Archive for జనవరి 9th, 2011

నల్లారి పిల్ల చేష్టలు


రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమాత్రం పరిణితి చెందినట్లులేదు. పదవీ రాజకీయాల్లో అనుభవం లేని ఆయన పిల్ల చేష్టలకు పెద్ద పీఠలేస్తున్నాడు. దీంతో ఆయన సొంత జిల్లా చిత్తూరులో ఆయనకు వ్యతిరేకంగా కుంపటి మొదలైంది. కాంగ్రెసు పక్షానికే చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కెలో బల్లెమయ్యాడు. ముఖ్యమంత్రిగా చిత్తూరులో జరిపిన తొలి పర్యటన సందర్భంగా తనకు ఆహ్వానం పలికేందుకు రాని నలుగురు శాసనసభ్యులకు తన తడాఖా చూపే పనిలో నల్లారి తొలి పావును కదిపారు. పెద్దిరెడ్డి నియోజవర్గం పుంగనూరుకు మంజూరయిన మంచినీటి గొట్టాల కాలువకు నిధుల్ని నిలిపివేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీచేశారు. నిన్నటి వరకూ మాటలతో సరిపెట్టిన పెద్దిరెడ్డి ఇప్పుడు ప్రత్యక్ష దాడికి సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా అదునుకోసం ఎదురుచూస్తున్న పెద్దిరెడ్డికి సిఎం నిర్ణయమే అందివచ్చిన ఆయుధంగా మారింది. నిధుల్ని నిలిపివేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేయటాన్ని నిరసిస్తూ, పెద్దిరెడ్డి ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లారిపై పోరాటానికి ఇది ఆరంభమని ప్రతినబూనారు. కిరణ్‌కుమార్‌కు కోపం ఉంటే తనపైన కక్ష తీర్చుకోవాలని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి పుంగనూరుకు మంజూరయిన నిధుల్ని పీలేరుకు తరలించాలనుకోవడం హేయమని విమర్శించారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై స్పందించకుండా నియోజకవర్గాన్ని పట్టుకుని వేలాడుతుండడం నల్లారి స్థాయికి తగదన్నారు. కరువు రక్కసి కరాళనృత్యం చేసే ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో గార్గేయనది నుంచి గొట్టాల కాలువ ఏర్పాటుకు 65 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నట్లు గుర్తుచేశారు. అయితే ముఖ్యమంత్రి తనపై కోపంతో నిధులను నిలిపివేశారన్నారు. తనపై కక్షతో నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

సదుముకున్నోల్లతో తంటాలే తంటాలు


మా ఊరి ఆదియ్య అంటాడూ, ”అబ్బ సదుముకున్నోల్లతో బలే తంటాలబ్బా.” అని. బ్లాగ్లోకంలోకి రాక మునుపు ఆదియ్యతో నేను ఏకీభవించేవాడిని కాదు. బ్లాగులు చదవటం ప్రారంభించి, బ్లాగును ప్రారంభించిన తర్వాత నా నమ్మకాలు నెమ్మదిగా సడిలిపోతున్నాయి. ఆదియ్య జీవితాన్ని ఒడపోసి చెప్పాడేమోనని అన్పిస్తోందిప్పుడు. తెలుగు సామెతలు 99.9999 శాతం శాస్త్రీయాలని నా నమ్మకం. ఆదియ్య మాటనుగూడా సామెతల్లో చేర్చాల్సి వస్తుందేమోనని నాకిప్పుడు తెగ భయం పట్టుకుంది.
బ్లాగ్వీక్షకుల్లో అత్యధికులు అలా టపాను తెరిచి ఇలా టపాటపా రెండు, మూడు వ్యాక్యాల్ని చదివేస్తారు. అంతే ఏ లేఖినికో వెళ్లిపోయి ఓ వ్యాఖ్యానాన్ని టపటపలాడించేస్తారు. కొందరయితే లేఖిని దాకా వెళ్లటం దండగ ఎందుకన్నట్లుగా అక్కడికక్కడే ఆంగ్లంలోనో, తెంగ్లీషులోనో తమకు తోచిందేదో కక్కేస్తారు. ఈ వ్యాఖ్యానాల్లో అత్యధికం చిలిపిగా ఉంటాయి. కొందరు చీదరించుకుంటూ రాస్తారు. మరి కొందరు టపాతో ఏ మాత్రం సంబంధం లేకుండా స్పందిస్తారు. బ్లాగరుకు తామే ఏదో ఆపాదిస్తారు. హితబోధలు చేస్తారు. నువ్విలా ఆలోచించటానికే వీల్లేదంటూ శాసిస్తారు. ఇలానే రాయాలంటూ ఆదేశాలూ జారీ చేస్తారు. కొద్దిమందే అయినా బూతులతో ఆశీర్వదిస్తారు. తిట్లదండకంతో అక్షింతలు చల్లుతారు. ఇంకొందరు కులం, మతం, ప్రాంతీయతల ఆధారంగా వ్యాఖ్యానిస్తారు. వీటన్నింటికీ నా టపాల్లో ఎంచక్కా మంచి మంచి ఉదాహరణలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎవడి బ్లాగు టపా వాడిష్టం  అనుకోరు కొందరు. తమకు అనుకూలంగా రాయలేదేమని మండిపడతారు. నూరు పూలు కాదుగదా, తమకు ఇష్టం లేని పూవు ఒక్కటయినా పూయకూడదని నలిపేసే ప్రయత్నం చేస్తారు కూడా. లక్ష ఆలోచనలు వికసిస్తే, ఈ సమాజానికి సవాలక్ష లాభాలు కలుగుతాయన్న నిజాన్ని గుర్తించరు. మానవ పరిణామ క్రమమంతా స్వేచ్ఛగా వికసించిన భావాల సమాహారమేనని ఒప్పుకోరు. ‘ద్రవిడ’ అన్న పదం వినగానే కొందరికి ఒళ్లు శివాలెక్కుతుంది. ఆర్య, ద్రావిడ చరిత్రలను తవ్వితీసిన పురాతత్వశాస్త్రవేత్తల తీర్మానాలన్నీ డొల్లంటూ గోలగోల చేస్తారు. పురాతత్వేతర విద్య చదివినవాళ్లు కూడా స్వీయమానసిక ధోరణితో సృష్టించిన పురాతత్వాన్నే అందరూ నమ్మితీరాలని ఆంగ్లంలో శాసిస్తారు. హేతువాదం అని విన్పించిందో ఇక కత్తులు దూస్తారు. నాస్తికత్వం కాదుగదా కనీసం ఆ పదం వినేందుకు కూడా ఇచ్చగించరు. ఇక ఇజం అంటేనే వీళ్లకు బూతు పదం. ఇజాలు వద్దని చెప్పటం కూడా ఇజమే(సిద్ధాంతం)నని ఇలాంటి వాళ్లను ఒప్పించేది ఎవరు? ఎవడన్నా దేవుడు లేడన్నారా? వాడిక బ్లాగ్లోకంలో మళ్లీ కనపడకుండా పడ తిట్టేయటం ఇక్కడ మామూలయింది. హిందూ మతం విమర్శలకు అతీతమని అత్యధికుల నమ్మకం. హిందువులు కాదు, సింధూనది పక్కనున్న వాళ్లు సింధువులు అని ఎవడన్నా మొదలుపెట్టాడో, ”నువ్వు మార్స్కిస్టువి, నువ్వు విదేశీయుడయిన మాక్స్‌ముల్లర్‌ మాయలో పడికొట్టుకుంటున్నావు, నువ్వు హిందూ వ్యతిరేక పురాతత్వవేత్తలు చెప్పినదానిని వదిలేసి, నేను చేప్పే వాదాల్ని చదువు, వంటబట్టించుకో, నమ్ము, ప్రచారం చెయ్యి” అంటూ శాసనాలు చేసేస్తారు. వీళ్లకు తెలిసిందే మార్క్సిజం అని నమ్మమంటారు. విశ్వాంతరాళంలో ఉన్న శాస్త్రాల సముదాయమే మార్క్సిజం అంటే గుడ్డిగా కొట్టేస్తారు. కోడినీ, ముసలమ్మనీ లాక్కొస్తారు. తమకు మార్క్సిజం కొట్టిన పిండని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. మార్క్సిజం అభిమానించేవాడెవరికీ ఆ శాస్త్రం అసలు తెలియనే తెలియదని వాదిస్తారు. విచిత్రమేమంటే, శ్రీశ్రీని అభిమానిస్తారు. మార్స్కిజాన్ని అవమానిస్తారు. మహా ప్రస్థానాన్ని ఆహాఒహో అంటూనే మార్క్సిజం ఒట్టి మూర్ఖత్వమంటూ కవిత్వం రాస్తారు. గోర్ఖీ గొప్పవాడంటూనే ఆయన నమ్మి, ఆచరించిన మార్స్కిజం మానవులకు పనికొచ్చేది కాదని తీర్మానిస్తారు. చేగువేరా బొమ్మున్న బనియను తొడుక్కుని రొమ్మిరుచుకు తిరుగుతూ సమానత్వ సిద్ధాంతం చచ్చిన కళేబరమని తృణీకరిస్తారు వీళ్లు. భగత్‌సింగ్‌కు తాము వీరవిప్లవ తమ్ముళ్లమంటూనే ఆయన ప్రవచనాలను దారి తప్పించి చెబతుంటారు. అల్లూరి సీతారామరాజును కీర్తిస్తూనే విప్లవం దండగమారి కృత్యమని ప్రచారం చేస్తారు. గురజాడ అప్పారావుని అంగీకరిస్తూనే దేశమంటే మనుషులు కాదు కంప్యూటరు విజ్ఞానమున్న కొందరేనని తేల్చిచెప్పబోతారు. కందుకూరిని అంగీకరిస్తూనే నేను చెప్పింది వేదం, నువ్వు కూడా నేను చెప్పిందే చెప్పమని పరోక్షంగా ఒత్తిడి చేస్తారు. దున్న ఈనిందంటే … ఇదిగో తాడు, అదిగో మేకు, దాన్ని కట్టేయమని తొందర పెట్టినట్లుగా చదువు – కంప్యూటరు సాంకేతిక విజ్ఞానం, అంతర్జాలంతో సంబంధబాంధవ్యాలు ఉన్న బ్లాగర్లు ఈ తీరున వ్యవహరించటం విస్మయం కలిగిస్తున్నది. విసుగు కలిగిస్తోంది. ఈ మనుషులు మారతారా? అన్న అనమానం బుర్రను తినేస్తోంది. ఈ సమాజం మారుతుందా అన్న ప్రశ్న మెదడులో నిల్వ చేరి మరీ మరీ తిరగబెడుతోంది.
ఈ తీరున, ఈ రీతిన ‘ఇదంతే’ అంటూ వాదించే బ్లాగర్లు, బ్లాగ్వీక్షకుల శాతం అధికంగా ఉన్నందునే నేను ఆదియ్య విశ్లేషణకు జై కొట్టాల్సి వస్తోంది మరి. చదువుకున్నవాడికన్నా చాకలి మేలన్న సామెతని మా అమ్మ గుర్తుచేస్తుండేది. పొట్టగోస్తే అక్షరం ముక్కరాని చాకలి ఎన్నెన్నో ఇళ్ల నుంచి బోలెడు బోలెడు బట్టల్ని సేకరించి, వాటిని ఉతికి మళ్లీ ఒక్కటంటే ఒక్కటి పొరబాటు లేకుండా ఎవరివి వాళ్లకు అప్పగిస్తాడు. మరి ఏదో ఒక అంశంలోనయినా శాస్త్రం చదివిన వాళ్లు ఇలా శాస్త్రాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? శాస్త్రీయతను ఎందుకు అంగీకరించటం లేదు? తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న తీరున ఎందుకు వ్యవహరిస్తున్నారు. విరిసే పూలను ఎందకు చిదిమేస్తున్నారు? వికసించే ఆలోచనలకు ఎందుకు మేకులు కొడుతున్నారు? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మార్క్సిజం.