నేతాజీ సుభాష్ చంద్రబోసును గౌరవించడంలో దేశం పూర్తిగా విఫలమయిందని ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి ఆదివారం విమర్శించారు. ఈ తప్పిదాన్ని ఇప్పటికయినా సరిదిద్దుకోవాలని సూచించారు. కొల్‌కతాలో జరిగిన నేతాజీ జయంతి సభలో ఆయన ప్రసంగించారు. దేశ రాజధాని ‘ఢిల్లోలో ఒక్క ప్రదేశానికి కూడా నేతాజీ పేరు పెట్టలేదని తెలిసి తాను చాలా విస్మయానికి గురయ్యానని వ్యాఖ్యానించారు. ఒక వేళ తాను చెప్పేది తప్పయితే సవాలు చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కనీసం అధ్బుతమైన దేశ ప్రధానయినా నా సవాలును స్వీకరిస్తారా? అని వ్యగ్యంగా ప్రశ్నించారు. నేతాజీ ధైర్యవంతుడయిన నాయకుడని శ్లాఘించారు. ఈ సభలో పశ్చిమబెంగాల్ గవర్నరు ఎంకె నారాయణ మాట్లాడుతూ నేతాజీ జన్మదినం జనవరి 23ను దేశభక్తి దినంగా ప్రకటించాలని కోరారు.
Archive for జనవరి, 2011
23 జన
నేతాజీని గౌరవించడం మరిచారు : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
22 జన
పసలేని మా పసలపూడి కథలు
మా టీవీలో ప్రసారమవుతోన్న పసలపూడి కథల ధారావాహిక పరిచయ గీతిక, అడుగడుగునా కన్పించే పచ్చటి పొలాలూ తప్ప అందులో మరో పస కన్పించ లేదు. రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ధారావహిక ప్రసారమవుతున్నందున ఒక్క శుక్రవారంనాటి పసలపూడి కథను మాత్రమే వీక్షించగలిగాను. అన్నం ఉడికిందీ లేనిదీ, ఒక్క మెతుకును చూసి చెప్పొచ్చన్న రీతిన ఒక్క కథను మాత్రమే వీక్షించినా సమీక్ష చేసే సాహసానికి దిగాను.
నేను వీక్షించిన ధారావాహికలో ప్రధాన లోపాలు ఇవీ :
1. బలహీనమైన కథ
2. అవాస్తవ సంఘటనలు
3. నటించేందుకు విఫలయత్నం చేసే నటులు
4. సినిమా తరహా సంభాషణలు
5. పక్కా పల్లెటూరిలో నగర స్థాయి వేగం
6. పట్టణస్థాయి దుస్తులు
7. సినిమా తరహాలో వ్యగ్యానికి ప్రత్యేక రంగాలు
స్థూలంగా కథ ఇది :
పసలపూడి సర్పంచి నీతీ నిజాయితీకి మారుపేరు. తమ్ముడు తనవాడయినా ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చి తీర్పులు ఇస్తుంటాడు. సర్పంచి కుమార్తెకు బొల్లి సోకటంతో ఆమె ఇంటి నుంచి బయటకు కాలు పెట్టటం మానేసింది. బొల్లివలన పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. ఆయనకు ఓ మేనల్లుడు. అతనికి ఆడవాళ్ల పిచ్చి. ఉత్తరాంధ్ర నుంచి కూలీలు ఏటా ఆ గ్రామానికి పనుల కోసం వలస వస్తుంటారు. వారిలో అందంగా కన్పించే ఓ యువతిని తన అనుయాయుల సహాయంతో చెరబట్టి అత్యాచారం జరుపుతాడు సర్పంచి మేనల్లుడు. ఈ నేరం నుంచి బయట పడేందుకుగాను ఎత్తుగడ వేస్తాడు. సర్పంచి కుమార్తెను పెళ్లి చేసుకుంటే శిక్ష నుంచి తప్పించుకోవచ్చని దూరాలోచన చేస్తాడు. తనే స్వయంగా మేనమావ ఇంటికి వెళ్లి మేనకోడలిని వివాహం చేసుకుంటానని చెబుతాడు. వారిద్దరి పెళ్లికి ఇంట్లో అందరూ సంతోషంగా అంగీకిరిస్తారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉత్తరాంధ్ర కూలీలు సర్పంచిని నిలదీస్తారు. దీంతో సర్పంచి విచారణ మొదలు పెడతాడు. అత్యాచారం జరినట్లు సాక్ష్యాలు దొరకకపోవటంతో కూలీల ఫిర్యాదు వీగిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో బాధితురాలు సర్పంచి మేనల్లుడికి సంబంధించిన పులిగోరును చూపుతుంది. తనపై అత్యాచారం జరుపుతోన్న సమయంలో సర్పంచి మేనల్లుడి మెడలో వేలాడుతోన్న పులిగోరును తాను లాక్కున్నాననీ, దాని ఆధారంగానయినా తాను అత్యాచారానికి గురయిన విషయం ఒప్పుకోవాలని కోరుతుంది. ఆ పులిగోరు సర్పంచి మేనల్లుడిదేనని పూజారి, మరిద్దరు గ్రామస్తులు కూడా సాక్ష్యం చెప్పటంతో తన మేనల్లుడిని నిందితుడిగా సర్పంచి ప్రకటిస్తాడు. అత్యాచారం చేసిన యువతిని పెళ్లి చేసుకోవాలని తీర్పుచెబుతాడు. ఈ తీర్పుతో సర్పంచి కుమార్తె కూడా కొత్త నిర్ణయం తీసుకుంటుంది. జీవితంలో పెళ్లి ఒక భాగమే తప్ప, పెళ్లే జీవితం కాదని గ్రహించినట్లు ఆమె ప్రకటిస్తుంది. బొల్లి అంటువ్యాధి కాదు కాబట్టి తనను కళాశాలలో చేర్పిస్తే చదువుకుని తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటానని తండ్రిని వేడుకుంటుంది. దానికి సర్పంచి అంగీకరిస్తాడు.
ఈకకు ఈక పీకకు పీక
ఈ కథలో బలహీనతల్లో మహా బలహీనత పులిగోరు. బాధితురాలికి పులిగోరు చిక్కకపోతే సర్పంచి ధర్మం గుట్టు ఇట్టే బయటపడేది. మహాకాయులతో ఆమెను చెరబట్టిన పెత్తందారీ యువకుడు తన పులిగోరును ఆమె లాక్కుంటే, పోనీలే పాపం అని వదిలేసి పోవటం నమ్మశక్యం కాదు. సహజంగా చెప్పవలసి వస్తే ఆమెను మరో నాలుగు తన్ని తన పులిగోరును లాక్కుపోవటం చూపాలి. అయితే ఇక్కడ కథకుడుగానీ, దర్శకుడుగానీ తమ ధారావాహికను వాస్తవికంగా నిర్మించాలన్న భావనతో లేరనే చెప్పాలి. అందువలనే అవాస్తవాలను అల్లారు. సినీమాటిక్ వ్యవహారాన్ని నడిపారు. కొన్ని వాస్తవాల నడుమ తమ భూస్వామ్య ఆలోచనలను చొప్పించారు. సర్పంచులు స్వయంగా న్యాయస్థానాలను ఏర్పాటు చేయటం, విచారణచేసి తీర్పు చెప్పటం చట్టరీత్యా ఇప్పుడు సాధ్యంకాని పనులు. కానరాని పనులు. అయితే కొన్ని గ్రామాల్లో పెద్దల గుంపు గుట్టుగా తీర్పు చెప్పటం ఇంకా అమలవుతున్నట్లు కన్పిస్తోంది. అయితే ఆ తీర్పుల్లో ధర్మం – న్యాయం నేతి బీర చందమే. కేవలం పెత్తందారులను రక్షించేందుకూ, పాత వ్యవస్థను కొనసాగించే విధంగా ఈ తీర్పులు ఉండటం కద్దు. ఆందోళనలు జరిగితే తప్ప కూలీలపై జరుగుతోన్న అత్యాచారాలు అసలు వెలుగు చూడటం లేదు. ఈ వ్యవహారాలు కోర్టు కెక్కినా సాక్ష్యాలు లేవన్న నెపంతో నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారు. శిక్షలు పడిన సంఘటనలు అరుదులో అరుదు. పెత్తందారులు, ప్రజాప్రతినిధులు, పాత చింతకాయ పచ్చడి, పురాతనకాలం తరహాలో నిర్వహించే తీర్పులు ధర్మబద్దమేననీ, ప్రజోపయోగమనీ, పేదలపాలిట వరమనీ నమ్మించేందుకే ఈ కథ, ఈ ధారావాహిక ప్రయత్నం చేసింది.
అయితే గియితే
సర్పంచి కుమార్తె తనకు తాను విధించుకున్న జైలు తరహా చీకటి జీవితానికి స్వస్థిపలకటం, పెళ్లి కాకపోవటం తప్పేమీ కాదని గ్రహించటం, చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలన్న తపనతో సాగే చివరి అంకమే ఈ కథలో ఆహ్వానించదగిన ఘట్టం. ఈ అంకాన్ని ప్రధానంగా తీసుకుని కథ అల్లి ఉంటే గ్రామాల్లో నిజమైన ఉషోదయానికి ఈ ధారావాహిక కూడా అంతో ఇంతో దోహదపడి ఉండేదేమో!
19 జన
అహం అందాలరాసి (పిల్లల కథ)
1. ఇది పిల్లల కోసం రాసిన కథ. మీకూ అలా అన్పించిందా?
2. పిల్లలకు అర్ధం కాని పదాలు, వాక్యాలు, విషయాలు ఇందులో ఉన్నాయా? ఉంటే ఏమేమి ఉన్నాయి?
3. ఈ కథలో ఊహలు, ప్రశ్నలు, రంగులు కన్పిస్తున్నాయా?
4. పిల్లలకు తగిన శైలిలో ఈ కథ ఉందా?
5. చదవటం పూర్తయిన తర్వాత కథ మూలం అర్ధం అయిందని పాఠకుడు భావిస్తాడా?
6. మంచి కథ అన్న భావన కలుగుతుందా?
7. ఇది హృదయాన్ని కదిలించే కధేనా? కనీసం కొన్ని అంశాలయినా ఉన్నాయా?
8. ఇది ఆలోచనకూ, ఊహలకూ తావిచ్చే రాతేనా?
9. దీంట్లో ఏమేమి బాగా లేదని భావిస్తున్నారు?
10. మార్చాల్సి వస్తే అవి ఏమిటో సూచించగలరా?
గమనిక : 1. ఈ కథను చదివిన ప్రతివారూ కనీసం దీనిలో ఒక్క ప్రశ్నకయినా సమాధానం ఇవ్వగలిగితే సంతోషిస్తాను.
2. దీనిని బొమ్మలసహా రంగుల్లో ప్రచురించి మా ఊరి పిల్లలకు ఉచితంగా అందజేయాలని భావిస్తున్నాను.
అనగనగనగా అదో అందమయిన అడవి.
ఆ అడవిలో ఎన్నెన్నో జంతువులు, కీటకాలు, పక్షులు హాయిహాయిగా జీవిస్తున్నాయి.
వానలకు కరువు లేదు.
ఆహారానికి కొరవ లేదు.
ఆహ్లాదానికి అసలే కొదవ లేదు.
అయితే అదంతా కొన్నేళ్లే సాగింది. కొన్నాళ్లే కొనసాగింది.
చెట్లను కొట్టేయటం ప్రారంభమయింది. వాటిని ఆసరాగా బతుకుతోన్న కొన్ని జీవులు మృత్యుముఖం పట్టాయి.
పరిసరాల నుంచి అనేకనేక వాయువులు అడవిని తాకుతున్నాయి. ఆ వాయువుల వలన వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అప్పటిదాకా మున్నూట అరవై అయిదు రోజులూ కురిసే వాన ఇప్పుడు ఎప్పుడన్నా పడుతోంది. నీరు చాలక మొక్కలు మొలవటం తగ్గిపోయింది. వందల ఏళ్లనాటి వృక్షాలు సైతం ఎండుముఖం పట్టి కొంతకాలానికి కూలిపోతున్నాయి.
కాయలు దొరక్క కొన్ని జీవులు, ఆకులు దొరక్క మరికొన్ని, దుంపలు దొరక్క ఇంకొన్ని, పూల కొరతతో తేనె దొరక్క సీతాకోకచిలుకలు, తేనెటీగలు ఆకలితో అల్లాడుతున్నాయి. నీరు దొరక్క జీవాలన్నీ దాహంతో అలమటిస్తున్నాయి.
అలాంటి అలాంటి దుస్థితిలో అడవిని కాపాడుకునేందుకు ఏదయినా చేసి తీరాలన్న కోరిక జీవుల్లో మొదలయింది. ఓ రోజు అన్ని రకాల జీవుల నాయకులంతా వాహిని ఏటి ఒడ్డున, శిల్పారామం కొండ కొసన సమావేశమయ్యాయి.
అదే సమయంలో ఓ రంగురంగుల పక్షి ఒకటి ఎగురుతూ అటువేపుగా వచ్చింది.
తొలుత దాన్ని చూసిన ఐరావతం అనే ఏనుగు ”ఓయ్ రంగురంగుల పక్షీ ఇటు రా” అంటూ ఆహ్వానించింది.
రంగురంగుల పక్షి వెంటనే జీవాల సమావేశం చెంత వాలింది.
”నువ్వెవరు? మున్నెన్నడూ నిన్ను మా అడవిలో చూడలేదే?” ప్రశ్నించింది పులిరాజు.
”అవునవును, నేను ఇక్కడిదానిని కాను. నా పేరు ఇంద్రధనస్సు. ఈ అడవికి రావటం ఇదే మొదటిసారి.”
”ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న మాకే ఆహారం, నీళ్లు లేక ఛస్తూంటే… ఇలా ఎవరు పడితే వాళ్లు వస్తుంటే ఎలా?” జాగిలం గదిమింది.
”అమ్మా, నేను ఉండేచోట ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఒక్క చెట్టూ లేదు. కొత్తగా మొక్కలూ మొలవటం లేదు. నేలంతా ఇసుకబారింది. ఆకాశమంతా దుమ్ము-ధూళితో నిండిపోయింది. వానలు లేక వాగులు- వంకలు, చెరువులు- దొరువులు, కుంటలు – గుంటలు, నదులు-నదాలూ అన్నీ ఎండిపోయాయి. అప్పుడప్పుడూ తుపాన్లు. దాంతో అంతా నాశనమే. గట్లన్నీ కొట్టుకుపోవటంతో చుక్కనీరన్నా నిలవటం లేదు. ఇక ఎండ అంటే మంటలే నయం. చలికాలం వస్తే తట్టుకోవటం ఏ జీవి వల్లా కావటం లేదు. ఇలా పర్యావరణ పూర్తిగా పాడయిపోయింది. రోజుకో జబ్బుతో జీవాలన్నీ గుట్టలుగుట్టలుగా చనిపోతున్నాయి. అందుకని అక్కడ ఉండలేక మంచి ఆవాసం కోసం వెదుక్కుంటూ బయలుదేరి ఇక్కడకు చేరుకున్నాను.” చెప్పింది ఇంద్రధనస్సు .
”అలానా?”
”అయ్యయ్యో!”
”ప్చ్! ప్చ్!”
”పాపం”
”ఎంత కష్టం- ఎంత కష్టం”
”ఘోరం – ఘోరం” తమకు తోచిన రీతిలో జీవాలన్నీ ఇంద్రధనస్సుకు సానుభూతి చూపాయి.
చివరిగా సింహం సింగరాజు నోరు విప్పింది. ”సరే సరే, నీ సమస్యతో పోలిస్తే మేమే కొంత నయం. ఏదయితేనేం వచ్చావుగదా, ఇక్కడ ఉండటానికి అంగీకరిస్తున్నాము. తోటివాళ్లతో తగాదాలు పడబోకు. అందరితో కలిసి మెలిసి జీవించు. ఉన్నదేదో తిని, దొరికిందేదో తాగి బతుకు. పిల్లాపీచును కని నీ జాతిని పెంచుకో.” అంటూ సలహాలు ఇచ్చింది.
ఇంద్రధనస్సు సంతోషపడిపోయింది. జీవాలన్నింటికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపింది.
వెతకగా, వెతకగా సంజీవని చెట్టు ఒకటి ఉండటానికి అనువుగా కన్పించింది ఇంద్రధనస్సు పక్షికి. ఆ చెట్టు రెండు కొమ్మల మధ్య చిన్న గూడు కట్టుకుని అందులో ఉంటోంది ఆనాటి నుంచీ.
జీవులన్నీ కలిసికట్టుగా తీసుకున్న చర్యల కారణంగా అడవి తల్లి మళ్లీ చిగురించింది. చెట్టునూ, పుట్టనూ కొట్టేందుకు వచ్చిన వారిని అవి తరిమి తరిమి కొట్టాయి. చెట్లు కొట్టేందుకు వచ్చేవారిని కనిపెట్టేందుకుగాను రోజూ వంతులు వేసుకుని కాపలా కాచాయి. ఎవరన్నా గొడ్డల్ని భుజానేసుకుని అటు వస్తుండటం చూడగానే గోలగోల చేసి అన్ని జీవాల్నీ పిలిచేవి. ఆకాశం నుంచి పక్షులు ముక్కులతో వాళ్లను పొడిచేవి. జంతువులేమో పొదల మాటునుంచి ఒక్కుమ్మడిగా దాడి చేసేవి. ఇక కీటకాలేమో వాళ్లను కుట్టికుట్టి తరిమేసేవి. వేటగాళ్లకూ అదేశాస్తి చేసేవి. దాంతో చెట్లు కొట్టటం నిలిచిపోయింది. వేటగాళ్ల జాడే లేకుండా పోయింది. అలా కొన్నాళ్లకు అక్కడ తిరిగి పచ్చదనం పెరిగింది. వానలు కురవటం ప్రారంభమయింది. ఆకుల కుప్పలు అడ్డుపడి కుంటల్లో నీరు నిలవటం ప్రారంభమయింది. దాంతో నేలరాలిన విత్తనాలకు నీరు అంది మొలకెత్తటం ప్రారంభమయింది. కొత్త మొలకలతో అడవి మళ్లీ చిక్కబడింది. అడవంతా పచ్చదనం పరుచుకుంది. జీవాలకు ఆహార పానీయాలు సమృద్ధిగా లభించటం మొదలయింది. అవి ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాయి. అక్కడికి పాత కళ తిరిగొచ్చింది.
చిన్నాచితకా అన్న తేడా లేకుండా అన్ని రకాల పక్షుల, జంతువుల, కీటకాల నాయకుల్నీ సమావేశాలకు పిలవటం అక్కడ తొలినుంచీ ఆచారం. వాటిలో అత్యధికుల అభిప్రాయాన్ని అమలు చేయటం అక్కడ ఆనవాయితి. తక్కువ మంది చెప్పిన దానిలో అనువయిన దానిని గుర్తించి అమలు చేయటం అక్కడి నీతి. నిర్ణయించినదానిని అందరూ అనుసరించటం అక్కడి రీతి.
కొత్తగా అక్కడికొచ్చిన ఇంద్రధనస్సుకు అక్కడి పద్ధతుల్ని అనుసరించటం కష్టంగా ఉంది. అప్పటిదాకా ఆవారాగా బతికిన దానికి కొత్త ఆవాస ప్రాంత సూత్రాలను అనుసరించటం ఇష్టంకావటం లేదు.
అయితే తనకు అండదండలు లేకపోవటంతో ఏదో నెట్టుకోస్తోంది. ఇతరులు చూడనప్పుడు గాడి తప్పుతోంది. ఎవరన్నా చూస్తుంటే నటించి వాళ్లను ఏమారుస్తోంది.
ఇంద్రధనస్సు ఒక్కటే కావటంతో చేసేదిలేక అడవిలో ఏమి జరిగినా దానినే ఆహ్వానిస్తున్నాయి ఇతర జీవాలు. అన్ని బాధ్యతల్లోనూ దానికి చోటు ఇస్తున్నాయి. అన్ని కార్యకలాపాల్లోనూ దాన్ని కూడా నాయకురాలిగా గుర్తిస్తున్నాయి. వరుస ప్రకారం అప్పుడప్పుడూ ఇంద్రధనస్సు కూడా సమావేశాలకు అధ్యక్షత వహిస్తోంది. దీనికితోడు దానికున్న రంగురంగుల ఈకల్ని చూసి కొన్ని జీవాలు ముచ్చటపడి పొగడ్తలతో ముంచెత్తుతుంటాయి. రంగురంగుల ఈకల మాటేమోగానీ దాని మాంసాన్ని రుచి చూడాలన్న కోరికతో నక్కబావ లాంటి జంతువులు ఇంద్రధనస్సును మాటలతో మైమరిపిస్తుంటాయి.
ఇంద్రధనస్సేమో అదంతా తన గొప్పతనమని మురిసిపోతోంది. రంగుల రంగుల రెక్కలు తనకు తప్ప ఇంకెవరికీ లేవని గర్వపడుతోంది. అందరికన్నా అందమయినదాన్నయినందునే తనకు గౌరవం దక్కుతోందని భ్రమపడుతోంది. ఇక్కడి వారందరికంటే తెలివయినదాన్నయినందునే తనతో మాట్లాడేందుకు అందరూ తహతహలాడుతున్నారని ఆలోచిస్తోంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా ఇంద్రధనస్సు గర్వం రోజుకూ పెచ్చరిల్లుతోంది. తాను ఏ పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చిందో దానికి ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. ఎదుటివారు ఎవరన్నది కూడా చూడకుండానే కసురుకుంటోంది. అక్కడి నియమాలను పాటించటం దాదాపుగా మానేసింది. అత్యధికుల భావాలకు విలువ ఇవ్వటం లేదు. అందరూ కలిసి చేసిన తీర్మానాలను కూడా పట్టించుకోవటం లేదు. రీతి – నీతి – నియమాలను తక్కువ రకం జీవులు అనుసరించాలి తప్ప తనలాంటి అందమైన పక్షులకు కాదని కొందరి దగ్గర వాగుతోంది. పైగా తనకు ఎప్పుడు ఏది తోస్తే దాన్ని అందరూ పాటించాలంటూ ఆదేశాలు జారీ చేయటం ప్రారంభించింది. అనుసరించని వారితో తగాదా పడుతోంది. వాగ్వాదాలకు దిగుతోంది. పులిరాజయినా, సింగరాజయినా తననేమీ చేయరని పొగరుగా పాటలు పాడుతుంటుంది. తన అందం ముందు అందరూ తలవంచాల్సిందేనని నాట్యం చేస్తుంది.
అలా అలా కొన్ని రోజులు సాగింది. ఇంద్రధనస్సు తీరు నచ్చని జీవులు అప్పుడప్పుడూ అటు పులిరాజుకో, ఇటు సింగరాజుకో చెబుతూనే ఉన్నాయి. అయితే, ఇంద్రధనస్సు ఎక్కడి నుంచో వచ్చినందున అదంటే గిట్టక చాడీలు చెబుతున్నాయని పులిరాజు, సింగరాజు మొదట భావించాయి. రానురానూ ఇంద్రధనస్సుపై రోజూ ఫిర్యాదులు రావటంతో అవి ఆలోచించక తప్పలేదు.
నక్కబావ, ఇనుపముక్కుకాకి లాంటివే కాకుండా ఐరావతం, కుందేలు బుజ్జి లాంటి సాధువులు కూడా ఫిర్యాదు చేయటంతో ఇక న్యాయ విచారణ జరపాల్సిందేనని పులిరాజు, సింగరాజు నిర్ణయించాయి. ఓ రోజు న్యాయస్ధానాన్ని ఏర్పాటు చేశాయి.
”ఇంద్రధనస్సూ, నీ మీద రోజురోజుకూ ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఏమంటావు?” ప్రశ్నించింది పులిరాజు.
”అయ్యో! నామీద ఫిర్యాదులా? నా అందాన్ని చూసి అందరూ మెచ్చుకుంటుంటే చూడలేక అనాకారులెవరో మీకు లేనిపోని చాడీలు చెప్పినట్లుంది?” నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది ఇంద్రధనస్సు.
ఫిర్యాదుదారులను ఒక్కొక్కరినీ పిలిచి ఇంద్రధనస్సు ఎదుటే అవి చెప్పిన మాటల్ని పులిరాజు, సింగరాజు విన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు జవాబిచ్చేందుకు ఇంద్రధనస్సుకు అవకాశమిచ్చాయి. అయితే ఒక్క ఫిర్యాదుకు కూడా ఇంద్రధనస్సు నేరుగా స్పందించలేదు. తిక్కిరిబిక్కిరిగా సమాధానం చెప్పింది. కొందరితోే పోట్లాడింది. వాటిపై కోప్పడింది. తన జోలికొస్తే తగిన శాస్తి చేస్తానని బెదిరించింది. తనకున్నట్లుగా రంగురంగుల రెక్కలు వాటికి లేనందున కుళ్లు పెంచుకున్నాయని కేకలు వేసింది.
ఇంద్రధనస్సు తీరును కళ్లారా చూశాయి పులిరాజు, సింగరాజు. ఇంద్రధనస్సు అహం పెంచుకుందని వాటికి అర్ధమయింది. తాను ఎక్కడ నుంచి ఏ పరిస్థితుల్లో ఇక్కడకు చేరిందో మరచిపోయిందని భావించాయి. ఏ చెట్టూ లేనిచోట ఆముదపు మొక్కే మహావృక్షమయినట్లుగా ఒక్కటే ఉన్నందున దానికి అన్ని ఆహ్వానాలూ అందటాన్ని తప్పుగా అర్ధం చేసుకుని గర్వం పెంచుకుందని అవి తేల్చుకున్నాయి.
”చివరగా చెప్పుకునేదేమయినా ఉందా?” పులిరాజు, సింగరాజు ఏక కంఠంతో ఇంద్రధనస్సును ప్రశ్నించాయి.
”ఆహ్హాహ్హాహ్హహహహహ…ఇంకా చెప్పుకోవటానికి ఏముంది? నా మీద అనవసరంగా ఫిర్యాదు చేసిన వాటన్నింటికీ తగిన శిక్ష వేసి బుద్ధి చెప్పండి చాలు” అంటూ గర్వపోతు ఇంద్రధనస్సు తన ఆఖరి అవకాశాన్ని కూడా తుంగలో తొక్కేసింది.
ఇంద్రధనస్సు గర్వాన్ని ప్రత్యక్షంగా చూసిన పులిరాజుకూ, సింగరాజుకు కూడా కోపం తారాస్ధాయికి చేరింది. మీదపడి ఒక్కదెబ్బకు చంపేద్దామని అన్పించినా అడవి నీతి గుర్తుకు వచ్చి తమాయించుకున్నాయి.
రెండూ కాసేపు మాట్లాడుకున్నాయి. ఇతర పెద్దలనూ పిలిచి వాటితో చర్చించాయి. చివరకు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఆ నిర్ణయాన్ని ఇంద్రధనస్సుతో ఐరావతం చెప్పాలని తీర్మానించాయి.
దీంతో ఐరావతం ముందుకొచ్చి ”ఇంద్రధనస్సు లేనిపోని ఆలోచనలు చేస్తూ, పూర్తిగా గర్వపోతుగా మారింది. అది ఇక ఏ మాత్రం మారే అవకాశాలు కన్పించటం లేదు. అందువలన అడవి నీతినీ రీతినీ అనుసరించి పులిరాజు, సింగరాజు, ఇతర జాతుల నాయకులందరూ కలిసి వెలువరించిన తీర్పుకు ఇంద్రధనస్సు కట్టుబడాల్సిందే. దాని ప్రకారం ఇంద్రధనస్సు వెంటనే తన స్థావరాన్ని ఖాళీచేసి అడవి నుంచి వెళ్లి పోవాలి. కాదని అది ఎదురు తిరిగితే దానికి మరణశిక్ష అమలు చేయాలని న్యాయమండలి నిర్ణయించింది. దీనిని అమలు చేయటం తప్ప చెప్పుకునేందుకు కూడా ఇంద్రధనస్సుకు ఇక అవకాశం లేదు.” అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది.
”అవును, అవును. ఇంద్రధనస్సు వెంటనే అడవి నుంచి వెళ్లిపోవాలి. వెళ్లిపోవాలి” అంటూ అక్కడ చేరిన అన్ని జీవులూ ముక్త కంఠంతో నినదించాయి.
ఇంద్రధనస్సుకు మొదటిసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. తాను ఈ అడవికి పరాయిదాన్నయినందునా, తాను అందరికంటే అందమయినదాన్నయినందునా మిగతా జీవులన్నీ కలిసి తనమీద కక్ష పట్టాయని దానికి మరోమారు కోపమూ వచ్చింది. ఏమేమో చెప్పేందుకు అరిచింది. ఏదేదో గోల చేసింది. అయితే అప్పటికే ఇంద్రధనస్సుతో విసిగిపోయిన జీవులు ఇక సహించలేక ఎదురుదాడికి దిగాయి. ఒక్కుమ్మడిగా లేచి మీదకు పోవటంతో చేసేది లేక ఇంద్రధనస్సు తన రంగురంగుల రెక్కల్ని విప్పి ఆకాశంలోకి లేచింది. అయితే దానికి నీరసం వచ్చింది. రెక్కల్ని టపటపలాడించలేక పోయింది. కొద్ది దూరం మాత్రమే ముందుకు పోయి అక్కడ అది నేలవాలింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఇంద్రధనస్సు ప్రాణం పోయింది. అప్పటిదాకా తమతోపాటున్న ఇంద్రధనస్సుకు పట్టిన గతిని చూసిన జీవులు కన్నీరు పెట్టుకున్నాయి. కాసేపటి తర్వాత లేచి భారంగా ఇంటి ముఖం పట్టాయి.
19 జన
తమిళనాట మొదలయిన ఎన్నికల కాట్లాట
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు మేలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని డిఎంకే, చేజిక్కుంచుకోవాలని అన్నాడిఎంకే కృషిచేస్తున్నాయి. అయితే ఈ రెండు పక్షాలకూ సొంత బలంతో అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేవు. దీంతో ఇతర పక్షాలతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలో దిగాలని ఈ పక్షాల నేతలు కరుణానిధి, జయలలిత భావిస్తున్నారు. దీంతో ఏయే పక్షాలకు రాష్ట్రంలో ఎంత మేరకు పట్టు ఉందో బేరీజు వేసే పనిలో నాయకులు మునిగి తేలుతున్నారు. ఈ రెండు కూటములలోనూ నాలుగు పక్షాలకు పైగా ఉండడంతో స్థానాల సంఖ్యల విషయంలో నేతలు చర్చలు జరుపుతున్నారు. ఏయే పక్షాలు ఎవరితో జతకట్టేదీ ఖరారయినా, స్థానాల సర్దుబాటు కుదిరిన పిదపే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
డిఎంకే- కాంగ్రెసు కూటమి
డిఎంకే ఈ పర్యాయము కూడా కాంగ్రెసుతోనే అంటకాగే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి డిఎంకేతో చెలిమి సుతరాము ఇష్టం లేకపోయినా కేంద్రప్రభుత్వం మనుగడకు డిఎంకే మద్దతు తప్పని సరి కావడంతో పొత్తుకు సిధ్దమయింది. కానీ, స్థానాల విషయంలో మాత్రం గతం కన్నా అధికంగా కోరాలని నాయకులు భావిస్తున్నారు. 2006 ఎన్నికలలో 48 స్ధానాలలో పోటీచేసిన కాంగ్రెసు 34 చోట్ల విజయం సాధించింది. ఈ పర్యాయం కనీసం 65 స్ధానాలలో పోటీచేయాలని కాంగ్రెసు పక్షం భావిస్తోంది. 2006 శాసనసభ ఎన్నికలలో డిఎంకే కూటమిలో ఉన్న పిఎంకే (పాట్టాలి మక్కల్ కట్చి) 31 స్ధానాలలో పోటీచేసి 18 గెలుపొందింది. అనంతరం పార్లమెంటు ఎన్నికలలో ఆ కూటమి నుంచి వైదొలిగి తృతీయ కూటమిలో చేరింది. ఆ ఎన్నికలలో పోటీచేసిన అన్నిచోట్లా పరాజయం పాలయింది. దీంతో తిరిగి డిఎంకే గూటికి చేరింది. ఈ పర్యాయము 50 స్ధానాలలో పోటీచేయాలని ఆ పక్ష నేతలు భావిస్తున్నారు. 2006 ఎన్నికలలో అన్నాడిఎంకే కూటమిలోని విసికే(విడుదలై చిరుతాంగళ్ కట్చి) గత పార్లమెంటు ఎన్నికలలో డిఎంకే కూటమిలో చేరింది. ఆ ఎన్నికలలో రెండు స్ధానాలలో పోటీచేసిన విసికే ఒక స్ధానంలో గెలుపొందింది. శాసనసభ ఎన్నికలలో డిఎంకే కూటమి విజయానికి కృషిచేస్తామని ఆ పక్షం ప్రకటించింది. ఎన్నికలలో పోటీ చేసే విషయాన్ని డిఎంకే అధ్యక్షుడు కరుణానిధితో చర్చలు జరుపనున్నట్లు ఆపార్టీ అధినేత తిరుమావళవన్ పేర్కొన్నారు.
అన్నాడిఎంకే కూటమి
అన్నాడిఎంకే కూటమిలోనే తిరిగి కొనసాగాలని ఎండిఎంకే ఇదివరకే ప్రకటించింది. 2006 ఎన్నికలలో 35 స్ధానాలలో పోటీచేసిన ఎండిఎంకే మూడు స్ధానాలలో విజయం సాధించింది. 2006 ఎన్నికలలో డిఎంకే కూటమిలో ఉన్న సిపిఎం 15 స్ధానాలలో పోటీచేసి తొమ్మిదింట, సిపిఐ 10 స్ధానాలలో పోటీచేసి ఆరింట విజయం సాధించాయి. అప్పట్లో అణు ఒప్పందంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వామపక్షాలు యుపిఏకు మద్దతు ఉపసంహరించాయి. యుపిఏ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించిన డిఎంకేతో విభేధించి ఆ కూటమి నుంచి వామపక్షాలు వైదొలిగాయి. వామపక్షాలు గత పార్లమెంటు ఎన్నికలలో తృతీయ కూటమిగా అన్నాడిఎంకేతో కలసి పోటీచేశాయి. ఈసారి కూడా అన్నాడిఎంకేతో కలసి పోటీచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ ప్రకటించారు. గడిచిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసిన విజయకాంత్ సారధ్యంలోని ఎండిఎంకే ఈసారి అన్నాడిఎంకే కూటమిలో చేరటం దాదాపు ఖరారయింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తొమ్మిది శాతం పైగా ఓట్లు పొందిన డిఎండికే కూటమిలో చేరడం జయలలితకు అనుకూలంగా ఎన్నికలు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్థానాల సర్దుబాటు కోసం ఇరు పక్షాల నేతలూ చర్చలు జరుపుతున్నారు.
18 జన
ముడి చమురు ధరలు పెరిగితే … వియత్నాంలో ఊరట – భారత్‌లో బాదుట
అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరిగినా ప్రజలపై భారం మోపకుండా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో వియత్నాం ప్రభుత్వానికీ మనదేశానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం వినియోగదారులపై పడకుండా చర్యలు తీసుకోవడంలో వియత్నాం, భారత దేశాలు వ్యవహరించిన తీరు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దేశీయంగా ఎలాంటి చమురుశుద్ధి సదుపాయాలూ లేని వియత్నాం, పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా వినియోగదారులపై దాని ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవడం విశేషం.
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 101 డాలర్లకు చేరిన సమయంలో దాని ప్రభావం నుంచి ప్రజలను రక్షించడానికి వియత్నాం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోలు పంపిణీదారులకు లీటరు ఒక్కొంటికి 600 డాంగ్స్ (వియత్నాం రూక) చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఆ విధంగా ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష రాయితీ 1600 డాంగ్స్‌కు (18500 డాంగ్స్ ఒక డాలరుతో సమానం) చేరింది. ‘ధరల స్థిరీకరణ నిధి’ ద్వారా ఈ రాయితీలో కొంత భాగాన్ని వినియోగదారులు కూడా చెల్లిస్తున్నారు. ప్రతి లీటరు నుంచి 300 డాంగ్స్ ఈ నిధికి వెళ్తాయి. పెట్రో ఉత్పత్తులపై దిగుమతి పన్నులను పూర్తిగా ఎత్తివేయడం రెండో చర్య. వాస్తవానికి దీనికి ముందు ఆ ప్రభుత్వం గత రెండు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై దిగుమతి పన్నును రెండు సార్లు తగ్గించింది. పెట్రోలుపై దిగుమతి పన్నును 20 శాతం నుంచి ఆరు శాతానికీ, డీజిలుపై దిగుమతి పన్నును 15 శాతం నుంచి రెండు శాతానికీ తగ్గించింది. ప్రస్తుతం ఆ పన్నులను పూర్తిగా ఎత్తివేసింది. కానీ, మన దేశంలో దేశీయంగా చమురు వెలికి తీస్తున్నా కేంద్ర యుపిఎ ప్రభుత్వం మాత్రం ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా, ధరల నిర్ణయాన్ని చమురు సంస్థలకే అప్పగించింది. ఫలితంగా కొన్ని వారాల్లోనే పెట్రోలు ధరలు లీటరుకు రూ.11.50 పెరిగాయి. దీనికితోడు త్వరలోనే డీజిలుపై ూన్న నియంత్రణను కూడా ఎత్తివేయాలని యోచిస్తోంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2010 ప్రారంభం నుంచీ 30 శాతం పెరిగినా, వియత్నాంలో మాత్రం కేవలం 2.8 శాతం మాత్రమే పెరగడం గమనార్హం.
18 జన
ఏడు రోజులుగా సొరంగంలో కార్మికుడు
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆకస్మాత్తుగా ఏర్పడిన సొరంగంలోకి ఓ కార్మికుడు జారిపోయాడు. గత గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో దివాస్ నీటి పథకానికి సంబంధించిన 200 అడుగుల లోతు భూగృహ కాలువను తవ్వుతోన్న నారాయణ్ అకస్మాత్తుగా ఏర్పడిన సొరంగంలోకి కూరుకుపోయాడు. అయితే సొరంగంలో తొమ్మిది మీటర్ల స్థలం ఉండడంతో అతను అటు ఇటూ తిరగగలుగుతున్నాడు. అతన్ని పైకి తీయాలంటే 22 మీటర్ల లోతున గోతిని తవ్వాలని అంచనా వేశారు. అయితే తవ్వకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంగళవారం నాటికి కూడా ఏడు మీటర్ల లోతున గొయ్యిని తవ్వారు. ఒక గొట్టాన్ని లోపలికి పంపి దాని ద్వారా అతనితో అధికారులు మాట్లాడుతున్నారు. అందులో నుంచే అతనికి ఆహారం, పండ్ల రసాలను కూడా పంపుతున్నారు.
జపనీస్‌తో అరవ బంధం
జపనీస్‌తో అరవ భాషకు బంధం ూన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉచ్ఛారణలో ఈ రెండు భాషల మధ్య సంబంధాలున్నట్లు తెలిపారు. జపాన్ భాషలో దాదాపు 500 పైచిలుకు తమిళ పదాలున్నాయని విశ్రాంత జపనీస్ ఆచార్యుడు సుమోటు కంబే తెలిపారు. కంబే వాదనలకు మద్దతుగా చెన్నయ్‌లోని ఆసియా అధ్యయన కేంద్రం (ఐఎఎస్) శ్రీలంకకు చెందిన ఆచార్యుల సాయంతో ‘తమిళ-జపాన్ సంబంధం’ పరిశోధనాత్మక మార్గదర్శినిని వెలుగులోకి తెచ్చింది. ఈ సంస్థ రజతోత్సవాలను పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని ప్రచురించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో జపనీస్, తమిళ భాషల్లో ఒకే ఉచ్చారణతో ఉన్న పదాలకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు.
17 జన
ఖాకీలకు ‘భోగి’ భాగ్యాలు
తూర్పుగోదావరి జిల్లాలో ముడుపుల ముందు షరామామూలుగానే లాఠీ తలవంచింది. జూదగాళ్ల బేరసారాలు ఫలించాయి. కోడిపందాలు, పేకాట, గుండాట, అశ్లీల నృత్యాలు, జూదాలు తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు రోజులపాటు జోరుగా సాగాయి. జిల్లాలో రూ.20 కోట్ల పైబడి పందాలు జరిగాయని జిల్లావాసులు లెక్కలు వేస్తున్నారు. అయినా పోలీసులకు ఈ దృశ్యాలేవీ కన్పించలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. జిల్లాలో ప్రతి పోలీసుస్టేషనుకూ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ముట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కోడి పుంజులను చంకన పెట్టుకుని పందెపురాయుళ్లు యథేచ్ఛగా సంచరించారు. పందాలు వేల రూపాయలు దాటి లక్షలకు చేరాయి. అక్కడే గుండాట, పేకాట జోరుగా సాగాయి. భోగికి ముందుగానే పోలీసులకు ముడుపులు అందడంతో పందెపు రాయుళ్లు అదరకుండా, బెదరకుండా తమ పనిని ఎంచక్కా చక్కబెట్టుకున్నారు.
రాజానగరం మండలంలో పండుగ రోజుల్లో కోడిపందాలు, జూదాల నిర్వహణ కోసం పోలీసులకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ముట్టజెప్పినట్టు సమాచారం. కానవరంలో కొందరు అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజమండ్రి గ్రామీణ పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేసి 36 మందిని అరెస్టు చేయడం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. అల్లవరం మండలం గోడిలంక, గుండుపూడి ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు కోడిపందాల నిర్వహణకు పోలీసులకు లక్ష రూపాయల చొప్పున ముడుపులు ముట్టినట్టు చెబుతున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్ అండదండలు పుష్కలంగా తమకు ఉన్నాయని నిర్వాహకులకు చెప్పుకోవటం విశేషం. ఈ ప్రాంతంలో ఐదు కోట్ల రూపాయలు పందాల్లో చేతులు మారాయి. తమ జోలికి రాకుండా నిర్వాహకులు పోలీసులకు రెండు లక్షల రూపాయలు చెల్లించారని అంటున్నారు. ఐ పోలవరం మండలంలోని కేశనకుర్రుపాలెం, పెదమడి, మొక్కతోటల్లో జోరుగా పందాలు జరిగాయి. మామిడికుదురు మండలం గోగన్నమఠం, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో కోట్ల రూపాయలు ఒడ్డి పందాలను నిర్వహించారు. అయినా పోలీసులు ఆ ప్రాంతాలకు అస్సలు వెళ్లలేదు. పందాల నిర్వాహకులు ఇక్కడి పోలీసు స్టేషన్లకు రూ.50 వేల చొప్పున ముట్టజెప్పారని ప్రచారం జరుగుతోంది. కిర్లంపూడి మండలం దొరగారితోటలో మిరుమిట్లుగొలిపే విద్యుత్తు వెలుగులో కోడిపందాలు నిర్వహించారు. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా పందాలు జరిగినా పోలీసులు అటువేపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ ప్రాంతంలో మూడు కోట్ల రూపాయలదాకా పందాలు జరిగాయని సమాచారం. వీటిని అడ్డుకోకుండా పోలీసులకు లక్ష రూపాయలకు పైగా ముట్టజెప్పారని తెలుస్తోంది. తుని గ్రామీణ మండలం కెఓ మల్లవరంలో కోటి రూపాయల మేర పందాలు జరిగాయి. పందాల నిర్వాహకులు పోలీసులకు లక్ష రూపాయలకు పైగా ముట్టజెప్పారు. కోరుకొండ మండలం నుపూరు, గాదరాడ, కోటికేశవరం, శ్రీరంగపట్నం తదితర ప్రాంతాల్లోనూ కోడిపందాలు జోరుగానే సాగాయి. ఇక్కడి నిర్వాహకులు పోలీసులకు ముందుగానే రూ.50 వేలు ముట్టజెప్పారని తెలిసింది. కపిలేశ్వరపురం మండలం ఏటిగట్టు, లంక గ్రామాల్లో పందాలు లక్షల రూపాయలు ఒడ్డి సాగాయి. ఈ మండలంలో జూదగాళ్లు పోలీసులకు రూ.50 వేల వరకూ సమర్పించారని సమాచారం. రాయవరం మండలం చెల్లూరు, పసలపూడి, సోమేశ్వరం వంటి ప్రాంతాల్లోనూ పందాలు జోరుగా సాగాయి. ఇక్కడ పోలీసులకు లక్ష రూపాయల వరకూ ముడుపులు ముట్టాయని ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా జిల్లాలో వంద గ్రామాల్లో కోడిపందాలు, జూదాలు జరిగినా ఒక్క గ్రామంలో కూడా పోలీసులు జోక్యం చేసుకున్న దాఖలాలు లేకపోవటమే అనుమానాలకు తావిస్తోంది.
17 జన
సీతాదేవిపై మల్లాది అవాకులు చెవాకులు
కీర్తిశేషులు, ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవిపై నవలా రచయిత మల్లాది కృష్ణమూర్తి అవాకులు చెవాకులు రాయటం ఘోరాతి ఘోరం. ఆమెకు అహంభావం ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. కౌముది వెబ్ పత్రికలో మల్లాది రాస్తోన్న ‘నా సాహితీ జీవనంలో జరిగిన కథ’ ధారావాహికలో ఆయన సీతాదేవి జీవితంపై మరక వేసేందుకు ప్రయత్నించారు. అసత్యాలను రాయదలచుకోలేదని ముందు మాటలో రాసుకున్న మల్లాది ధారలో మాత్రం దారి తప్పారని అనక తప్పదు. సీతాదేవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలిసిన వాళ్లెవ్వరూ మల్లాది విమర్శను ఒప్పుకోరనే భావిస్తాను. సీతాదేవి ఆత్మగౌరవంగా వ్యవహరించారే తప్ప ఏనాడూ అహంభావిగా బతికిన దాఖలాలు లేవు. పాఠకులకు స్పృహ ఉండదని మల్లాదికి మొదటి నుంచీ మహా గొప్ప నమ్మకం. ఆ నమ్మకంతోనే కాబోలు, ఆంధ్రభూమి వారపత్రిక సంపాదకుడిగా పనిచేసిన సికరాజు (సి కనకాంబరరాజు) వైఖరిని తాను నిరసిస్తే అది సరైనదనీ, అదే సీతాదేవి అనుసరిస్తే మాత్రం తప్పనీ మనకు చెప్పబోవటం మల్లాది రీతికీ, నీతికీ అద్దం పడుతోంది.
సీతాదేవిని గురించి మల్లాది తన ధారవాహికలో ఇలా రాశారు…
స్వతహాగా ఆమెలో అహంపాలు ఎక్కువ. సికరాజు ఆవిడతో సీరియల్ రాయించాలనుకున్నారు. కాని తను సీనియర్ రైటర్ కాబట్టి తన ఇంటికి వచ్చి ఆయన అడగాలని ఆమె కోరుకుంది. సికరాజుకి ఇది ఇష్టం లేదు. దాంతో సికరాజు మీద సీతాదేవి ద్వేషం పెంచుకుంది. భూమిలో వచ్చే వీరేంద్రనాథ్ నవల ‘తులసిదళం’ క్షుద్రసాహిత్యం అని విమర్శించినవారిలో ఆవిడ కూడా ఉండటానికి కారణం ఇదే అని నా అభిప్రాయం.
నాతో ఫ్రెండ్లీగా ఉన్నా ఆంధ్రభూమి మనిషి అనే కోపం మనసులో ఉందని ‘తేనెటీగ’ జ్యోతి వీక్లీలో వచ్చే సమయంలో గమనించాను, తేనెటీగ అనే పేరే అసభ్యంగా ఉంది కాబట్టి సినిమాకి ఆ పేరు మార్చాలని, అప్పట్లో సెన్సార్‌బోర్డు సభ్యురాలైన ఆమె ప్రత్యేకంగా తేనెటీగకి తననే వేయించుకుని గొడవ చేసి, ఇబ్బంది పెట్టింది.
ఆవిడలాగే సీనియర్ రైటరయిన శ్రీమతి సి ఆనందరామాన్ని ఫోన్‌చేసి సికరాజు అడిగితే ఆవిడ భూమిలో సీరియల్ రాసింది. సీతాదేవి, ఆనందరామం సమకాలీనులు కాబట్టి, ఇది తనని అవమానించినట్లుగా సీతాదేవి ఫీలయ్యేది. అవిడ వ్యక్తిగతంగా నన్ను ఇష్టపడేది. రచయితగా ద్వేషించేది. ఇలాంటి ద్వంద్వ మనస్తత్వం నేను మరెవరిలోనూ చూడలేదు. ఆవిడకి వీరేంద్రనాథ్ అంటే వ్యక్తిగతంగానూ, రచయితగానూ బాగా ద్వేషం ఉండేది.
వాస్తవానికి సీతాదేవి ప్రత్యేకతను మల్లాది చెప్పకనే చెప్పారు. వ్యక్తిగతంగా నన్ను ఇస్టపడేది… అంటే అది మానవుల పట్ల ఆమె వైఖరిని సూచిస్తోంది. రచయితగా ద్వేషించేది…. అంటే ఆ రచనల సారం పనికి రాదని ఆమె భావించిందని భావించాలి. ఉత్తములెవరయినా సహజంగా చేసే పనినే సీతాదేవీ అనుసరించారు. దానిని మల్లాది తప్పుబట్టటం అంటే ఉత్తమ ప్రవర్తకు తాను దూరమని ఆయనే అంగీకరించటం తప్ప మరొకటి కాదు.
ఆంధ్రభూమి… సికరాజు … సీరియల్, ఇంటికి వెళ్లి అడగాలని భావించటం, సి. ఆనందరామం ఇత్యాది విషయాలకు సంబంధించి మల్లాది తన వ్యాఖ్యానంతో సరిపెట్టి ఉండకూడదు. ఎవరెవరి మధ్య? ఏ? ఏ? సంభాషణలు? ఎప్పుడు? ఎక్కడ? జరిగాయో వివరంగా రాసి ఉంటే నమ్మకం కుదిరేది. కానీ నన్ను నమ్మండి, వీళ్లంతా మంచివాళ్లు, వీళ్లంతా చెడ్డవాళ్లు అంటూ కొందరికి పూలదండలు, కొందరికి చెప్పుల దండలు వేయటం సత్యవంతులకు తగదుగాక తగదు.
అయినా సికరాజును పెద్ద అక్రమార్కుడని నిరూపించే ప్రయత్నం చేసిన మల్లాది, ఆయనను సీతాదేవి గౌరవించలేదని వాపోవటం వెనుక ఆమెపై బురదజల్లే ఆలోచన తపన పుష్కలంగా ఉంది. ఆత్మగౌరవానికి సంబంధించి ఆనందరామం చూసినట్లే సీతాదేవి కూడా ఉండాలనుకోవటం తెలివితక్కువ తనం. కొందరు డబ్బుతోనే ఆత్మగౌరవం ఉందనుకుంటారు. కొందరు తమ ప్రవర్తతోనే ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు. తన ప్రవర్తన ద్వారా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధానానికి మల్లాది సహజంగా దూరం కాబట్టి సీతాదేవిని ఆయన తప్పుపట్టటాన్ని అర్ధం చేసుకోవచ్చు.
తేనెటీగ సినిమాకు సంబంధించిన పూర్తి విషయం చెప్పకుండా సీతాదేవికి ఆ పేరు అంటే గిట్టదని వ్యాఖ్యానించటం కూడా అలాంటిదే. ఆడ- మగ సంబంధాలను కేవలం వ్యాపార పరంగా వాడుకునే వైఖరికి ఆమె వ్యతిరేకం తప్ప తేనెటీగకు కాదని మల్లాదికి తెలియదా? అదంతా రాస్తే వాస్తవికులు తనను తప్పుపడతారని ఆయన భయం కాబోలు.
ఇందులో ఉటంకించినట్లుగా సికరాజుతోపాటు చరిత్రను తిరగేస్తే మల్లాది, ఆయన స్నేహితుడు వీరేంద్రనాథ్ కూడా ఒక్కొక్కడు ఒక మహా దొంగ.
ఈ ముగ్గురికీ ఏనాడూ సమాజం – దాని బాగోగులు ఏనాడూ పట్టలేదు. వీళ్ల రచనలన్నీ నేల విడిచి సాము చేసినవే తప్ప ఒక్కడంటే ఒక్క బాధితుడి కన్నీరు తుడిచిన పాపాన పోలేదు. వీరేంద్రనాథ్ తన పిచాచ రచనలతో సమాజాన్ని వేలవేల సంవత్సరాలపాటు వెనక్కు నడిపే ప్రయత్నం చేయగా, శృంగార రచనలతో మల్లాది సమాజానికి జోలపాట పాడి సొమ్ము చేసుకున్నారు. వీళ్లు అంతటితో ఆగలేదు. వీళ్లు ఒట్టొట్టి రాతలోళ్లు కాదు సుమా. ప్రత్యక్ష కార్యాచరణ అంటే వీళ్లకు మహా ఇష్టం. వీళ్ల రచనలు చదివి మాయలో పడిన విజయవాడకు చెందిన యువతి జ్యోతి వీళ్ల అసలు బతుకులు తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంది. మీ రచనలు బాగుంటాయని ఆమె ఉత్తరం రాస్తే, నువ్వు అందంగా ఉంటావనీ, నీ కళ్లు మెరుస్తుంటాయని వీళ్లు ఉత్తరాలు రాసి ఆమెను ప్రేమలోకి దింపిన వైనం ఈనాటి తరానికి తెలియదు పాపం. చివరకు ఓ రోజు జ్యోతిని విజయవాడలోని ఓ లాడ్జీకి రప్పించారు. అక్కడ ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదుగానీ, ఆమె ఇంటికి వెళ్లి ఉరేసుకుని చనిపోయింది. వీళ్ల మధ్య నడిచిన ఉత్తరాలే ఈ రచయితల అసలు స్వరూపాలను పట్టిచూపాయి. ఆనాడు రాష్ట్రం రాష్ట్రం వీళ్లను దుమ్మెత్తి పోసింది. డబ్బున్న, పలుకుబడి ఉన్న రచైత్తలు కాబట్టి పోలీసు కేసుల నుంచి తప్పించుకున్నారు. ఇంకొక దేశంలో అయితే వీళ్లకు కనీసం ఓ జీవిత కాలం కారగార శిక్ష పడి ఉండేది. మల్లాదీ కాదంటారా? ఆంధ్రాబ్యాంకు ఉద్యోగయిన వీరేంధ్రనాధ్ అయితే ఆర్థిక అక్రమాలకు కూడా పాల్పడినట్లు ఆనాడు ఫిర్యాదులు వచ్చాయి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా మల్లాది ఇప్పుడు గొప్ప ఆథ్యాత్మిక రచయిత. వీరేంద్రనాథ్ గొప్ప మానవ సంబంధాల శాస్త్ర బోధకుడు
16 జన
కోట్ల కో’ఢీ’ … రూ. 90 లక్షలు గెలిచిన ప్రవాసాంధ్ర యువతి
మూడు రోజుల్లో రూ.150 కోట్లు
‘పశ్చిమ’లో అత్యధిక పందెం రూ. 1.30 కోట్లు
గోదావరిలో వెల్లువెత్తిన కాయ్ రాజా కాయ్
పోలీసులపై కాంగ్రెసు నేతల ఒత్తిడి
గోదావరి జిల్లాల్లో కాయా రాజా కాయ్ కోడై కూసింది. పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పలువురు శాసనసభ్యులు, ప్రవాసాంధ్రులు, సినీజీవులు, వ్యాపారులు కోడి పందాలకు తెగబడ్డారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే భారీ స్థాయిలో వంద చోట్ల పందాలు నిర్వహించారు. ఇవిగాక మరో వంద చోట్ల చిన్నాచితక పందాలు జోరుజోరుగా సాగాయి. పోలీసుల నివేదిక ప్రకారమే జిల్లాలో 84 చోట్ల భారీ స్థాయిలో పందాలు సాగాయి. ఏలూరు డివిజనులో 10, జంగారెడ్డిగూడెం డివిజనులో 20, కొవ్వూరు డివిజనులో 22, నర్సాపురం డివిజనులో 32 ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పందాలు జరిగే ప్రాంతాలన్నింటా పోలీసులు సాధారణ దుస్తుల్లో తిరగటం తప్ప అడ్డుకున్న పాపాన పోలేదు. పెద్ద పండుగ మూడు రోజుల్లోనూ కలిపి రూ.150 కోట్లు చేతులు మారినట్లు ప్రాథమిక అంచనా. భోగి రోజు మధ్యాహ్నం నుంచీ పోలీసులు లోపాయికారీగా అనుమతి ఇవ్వడంతో జిల్లాలో ఎక్కడికక్కడ అడ్డూ అదుపూ లేకుండా కోడి పందాలను నిర్వహించారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు నేరుగా పందాలు జరిగే చోట కన్పించకపోయినప్పటికీ తమ అనుచరులతో భారీగా పందాలు కట్టించారు.కొందరు ప్రముఖులు కూటమిగా ఏర్పడి కోట్ల రూపాయల పందాలు కాయించినట్లు పందెపురాయుళ్లు చర్చించుకున్నారు.
ఐ భీమవరంలో రూ. 1.30 కోట్ల పందెం
పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలకు పేరున్న ఆకివీడు మండలం ఐ.భీమవరంలో భోగి రోజున అత్యధికంగా రూ.20 లక్షలు పందెం కాయగా సంక్రాంతి రోజున రూ.1.30 కోట్లు, కనుమ రోజున రూ.68 లక్షలు కాసినట్లు పందాల్లో పాల్గన్నవారు తెలిపారు. మూడు రోజుల్లో ఈ ఒక్కచోటే రూ.50 కోట్లకు పైబడి పందాలు సాగినట్లు సమాచారం. యలమంచిలి మండలం కలగంపూడి, పెదవేగి మండలం కొప్పాకలో శాసనసభ్యులు ముదునూరు ప్రసాదరాజు, చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో కోడిపందాలు నిర్వహించారు. యలమంచిలి మండలంలో నిర్వహించిన కోడి పందాల్లో భోగి రోజున ఆరుగురు శాసనసభ్యులు హాజరవగా సంక్రాంతి రోజు మరో ఇద్దరు కలిశారు.
రూ. 90 లక్షలు గెలిచిన ప్రవాసాంధ్ర యువతి
కొప్పాకలో ప్రవాసాంధ్రులదే పైచేయి అయింది. ఇక్కడ పలువురు ప్రవాసాంధ్ర యువతులు కూడా లక్షలాది రూపాయలు పందాలు ఆడారు. ఖమ్మం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, హైదరాబాద్‌కు చెందిన ప్రవాసాంధ్ర యువతీ, యువకులు పందాల్లో పాల్గన్నారు. విశాఖపట్టణం నుంచి వచ్చిన ఒక ప్రవాసాంధ్ర యువతి మూడు రెట్లు చొప్పున రూ.30 లక్షలు పందెం ఆడి రూ.90 లక్షలు గెలుచుకుంది. గెలిచిన వెంటనే ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు పందెపురాయుళ్లు తెలిపారు. కొందరు సినీ ప్రముఖులు జిల్లాకు చేరుకుని వారి అనుచరులతో పందాలు వేయించారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం పరిసర ప్రాంతాల్లోని లాడ్జీలూ, అతిథి గృహాలూ పందెపురాయుళ్లతో నిండిపోయాయి.
తూర్పులోనూ అదే తీరు అదే జోరు
తూర్పుగోదావరి జిల్లాలో పండుగ మూడు రోజుల్లో రూ.20 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. కోనసీమలోని గోడిలంకలోనే ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయి. కాంగ్రెసు నేతల ఒత్తిళ్లతో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ఆంక్షలు ఉన్నా కోడిపందాలు నిరాటంకంగా కొనసాగాయి. మంత్రి తోట నరసింహం నియోజకవర్గంలోని మన్యంవారిపాలెం, నరేంద్రపురం, మల్లిశాల, రాజపూడి, గోవిందపురం, గొల్లలగుంట, కాట్రావులపల్లిలో కోడి పందాలను జోరుగా సాగాయి.