Archive for జనవరి 5th, 2011

ఇప్పుడే తేల్చం … తెలంగాణ ఎంపీలకు కాంగ్రెసు అధిష్టానం హితబోధ

శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తమ ఎంపీలతో కాంగ్రెసుపార్టీ అధిష్టానం కీలక సమావేశం నిర్వహించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడ్డాక ఎలా నడుచుకోవాలనే అంశంపై ప్రధానంగా ఎంపీలకు హితబోద చేశారు. పార్టీ కీలక నిర్ణయాలను చర్చించే యుద్ధ వేదిక (‘వార్‌ రూం’) భవనంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీతో పాటు కోర్‌కమిటీ సభ్యులు ఎకె ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌ పాల్గన్నారు. పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీగౌడ్‌, వి హనుమంతరావు, వివేక్‌, సర్వే సత్యనారాయణ, ఎంఎ ఖాన్‌, నంది ఎల్లయ్య తదితర ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ూన్నా తెలంగాణ ఇప్పటికిప్పుడే ఇచ్చే పరిస్థితి ఉండదని ఎంపీలకు కోర్‌కమిటీ స్ఫష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్ల నివేదికపై ఎవరికి వారే స్పందించవద్దని సూచించినట్లు సమాచారం. ఈ నివేదిక అధ్యయనానికి పార్టీకీ, ప్రభుత్వానికీ సమయం పడుతుందని తెలిపారు. ఎంపీలు కూడా నివేదికను కూలంకషంగా అధ్యయనం చేయాలని కోరినట్లు తెలిసింది. ఈ నివేదికను అధ్యయనం చేసేందుకు పార్టీకి కనీసం నెల సమయం పడుతుందని నేతలు వివరించారు. నివేదిక వచ్చిన వెంటనే దానిపై రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని సూచించారు. అలాంటి ప్రకటనలు చేస్తే టిఆర్‌ఎస్‌కు లబ్ది చేకూరుతుందని విశ్లేషించారు. దాంతోపాటు ప్రజల్లో లేనిపోని భ్రమలు, అపోహాలకు ఆస్కారం ఏర్పడుతందని పేర్కొన్నట్లు తెలిసింది.
‘శ్రీకృష్ణ’ నిర్ణయం అంతిమం కాదు : ఎంపీలు
కోర్‌కమిటీ సభ్యులతో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీలు సర్వే సత్యనారాయణ, మధుయాష్కిగౌడ్‌, వివేక్‌ తదితరులు మీడియాతో మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఇష్ణానుసారం మాట్లాడవద్దని అధిష్టానం తమకు సూచించిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నిర్ణయం అంతిమం కాదని ఎంపీలు చెప్పారు. ఈ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడతామన్నారు. తెలంగాణకు నివేదిక వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదన్నారు. కాంగ్రెసుపార్టీ ఇప్పటికీ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు పలు సందర్భాల్లో పార్టీ హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. నివేదికపై తామంతా చర్చించిన తర్వాత సోనియాను కలిసి తమ అభిప్రాయాలు చెబుతామన్నారు. ఈ భేటీ అనంతరం ప్రణబ్‌, అహ్మద్‌ పటేల్‌, ఎకె ఆంటోనితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశమవటం విశేషం.