెడుతూ ప్రారంభం. ప్రభుత్వం మీద పోరాటమా? దాని వలన ఏమి సాధించారు? ఎగతాళి, వ్యగ్యం. అయినా పన్నులు చెల్లించే మాలాంటి వాళ్లను ప్రభుత్వం కాపాడవద్దా? దురుసుగా దూశాడో ప్రశ్న. మీ అమ్మాయిని ప్రభుత్వ పాఠశాలలో కాకుండా, ఎయిడెడ్‌ స్కూల్లో చదివిస్తున్నందునా, కుమార్తె కోరుకుంటే ఐదు నక్షత్రాల హోటలుకు స్వేచ్చగా పోనిస్తానని అన్నందుకూ నీవు అసలు సామ్యవాదివే కాదు పొమ్మంటూ యండమూరి తీర్పిచ్చాడు. దీనికితోడు ఆథ్యాత్మికవాది ముసుగు మనిషి మరో తిక్క ప్రశ్నతో ఆమెకు మిగిలున్న ఓపికను కూడా మింగేశాడు. ”అమ్మా, ఒకడికి తొంభై మార్కులు వస్తాయి. ఇంకొకడికి ముప్పై మార్కులొస్తాయి. మీరేమో వాళ్లిద్దర్నీ సమానం చేయమంటుంటిరి. తొంభై మార్కులవాడు ఊరుకుంటాడా తల్లీ? ఇదీ సామ్యవాద సిద్ధాంతానికి ఆథ్యాత్మికవాది తూట్లు పొడిచే తీరు. నేను ముందే చెప్పినట్లుగా పాతిక భాగం మాత్రమే చూసి తెరేసినందున మార్క్సిస్టు కుమార్తె గెలిచిందో? అవినీతిపై పోరాటేగ్రేసరుడు నిలిచాడో? ఐఏఎస్‌ పట్టాకోసం నిత్యం తంటాలు పడుతోన్న యువతి స్థితి చివరలో ఏమయిందో? నాకు తెలియదు. అన్నట్లు మొదటి ఘట్టంలో ఆడవాళ్లకు చెరొక 24 మార్కులు రాగా, అవినీతి వ్యతిరేకికి 25 మార్కులు వడ్డించారు మరి.

విజయవాడ జ్యొతిని నిట్టనిలువునా ఆర్పిన నీ అంతర్ముఖం సంగతేమిటని యండమూరి వీరేంద్రనాధ్‌ని  యెవరన్నా ప్రశ్నిస్తే బాగుండును.

సజీవ సమాధికి శతాధిక వృద్ధురాలు వినతి


కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి విముక్తి పొందేందుకుగాను తాను సజీవ సమాధి అయ్యేందుకు అవకాశం కల్పించాలని విశాఖజిల్లా చోడవరం మండలం పిఎస్‌పేటకు చెందిన శతాధిక వృద్ధురాలు మజ్జి దేముడమ్మ (110) జిల్లా కలెక్టరుకు విన్నవించింది. దీంతో కలెక్టరు ఆదేశాల మేరకు చోడవరం తహశీల్దారు జి తాతబ్బాయి, ఎస్‌ఐ గఫూర్‌ ఆమె వద్దకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. పిఎస్‌పేటకు చెందిన దేముడమ్మ భర్త బాపునాయుడు 40 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె ఆస్తులన్నింటినీ ఆమె మనవడు మజ్జి రామకృష్ణ గతంలోనే స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటిని కూడా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నాడు. ఆమె నివసిస్తున్న ఇంటికి విద్యుత్తును కూడా నిలిపేయించాడు. తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులను మిగతా కుటుంబ సభ్యులు కాజేశారని ఆమె కన్నీటి పర్యంతమయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు సజీవ సమాధికి అనుమతించాలని దేముడమ్మ కోరింది. ఇంటి ప్రాంగణంలో సమాధిని కూడా సిద్ధం చేసుకున్నానని ఆమె వారికి చూపింది. ఇదీ నేటి భారతం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ‘మూడో కంటికి’ తెలియకుండా స్వాహా


హరి అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పేమాటలో యదార్థం మాటేమోగానీ, శ్రీకాళహస్తీశ్వరాలయంలో అవినీతి లేని అడుగే కానరాదు. తామరపూలు, టెంకాయలు, నెయ్యి దీపాల కొనుగోళ్లలోనూ కోట్లాది రూపాయలు కైంకర్యం అవుతోంది. ఈ వస్తువులను కూడా సర్పదోష నివారణ పూజల్లో వినియోగిస్తారు. నాగపడగలతో పాటు తామరపూలు, నెయ్యిదీపాలు, కొబ్బరికాయలను రెండేసి చొప్పున దోషనివారణ పూజలో ఉపయోగిస్తారు.
తామరపూలతో ఏడాదికి రూ. 59 కోట్ల పరిమళం
రోజుకు 2,500 పూజలకు మొత్తం ఐదువేల తామరపూలు అవసరం. పూలను అమ్ముకున్నందుకుగాను గుత్తేదారు పి రమేష్‌, ఆలయానికి నెలకు రూ.11 లక్షలు చెల్లించాలి. జత తామర పూలను 20 రూపాయల చొప్పున మాత్రమే అమ్మాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. అయితే దానికి భిన్నంగా రూ. 60 నుంచి రూ. 80 రూపాయల దాకా సాధారణంగా వసూలు చేస్తున్నారు. దీని ప్రకారం సాధారణంగా వ్యాపారం జరిగిందనుకున్నా నెలకు రూ. 60 లక్షల చొప్పున ఏడాదికి రూ. 7.20 కోట్ల రాబడి తామరపూల వ్యాపారం ద్వారా సమకూరుతోంది. గుత్తేదారు ఆలయానికి చెల్లించాల్సిన రూ. 1.32 కోట్లు పోను రూ. 58.80 కోట్లు ఏడాదికి మిగులుతోంది. అదే భక్తుల రద్దీ పెరిగితే తామరపూల ధర నూర్రూపాయలకు పైమాటే. ఈ గుత్తేదారుకు దక్కిన టెండరు ప్రకారం 2010 ఏప్రిల్‌ ఒకటో తేదీతో మొదలయి 2013 మార్చి 31 వరకూ ఆలయంలో తామరపూలు, టెంకాయలు తదితర సామగ్రిని అమ్ముకోవచ్చు. అయితే నెలనెలా కోట్లాది రూపాయల్ని సొంతం చేసుకుంటున్న గుత్తేదారు ఇప్పటికే దేవస్థానానికి 88.34 లక్షల రూపాయిలు బకాయి పడ్డాడు. వాస్తవానికి నిర్ధేశిత ధరలకు మించి విక్రయించటంతోపాటు, బకాయి పడిన నేరానికి ఈ గుత్తేదారు టెండరును రద్దు చేయాలి. అయితే గుత్తేదారు లాభాల మూటలో ఉన్నతాధికారులకూ వాటాలు పడుతున్నందున చట్టం ఇక్కడ చట్టుబండలవుతోంది.
ఆదాయం రూ. 14 కోట్లు … బకాయి రూ. 14 లక్షలు
నెయ్యి దీపాల వ్యవహారంలోనూ ఇదే తంతు నడుస్తోంది. జత నెయ్యి దీపాలకు రూ. 20 ధర నిర్ణయించగా, గుత్తేదారు రెట్టింపు వసూలు చేస్తున్నాడు. నెయ్యి దీపాల ద్వారా రోజుకు లక్ష రూపాయల చొప్పున నెలకు రూ. 30 లక్షల రాబడి వస్తోంది. వీటిని అమ్ముకున్నందుకుగాను ఆలయానికి రూ. 1.08 లక్షలు చెల్లించాలి. అంటే నెలకు రూ. 29 లక్షలు ఆదాయం గుత్తేదారు రమేష్‌ పరమవుతోంది. 2007 నుంచి ఈ కాంట్రాక్టును నిర్వహిస్తున్న గుత్తేదారుకు ఇప్పటి వరకూ 13.92 కోట్లు ఆదాయం రాగ ఆలయానికి చెల్లించాల్సిన దానిలో 14 లక్షల రూపాయలు బకాయి పడ్డాడు.
టెంకాయల్లో అంతా అవినీతే
రోజుకు ఐదువేల టెంకాయలు అవసరం. టెంకాయలను పాత, కొత్త అని రెండు రకాలుగా విభజించారు. పాతరకం కాయ చుట్టు కొలత 28 సెంటీమీటర్లు ూండాలి. కొత్త టెంకాయ 30 సెంటీమీటర్లు ఉండాలి. అయితే గుత్తేదారు ఈ ప్రమాణాలకు పాతరేసేశాడు. 22-25 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న టెంకాయలనే సరఫరా చేస్తున్నాడు. ఒక టెంకాయ రూ. 6.60 విక్రయించాలని ఆలయ యాజమాన్యం నిర్ధేశించింది. అయితే మిగతావాటి మాదిరిగానే అధిక ధరల్ని వసూలు చేయటం రివాజయింది. ఒక్కొక్క కాయకు రూ. 10 నుంచి రూ. 12 దాకా ఇక్కడ వసూలు చేస్తున్నారు. అంటే రెట్టింపు లాభాలు దండుకుంటున్నారు. నెలకు రూ. 18 లక్షలు దండుకునే గుత్తేదారుకు ఆలయానికి చెల్లించాల్సింది చెల్లించినా నెలకు రూ. 15 లక్షల చొప్పున ఏడాదికి 1.80 కోట్లకు పైనే మిగులుతుంది. ఇదంతా బయటకు కనిపించే అవినీతి. దీనికితోడు అర్చకులకూ, గుత్తేదారుకూ మధ్య జరిగే లోపాయికారి ఒప్పందం ప్రకారం టెంకాయలను పగలగొట్టకుండానే తట్టలోకి విసురుతారు. అలా పగలని కాయలను అర్చకులు తిరిగి గుత్తేదారుకు అమ్ముకుంటారు. భక్తులు ఎవరయినా తమ ప్రసాదం ఇవ్వాలని కోరితే, శని దోషం ఇక్కడితోనే పోవాలి, ఇంటికి తీసుకెళ్లకూడదు’ అంటూ అర్చకులు భక్తుల నోరు మూస్తారు. టెంకాయల టెండరుదారు 2008లో నెలకు 2.35 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఆనాటి గుత్తేదారు కాసరం బాలాజీ మాజీ శాసనసభ్యుడికి అనుచరుడు కావడంతో తాను చెల్లించాల్సిన సొమ్మును శాశ్వత బకాయిల జాబితాలో పెట్టేశాడు. ఆయన రూ. 25.50 లక్షల సొమ్మును ఆలయానికి ఎగవేశాడు.

పదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అవినీతి : పాత్రికేయుడు పాలగుమ్మి


గడచిన పది సంవత్సరాల్లో దేశంలో రూ. 10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ విశ్లేషించారు. కడప జిల్లా పరిషత్తు సమావేశ భవనంలో పిఎఫ్‌ఐ, ఐసిఇయు, ఎపిఎంఎస్‌ఆర్‌యు, యుటిఎఫ్‌, జెవివి గురువారం సంయుక్తంగా నిర్వహించిన ‘రాజకీయాల్లో అవినీతి – ధన ప్రాబల్యం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ సంసదను కార్పొరేట్‌ సంస్థలు, అవినీతి పరులైన రాజకీయ నాయకులు కలిసి దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి నిధులు లేవంటున్న ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు మాత్రం కోట్లాది రూపాయలు రాయితీలుగా ఇస్తున్నాయని తప్పుపట్టారు. ప్రపంచ కుబేరుల్లో మనదేశం నాలుగో స్థానంలో ఉండగా, మానవాభివృద్ధిలో 134వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 53 మంది ధనికుల వద్ద దేశ తలసరి ఆదాయంలో 1/3 వంతు సంపద పోగుబడుతోందని తెలిపారు. స్విస్‌ బ్యాంకుల్లో రూ. 20 లక్షల కోట్ల భారతదేశ ధనం మూలుగుతోందని వివరించారు. స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారి ఖాతాలు తెలియవని మొదట ప్రకటించిన ప్రణబ్‌, తర్వాత మాట మార్చి వారి పేర్లు ఉన్నాయని చెప్పటంలో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దొంగలెవరో తెలిసినా చెప్పలేమని ప్రణబ్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. స్విస్‌ బ్యాంకుల్లో దాచిన అవినీతి ధనం 2-జి స్కాం కన్నా పది రెట్లు అధికమని విశ్లేషించారు.
ప్రభుత్వం సృష్టించిన వివిధ కారణాలతో 1995 నుంచీ ఇప్పటి వరకు మహారాష్ట్రలోని విదర్భలో 45 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 2003లో ఎకరా పత్తి సాగుకు ఐదు వేల రూపాయలు సరిపోగా, ఇప్పుడు 24 వేల రూపాయలు పెట్టాల్సి వస్తోందని చెప్పారు. దిగుబడి మాత్రం నాలుగు క్వింటాళ్లే వస్తోందన్నారు. ఈ లెక్కన రైతుకు ఎనిమిది వేల రూపాయల దాకా నష్టం వస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 1995 నుంచి ఇప్పటి వరకూ 2.56 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే 30 వేల మంది చనిపోయారని గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయన్నారు. 2008 నుంచీ ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు.

శివశివా… ఇదేం ‘దోషం’


దోష నివారణ దేవుడిగా పేరున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అవినీతి పడగ విప్పి నాట్యమాడుతోంది. ఈ ఆలయంలో నిత్యం సర్పదోష నివారణ పూజలు జరుగుతుంటాయి. తనను కష్టాల నుంచి కడతేర్చాలని గతవారం కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా స్వయంగా ఇక్కడకు వచ్చి దోష నివారణ పూజ చేయించారు. ఈ పూజల వ్యవహారంలో సంబంధిత ఉన్నతాధికారులు కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడుతున్నారు. దోష నివారణ పూజల్లో నాగపడగను వినియోగిస్తారు. ఈ నాగపడగల సరఫరాను వాస్తవంగా టెండర్ల ద్వారా ఖరారు చేయాలి. అయితే ఆలయ అధికారి ఈ విధానాన్ని 2009 నవంబరు నుంచీ పక్కనబెట్టి గుత్తేదారు కిషోరు నుంచి నామినేషను పద్ధతిన నాగపడగలను కొనుగోలు చేస్తున్నారు. ఆనాటి నుంచీ 2011 జనవరి వరకు ఈ వ్యవహారంలో రూ. 1.50 కోట్ల కుంభకోణం జరిగినట్టు లెక్కలు విన్పిస్తున్నాయి. దీనికితోడు తామరపూలు, నెయ్యిదీపాలు, తుమ్మెదపూలు, టెంకాయలు సరఫరాలోనూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి.
రాహూకేతు పూజలని కూడా పిలిచే సర్పదోష నివారణ పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో రోజుకు సగటున 2,500దాకా జరుగుతుంటాయి. ఆదివారం, సోమవారాల్లో మూడువేల మంది పైనే ఈ పూజల్ని చేయించుకుంటారు. ఈ పూజలకు దాని విధానాన్నిబట్టి రూ. 250, రూ. 600, రూ. 1000, రూ. 1500 చొప్పున వసూలు చేస్తారు. రూ. 1000, రూ. 1500 చెల్లించిన వారికి పది గ్రాముల వెండి నాగపడగలను ఉచితంగా అందజేస్తారు. రూ. 250, రూ. 600 విలువయిన పూజలు చేయించినవారికి ఐదు గ్రాముల వెండి పడగలను ఇస్తారు. ఈ లెక్కన నెలకు సరాసరిన 250 కిలోల వెండి అవసరం.
వెండి కొనుగోళ్లలో కమీషను
రోజుకు ఎనిమిది కిలోల చొప్పున ప్రస్తుత చెన్నయ్‌ బులియన్‌ మార్కెట్టు ధర ప్రకారం ఏడాదికి వెండి కోసం 13 కోట్ల రూపాయలను ఆలయం వెచ్చిస్తున్నది. కిలో వెండికి మూడువేల రూపాయల చొప్పున చెన్నయి వ్యాపారులు కమీషను కింద ముట్టజెప్పటం కద్దు. అంటే మూడు వేల కిలోలకు ఏడాదికి 90 లక్షల రూపాయలు కమీషను రూపంలో కొనుగోలుదారులకు అందుతుంది. ఈ కమీషను సొమ్ములో అత్యధికం గుత్తేదారు ద్వారా అధికారుల ఖాతాలకు చేరుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
తరుగులో లాభం
రోజుకు ఎనిమిది కిలోల వెండి కొనుగోలుకుగాను 200 గ్రాముల చొప్పున తరుగు కింద వ్యాపారులు తీసేస్తారు. ఈ లెక్కన రోజుకు రూ. 8,600 చొప్పున, ఏడాదికి రూ. 31 లక్షలు జమపడుతుంది. ఇలా ఏడాదికి కమీషను, తరుగు కలిపి రూ. 1.21 కోట్ల సొమ్ము గుత్తేదారుకు దక్కుతుంది. దీనిని బట్టి టెండర్లకు బదులు నామినేషను పద్ధతి పాటించటం ప్రారంభించిన గత 15 నెలల కాలంలో 1.50 కోట్ల రూపాయలను ూన్నతాధికారులు, గుత్తేదారు కలిసి అప్పన్నంగా భోంచేసినట్లే.
సొంత వెండి నిల్వలతోనే నాగపడగల తయారీకి అవకాశం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు అందజేసిన వెండి 17 వేల కిలోలదాకా నిల్వ ఉంది. ఇది ప్రస్తుత వినియోగం ప్రకారం చూస్తే ఆరేళ్లకు సరిపోతుంది. ఈ నిల్వలను వినియోగించి నాగ పడగలు తయారు చేయిస్తే భక్తులకు నాణ్యమయిన వెండిని సరసమయిన ధరలోనే అందించే వీలుంది. అయితే 2,500 కిలోల వెండిని మాత్రమే కరిగించేందుకు దేవాదాయశాఖ కమిషనరు అనుమతి ఇచ్చారు. వెండిని కరిగించే పనిని కూడా నాగపడగలు సరఫరా చేసే గుత్తేదారుకే అధికారులు అప్పగించారు. దీంతో ఈ వ్యవహారంలోనూ లక్షలాది రూపాయలు చేతులు మారే ప్రమాదం ఉందని భక్తుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది

భారతదేశాన్ని ఏ వ్యవస్థా కాపాడలేదు … ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌

అత్యున్నతస్థాయిలో అసమానతలున్న భారతదేశాన్ని ఏ వ్యవస్థా కాపాడలేదని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ తేల్చి చెప్పారు. కర్నూలులో ఉపాధ్యాయులు – ఉద్యోగుల వేదిక బుధవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం-ధనప్రభావం’ అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోన్న అసమానతలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నట్లుగానే, పేదరికం అంతకంటే శరవేగంగా పెరిగిపోతోందని విశ్లేషించారు. 1991కి ముందు దేశంలో ఒక్కరు కూడా డాలరు బిలీనియర్లు లేరని గుర్తుచేశారు. ఇప్పుడు 53 మంది డాలరు బిలీనియర్లు ఉన్నారని లెక్కలు వేశారు. 1/3వ వంతు తలసరి ఆదాయం వారి చేతుల్లోనే ఉందన్నారు. కోటీశ్వరుల సంఖ్య విషయంలో భారతదేశానిది నాలుగో స్థానం కాగా ఆహారం, ఆరోగ్యం, విద్యలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో 135వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో 83 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.20 కంటే తక్కువతోనే బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ధరల్లో రూ.20కి ఏమి వస్తుందని ప్రశ్నించారు. 83 కోట్ల మంది పేదల్లో దళితులు, ఆదివాసీలు, ముస్లిములే అత్యధికులని వివరించారు. శాసనసభ ఎన్నికలకు రూ.10 లక్షలు, లోక్‌సభ ఎన్నికలకు రూ.25 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదని నిబంధన ఉన్నా ఇప్పుడు రూ.40 కోట్ల నుంచి రూ.70 కోట్లదాకా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 288 మంది శాసనసభ్యులు ఉండే మహారాష్ట్రలో 212 మంది కోటీశ్వరులు పోటీ చేయగా, 186 మంది గెలిచారని వివరించారు. మిగిలిన వారు ఎందుకు ఓడారని తాను పరిశీలించానని చెబుతూ, ఓడిన కోటీశ్వరుల కన్నా గెలిచిన అభ్యర్థులు పెద్ద వాళ్లని తేలిందని విశ్లేషించారు. 70వ దశకంలో ముంబయిలో టాటా మీద ఒక సాధారణ కార్మికుడు పోటీ చేసి గెలిచాడని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిది సాధ్యమా? అని ప్రశ్నించారు. ఈ అవినీతిలో మీడియా పాత్ర కూడా కీలకమేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ఎన్నికల్లో చెల్లింపుల వార్తల కోసం ధనాన్ని ధారాళంగా ఖర్చు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల్ని చెల్లింపుల వార్తల కోసం ఖర్చు పెట్టారని తెలిపారు. ఆదర్శ కుంభకోణంలో పదవీచిత్యుడైన అశోక్‌ ఛవాన్‌ లోకమత్‌ పత్రికలో 156 పేజీల  చెల్లింపుల వార్తలు  రాయించుకున్నారని చెప్పారు. దీనిపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లోకమత్‌ పత్రిక యాజమాన్యాన్ని విచారించగా, అశోక్‌ ఛవాన్‌ గొప్ప నాయకుడయినందునే ఆ వార్తలు రాశామంటూ సమాధానం ఇచ్చిందని తెలిపారు. పాపం అంత గొప్ప నాయకుడూ ఆదర్శ కుంభకోణంలో ఇరుక్కుపోయి పదవి కోల్పోయాడని ఎద్దేవా చేశారు. డబ్బులు పోసి గెలిచిన ప్రజాప్రతినిధుల ఆదాయంలో 350 శాతం నుంచి ఏడు వేల శాతం వరకూ వృద్ధి ఉంటోందని తెలిపారు. ఏడేళ్లుగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని వివరిస్తూ ఈ జబ్బును నియంత్రించేందుకు ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.