హెచ్‌ఎంటీవీ ప్రధాన సంపా(త)దకుడు కె. రామచంద్రమూర్తికి కొంత తెలంగాణ మొగ్గుందని తెలుసుగానీ, శుక్రవారం ప్రసారమయిన ఆంధ్రప్రదేశ్ దశ-దిశ కార్యక్రమం చూసేంతవరకూ మోసగాడని అనుకోలేదు నేను. ఎవరు కాదన్నా, అవునన్నా దశదిశ కార్యక్రమంతో హెచ్‌ఎంటీవీ దశ కొంత మారింది. బూతుల పంచాంగమో, హత్యోదంతాలో లేని ప్రజాకర్షక కార్యక్రమాలు నిర్వహించి దశను మార్చుకునే ప్రయత్నం చేయటం తప్పుకాదు. కానీ రాష్ట్ర దశకూ, దిశకూ కీలకమయిన విభజన వ్యవహారాన్ని సమతూకంగా నిర్వచించాల్సిన బాధ్యత వార్తా సంస్థల కనీస బాధ్యత. అందులోనూ ఊ అంటే చాలు ఉద్రిక్తతలకు దారితీస్తోన్న తెలంగాణ విభజన సమస్యను సొంత లాభం కొంతమానుకుని వ్యవహరించాల్సిన బాధ్యత పాత్రికేయుల విధి.
అయితే శ్రీకృష్ణకమిటీ నివేదిక వెల్లడయిన నేపథ్యంలో హెచ్‌ఎంటీవీ నిర్వహించిన దశ-దిశ కార్యక్రమాన్ని సంపాదకుడు రామచంద్రమూర్తి తెలివిగా తెలంగాణ వాదులకు అనుకూలంగా నిర్వహించాడనేందుకు సవాలక్ష సాక్ష్యాలున్నాయి. వాస్తవానికి ఏడాది క్రితం ప్రారంభించిన ఈ జీడిపాకం కార్యక్రమం తొలి ధారావాహికలోనే మోసపు బీజాలున్నాయి. శుక్రవారం కార్యక్రమం మాదిరిగానే ఆనాడు కూడా ఒకరో అరో తప్ప తెలంగాణ వాదులను అత్యధికంగా ఆహ్వానించటమే ఈ మోసం. అయితే ఈ దఫా కొంత నయం. ఆనాటితో పోలిస్తే సమైక్యవాదుల సంఖ్య కొంత మెరుగ్గా కన్పించింది. అయితే ప్రసంగానికి అవకాశం కల్పించటంలోనూ, వ్యాఖ్యానాలు చేసేందుకూ, తెలంగాణకు అనుకూలంగా రెచ్చగొట్టేందుకూ రామచంద్రమూర్తి తెలివిగా అవకాశాలు కల్పించారు. అయితే ఈ వివక్షను ఎవ్వరూ గమనించకుండా ఉండేందుకగాను ఆయన తొలి అవకాశాన్ని సమైక్యవాదాన్ని విన్పిస్తోన్న పీఆర్సీ నాయకుడు విద్యాధరరావుకి కల్పించారు. ఆ తర్వాత చూసుకోండిక. వరుసబెట్టి తెలంగాణ వాదులకే గొట్టాన్ని అందజేశారు. తెలుగుదేశం నాయకుడు నాగం జనార్ధనరెడ్డితో మొదలుబెట్టి ఒకే గూటిపక్షులతో ఊదరగొట్టించారు. అందులో ఏకో నారాయణలయిన వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్‌కు కూడా తొలి అంకంలోనే అవకాశం కల్పించారు. ఆయన తన పావుగంట ఉపన్యాసంలో సమయం తీసుకుంటున్నందుకు కనీసం పదిసార్లన్నా క్షమాపణలు కోరారు. ఇక కోస్తా సంతతికి చెందిన కాట్రగడ్డ ప్రసూనకు కూడా ప్రారంభంలోనే మైకు అందింది. తాము తెలంగాణకు చెందిన వాళ్లమేననీ, ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్న సెటిలర్లమనీ ఆమె చెప్పుకున్నారు. ఆ విషయం తెలిసే ఆమెకు అవకాశం కల్పించి ఉంటారు. దీనికితోడు పలువురు సమైక్యవాదులు, ప్రత్యేక ఆంధ్రవాదులు కూడా కార్యక్రమం ప్రారంభం కాకమునుపే వచ్చి కూర్చున్నారు. అయితే వారిని పక్కనబెట్టి టిఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్‌కు మాత్రం వచ్చీరాగానే మైకు అందజేసి సమైక్యవాదులకు హెచ్చరికలు జారీచేసే అవకాశం కల్పించారు. అసలు ఆదినుంచే హెచ్చరికలు జారీ చేయటం ఈ దశ-దిశ ప్రత్యేకత. పీఆర్పీ విద్యాధరరావు మాట్లాడుతుండగానే పలువురు విద్యార్థులు గొడవకు దిగారు. దీనికితోడు ఎవరో పెద్దాయన, విద్యాధికుడు కూడానట ఆయన అనుమతి లేకుండానే కేకలు పెట్టాడు. ఏదిబడితే అది మాట్లాడకూడదని హెచ్చరికలు చేశాడు. అంటే ఆయనకు ఇష్టమైన మాటల్ని మాత్రమే మాట్లాడాలని ఈ విద్యాధిక పెద్దమనిషి ఆంక్షలు విధించటం చూస్తుంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందోనన్న భయం వెన్నాడుతోంది. ఇక కాంగ్రెసు మాజీ మంత్రి దామోదరరెడ్డి, బిజెపి మహిళా నాయకురాలు వనం ఝాన్సి, సిపిఐఎంఎల్ మహిళానాయకురాలు సంధ్య మధ్య సాగిన ఆధిపత్యపోరాటం గంటల సమయాన్నే మింగేసింది. సమైక్యవాద పార్టీలను నిలదీయాలంటూ దామోదరరెడ్డి నోరు పారేసుకుంటున్నా రామంచంద్రమూర్తి కనీసం నివారించే ప్రయత్నం కూడా చేయకపోవటం ప్రశ్నార్ధకం. దామోదరరెడ్డిని రెచ్చగొట్టి ఆయన్నీ, కాంగ్రెసు నాయకుల్నీ రాజీనామాల దాకా తీసుకురావటమే ఝాన్సీ, సంధ్యల అరుపుల వెనుకున్న ఉద్దేశంగా కన్పిస్తోంది. పనిలో పనిగా ఆధిపత్యమూ సరేసరి. వీటన్నింటికీ మించి అధ్యక్షవర్గంలో ఒక్క సమైక్యవాదిగానీ, ప్రత్యేక ఆంధ్రవాదిగానీ, ప్రత్యేక రాయలసీమ వాదిగానీ లేరు. అధ్యక్షవర్గంలో ఒకడని ప్రకటించి అందరికంటే ముందుగా జర్నలిస్టు ఉద్యమకారుడంటూ విశాలాంధ్ర దినపత్రిక స్థానిక సంపాదకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఆయన తన స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ, తెలంగాణవాదిగా ప్రసంగించారు. వాస్తవానికి అధ్యక్షవర్గంలో చోటుదక్కిన వారిలో ఒక్కరు కూడా తమ స్ధానానికి తగ్గట్టుగా వ్యవహరించలేదు. రాగాపోగా అతికొద్దిమంది సమైక్యవాదులకు, ఒకరిద్దరు ప్రత్యేక ఆంధ్రవాదులకు మాత్రం పొద్దుబోయిన తర్వాత, టీవీని వీక్షించే ఓపిక నశించే సమయానికి అవకాశం కల్పించారు. అయితే గియితే ప్రత్యేక రాయలసీమవాదులకుగానీ, ప్రత్యేక ఉత్తరాంధ్రవాదులకుగానీ, ప్రత్యేక హైదరాబాదువాదులకుగానీ అసలే చోటు లేదు.
Archive for జనవరి 8th, 2011
8 జన