మంత్రి తలచుకుంటే కబ్జాలకూ, రహదారుల నిర్మాణానికీ కొదవేముందని విజయనగరం జిల్లా గాజులరేగవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం పట్టణానికి ఆనుకుని ఉన్న గాజులరేగ పంచాయతీ పరిధిలో నిర్మిస్తోన్న సత్య ఇంజినీరింగు కళాశాల మీదుగా రూ.80 లక్షల వ్యయంతో తారు రోడ్డు పనులు రెండు రోజుల్లో శరవేగంగా పూర్తయ్యాయి. ఈ కళాశాల ఎదురుగా ఉన్న పొన్నావారి చెరువుకు (సర్వే నంబరు 35/4) సంబంధించిన 3.36 ఎకరాల స్థలాన్ని మంత్రి బొత్స గతేడాది ఆక్రమించిన విషయం విదితమే. బొత్స కబ్జాలను నిరసిస్తూ గత మే, జూన్ నెలల్లో సిపిఎం, సిపిఐ, టిడిపి ఆధ్వర్యాన ఆందోళనలు జరిగాయి. అప్పట్లో మండల, జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ చెరువు ప్రభుత్వానిదేనని తేల్చారు. తమ వద్ద పురాతన కాలంనాటి యాజమాన్య పత్రాలున్నాయని బొత్స కుటుంబీకులు అప్పట్లో బుకాయించారు. అయితే ఇప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం అధికారులకు ఇవ్వలేదు. తమకు ఏ పత్రాలూ అందలేదని ఆర్డీవో ఎస్ ఢిల్లీరావు కూడా ధృవీకరించారు.
రెండురోజుల్లోనే రోడ్డు పనులు
పదేళ్ల నుంచీ గాజులరేగవాసులు తమ గ్రామానికి రహదారిని నిర్మించాలని మండల, జిల్లా అధికారులకూ, అధినేతలనూ కలిసి పలు వినతిపత్రాలు సమర్పించారు. ఆ స్థలం కబ్జా చేసిన వెంటనే పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న బొత్స తన కళాశాల పక్క నుంచి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించుకున్నారని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఇంజినీరింగు కళాశాలను ఈ ఏడాది ప్రారంభించనున్న నేపథ్యంలో గాజులరేగ నుంచి జాతీయరహదారి మీదుగా రూ.80 లక్షలతో ఈ నెల 7-8 తేదీల్లో తారు రోడ్డును నిర్మించారు. అయితే గాజులరేగ నివాసుల కోరికమేరకే రూ.80 లక్షలతో రోడ్డు నిర్మిస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ ఇఇ రఘుబాబు వివరించటం విశేషం.