తనకు తనే అతీతుడనని అనుకునే యండమూరి వీరేంద్రనాధ్ అను క్షుద్ర రచయిత సొమ్ముల్ని దండుకునేందుకు మా టీవీలో కొత్త నాటకం ప్రారంభించాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ అరవీర భయంకర పిశాచ రచయిత సిరి సంపదల్ని పోగేసుకోవటంతోపాటు సామ్యవాద సిద్ధాంతంపై ఉమ్మేందుకు కూడా ఈ నాటకాన్ని వినియోగించుకుంటున్నాడు. వైఎస్ పంచనజేరి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మత్స్యకారుల నోట మట్టిగొట్టి వాన్‌పిక్ పేరుతో 40 వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్న నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మాట్రిక్స్ ప్రసాద్, అలియాస్ వాన్‌పిక్ ప్రసాద్ అలియాస్ మా టీవీ ప్రసాద్ అను నయా పెట్టుబడిదారుడి విధానాలకు తగ్గట్టుగానే బండబారిన యండమూరి అంతర్ముఖం అంటూ నాటకానికి తెరలేపాడు. ఏటా కోట్లాది రూపాయల భారతీయ పంటను లక్స్, క్లోజప్ తదితర పేర్లతో ఎత్తుకుపోతోన్న విదేశీ బహూళజాతి సంస్థ హిందూస్థాన్ లెవర్స్ ఈ అంతర్ముఖ కార్యక్రమాన్ని సగర్వంగా సమర్పిస్తోంది. ఎందుకంటే దెయ్యాల రచయిత పనిలో పనిగా యూనీ లెవర్స్ (మాతృ సంస్థ) అంతర కోరికను కూడా నెరవేర్చే పనిలో తలమునకలవుతున్నాడు గనుక.
కుళ్లిపోతోన్న వ్యవస్థను ఏదో ఒక చిట్కా వేసి రక్షించాలన్న తాపత్రయమున్న గూటి పక్షులు సమర్పకుడు, ప్రసారకుడు, దర్శకుడు ఒక వైదికపై చేరి వాళ్ల అంతర్ముఖాన్ని కొందరు సామాన్యుల ముఖాల వెనుక దాచిపెట్టి మరీ నాటకమాడుతున్నారు.
ఈ ముగ్గురి కిలాడీలకు మరో ముగ్గురు వంతలు ప్లకార్డులతో మార్కులు వేస్తూ తందాన తానతందనాన పలుకుతుంటారు.
స్వయంకృషితోనూ, ఆత్మబలంతోనూ, నిక్కచ్చిగానూ, స్వీయకృషితోనూ తొలుత ఇంద్రజాలకుడిగా, అనంతరం హిప్నటిస్టుగానూ, హిప్నోథెరపిస్టుగానూ, సైక్రియాటిస్టుగానూ, ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షుడిగానూ, రచయితగానూ తన పనేదో తను చేసుకుపోయే పట్టాభితో తనకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని యండమూరి ఆయనను ఈ అంతర్ముఖంలో న్యాయనిర్ణేత ఆసనంలో కూర్చోబెట్టి వంత కొట్టించుకుంటున్నాడు. నిన్నటిదాకా ఈ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అంతగా తెలియని, ప్రస్తుతం వైఎస్ జగన్మోహననాటక సూత్రధారుల్లో ఒకతెగా భాసిల్లుతోన్న తెలుగు సినీనటి రోజా మరో వంత. పేర్లు తెలియదుగానీ ఓ మగ, ఓ ఆడ ఆథ్యాత్మికవాదులు విడతలవారీగా మూడో వంత పుచ్చుకుంటున్నారు.
ఇక అంతర్మఖానికి తెరతీస్తే… ఈ అంతర్జాతీయ దొంగల ముఠా అంతర్ముఖ నాటకాన్ని రక్తి కట్టించేందుకు సూత్రధారి, సిద్ధాంత సూరి యండమూరి తనకు ఇష్టం లేని ఆదర్శాలపై ఉమ్మేందుకు క్షణం క్షణం తాపత్రయ పడుతూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు గుప్పిస్తుంటాడు. తిక్క వాగుడుతో తలకాయను కుళ్లబొడుస్తుంటాడు. క్షుద్రదేవు(తో)డో, పిశాచమో యండమూరిని పూని నీచ, నికృష్ణ, మదాంధ పూరిత అనుమానాలను వదులుతుంటే దానికి తట్టుకోలేక సామాన్యులు బిక్క ముఖం వేస్తూనే, అంతలోనే కెమెరాలు తమను వేలాది మంది నగ్నంగా నిలబెడుతున్నాయన్న సత్యం స్ఫురించి నవ్వలేక నవ్వుతూ యండమూరికి తగ్గట్టే ఏవేవో సమాధానాలిస్తుంటారు. ఎవరో అమాయకులు ఈ అంతర్ముఖుల వలలో పడితే అయ్యయ్యో అనుకోవచ్చు. శుక్రవారం రాత్రి కొద్దిసేపు మాత్రమే ఈ కార్యక్రమాన్ని వీక్షించాను. విచారించాల్సిన విషయం ఏమిటంటే ఓ వీర మార్క్సిస్టు విప్లవ సాయుధపోరాట యోధుడి కుమార్తె, అవినీతిని చీల్చి చెండాడతాననే ఇంకొకాయన, ఐఏఎస్ అయి పేదల్ని ఆదుకోవాలని కలలుగనే (ఈమె ఐఎఎస్ కలలు సాకారం కావాలని మనసారా కోరుకుంటూనే, చమురు మాఫియా కరకు కత్తులకు మహారాష్ట్రలో బలయిన ఐఎఎస్ అధికారి యశ్వంత్ సోనవానే సంఘటనను గుర్తుంచుకోవాలని వినమ్రంగా సూచిస్తున్నాను.) మరొకామె యండమూరి కోసం బలిపీఠం ఎక్కారు. అయితే పాపం వాళ్లు అడుగడుగునా బలవటం చూళ్లేక టీవీని కట్టేసి అటు దొంగనాటకానికి తెరవేశాను. ఇటు టీవీ వీక్షణతో కలిగే రోగాలకూ తెరవేశాను. చూసిన కాసేపూ యండమూరి అంతర్ముఖాన్నుంచి గబ్బు ఉమ్మి వెలువడుతూనే ఉంది. ఎవరి మీదమ్మా మీ పోరాటం అంటూ భయపెడుతూ ప్రారంభం. ప్రభుత్వం మీద పోరాటమా? దాని వలన ఏమి సాధించారు? ఎగతాళి, వ్యగ్యం. అయినా పన్నులు చెల్లించే మాలాంటి వాళ్లను ప్రభుత్వం కాపాడవద్దా? దురుసుగా దూశాడో ప్రశ్న. మీ అమ్మాయిని ప్రభుత్వ పాఠశాలలో కాకుండా, ఎయిడెడ్ స్కూల్లో చదివిస్తున్నందునా, కుమార్తె కోరుకుంటే ఐదు నక్షత్రాల హోటలుకు స్వేచ్చగా పోనిస్తానని అన్నందుకూ నీవు అసలు సామ్యవాదివే కాదు పొమ్మంటూ యండమూరి తీర్పిచ్చాడు. దీనికితోడు ఆథ్యాత్మికవాది ముసుగు మనిషి మరో తిక్క ప్రశ్నతో ఆమెకు మిగిలున్న ఓపికను కూడా మింగేశాడు. ”అమ్మా, ఒకడికి తొంభై మార్కులు వస్తాయి. ఇంకొకడికి ముప్పై మార్కులొస్తాయి. మీరేమో వాళ్లిద్దర్నీ సమానం చేయమంటుంటిరి. తొంభై మార్కులవాడు ఊరుకుంటాడా తల్లీ? ఇదీ సామ్యవాద సిద్ధాంతానికి ఆథ్యాత్మికవాది తూట్లు పొడిచే తీరు. నేను ముందే చెప్పినట్లుగా పాతిక భాగం మాత్రమే చూసి తెరేసినందున మార్క్సిస్టు కుమార్తె గెలిచిందో? అవినీతిపై పోరాటేగ్రేసరుడు నిలిచాడో? ఐఏఎస్ పట్టాకోసం నిత్యం తంటాలు పడుతోన్న యువతి స్థితి చివరలో ఏమయిందో? నాకు తెలియదు. అన్నట్లు మొదటి ఘట్టంలో ఆడవాళ్లకు చెరొక 24 మార్కులు రాగా, అవినీతి వ్యతిరేకికి 25 మార్కులు వడ్డించారు మరి.
విజయవాడ జ్యొతిని నిట్టనిలువునా ఆర్పిన నీ అంతర్ముఖం సంగతేమిటని యండమూరి వీరేంద్రనాధ్‌ని యెవరన్నా ప్రశ్నిస్తే బాగుండును.