Archive for జనవరి 26th, 2011

శివశివా… ఇదేం ‘దోషం’


దోష నివారణ దేవుడిగా పేరున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అవినీతి పడగ విప్పి నాట్యమాడుతోంది. ఈ ఆలయంలో నిత్యం సర్పదోష నివారణ పూజలు జరుగుతుంటాయి. తనను కష్టాల నుంచి కడతేర్చాలని గతవారం కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా స్వయంగా ఇక్కడకు వచ్చి దోష నివారణ పూజ చేయించారు. ఈ పూజల వ్యవహారంలో సంబంధిత ఉన్నతాధికారులు కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడుతున్నారు. దోష నివారణ పూజల్లో నాగపడగను వినియోగిస్తారు. ఈ నాగపడగల సరఫరాను వాస్తవంగా టెండర్ల ద్వారా ఖరారు చేయాలి. అయితే ఆలయ అధికారి ఈ విధానాన్ని 2009 నవంబరు నుంచీ పక్కనబెట్టి గుత్తేదారు కిషోరు నుంచి నామినేషను పద్ధతిన నాగపడగలను కొనుగోలు చేస్తున్నారు. ఆనాటి నుంచీ 2011 జనవరి వరకు ఈ వ్యవహారంలో రూ. 1.50 కోట్ల కుంభకోణం జరిగినట్టు లెక్కలు విన్పిస్తున్నాయి. దీనికితోడు తామరపూలు, నెయ్యిదీపాలు, తుమ్మెదపూలు, టెంకాయలు సరఫరాలోనూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి.
రాహూకేతు పూజలని కూడా పిలిచే సర్పదోష నివారణ పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో రోజుకు సగటున 2,500దాకా జరుగుతుంటాయి. ఆదివారం, సోమవారాల్లో మూడువేల మంది పైనే ఈ పూజల్ని చేయించుకుంటారు. ఈ పూజలకు దాని విధానాన్నిబట్టి రూ. 250, రూ. 600, రూ. 1000, రూ. 1500 చొప్పున వసూలు చేస్తారు. రూ. 1000, రూ. 1500 చెల్లించిన వారికి పది గ్రాముల వెండి నాగపడగలను ఉచితంగా అందజేస్తారు. రూ. 250, రూ. 600 విలువయిన పూజలు చేయించినవారికి ఐదు గ్రాముల వెండి పడగలను ఇస్తారు. ఈ లెక్కన నెలకు సరాసరిన 250 కిలోల వెండి అవసరం.
వెండి కొనుగోళ్లలో కమీషను
రోజుకు ఎనిమిది కిలోల చొప్పున ప్రస్తుత చెన్నయ్‌ బులియన్‌ మార్కెట్టు ధర ప్రకారం ఏడాదికి వెండి కోసం 13 కోట్ల రూపాయలను ఆలయం వెచ్చిస్తున్నది. కిలో వెండికి మూడువేల రూపాయల చొప్పున చెన్నయి వ్యాపారులు కమీషను కింద ముట్టజెప్పటం కద్దు. అంటే మూడు వేల కిలోలకు ఏడాదికి 90 లక్షల రూపాయలు కమీషను రూపంలో కొనుగోలుదారులకు అందుతుంది. ఈ కమీషను సొమ్ములో అత్యధికం గుత్తేదారు ద్వారా అధికారుల ఖాతాలకు చేరుతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
తరుగులో లాభం
రోజుకు ఎనిమిది కిలోల వెండి కొనుగోలుకుగాను 200 గ్రాముల చొప్పున తరుగు కింద వ్యాపారులు తీసేస్తారు. ఈ లెక్కన రోజుకు రూ. 8,600 చొప్పున, ఏడాదికి రూ. 31 లక్షలు జమపడుతుంది. ఇలా ఏడాదికి కమీషను, తరుగు కలిపి రూ. 1.21 కోట్ల సొమ్ము గుత్తేదారుకు దక్కుతుంది. దీనిని బట్టి టెండర్లకు బదులు నామినేషను పద్ధతి పాటించటం ప్రారంభించిన గత 15 నెలల కాలంలో 1.50 కోట్ల రూపాయలను ూన్నతాధికారులు, గుత్తేదారు కలిసి అప్పన్నంగా భోంచేసినట్లే.
సొంత వెండి నిల్వలతోనే నాగపడగల తయారీకి అవకాశం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు అందజేసిన వెండి 17 వేల కిలోలదాకా నిల్వ ఉంది. ఇది ప్రస్తుత వినియోగం ప్రకారం చూస్తే ఆరేళ్లకు సరిపోతుంది. ఈ నిల్వలను వినియోగించి నాగ పడగలు తయారు చేయిస్తే భక్తులకు నాణ్యమయిన వెండిని సరసమయిన ధరలోనే అందించే వీలుంది. అయితే 2,500 కిలోల వెండిని మాత్రమే కరిగించేందుకు దేవాదాయశాఖ కమిషనరు అనుమతి ఇచ్చారు. వెండిని కరిగించే పనిని కూడా నాగపడగలు సరఫరా చేసే గుత్తేదారుకే అధికారులు అప్పగించారు. దీంతో ఈ వ్యవహారంలోనూ లక్షలాది రూపాయలు చేతులు మారే ప్రమాదం ఉందని భక్తుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది

భారతదేశాన్ని ఏ వ్యవస్థా కాపాడలేదు … ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌

అత్యున్నతస్థాయిలో అసమానతలున్న భారతదేశాన్ని ఏ వ్యవస్థా కాపాడలేదని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ తేల్చి చెప్పారు. కర్నూలులో ఉపాధ్యాయులు – ఉద్యోగుల వేదిక బుధవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం-ధనప్రభావం’ అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోన్న అసమానతలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నట్లుగానే, పేదరికం అంతకంటే శరవేగంగా పెరిగిపోతోందని విశ్లేషించారు. 1991కి ముందు దేశంలో ఒక్కరు కూడా డాలరు బిలీనియర్లు లేరని గుర్తుచేశారు. ఇప్పుడు 53 మంది డాలరు బిలీనియర్లు ఉన్నారని లెక్కలు వేశారు. 1/3వ వంతు తలసరి ఆదాయం వారి చేతుల్లోనే ఉందన్నారు. కోటీశ్వరుల సంఖ్య విషయంలో భారతదేశానిది నాలుగో స్థానం కాగా ఆహారం, ఆరోగ్యం, విద్యలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో 135వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో 83 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.20 కంటే తక్కువతోనే బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ధరల్లో రూ.20కి ఏమి వస్తుందని ప్రశ్నించారు. 83 కోట్ల మంది పేదల్లో దళితులు, ఆదివాసీలు, ముస్లిములే అత్యధికులని వివరించారు. శాసనసభ ఎన్నికలకు రూ.10 లక్షలు, లోక్‌సభ ఎన్నికలకు రూ.25 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదని నిబంధన ఉన్నా ఇప్పుడు రూ.40 కోట్ల నుంచి రూ.70 కోట్లదాకా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 288 మంది శాసనసభ్యులు ఉండే మహారాష్ట్రలో 212 మంది కోటీశ్వరులు పోటీ చేయగా, 186 మంది గెలిచారని వివరించారు. మిగిలిన వారు ఎందుకు ఓడారని తాను పరిశీలించానని చెబుతూ, ఓడిన కోటీశ్వరుల కన్నా గెలిచిన అభ్యర్థులు పెద్ద వాళ్లని తేలిందని విశ్లేషించారు. 70వ దశకంలో ముంబయిలో టాటా మీద ఒక సాధారణ కార్మికుడు పోటీ చేసి గెలిచాడని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిది సాధ్యమా? అని ప్రశ్నించారు. ఈ అవినీతిలో మీడియా పాత్ర కూడా కీలకమేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ఎన్నికల్లో చెల్లింపుల వార్తల కోసం ధనాన్ని ధారాళంగా ఖర్చు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల్ని చెల్లింపుల వార్తల కోసం ఖర్చు పెట్టారని తెలిపారు. ఆదర్శ కుంభకోణంలో పదవీచిత్యుడైన అశోక్‌ ఛవాన్‌ లోకమత్‌ పత్రికలో 156 పేజీల  చెల్లింపుల వార్తలు  రాయించుకున్నారని చెప్పారు. దీనిపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లోకమత్‌ పత్రిక యాజమాన్యాన్ని విచారించగా, అశోక్‌ ఛవాన్‌ గొప్ప నాయకుడయినందునే ఆ వార్తలు రాశామంటూ సమాధానం ఇచ్చిందని తెలిపారు. పాపం అంత గొప్ప నాయకుడూ ఆదర్శ కుంభకోణంలో ఇరుక్కుపోయి పదవి కోల్పోయాడని ఎద్దేవా చేశారు. డబ్బులు పోసి గెలిచిన ప్రజాప్రతినిధుల ఆదాయంలో 350 శాతం నుంచి ఏడు వేల శాతం వరకూ వృద్ధి ఉంటోందని తెలిపారు. ఏడేళ్లుగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని వివరిస్తూ ఈ జబ్బును నియంత్రించేందుకు ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.