పప్పు బెల్లాల పండగ మళ్లొచ్చింది!

గణతంత్రమో ! స్వాతంత్య్రమో !! సొసంత్రమో !!!స్వాహాతంత్రమో !!!!
నిజానికి అవేమీ మాకానాడు తెలీదు. ఆగస్టు 15 అన్నా, జనవరి 26 అయినా మాకు తెలిసిందల్లా పప్పుబెల్లాల పండగని మాత్రమే. కాదంటే జెండాల పండగనీ అనేవాళ్లమనుకోండి.
ఏందిరోయ్‌! పుస్తకాలూ, గట్రా లేకుండా చేతులూపుకుంటూ ఎక్కడికో పోతన్నారు? అంటూ ఎవరయినా పలకరించారనుకోండి.
అయ్యో! తెలీదా? ఇయ్యాల సొసంత్ర దినోత్సవంగదా! అంటూ ప్రపంచంలో అన్ని విషయాలూ మాకు తెలుసు అన్నట్లుగానూ, పేద్ద పండితుల్లాగానూ ముఖాలు పెట్టేసి జవాబిచ్చేవాళ్లం.
అట్టాగా! గాంధీగోరి పండగన్నమాట. అయితే పప్పుబెల్లాలు దండిగా పెడతారుగా! తొందరగా ఎల్లండి బడికి! సదువుల్లేకపోయినా, ఇయ్యొకటేడిసినయ్యిప్పుడు. అంటూ ఆ పెద్దమనిషి ఏదో ఒకటి అనేసి చేతులూపుకుంటూ వెళ్లిపోయేవాడు.
వాస్తవంగా ఏడాదిలో ఆ రెండు రోజులూ బడికి సెలవే. అయినా, బడికెళ్లాలి. అయితే పుస్తకాల గోతాముని మోసుకెళ్లాల్సిన పనిలేదు. చేతులూపుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోవటమే. పైగా బళ్లో పంతుళ్ల పాఠాల్ని వినాల్సి పనిలేదు. చదవాల్సిన పని అంతకన్నా లేదు. అప్పజెప్పాల్సిన పని అసలే లేదు. ఆ ముందు రోజు రోజూ మాదిరిగా జంట రూళ్ల పుస్తకంలో కాపీ రాయాల్సిన పని ఉండేది కాదు. రాయనివారి వేళ్లమీద రూళ్ల కర్ర నాట్యమాడేదే కాదు. అంటే పిలగాళ్లకు సొసంత్రం వచ్చినట్లేగదా మరి.
అలాంటి రోజున బడికిపోయి ఆడుకుంటుండగా, అందరూ ప్రార్థనకు రండహో అని పిలుస్తున్నట్లుగా బెల్లు మోగేది. బిలబిలమంటూ పిల్లలమంతా రంగురంగుల రంగుకాగితాలు అంటించిన జెండా స్తంభం ముందు తరగతులవారీగ బారులుదీరేవాళ్లం. ఎగుడుదిగుడుగా నిల్చున్నామో! ఇక అంతే సంగతులు. ఏమయ్యా! డ్రిల్లు మాస్టరూ, ఇదేనా? నువ్వు రోజూ మన పిల్లలకు నేర్పుతోంది! అంటూ ప్రధానోపాధ్యాయుడి అసహనం కొట్టొచ్చినట్లు ప్రశ్నించేది. ఇక చూడండి ఆ డ్రిల్లు మాస్టారు చేతనున్న పేము బెత్తం తెగ తెగ బుసలు కొట్టేదనుకోండి. అప్పుడుగానీ ప్రధానోపాధ్యాయుడి కళ్లల్లో కళకళ కనపడేది కాదు. మొత్తం ప్రపంచాన్నే తాననుకున్నట్లుగా నడుపుతున్నానన్నట్లుగా ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడేదంటే నమ్మండి. అట్టాగా కొందరిని సొసంత్ర దేశంలోనే సొసంత్రంగా ఉన్నందుకు వీపు విమానం మోత మోగించేవాడు డ్రిల్లు మాస్టరు అనే హిట్లరు.
ఇక ఆ సమయానికి పెసిరంటు, పెసరట్టు అని ముద్దుముద్దుగా పిలుచుకునే గ్యామ సర్పంచి వేంచేసేవారు. రోజూ మాదిరిగా అడ్డ పంచెకాకుండా, ఆ రోజు గోచిపంచె కట్టుకుని టిక్కుటాకుగా వచ్చేవాడు పాపం. తలనిండా వాసన నూనె దట్టించి నున్నగా దువ్వుండేది ఆయన తల. చొక్కాకీ, పంచెకూ రాసిన అత్తరు గుప్పుమంటుండేది. రోజూ ఎట్లాగున్నా, ఆ రోజు మాత్రం రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ముఖంమీద చిరునవ్వు పులుముకుని వచ్చి జెండా స్తంభం పక్కనే నిలబడేవాడు. దూరంగా నుంచుంటే ఆ జెండాను మరెవరన్నా ఎగరేస్తారేమోనని భయపడి దగ్గర నుంచున్నేవాడని చెప్పుకుంటూ మేము పకపకలూ- ఇక ఇకలూ పోయేవాళ్లం. వంకబోకుండా నించోటం అయిపోయిన తర్వాత ఇంకేముంది. జెండాకు కట్టిన తాడును పట్టుకుని సర్పంచి లాగేసేవాడు. ప్రధానోపాధ్యాయుడు, ఒకరిద్దరు ఉపాధ్యాయులు కూడా సాయంపట్టి తాడు లాగేవాళ్లు. అప్పుడు జెండాలో కలిపి కట్టిన రంగు కాగితాలు జలజలరాలేవి. ఆ దృశ్యం కూడా భలే చూడబుద్దేసేది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి సీగానపెసూనాంబలు కలిసి ఒందేమాతరం పాడేవాళ్లు. రోజూ పొద్దున్నే మా నాన్న రేడియో పెట్టగానే విన్పించే వందేమాతరం వినే నాకు మా బడి ఆడ పిల్లకాయలు పాడే పాట అట్టే బాగుండేది కాదు. రేడియో గొంతులో పలికే గమకాలు భలేబాగుండేవి నాకప్పుడు. పాట పాడటం అయిపోగానే పెద్ద పెద్ద పిల్లలు పప్పుబెల్లాల బేసిన్లతో ప్రత్యక్షమయ్యేవాళ్లు. పప్పుబెల్లాలంటే మరమరాలు, వాటిలో బెల్లం ముక్కలుండేవి. అందరికీ దోసెడు దోసెడు పెట్టేవాళ్లు. ఇప్పటి పిల్లకాయలయితే వాటిని అసలు తినబోరనుకోండి. పప్పుల్ని నములుకుంటూ ఏ చెట్టుకిందనో, తడికెలు తీసేసిన గదిలోనో కూర్చుంటే సభ మొదలయ్యేది. గాంధీగోరే లేకపోతే, ఈ దేశం ఏమయ్యుండేదో ఒకరు చెబితే, నెహ్రూ రాజ్యం ఎంత కమ్మదనమో ఇంకొకరు బోధిస్తూ బాధించేవాళ్లు. నాకు ఇప్పటికీ తెలియనది ఏమంటే వాళ్ల నోటంట ఏనాడూ సీతారామరాజు మాట వినపడేది కాదు. భగత్‌సింగ్‌ను తలచుకునేవాళ్లు కాదు. గదర్‌ వీరుడు దరిశి చెంచయ్య అంటే ఏమి తెలుసు వాళ్ల మొహం. అందుకనే చెప్పిందే చెప్పేవాళ్లు. దేశం మనకేమిచ్చిందని చూడగూడదు, దేశానికి మనం ఏమిచ్చామో చూడాలి అంటూ గొప్ప సందేశం ఇచ్చేవాళ్లు. ఇప్పటిలా అది నాకు ఆనాడేగనుక నాకు అర్ధం అయిఉంటేనా? చంపేసుందును! సరే, పాపం శమించుగాక. రెండు,మూడు గంటలపాటు ఉపన్యాసాలు దంచిన తర్వాత కనీసం మంచి నీళ్లన్నా ఇవ్వకుండానే, వాళ్లేమి చేస్తారు పాపం. వాళ్లే మంచినీళ్లను సీసాల్లో తెచ్చుకునేవాళ్లు, ఇక బుడుగులకేమిస్తారు? పంతుళ్లంతా ఒకచోట చేరి వాళ్లు కబుర్లలో పడితే మేము ఇళ్లదారి పట్టేవాళ్లం. వచ్చే ఏడాది పప్పుబెల్లాల్ని పంచేది మనేమేగదరా! అని ఒకడు పొంగిపోతుంటే, మిగతావాళ్లం కూడా వచ్చే ఏడాది కనపడబోయే ఆ దృశ్యాన్ని తలచుకుని ఉబ్బితబ్బిబ్బయ్యేవాళ్లం. అసలు సొసంత్రం అంటే కలలుగనే హక్కేగదా! కలల్ని సాకారం చేసుకోవటం మాజీ రాష్ట్రపతి కలాం చెప్పినంత సులభం మాత్రం కాదని నా అనుభవం.
నగరాలకూ – మారుమూల గ్రామాలకూ పాము పుట్టలూ – హిమాలయాలంత వ్యత్యాసం
పేదవాడికీ – ధనవంతుడికీ నక్కకూ – నాగలోకానికున్నంత తేడా
మరి ఈ తరహా వ్యత్యాసాల ప్రపంచంలో అందరూ కలిసి పరుగు పెడితే గెలిచేదెవడు? ఓడేదెవడో తెలియనిది ఎవరికీ!

నిజమైన సొసంత్రం కోసం ఇంకా ఇంకా చేయెత్తాలని ఉంది నాకు.

నిజమైన సొసంత్రం కోసం ఇంకా ఇంకా నోరెత్తి అరవాలని ఉంది నాకు.

భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: