Archive for ఫిబ్రవరి, 2011

నరుడి నెత్తురు రుచి మరిగిన ఆంధ్ర ఇడీ అమీన్‌ కేవీపీ

 


అతడు ఒకనాటి ఉగండా నియంత ఇడీ అమీన్‌కు ఏమాత్రం తీసిపోడు. అతడు ఒకనాటి చిలీ నియంత పోల్‌పాట్‌కు ఫొటోస్టాట్‌. అతడు ముస్సోలినీకి మారు రూపం. అతడు హిట్లర్‌ సంతతి. అతడే నర రక్తం రుచి మరిగిన కేవీపీ రామచంద్రరావు. 14 ఏళ్లపాటు ఎంబీబీఎస్‌ చదివిన ఈ ఆంధ్ర ఇడీ అమీన్‌కు నరుడి నెత్తురు రుచి బాగా ఎరుకే. వైఎస్‌కు తాను ఆత్మనని తనకు తాను చెప్పకనే చెప్పుకునే కేవీపీ షాడో గృహమంత్రిగా పాలన సాగిస్తో మనుజుల రక్తాన్ని తరచూ జుర్రుకోవటం సాధారణమయింది. ఖమ్మం జిల్లా ముదిగొండలో, తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన సాంఘీక సంక్షేమ విద్యార్థుల పోరాటంలో, అటు తర్వాత పోలవరం వద్దన్న గిరిజనుల రక్తాన్ని భద్రాచలంలో, నిన్నగాక మొన్న సోంపేటలో రక్తం రుచి చూశాడు కెవీపీ.
తాజాగా సోమవారంనాడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రలో కేవీపీ బినామీ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రానికి వ్యతిరేకంగా ూద్యమిస్తోన్న ముగ్గురు మత్స్యకారులను పోలీసులు పొట్టనబెట్టుకుని తమ నేతకు సంతృప్తి కలిగించారు. ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, ఏ ఊరో ఇంకా ప్రకటించని గణేష్‌, బీరపువానిపేట నివాసి ఎర్రయ్య రక్తం ఏరులైపారింది. ఆకాశలక్కవరం గ్రామానికే చెందిన రాజు గాయాలపాలయి సాయంత్రం ఆరు గంటల సమయంలోనూ అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తమకు ఇంత బువ్వ పెడుతోన్న భూములను లాక్కోవటాన్ని సహించలేని మత్స్యకార రైతులు గత రెండు వందల రోజులుగా గాంధీ పథాన నిరసన తెలపటమే వారు చేసిన ఘోర నేరం. కేవీపీ బినామీ థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణాన్ని కాకరపల్లి, హనుమంతరాయపేట, ఆకాశలక్కవరం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. కర్మాగార పనులు జరగకుండా రహదారులను దిగ్బంధిస్తున్నారు. దీంతో థర్మల్‌ కేంద్ర నిర్మాణంలో వినియోగించాల్సిన యంత్రాలు విదేశాల నుంచి దిగుమతి అయినా ప్రతిపాదిత స్థలంలోకి చేరవేసేందుకు కేవీపీ అండ్‌ కంపెనీ వల్లకాలేదు. దీంతో పైకి కన్పించే నిర్మలమైన ముఖం స్థానే కేవీపీ అసలు రూపం నిద్ర లేచింది. రెండు వేల మంది పోలీసులను అక్కడకు తరలించేలా ఆయన తెరవెను కథ నడిపాడు. గత శనివారంనాడే తొలివిడతగా ప్రజలపై యుద్ధానికి తెరలేపారు. లాఠీలు ఝళిపించి వీపులు పగలగొట్టారు. ఆ తర్వాతా ఇంటికి పది మంది అన్నట్లుగా పోలీసులు తమదైన శైలిలో కాపలా మొదలు పెట్టారు. మత్స్యకారులు బహిర్భూమికి వెళ్లేందుకు లేదు. తడికల దొడ్లో స్నానాలు చేసే అవకాశం లేదు. కదిలే అవకాశం లేదు. మెదిలే అవకాశం లేదు. ఇంకొకరి పెత్తనాన్ని సహజంగానే సహించలేని స్వేచ్ఛాజీవులయిన మత్స్యకారుల ఓపికను 50 మంది డిఎస్పీలు, 100 మంది సిఐలు, 200 మంది ఎస్సైలు, మరొక పదిహేడు వందలమంది పోలీసులు నిట్టనిలువునా కాజేశారు. పిల్లినయినా గదిలో బంధిస్తే … ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వడ్డితాండ్రలోనూ అదే జరిగింది. తాము బహిర్భూమికి పోయేందుకూ, తమ మహిళలు దొడ్లలో సాన్నాలు చేసేందుకూ స్వేచ్ఛ కావాలంటూ పోలీసులను మత్స్యకారులు అభ్యర్థించారు. అంతే… నిరక్షరకుక్షులు, మడ్డోళ్లు, కంపు మనుషులు తమను ప్రశ్నించటమా? అంటూ దొరవారి విశ్వాసపాత్రులకు సహజంగానే కోపం నషాళానికంటింది. వాళ్లు చెబుతున్నట్లు రబ్బరు తూటాలో, ఉక్కు తూటాలో తెలియదుగానీ చేపల కంపు మనుషుల శరీరాలను తుత్తునియలు చేశాయి. వాళ్లలో ముగ్గురు అక్కడికక్కడే వాలిపోయారు. వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పొగబాంబుల తాకిడికి పూరిళ్ళు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి.  150 ఇళ్ళు అంటుకున్నాయి. బాధితుల ఆక్రందనలు, పోలీసుల బూట్ల చప్పుడు, ఆందోళనకారుల పరుగులతో వడ్డితాండ్ర వణికిoది. ఈ ఘటనలతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. శభాష్‌ అంటూ ప్రపంచబ్యాంకు నుంచి మన ఘనత వహించిన ప్రభుత్వాధినేతలకు ఫోను వచ్చే ఉoడవచ్చు. పనామా కాలువను ప్రైవేటీకరించేందుకు ఒప్పుకోని ఆ దేశ అధ్యక్షుడి విమానాన్ని కూల్చి వేసిన ప్రపంచబ్యాంకు నిర్వాహకుడు అమెరికా పెట్టుబడికి శ్రీకాకుళంలో పారిన రక్తం ఒక లెక్కలోది కాదంటే దాని అసలైన భయంకర రూపం ఎంతటితో తెలియాలంటే చరిత్ర, తాజా తాజా సంఘటనల లోతుపాతుల్లోకి వెళ్లాల్సిందే.

ఇచ్చట తెలుగు వార్తా ఛానళ్లు కొనబడును… అయితే, ష్‌ష్‌ష్‌ష్‌ అంతా రహస్యం

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంది సొమ్మును అడ్డంగా దోచేసిన వైఎస్‌ తనయుడు జగన్మోహనరెడ్డి తానే గద్దెనెక్కేందుకు అన్ని మార్గాల్లోనూ వేటాడుతున్నాడు. ప్రధానంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు శతవిధాలా సొమ్ము వెదజల్లుతున్నాడు. తన సాక్షి పత్రికనూ, టీవీని జగన్మోహకరించిందిగాక, పాక్షికంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రసార మాధ్యమాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు మూడు వార్తా ఛానళ్లను 50 శాతానికి కొద్దిగా అటూఇటూగా బినామీ పేర్లతో కొనుగోలు చేసేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్రనాథ్‌ చౌదరి సంస్థాపిత ఎన్‌ టీలో 49 శాతాన్నీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అన్న ఐదు అత్యవసరాలు అందరికీ అందించే ధ్యేయం తమదంటూ పురుడుపోసుకున్న టీవీ-5లో  42 శాతం,  టీవీ-9 పాత్రికేయులతో చిన్నపాటి సమరభేరి మోగించిన  ఓ విద్యా వ్యాపారి రాజు భావోద్వేగ ఫలితంగా ఉద్భవించిన ఐ న్యూస్‌లో 51 శాతాన్ని యువనేత కొనుగోలు చేసినట్లు జగన్మోహనరెడ్డి శిబిరంలో పనిచేస్తోన్న ఒకరు ఉప్పందించాడు.

ఈ మూడు ఛానళ్లు ఇక సాక్షి స్థాయిలో ఏకపక్షంగా జగన్మోహన చాలీసాలను అదే పనిగా భజనచేయకపోవచ్చేమోగానీ వ్యతిరేకంగా మాత్రం నోరు విప్పబోవు. అయితే ఈ ఛానళ్ల ద్వారా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసేందుకు జగన్మోహనుడి శిబిరం ప్రణాళిక రూపొందించుకున్నట్లు మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహనుడి శిబిరంలోకి చేరిపోయిన మూడు ఛానళ్లూ తొలి నుంచీ అంతో ఇంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దొడ్డిలోనే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన రాగాన్ని ఆలపించేందుకుగాను సొమ్ముల్ని దక్కించుకుని నీకో సగం – నాకో సగం అంటూ పాడబోతున్నాయి. అంటే ఈ ఛానళ్లు ఇక సోనియా వ్యతిరేక, నకికురె వ్యతిరేక, తెదేపా వ్యతిరేక ఆలాపనలకు వేదికలు అవనున్నాయి. ఇక ఆ తరహా ఆలాపాలు వినాలో? వినకూడదో? నిర్ణయించుకోవలసింది మాత్రం వీక్షకులే.

నవ్వి పోదురుగాక ! నాకేటి సిగ్గు !!


నవ్వి పోదురుగాక, నాకేటి సిగ్గు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరి మోసపోయిన తెలుగు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించేందుకు వేగంగా స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కాక, తగుదునమ్మా అంటూ రాష్ట్రంలో ఉచితంగా స్థలాలు ఇస్తాం, నీళ్తిస్తాం, విద్యుత్తు ఇస్తాం, పన్నులు లేకుండా చేసేస్తాం ఇలా ఒకటేమిటి అవసరమయిన, అవసరం లేని వసతులన్నీ కల్పిస్తాం రమ్మంటూ అమెరికా విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత సత్కారాలు పలుకుతోంది. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో మొత్తం 1,555 మంది విద్యార్థులుండగా, అందులో 95 శాతం మంది భారతీయులు కాగా, అందులో 60 శాతం మంది తెలుగువాళ్లేనట. ట్రైవ్యాలీ సంగతి అటుంచి రాష్ట్రంలో కాలిఫోర్నియాకు చెందిన పెప్పర్‌డైన్‌ విశ్వవిద్యాలయ విభాగాన్ని నల్గండ-వరంగల్‌ రోడ్డులో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే ప్రభుత్వ ప్రకటన తొందరపాటు చర్య అని ఆ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఆండ్రూ కె బెంటన్‌ ఖండించారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఇప్పటివరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు. పెప్పర్‌డైన్‌, భారత్‌ మధ్య చర్చలు మొదటి దశలోనే ఉన్నాయని బెంటన్‌ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్లు సమాచార, సాంకేతికశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో ప్రకటించారు. విశ్వవిద్యాలయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డితో సమావేశమైన నేపథ్యంలో ఫిబ్రవరి రెండో తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రూ. 1000 కోట్ల పెట్టుబడి, మూడు వేల మంది విద్యార్థులతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నట్లు సిఎంఒ నుంచి వెలువడిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో ూన్న 20 విశ్వవిద్యాలయాల్లో పెప్పర్‌డైన్‌ ఒకటని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. తాము 22 కోట్ల డాలర్లను పెట్టబడి పెట్టనున్నట్లు వచ్చిన వార్తలు కూడా వాస్తవం కాదని ఆ విశ్వవిద్యాలయ నిర్వాహకులు తెలిపారు.

ఆహ్వానము

కావూరి కోటేశ్వరరావు (పంతులు)  ద్వితీయ వర్ధంతి సందర్భంగా
కాకోరా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానం
21 ఫిబ్రవరి 2011

దయం 11 గంటలకు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఈదుమూడి ప్రకాశం జిల్లా
సభాధ్యక్షుడు
శ్రీ పొనుగుపాటి వెంకట సుబ్బారావు
(విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, జెడ్‌హెచ్‌ఎస్‌)
గౌరవ అతిథి
శ్రీ జి. రాంగోపాల్‌
(సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, కార్యదర్శి,
ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఒంగోలు)
ముఖ్య అతిథులు
శ్రీ మేకా రవీంద్రబాబు
(డిఆర్‌ఓ, ప్రకాశం జిల్లా)
శ్రీ కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు ఎడిట్‌ పేజీ, సినీ రచయిత)
శ్రీ వట్టికూటి శ్రీనివాసరావు
(ఈనాడు పూర్వ పాత్రికేయులు)
కాకోరా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత
శ్రీ కెవి రమణారెడ్డి
ఉపాధ్యాయుడు, ఎంపిపి పాఠశాల, హనుమంతునిపాడు

ఆహ్వానితులు
కాకోరాస్మాసం
ఈదుమూడి

కల – నిజం

భౌతికవాదులను ఓడించడం ద్వారా శంకరుడు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ఎనలేని హానిని కలిగించాడని ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త  ప్రపుల్లచంద్ర రే విమర్శించారు. ఈ విమర్శ సరైనది. ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, గణితం, రసాయనశాస్త్రం వంటి రంగాలలో ప్రాచీన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. జగత్తు మిథ్య అని, ఇదంతా నాశనమయ్యేదే అని, వాస్తవిక జ్ఞానం అసలైన జ్ఞానం కాదని, విశ్వాసమే జ్ఞానానికి ప్రాతిపదిక అని చెప్పిన అద్వైతం విజ్ఞాన పురోగతికి పెద్ద తాత్విక ఆటంకంగా వ్యవహరించింది. శంకరుడు మనువాదాన్ని పూర్తిగా సమర్థించాడు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఓ పక్క చెప్తూనే ఇంకోపక్క వ్యవహారిక ప్రపంచంలో వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం అవసరమని నొక్కి చెప్పాడు. మనకు ఇప్పుడు కూడా ఇటువంటి మహానుభావులు తారసిల్లుతూనే ఉంటారు.

”అంతా మట్టేనని తెలుసు; అదీ ఒక మాయేనని తెలుసు; తెలిసీ వలచీ విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు” అన్నారు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు. శంకరుని అద్వైత సిద్థాంతంలోని వైరుధ్యాన్ని ప్రేమకు అన్వయించి తన పాటలోనే ఒక చరణంలో చొప్పించా రాయన. భావవాదులు భౌతిక ప్రపంచపు వాస్తవాన్ని గుర్తించడానికి ఒప్పుకోరు. ”ఈ ప్రపంచం అంతా మాయ. పరబ్రహ్మే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ముక్తి, మోక్షం” అని ఉపనిషత్తులన్నీ చెప్పాయి. ఈ వాదన సమాజంలోని భావవాదపు మేథావులను ఎందుకూ కొరగాని వాళ్లని చేసింది. ఈ ప్రపంచంలో జరిగే కార్యకలాపాలకు వాళ్లను దూరం చేసింది. పర్యవసానంగా ప్రజలను భావవాద ప్రభావానికి లోబర్చి ఉంచడం పాలకవర్గాలకు ఇబ్బందికరంగా మారింది. అంతేగాక ఆనాటి సమాజాభివృద్ధికి కూడా ఆటంకం ఏర్పడింది. ఈ ప్రపంచమే మాయ అనుకున్నాక ఇక ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టి పెట్టడం కుదురుతుందా? పోనీ, ఈ ప్రపంచం మాయ కాదనీ, వాస్తవమేననీ అంగీకరిస్తేనో? అప్పుడు భావవాదపు పునాదే తలకిందు లౌతుంది. దీనికి పరిష్కారంగా ముందు కొచ్చిందే అద్వైతం.

శంకరుడు పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం అని రెండు రకాల సత్యాన్ని ప్రతి పాదించాడు. ”పరబ్రహ్మ ఒక్కటే అసలైన సత్యం. ఈ జగత్తు అంతా మిథ్య” అన్నది పారమార్థిక సత్యం. ఆ పరబ్రహ్మ అంతటా ఉన్నాడు. అన్నింటా ఉన్నాడు. అంటే నీలోనూ, నాలోనూ, అందరిలోనూ ఉన్నాడు. ఈ పరమార్థాన్ని గ్రహించగలిగిన వాడికి జీవన్ముక్తి లభించినట్టే.

జగత్తు మిథ్య అయితే మనం రోజూ చూస్తున్నది, చేస్తున్నది, తెలుసుకుంటున్నది, మన చుట్టూ జరుగుతున్నది ఇదంతా ఏమిటి? ఇదంతా నిజం కాదా? అన్న సందేహం వస్తుంది. ఇదంతా వ్యవహారిక సత్యం అన్నాడు శంకరుడు. వ్యవహారిక సత్యాన్ని కలగనడంతో సరి పోల్చాడు. మనం నిద్రలో కలగన్నప్పుడు ఆ కలలో ఉన్నంతసేపూ అదంతా నిజమేన నుకుంటాం. మెలకువ వచ్చాక అదంతా వొట్టిదేనని తెలుసుకుంటాం. అదేవిధంగా ప్రపంచంలో మనం అనుభవిస్తున్నది, చూస్తు న్నది, చేస్తున్నది అంతా నిజమేనని అను కుంటున్నాం. పరమార్థం బోధపడినప్పుడు ఇదంతా మిథ్య అని తెలుస్తుంది అన్నాడు శంకరుడు.

నిద్రలో కలగన్నది వాస్తవం కాదని మెలకువ వచ్చాక తెలుస్తున్నది. ఇది అందరికీ అనుభవమే. మరి మేలుకున్నాక అనుభవి స్తున్నదంతా, జరిగినదంతా వాస్తవం కాదని ఎప్పుడు తెలుస్తుంది? దీనికి రజ్జు సర్ప భ్రాంతిని ఉదాహరణగా చెప్పాడు శంకరుడు. (రజ్ఞు – తాడు, సర్పం – పాము). మెలకువ ఉన్నప్పుడే దూరంగా ఉన్న తాడుని చూసి పాము అనుకుని పొరబడతాం. అలాగే పామును కూడా ఒక్కోసారి తాడని పొరపడవచ్చు. దాని దగ్గరకు పోయి చూస్తే అసలు అది తాడో, పామో తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని వాస్తవమని భ్రమపడుతున్నాం. సాధన ద్వారా అది వాస్తవం కాదని తెలుస్తుందని అన్నాడు శంకరుడు.

తాడుకి బదులు పాము అని పొరపడే పరిస్థితి ఎప్పుడొస్తుంది? ముందుగా ఆ మనిషికి తాడు గురించీ, పాము గురించీ తెలిసి ఉండాలి. ఆ రెండింటి మధ్య (తాడుకి, పాముకి మధ్య) కొంత పోలిక ఉండాలి. అంటే తాడు, పాము వాస్తవంగా ఉనికిలో ఉండే వాటి విషయంలోనే పొరపడే అవకాశం ఉంటుంది. అంతేతప్ప ఉనికిలో లేని వాటి విషయంలో పొరపడే అవకాశం లేదుగదా!

దీనికి జవాబుగా శంకరుడు ఎండమావిని ఉదాహరణగా చెప్పాడు. ఎండమావిలో నీళ్ళున్నట్టు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. దగ్గరకుపోతే ఉండవుగదా. ఈ ప్రపంచమూ అంతేనన్నాడు.

భౌతికవాదులు దీనినీ ప్రశ్నించారు. ఎండ మావి దగ్గరకుపోతే నీరు లేదని తెలిసిపోతుంది. అదే సముద్రంలో నీరున్నట్టు దూరంనుంచి చూస్తే అనిపిస్తుంది. దగ్గరకు పోయి చూసినా నీరుం దిగదా! దీని సంగతేమిటని నిలదీశారు.

బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తు అంతా మిథ్య అన్నది ప్రశ్నించడానికి వీల్లేదన్నాడు శంకరుడు. ఎందుకంటే మనకు కనపడేదల్లా నాశనమై పోతున్నది. నాశనమయ్యేదేదీ సత్యం కాదన్నాడు. పరమాత్మ ఒక్కటే సత్యం అయినప్పటికీ మనకి అది తెలియకపోవడానికి కారణం మనను ఆవరించుకున్న మాయ/మిథ్య అన్నాడు. దీనిని అంగీకరించడం ఎలా? అంటే ఉపనిషత్తులలో అలా చెప్పారు గనక ఒప్పుకుని తీరాలన్నాడు. వేదాలు, ఉపనిషత్తులలో చెప్పిన దానిని విశ్వసించాల్సిందే తప్ప ప్రశ్నించడానికి, సందే హించడానికి వీలులేదన్నాడు.

ఒక అడవిలో ఆశ్రమం బైట చెట్టుకింద శిష్యులకు గురువు అద్వైత సిద్థాంతంలోని మిథ్య గురించి వివరిస్తున్నాడు. ”ఈ అడవి మనచుట్టూ ఉన్నట్టు కనపడుతుంది. కాని అది నశించిపోతుంది. అంచేత అది మిథ్య. ఈ శరీరం కూడా నశిస్తుంది కనక అదీ మిథ్యే…ఈ చెట్టు.. ఆ చెట్టుకున్న కాయలు, పువ్వులు, అంతా మిథ్యే” ఇలా చెప్తూ ఉంటే అక్కడికో అడవి ఏనుగు ఘీంకరిస్తూ వచ్చింది. శిష్యులంతా తలో చెట్టుచాటుకీ పరుగెత్తారు. ఒక శిష్యుడు చెట్టుచాటు నుంచి చూసేసరికి గురువుగారు కూడా పరుగెత్తి ఓ చెట్టు వెనక్కి చేరడం కనపడింది. ”దొరికారు గురువుగారు” అనుకున్నాడు ఆ శిష్యుడు. ఏనుగు వెళ్లిపోయాక మళ్ళీ అంతా చెట్టు కింద చేరారు. మళ్ళీ గురువుగారు అద్వైతసారం చెప్పడం మొదలుబెట్టారు. అప్పుడీ శిష్యుడు ”గురువు గారూ, అంతా మిథ్యే అయినప్పుడు ఇందాక వచ్చిన ఏనుగు కూడా మిథ్యే కదా!” అనడిడాడు. గురువుగారు ”అవును నాయనా! బాగా అర్థ మైందినీకు” అన్నాడు. ”మరి అలాంటప్పుడు మీరు ఎందుకు చెట్టుచాటుకి పరిగెత్తారు?” అని శిష్యుడు అడిగాడు. ”నేను పరిగెత్తడం కూడా మిథ్యే నాయనా” అని గురువుగారు బదులిచ్చాడు. గజం మిథ్య – పలాయనం మిథ్య అనే సామెత అద్వైతం నుంచే వచ్చింది.

ఈ మిథ్యనే వ్యవహారిక సత్యం అని శంకరుడు అన్నాడు. పరబ్రహ్మే సత్యం అన్న పారమార్థిక సత్యం బోధపడే వరకూ వ్యవహారిక సత్యానికి లోబడే వ్యవహరించాలన్నాడు. తాను బోధించింది భావవాదం అయినా, ఆచరణలో ప్రపంచం వాస్తవమని భావించి నడుచుకోవాలని శంకరుడు వాదించాడు. ఆ విధంగా పాలక వర్గాలకు ఆనాడున్న తాత్విక సమస్యకు పరిష్కారం చూపించాడు.

శంకరునికి గల అపారమైన వాదనా పటిమ, తర్కం ఆనాటి ఇతర సమకాలీన తాత్విక సిద్థాంతాలను వెనక్కునెట్టడానికి ఉపయోగ పడ్డాయి. ఇటు యజ్ఞయాగాల కర్మకాండలకు అతిగా ప్రాధాన్యతనిచ్చి పరమాత్మ భావనను పట్టించుకోని పూర్వమీమాంసకులనూ, అటు ఉపనిషత్తులలోని పరమాత్మ భావాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాత్రమే చర్చిస్తూ వాస్తవ ప్రపంచాన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టిన వేదాంతులనూ శంకరుడు తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఆనాటి ప్రజాసా మాన్యం కాపాలిక మతం, శాక్తేయ మతం వంటి జంతుబలులు, నరబలులు, శవపూజలు వంటి క్రూర మతాచారాలను పాటిస్తూ ఉండేవి. ఇంకోవైపు శైవ, వైష్ణవ మతాల మధ్య విద్వేషాలు పెరిగి రాజ్యాల మధ్య యుద్ధాలకు కూడా దారితీశాయి. శంకరుడు ఈ క్రూర మతాచా రాలను ఖండించడమేగాక వాటిని నిర్మూ లించడానికి కొందరు రాజుల సైనిక బలాన్ని సైతం వినియోగించుకున్నాడు. సంకుచిత విభేదాలను అధిగమించడానికి శంకరుని జ్ఞానమార్గం తోడ్పడింది.

”అత్యున్నతమైన కవితా దృష్టికి, మత దృష్టికి శంకరుని అద్వైతం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ దశలో మానవుడు హేతువాదాన్ని కొంచెం పక్కకునెట్టి ఆత్మజ్ఞానం వైపు మొగ్గుచూపుదామా అని అనుకుంటాడు” అని రాధాకృష్ణన్‌ అన్నారు.

నాశనమయేదేదీ వాస్తవం కాదు అని శంకరుడు చెప్పినది తప్పు. ”అద్వైత భావవాదం: ఒక విమర్శ” అన్న వ్యాసంలో (చూడండి.. సందేశం- మార్కిస్టు సిద్థాంత రాజకీయ మానసపత్రిక, మార్చి 1958) శ్రీ ఏటుకూరి బలరామ్మూర్తి ఇలా పేర్కొన్నారు: ”మార్పు, కదలిక, నాశం కలిగిన వస్తువు అవాస్తవికం అనే శంకరుని ప్రాథమిక ప్రతిపాదనే పొరపాటు. ఏమంటే ఇంద్రియగోచరమైన ప్రతి వస్తువు కదులుతున్నది, మార్పు చెందుతున్నది, నశిస్తు న్నది, రూపాంతరం చెందుతున్నది. ప్రగతి శీలమైన, ప్రవాహ సదృశమైన ఈ బాహ్య ప్రపంచాన్నంతా వాస్తవమని, శంకరునికి పూర్వమున్న బౌద్ధ, జైన, సాంఖ్య, వైశేషికాది ధోరణులన్నీ అంగీకరించాయి. శంకరుడు తనకంటే ప్రాచీనమైన ధోరణులలోని వాస్తవి కతను విసర్జించాడు.”

ఏదిఏమైనా శంకరుని అద్వైతం ఆనాటి భారతీయ సమాజంలో తాత్విక పురోగతికీ, సామాజిక సంస్కరణలకూ తోడ్పడిందనడంలో సందేహం లేదు.

అద్వైతం భారతీయ భావవాదాన్ని చాలా ఉచ్ఛస్థితికి తీసుకుపోయింది. శంకరుడు క్రీ.శ. 788 సంవంత్సరాల్లో కేరళలోని కాలడి గ్రామం లో జన్మించాడు. అతను జీవించినది కేవలం 32 సంవత్సరాలే. కాని అతని కృషి అనన్య సామాన్యం. తన గురువైన గోవిందునికి గురువు గౌడపాదుడు అద్వైతసిద్థాంతాన్ని ప్రతిపా దించాడు. దానిని అధ్యయనం చేసిన శంకరుడు మరింతగా అద్వైతాన్ని పరిపుష్టం చేశాడు. వేదాంత సూత్రాలను బ్రహ్మసూత్రాలని కూడా పిలుస్తారు. ఆ సూత్రాలను రచించింది బాదరాయణుడు. ఇవి మామూలుగా అర్థం కావు. మనం ఎవరి చుట్టరికాల గురించైనా చెప్పినపుడు (నా పెత్తల్లి వేలు విడిచిన మేన మామ రెండో అల్లుడి చెల్లెలి మరిది కూతురు…. లాంటివి) అర్థం కాకపోతే బాదరాయణ సంబంధం అనడం పరిపాటి. అంటే ఏదో చుట్టరికం ఉందిగాని అదేమిటో అర్థం కాలేదన్నమాట. అలాంటి బ్రహ్మసూత్రాలకూ శంకరుడు భాష్యం రాశాడు. అంతేగాక భగవద్గీతకూ, ముఖ్యమైన పదకొండు ఉపనిషత్తులకూ భాష్యాలు రాశాడు. ఉపదేశ సహస్రి, వివేక చూడామణి, దక్షిణామూర్తి స్తోత్రం, హరిమిదె స్తోత్రం, ఆనందలహరి, సౌందర్య లహరి వంటి రచనలతో తన సిద్థాంతాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకుపోయే ప్రయత్నం చేశాడు.

”శంకరుని జీవితం పరిశీలిస్తే చాలా బలమైన పరస్పర విరుద్ధాంశాలతో ఉన్నట్టు కనపడుతుంది. అతడొక తత్వవేత్త, కవి, వైజ్ఞానికుడు, సన్యాసి, మార్మికుడు, సంస్కరణ కర్త. అతడెంత వైవిధ్యమైన ప్రజ్ఞావంతుడో అతని బహుముఖ స్వభావమే తెలియచేస్తుంది. మేథో సంపన్నుడై లక్ష్యసాధకుడిగా యువకుడిగా ఉన్నప్పుడే వాదనాపటిమను ప్రదర్శించి ఒకేసారి అనేక రకాల చర్చలను నిర్వహించగలిగిన ప్రతిభాశాలి. వివిధ రకాలుగా చీలిపోయిన ప్రజలను ఐక్యం చేయగలిగిన అతడి రాజకీయ పరిణతిని కొందరు ప్రధానాంశంగా భావిస్తారు. పదునైన వాదనలతో జీవితంలోని వైరుధ్యాలనూ, ఆలోచనలలోని వైరుధ్యాలనూ వివరించే శాంతమూర్తి అయిన తత్వవేత్తగా వర్ణిస్తారు. మనకే తెలియని మన గొప్పదనం గురించి వివరించే మార్మికుడుగా మరికొందరంటారు. అతనికన్నా విశ్వాన్ని దర్శించగలిగిన మేథోవం తులు బహుకొద్దిమందే ఉన్నారన్నది సత్యం” – డా. రాధాకృష్ణన్‌.

భౌతికవాదులను ఓడించడం ద్వారా శంకరుడు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ఎనలేని హానిని కలిగించాడని ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త  ప్రపుల్లచంద్ర రే విమర్శించారు. ఈ విమర్శ సరైనది. ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, గణితం, రసాయనశాస్త్రం వంటి రంగాలలో ప్రాచీన భారతదేశం ప్రపంచంలోనే అగ్ర గామిగా ఉండేది. జగత్తు మిథ్య అని, ఇదంతా నాశనమయ్యేదే అని, వాస్తవిక జ్ఞానం అసలైన జ్ఞానం కాదని, విశ్వాసమే జ్ఞానానికి ప్రాతిపదిక అని చెప్పిన అద్వైతం విజ్ఞాన పురోగతికి పెద్ద తాత్విక ఆటంకంగా వ్యవహరించింది. శంక రుడు మనువాదాన్ని పూర్తిగా సమర్థించాడు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఓ పక్క చెప్తూనే ఇంకోపక్క వ్యవహారిక ప్రపంచంలో వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం అవసరమని నొక్కి చెప్పాడు. మనకు ఇప్పుడు కూడా ఇటువంటి మహానుభావులు తారసిల్లుతూనే ఉంటారు. ”నా వరకు అయితే ఏ కులమూ లేదు, గిలమూ లేదు, మనుషులంతా ఒక్కటేగాని ఆచారాలనూ, పద్ధతులనూ గౌరవించాలి గదా” అనేవాళ్ళు కోకొల్లలు.

శంకరుడు తాత్వికవేత్తగానే గాక నిర్మాణ దక్షుడిగా కూడా ప్రసిద్ధుడు. చిన్న వయస్సులోనే దేశమంతటా పర్యటించి ఉద్దండులందర్ని వాదనా పటిమతో ఓడించి అద్వైతాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఉత్తరాన బదరీనాథ్‌, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరీ, దక్షిణాన శృంగేరి పీఠాలను స్థాపించాడు. నేటికీ ఈ పీఠాల అధిపతులను శంకరాచార్యులనే పిలుస్తారు. వీరు ఇచ్చే ఆదేశాలను వర్తమాన ప్రపంచంలోని ప్రభుత్వాలు సైతం అమితంగా గౌరవిస్తాయి. పాలకవర్గాలకు అద్వైతం ఎంత ప్రీతిపాత్రమైనదో దీనినిబట్టే అర్థం అవుతుంది.

ఇంత విశేషమైన కృషిని శంకరుడు కేవలం తన 32 సంవత్సరాల జీవితంలోనే చేయగలి గాడన్నది గమనార్హం.

అద్వైతం యొక్క అభ్యుదయకరమైన పాత్రను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవ లసిందే. కానీ, మొత్తంగా అద్వైతం గురించి ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం నేడున్నది.

శంకరుని గురించి మార్క్సిస్టు మేధావి  ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఇలా చెప్పారు:

”శంకరుని విజయం, అతని తాత్విక సిద్థాం తపు విజయం అంటే బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణాలు ఆనాడు తక్కిన భారతీయ సమా జంపై సాధించిన విజయంగా అర్థం చేసు కోవాలి.

కనుక శంకరుని తాత్విక సిద్థాంతం ప్రస్తుత భారతదేశానికిగానీ, ప్రపంచానికిగానీ వర్తించే సిద్థాంతంగా… సవ్యంగా ఆలోచించగలిగే ఏ వ్యక్తీ అంగీకరించలేడు. పెనుమార్పులతో శరవే గంగా ప్రపంచం ముందుకుపోతున్న నేటి కాలంలో మానవజాతి ముఖ్యంగా మనదేశం ఆ వేగాన్ని అందుకోవాలంటే భావవాదపు సిద్థాంతాలను, అద్వైతంతోసహా తీవ్రంగా ఎదిరించి, ఓడించాలి. హిందూ పునరుద్ధరణ వాదాన్ని వేద, పురాణాల తాత్విక భావజాలాన్ని ఎదిరించి ఒక ప్రజాతంత్ర లౌకిక, నవీన భారతదేశాన్ని నిర్మించుకునేందుకు సాగిస్తున్న పోరాటంలో ఇదొక విడదీయలేని భాగం”

ఎం.వి.ఎస్‌. శర్మ

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు బాల్యమిత్రుడి పలకరింపు ఇన్నాళ్లకు


ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు వి శ్రీనివాసరావు కుమార్తె శాంతి వివాహ కార్యక్రమంలో నేను ఉండగా ఫిబ్రవరి ఆరో తేదీన విదేశీ నంబరుతో ఫోను. నాకు ఇప్పటివరకూ విదేశం నుంచి ఫోను అంటే  చైనాలో మార్క్సిజం ఆచార్యుడిగా పనిచేస్తోన్న నా మిత్రుడు కొండూరి రవీంద్ర నుంచి మాత్రమే వచ్చేది. ఆ నంబరు మూడుతో ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఫోను నంబరు నాలుగుతో ప్రారంభమయింది. దాంతో ఆసక్తిగా ఫోను తీయగా ”వెంకటసుబ్బారావేనా? అంటూ వాకబు. విదేశం నుంచి నా గురించి వాకబు చేసేది ఎవరబ్బా అనుకుంటూ ”అవును, నేనే. మీరెవరు?. ఎదురు వాకబు చేశాను. ”నేను వీరభద్రరావుని, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను” ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నాము. మా నాన్న కోటేశ్వరరావు, వీరభద్రరావు తండ్రి వెంకటరత్నం మంచి మిత్రులు. ఇద్దరూ ఉపాధ్యాయులే. ఎక్కువ కాలం మా ఊరికి కిలోమీటరు దూరంలోని దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలలో ఇద్దరూ కలిసే పనిచేశారు. మా గ్రామం ఈదుమూడి నుంచి ఇద్దరూ కలిసి సైకిళ్ల మీద పాఠశాలకు వెళ్లేవాళ్లు. మా తండ్రుల బదిలీల కారణంగా వీరభద్రరావూ, నేనూ నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ మాత్రమే కలిసి చదువుకున్నాము. అయితే స్నేహం మాత్రం ఊహ తెలుస్తోన్న దశలోనే ప్రారంభమయింది. వాడు అమెరికా వెళ్లటంతో ఎవరిదారి వారిదయింది. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాదు వచ్చినా, అనారోగ్యంగా ఉన్న తండ్రికి ఆసుపత్రిలో సేవలతోనే సరిపోవటంతో నన్ను కలవలేకపోవటాన్ని పదే పదే ప్రస్తావించి బాధపడ్డాడు భద్రం. ఇద్దరం కలిసే అవకాశాన్ని కోల్పోయినందుకు నేనూ బాధపడ్డాను. కేవలం మిత్రులను కలిసేందుకే తాను త్వరలో హైదరాబాదు వస్తానని భద్రం చెప్పటం కొంత ఊరట. తెలుగు భాష పట్ల చిన్పప్పటి నుంచీ మా ఇద్దరికీ ఆసక్తి మెండుగానే ఉండేది. దాన్ని మా వాడు గుర్తుచేశాడు. తెలుగులో 95 నుంచి 98 దాకా మాకు మార్కులు వస్తుండేవి. ”నేను ఇంజినీరును కాకపోతే, నీ మాదిరిగానే పాత్రికేయుడిగా జీవితాన్ని ఆనందంగా గడిపేవాడినిగదా! అంటూ తెలుగుపట్ల తన ఆసక్తిని వ్యక్తంచేశాడు. ఈదుమూడి పేరుతో వెదుకుతూ అనుకోకుండా నా బ్లాగు తెలుగిల్లు చూశానని తబ్బిబ్బవుతూ గుర్తుచేసుకున్నాడు. బాగుందని కితాబిచ్చాడు. ఇవండీ, ప్రస్తుతం అమెరికాలో ఐటి ఇంజినీరుగా పనిచేస్తోన్న నా చిన్ననాటి స్నేహితుడు గడ్డిపాటి వీరభద్రరావుతో ఎన్నాళ్లో తర్వాత జరిగిన ఫోను ముచ్చట్లు. ఈ ఏడాది ఏదో ఒకరోజు ఇద్దరమూ కచ్చితంగా కలుద్దామన్న వాగ్దానాలతో మా ఫోన్లకు ఆదివారం మధ్యాహ్నం వేళ తాత్కాలికంగా సెలవు ఇచ్చాము. అన్నట్లు ఇక నుంచీ వీలయినంత తరచుగా నాతో మాట్లాడాలని వీరభద్రాన్ని కోరగా వాడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అదే నాకు కొండంత సంతోషాన్నిచ్చింది.

ప్రరాపా విలీనం స్క్రిప్టు పూర్తి…. ఆదివారంనాడే ముహూర్తం


కాంగ్రెసుపార్టీలో ప్రజారాజ్యంపార్టీ విలీనం స్క్రిప్టు రచన పూర్తయింది. వచ్చే ఆదివారంనాడు విలీనం తంతును నిర్వర్తించేందుకు ఈ రెండు పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు. అంటే చిరంజీవి తన రాజకీయ పరివారంతో కలిసి ఆదివారంనాడు హస్తినాపురికి చేరుకుంటారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మదిలో ప్రారంభమయిన విలీనక్రతువు ఆలోచన ఎట్టకేలకు కాంగ్రెసు నుంచి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తొలగటంతో సాకారమయ్యేందుకు వీలుచిక్కింది. చిరంజీవిని సోనియా ప్రతినిధి ఆంటోనీ జనవరి 31న హైదరాబాదులో కలిసి ప్రాథమిక చర్చల్ని పూర్తిచేసిన అనంతరం ఈ విలీన వ్యవహారానికి ఊపు వచ్చింది. తదుపరి చిరంజీవి నిర్వహించిన శాసనసభ్యుల సమావేశానికి హాజరయిన 17 మంది ప్రరాపా భవితవ్యానికి ఏది మంచిదని భావిస్తే ఆ నిర్ణయాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అభయం ఇవ్వటంతో చిరంజీవి పనికి సానుకూలత ఏర్పడింది. కాంగ్రెసులో ప్రరాపాను విలీనం చేసేందుకు సిద్ధమేనని సోనియాకు చిరంజీవి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కూడా పంపారు. ఆదివారంనాడు హస్తినకు వెళ్లే చిరంజీవి పరివారమంతా కలిసి సోనియాతో ఫొటో దిగటంతో విలీన వ్యవహారం పూర్తయినట్లు ప్రపంచానికి వెల్లడవనుంది. రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు, శాసనమండలి అభ్యర్థిత్వాలు, పార్టీలో నాయకత్వ స్ధానాలు ఇలా ఒక్కొక్క పనినీ వీలువెంబడి పూర్తి చేయాలని కూడా నిర్ణయమయింది.