Archive for జనవరి 27th, 2011

సజీవ సమాధికి శతాధిక వృద్ధురాలు వినతి


కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి విముక్తి పొందేందుకుగాను తాను సజీవ సమాధి అయ్యేందుకు అవకాశం కల్పించాలని విశాఖజిల్లా చోడవరం మండలం పిఎస్‌పేటకు చెందిన శతాధిక వృద్ధురాలు మజ్జి దేముడమ్మ (110) జిల్లా కలెక్టరుకు విన్నవించింది. దీంతో కలెక్టరు ఆదేశాల మేరకు చోడవరం తహశీల్దారు జి తాతబ్బాయి, ఎస్‌ఐ గఫూర్‌ ఆమె వద్దకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. పిఎస్‌పేటకు చెందిన దేముడమ్మ భర్త బాపునాయుడు 40 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె ఆస్తులన్నింటినీ ఆమె మనవడు మజ్జి రామకృష్ణ గతంలోనే స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటిని కూడా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నాడు. ఆమె నివసిస్తున్న ఇంటికి విద్యుత్తును కూడా నిలిపేయించాడు. తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులను మిగతా కుటుంబ సభ్యులు కాజేశారని ఆమె కన్నీటి పర్యంతమయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు సజీవ సమాధికి అనుమతించాలని దేముడమ్మ కోరింది. ఇంటి ప్రాంగణంలో సమాధిని కూడా సిద్ధం చేసుకున్నానని ఆమె వారికి చూపింది. ఇదీ నేటి భారతం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ‘మూడో కంటికి’ తెలియకుండా స్వాహా


హరి అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పేమాటలో యదార్థం మాటేమోగానీ, శ్రీకాళహస్తీశ్వరాలయంలో అవినీతి లేని అడుగే కానరాదు. తామరపూలు, టెంకాయలు, నెయ్యి దీపాల కొనుగోళ్లలోనూ కోట్లాది రూపాయలు కైంకర్యం అవుతోంది. ఈ వస్తువులను కూడా సర్పదోష నివారణ పూజల్లో వినియోగిస్తారు. నాగపడగలతో పాటు తామరపూలు, నెయ్యిదీపాలు, కొబ్బరికాయలను రెండేసి చొప్పున దోషనివారణ పూజలో ఉపయోగిస్తారు.
తామరపూలతో ఏడాదికి రూ. 59 కోట్ల పరిమళం
రోజుకు 2,500 పూజలకు మొత్తం ఐదువేల తామరపూలు అవసరం. పూలను అమ్ముకున్నందుకుగాను గుత్తేదారు పి రమేష్‌, ఆలయానికి నెలకు రూ.11 లక్షలు చెల్లించాలి. జత తామర పూలను 20 రూపాయల చొప్పున మాత్రమే అమ్మాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. అయితే దానికి భిన్నంగా రూ. 60 నుంచి రూ. 80 రూపాయల దాకా సాధారణంగా వసూలు చేస్తున్నారు. దీని ప్రకారం సాధారణంగా వ్యాపారం జరిగిందనుకున్నా నెలకు రూ. 60 లక్షల చొప్పున ఏడాదికి రూ. 7.20 కోట్ల రాబడి తామరపూల వ్యాపారం ద్వారా సమకూరుతోంది. గుత్తేదారు ఆలయానికి చెల్లించాల్సిన రూ. 1.32 కోట్లు పోను రూ. 58.80 కోట్లు ఏడాదికి మిగులుతోంది. అదే భక్తుల రద్దీ పెరిగితే తామరపూల ధర నూర్రూపాయలకు పైమాటే. ఈ గుత్తేదారుకు దక్కిన టెండరు ప్రకారం 2010 ఏప్రిల్‌ ఒకటో తేదీతో మొదలయి 2013 మార్చి 31 వరకూ ఆలయంలో తామరపూలు, టెంకాయలు తదితర సామగ్రిని అమ్ముకోవచ్చు. అయితే నెలనెలా కోట్లాది రూపాయల్ని సొంతం చేసుకుంటున్న గుత్తేదారు ఇప్పటికే దేవస్థానానికి 88.34 లక్షల రూపాయిలు బకాయి పడ్డాడు. వాస్తవానికి నిర్ధేశిత ధరలకు మించి విక్రయించటంతోపాటు, బకాయి పడిన నేరానికి ఈ గుత్తేదారు టెండరును రద్దు చేయాలి. అయితే గుత్తేదారు లాభాల మూటలో ఉన్నతాధికారులకూ వాటాలు పడుతున్నందున చట్టం ఇక్కడ చట్టుబండలవుతోంది.
ఆదాయం రూ. 14 కోట్లు … బకాయి రూ. 14 లక్షలు
నెయ్యి దీపాల వ్యవహారంలోనూ ఇదే తంతు నడుస్తోంది. జత నెయ్యి దీపాలకు రూ. 20 ధర నిర్ణయించగా, గుత్తేదారు రెట్టింపు వసూలు చేస్తున్నాడు. నెయ్యి దీపాల ద్వారా రోజుకు లక్ష రూపాయల చొప్పున నెలకు రూ. 30 లక్షల రాబడి వస్తోంది. వీటిని అమ్ముకున్నందుకుగాను ఆలయానికి రూ. 1.08 లక్షలు చెల్లించాలి. అంటే నెలకు రూ. 29 లక్షలు ఆదాయం గుత్తేదారు రమేష్‌ పరమవుతోంది. 2007 నుంచి ఈ కాంట్రాక్టును నిర్వహిస్తున్న గుత్తేదారుకు ఇప్పటి వరకూ 13.92 కోట్లు ఆదాయం రాగ ఆలయానికి చెల్లించాల్సిన దానిలో 14 లక్షల రూపాయలు బకాయి పడ్డాడు.
టెంకాయల్లో అంతా అవినీతే
రోజుకు ఐదువేల టెంకాయలు అవసరం. టెంకాయలను పాత, కొత్త అని రెండు రకాలుగా విభజించారు. పాతరకం కాయ చుట్టు కొలత 28 సెంటీమీటర్లు ూండాలి. కొత్త టెంకాయ 30 సెంటీమీటర్లు ఉండాలి. అయితే గుత్తేదారు ఈ ప్రమాణాలకు పాతరేసేశాడు. 22-25 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న టెంకాయలనే సరఫరా చేస్తున్నాడు. ఒక టెంకాయ రూ. 6.60 విక్రయించాలని ఆలయ యాజమాన్యం నిర్ధేశించింది. అయితే మిగతావాటి మాదిరిగానే అధిక ధరల్ని వసూలు చేయటం రివాజయింది. ఒక్కొక్క కాయకు రూ. 10 నుంచి రూ. 12 దాకా ఇక్కడ వసూలు చేస్తున్నారు. అంటే రెట్టింపు లాభాలు దండుకుంటున్నారు. నెలకు రూ. 18 లక్షలు దండుకునే గుత్తేదారుకు ఆలయానికి చెల్లించాల్సింది చెల్లించినా నెలకు రూ. 15 లక్షల చొప్పున ఏడాదికి 1.80 కోట్లకు పైనే మిగులుతుంది. ఇదంతా బయటకు కనిపించే అవినీతి. దీనికితోడు అర్చకులకూ, గుత్తేదారుకూ మధ్య జరిగే లోపాయికారి ఒప్పందం ప్రకారం టెంకాయలను పగలగొట్టకుండానే తట్టలోకి విసురుతారు. అలా పగలని కాయలను అర్చకులు తిరిగి గుత్తేదారుకు అమ్ముకుంటారు. భక్తులు ఎవరయినా తమ ప్రసాదం ఇవ్వాలని కోరితే, శని దోషం ఇక్కడితోనే పోవాలి, ఇంటికి తీసుకెళ్లకూడదు’ అంటూ అర్చకులు భక్తుల నోరు మూస్తారు. టెంకాయల టెండరుదారు 2008లో నెలకు 2.35 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఆనాటి గుత్తేదారు కాసరం బాలాజీ మాజీ శాసనసభ్యుడికి అనుచరుడు కావడంతో తాను చెల్లించాల్సిన సొమ్మును శాశ్వత బకాయిల జాబితాలో పెట్టేశాడు. ఆయన రూ. 25.50 లక్షల సొమ్మును ఆలయానికి ఎగవేశాడు.

పదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అవినీతి : పాత్రికేయుడు పాలగుమ్మి


గడచిన పది సంవత్సరాల్లో దేశంలో రూ. 10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ విశ్లేషించారు. కడప జిల్లా పరిషత్తు సమావేశ భవనంలో పిఎఫ్‌ఐ, ఐసిఇయు, ఎపిఎంఎస్‌ఆర్‌యు, యుటిఎఫ్‌, జెవివి గురువారం సంయుక్తంగా నిర్వహించిన ‘రాజకీయాల్లో అవినీతి – ధన ప్రాబల్యం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ సంసదను కార్పొరేట్‌ సంస్థలు, అవినీతి పరులైన రాజకీయ నాయకులు కలిసి దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి నిధులు లేవంటున్న ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు మాత్రం కోట్లాది రూపాయలు రాయితీలుగా ఇస్తున్నాయని తప్పుపట్టారు. ప్రపంచ కుబేరుల్లో మనదేశం నాలుగో స్థానంలో ఉండగా, మానవాభివృద్ధిలో 134వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 53 మంది ధనికుల వద్ద దేశ తలసరి ఆదాయంలో 1/3 వంతు సంపద పోగుబడుతోందని తెలిపారు. స్విస్‌ బ్యాంకుల్లో రూ. 20 లక్షల కోట్ల భారతదేశ ధనం మూలుగుతోందని వివరించారు. స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారి ఖాతాలు తెలియవని మొదట ప్రకటించిన ప్రణబ్‌, తర్వాత మాట మార్చి వారి పేర్లు ఉన్నాయని చెప్పటంలో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దొంగలెవరో తెలిసినా చెప్పలేమని ప్రణబ్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. స్విస్‌ బ్యాంకుల్లో దాచిన అవినీతి ధనం 2-జి స్కాం కన్నా పది రెట్లు అధికమని విశ్లేషించారు.
ప్రభుత్వం సృష్టించిన వివిధ కారణాలతో 1995 నుంచీ ఇప్పటి వరకు మహారాష్ట్రలోని విదర్భలో 45 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 2003లో ఎకరా పత్తి సాగుకు ఐదు వేల రూపాయలు సరిపోగా, ఇప్పుడు 24 వేల రూపాయలు పెట్టాల్సి వస్తోందని చెప్పారు. దిగుబడి మాత్రం నాలుగు క్వింటాళ్లే వస్తోందన్నారు. ఈ లెక్కన రైతుకు ఎనిమిది వేల రూపాయల దాకా నష్టం వస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 1995 నుంచి ఇప్పటి వరకూ 2.56 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే 30 వేల మంది చనిపోయారని గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయన్నారు. 2008 నుంచీ ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు.