Archive for జనవరి 1st, 2011

2010లో 57 మంది పాత్రికేయులు హత్య


ప్రపంచ వ్యాప్తంగా 2010లో మొత్తం 57 మంది పాత్రికేయులు హత్యకు గురయినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రకటించింది. అలాగే పాత్రికేయులకు పాకిస్తాన్‌ అత్యంత ప్రమాదకరంగా ప్రాంతమని విశ్లేషించింది. అత్యధిక పాత్రికేయులు నేరస్తుల చేతుల్లో మృతిచెందారు. 2009లో 76 మంది చనిపోయారు. వాస్తవానికి పాలకుల పరోక్ష, ప్రత్యక్ష మద్దతుతోనే పాత్రికేయులను నేరస్తులు దాడులకు పాల్పడుతున్నట్లు అనేక రుజువులున్నాయి. అందువలనే పాత్రికేయులను హత్యచేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు పూనుకోవటం లేదు. 2010లో చనిపోయినవారిలో పాకిస్తాన్‌లో అత్యధికంగా 11 మంది, మెక్సికో, ఇరాక్‌లలో ఏడుగురి చొప్పున, ఫిలిఫ్పైన్స్‌లో నలుగురు మృతిచెందారు. 51 మంది పాత్రికేయులను అపహరించినట్లు వివిధ దేశాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌ పాత్రికేయులు హర్వీ జెస్క్విరీ, స్టీఫెన్‌ టపోనియర్‌తోపాటు మరో ముగ్గురు ఏడాదికిపై నుంచే ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది.

అరవోళ్లకు ప్రభుత్వం సంక్రాంతి నజరానా


తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చౌకదుకాణ రేకుదారులందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా చీర, ధోవతితోపాటు పొంగలి వస్తుసామ్రగ్రిని ఉచితంగా అందించనుంది. చెన్నయ్‌ పల్లవరంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని 1.9 కోట్ల కుటుంబాలకు ఈ ఉచిత నజరానా అందుతుంది. ఒక్కొక్క కుటుంబానికి చీర, ధోవతితో పాటు అరకిలో చొప్పున కొత్త బియ్యం, బెల్లం, 100 గ్రాముల పెసరపప్పు, 10 గ్రాముల చొప్పున ముంతమామిడి పప్పు, ద్రాక్ష, యాలకులు అందించనున్నారు. ఈ పధకానికి ప్రభుత్వం రూ. 90 కోట్లు కేటాయించింది. ఇదేదో అరవ ప్రభువుల్ని పొగిడేందుకు ఇక్కడ టపా కట్టలేదు. ఘనత వహించిన తెలుగు ప్రభువులు ఈ విధంగా ఎందుకు స్పందించరు? తెలుగు వాళ్లు ఎక్కడున్నా పెద్ద పండుగని ఏడాది కాలంపాటు ఎదురెదురు చూసే పండుగ ఇది. ఈ ఏడాది మే నుంచి డిసెంబరు వరకూ ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలన్నింటినీ కోల్పోయి ఏదీ నాకు దిక్కంటూ చేతులు చాచి అర్థిస్తోన్న తెలుగు రైతన్నలు, చేనేతన్నలు, పేద వ్యవసాయకార్మి కుటుంబాలకు కూడా తమిళనాడు ప్రభుత్వం మాదిరిగానే సంక్రాంతికి ఈ చిన్నపాటి సాయం అందించి కనీసం ఆ ఒక్కరోజయినా కాసింత సంతసాన్ని కలిగించాల్సిన బాధ్యత వాన దేవుడు తమ పార్టీ వాడేనని పదేపదే ప్రకటించుకునే పాలకులకు లేదా?

నూతన గీతిక … మహాకవి శ్రీశ్రీ

ఈ నూతనసంవత్సర శుభాది తరుణాన
ఈ ప్రథమ మాసాన
ఈ మనోజ్ఞ విభాత సమయాన
ఈ మహాంధ్ర జనాళి సుముఖాన
కలతలే తరగలై లేస్తుంటే
కక్షలే గాలులై వీస్తుంటే
కలుష జీమూతాలు మూస్తుంటే
కుట్రలే కుక్కలై కూస్తుంటే
ధరియించి పెదవిపై దరహాసం
భరియించి యెడదలో పరితాపం
విరిచింతు నీనాటి నవగీతం
చిలికింతు విజయాంధ్ర నవనీతం
తెలుగునాడును పెద్ద చౌరాస్తా
నావహించిన పిచ్చి చాదస్తా
లవఘళించే భ్రమలు ఛేదిస్తా
మలుపులన్నీ దిద్ది తీరుస్తా
ఎవరురా ఆ గొప్ప మొనగాళ్ళు
మతిలేని తలకిందు గిజిగాళ్ళు
నాయకుల మనుకునే మగవాళ్ళు
ఐకమత్యం చెరచగలవాళ్లు
తెలుగుతల్లిని పంచుకొంటారా
తెలుగు నెత్తురు నంచుకొంటారా
తెలుగు గొంతుక చించుకొంటారా
తెలుగు తాడే తెంచుకుంటారా
అంతస్సమర భీతి ముట్టించి
అభివృద్ధి పెడదారి పట్టించి
లేనిపోని పుకార్లు పుట్టించి
సత్యానికి సమాధి కట్టించి
ఎవరురా  విరగబడుతున్నోళ్ళు
ఆస్తులు పాస్తులు ఉన్నోళ్ళు
మస్తుగా దేశాన్ని తిన్నోళ్ళు
జరుపుతా రీజులుం ఎన్నాళ్లు
తిరగబడుతున్నారు పేదోల్లు
కూటికి గుడ్డకి లేనోళ్ళు
చదువులూ సాములూ రానోళ్ళు
విప్పుతా రికమీద వేనోళ్ళు
వీళ్ళ కోసం నేను నిలుచుంతా
వీళ్ళ భాధలు నాకు తెలుసంటా
రేపటికి వారసులు వీరంతా
వీళ్ళ ధాటికి ఎదురు లేదంటా
కళింగాంధ్ర త్రిలింగాంధ్రాలు
కాకతీయుల మధురబంధాలు
రాయలేలిన ఏడు సంద్రాలు
రాగానురాగ ప్రబంధాలు
తెలుగు జాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చ జూస్తున్న
పిచాచాలను తరిమి వేస్తున్నా