Archive for జనవరి 10th, 2011

భూమిని కొల్లగొడుతున్న గల్లమ్మ


ఆమె శాసనసభకు ప్రజాప్రతినిధి. అంతే కాదు మంత్రి కూడా. అన్ని సమస్యలూ పరిష్కరిస్తానని, కష్టాల్లో ఆదుకుంటానని ఆమె ఓటర్ల ముందు సాగిలపడి గెలిచింది. అయితే కంచే చేను మేసిన చందంగా ఆమె వారిని నట్టేట ముంచుతోంది. పేదోళ్ల బతుకుల్లో చిచ్చు పెడుతోంది. తాను కోట్లకు పడగలెత్తేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారి భూములు కాజేస్తోంది. ఇదంతా తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఆమెకు సాగిలపడి సేవ చేస్తున్నారు. హక్కుదారులే ఆ భూముల్ని అమ్మేసినట్లు దస్త్రాలూ తయారు చేసేశారు. అడ్డొస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. నిబంధనల మెలికతో వారిని వేధించి మంత్రిణి మెప్పుకు పాత్రులవుతున్నారు.
ఇంతటి అకృత్యాలు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో సాగుతున్నాయి. ఈ అకృత్యాలకు రాష్ట్ర గనులశాఖ మంత్రి గల్లా అరుణకుమారి పాల్పడుతున్నారు. తాను నిర్మించదలచిన పరిశ్రమ కోసం ఆమె ఈ అకృత్యాలకు ఒడిగడుతున్నారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, తవణంపల్లి, యాదమరి మండలాల పరిధిలో గల్లా కుటుంబం ‘డిజిటల్‌ వరల్డ్‌ సిటీ’ పేరుతో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం 750 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను తన అధికార బలాన్ని చవి చూపిస్తున్నారు. ఇప్పటికే 500 ఎకరాల భూమిని సేకరించారు.
హక్కుదారులకు తెలీకుండానే అమ్మకాలు
బంగారుపాళ్యం మండలం, నూనుగుండ్ల పల్లె లోని సర్వే నంబరు 247లో 90 ఎకరాల భూమిని 1970లో ప్రభుత్వం 20 మంది పేదలకు పట్టాలు మంజూరు చేసింది. గల్లా పరిశ్రమకు సంబంధించిన వాహనాలను నిలిపేందుకుగాను ఈ భూములపై కన్నేశారు. అనుకుందే తడువుగా తన అధికార బలాన్ని ఉపయోగించి ఆ భూములను తనకు అమ్మేసినట్లు ఏడాది క్రితం దస్త్రాలు తయారు చేయించారు. అయితే అదేమీ తెలియని రైతులు రెండు రోజుల క్రితం రుణం కోసం బ్యాంకుకు వెళ్లడంతో ఈ మోసం వెలుగుచూసింది. రుణాల మంజూరుకు అవసరమయిన ఇసిని తీసుకునేందుకుగాను రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లగా అక్కడే ఈ వ్యవహారం బయటపడింది. ఆ భూముల్ని డిజిటల్‌ వరల్డ్‌ సిటీకి అమ్మేసినట్లు దస్త్రాల్లో నమోదు చేసి ఉంది. ఇది తెలుసుకున్న లబ్ధిదారులు కంగుతిన్నారు. తాము సంతకం కూడా చేయకుండా భూముల్ని ఎలా అమ్ముతారు? ఎలా కొంటారు? అంటూ ఆ పేద రైతులు లబోదిబో మంటూ ఇంటికి తిరిగి వచ్చారు.
దాడులు


బంగారుపాళ్యం మండలం, మహాసముద్రం గ్రామ సర్పంచి షర్మిల తన మామిడి తోటను అమ్ముకున్న సొమ్ము రూ. 11 లక్షలతో యాదమరి మండలం కొత్తపల్లిలో 180/2, 181/8, 180/3, 180/5 సర్వే నంబర్లలో 6.68 ఎకరాలు కొనుగోలు చేశారు. దానిలో ప్రభుత్వ అనుమతి తీసుకుని 2008లో కంకర పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ భూమిని తమకు స్వాధీనం చేయాలని డిజిటల్‌ వరల్డ్‌ సిటీ యాజమాన్యం వారం రోజులుగా బెదిరింపులకు పాల్పడుతోంది. అయినా ఒప్పుకోకపోవటంతో ఆమె భర్త తమ పరిశ్రమ సిబ్బందిని కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. గనులశాఖ అసిస్టెంటు డైరెక్టరుపై ఒత్తిడి తెచ్చి కంకర పరిశ్రమకు సంబంధించిన టిప్పరును సీజ్‌ చేయించారని బాధితురాలు షర్మిల  వాపోయారు.
మాకు తెలీకుండానే అమ్మేశారు : దొర


‘నాకు కాళ్లు లేవు. నేను, మా కుటుంబం నాలుగు ఎకరాలు సాగుచేసుకుని బతుకుతున్నాము. మామిడి, మిర్చి, బీర సాగు చేస్తున్నాము. మొన్న అప్పుకోసమని ఇసిలు అడిగితే, మేము భూములు అమ్మేసినట్లు రికార్డుల్లో ఉందని అధికారులు చెప్పారు. మాకు తెలీకుండానే ఎట్లా రిజిస్టరు చేశారని అడిగితే అధికారులు కసురుకున్నారు. ఇదెక్కడి న్యాయం? మంత్రికి పేదలమయిన మా పొలాలే కావాల్సి వచ్చాయా? మా ూసురు ఊరికే పోదు.’ అంటూ బంగారుపాళ్యం మండలం కోనెగొండ్ల పల్లి గ్రామస్తుడు దొర కన్నీటి పర్యంతమయ్కారు.
మా నోట్లో మట్టి కొడుతున్నారు : రంగయ్య
’40 ఏళ్లుగా నాకిచ్చిన ఐదెకారాల్లో సాగు చేసుకుని జీవిస్తున్నాము. ఇప్పుడు మేము భూములు అమ్మేశామని అధికారులు చెబుతున్నారు. అదేమని అడిగితే ఊరకే వచ్చిన నేలే కదరా? అంటూ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ భూమి లేకుండా మేమెట్లా బతకాలి? మా నోట్లో గల్లమ్మ మట్టి కొడతాంది బాబో.’ అంటూ కోనెగొండ్లపల్లి గ్రామస్తుడు రంగయ్య వాపోయారు.